Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 14


    "ఓ.కే. విక్టర్ పద!' సాగర్ మాధవి పక్కన కూర్చుని డోర్ వేశాడు. అంతలో డాక్టర్ గారి నౌకరు గేటు తెరచుకొని బయటికొచ్చాడు.
    "ఎవరండి మీరు? డాక్టర్ గారి కోసం వచ్చారా?" నౌకరు కారు ప్రక్కకు వచ్చి అడిగాడు. కారు రివర్స్ చేస్తున్న విక్టర్ ఓ క్షణం ఆగి తల బయటకు పెట్టాడు. విక్టర్ ను గుర్తు పట్టిన నౌకరు "డాక్టరు గారు లేరు" అన్నాడు.
    సాగర్ వెంటనే కారు దిగి , నౌకరు దగ్గరకు వెళ్ళాడు. నౌకర్ని కారుకు దూరంగా తీసుకు వెళ్ళి "డాక్టరు గారు ఇంత వరకూ ఇంటికే రాలేదా?" అని అడిగాడు.
    "ఎందుకు రాలేదు బాబూ? వచ్చారు? ఇయ్యాళ మాములు కంటే ఆలశ్యంగా వచ్చారు."
    "అయితే మళ్ళీ ఎప్పుడు బయటకు వెళ్ళారంటావ్?"
    "కూసేపయింది బాబూ!"
    "అంటే ఓ గంటయిందా? ఇంకా ఎక్కవయిందా?
    "అంత సేపెక్కడ బాబు! ఇప్పుడేగా బాబు!"
    "అంటే అరగంటయిందా? పది నిమిషాలయిందా?"
    "అంతే బాబు పది నిమిషాలయిందేమో! ఆరు నన్ను లేపి అటేల్లారు. నేను బీడీ ముక్క వెలిగించుకున్నా! బీడీ ఆర్పేసి పారేత్తన్నా మీరొచ్చారు. అంతే తేడా బాబూ!"
    సాగర్ తిరిగి కారు దగ్గరకొచ్చాడు . విక్టర్ అప్పటికే కారు రివర్స్ చేసి పెట్టుకున్నాడు. సాగర్ కారెక్కి "విక్టర్ జడ్జి గారింటికి పోనియ్" అన్నాడు.
    "హాస్పిటల్ కు వెళ్ళవద్దా సార్?"
    "హాస్పిటల్ తర్వాత! ముందు మాధవి వాళ్ళింటికి పోనియ్! త్వరగా వెళ్ళాలి."
    మాధవి పక్కనే కూర్చున్న సాగర్ కు హటాత్తుగా గుండె చెదిరినట్టయింది. మాధవి చెప్పినదంతా నిజమేనా? జడ్జి రామనాధం గారూ అయన భార్య నిజంగానే హత్య చేయబడ్డారా? ఆ దృశ్యాన్ని చూసిన మాధవి మనసు చెదిరిపోయి ఇలా ప్రవర్తిస్తుందా? తనేమేమో ఊహించి పాత సంఘటనలకు ముడివేసి ఆలోచిస్తూ తప్పు దారిన పడ్డాడా? మాధవి ముందు చెప్పినదంతా నిజమేనా? స్పృహ తప్పినప్పుడు అంతకు ముందు చూసినదంతా మర్చిపోయి వుంటుందా? ఇప్పుడు మాధవి ఇంత నిర్వికారంగా కూర్చున్నదంటే కారణం అంతకు ముందు చూసినదంతా మరచి పోయి ఉండటమేనా? లేక ఆమె ముందు చెప్పినదంతా భ్రమా జనితమై - స్పృహ తెలియడంతో మాములు మనిషి అయిందా? ఏది నిజం? ఏది నిజం కాదు? సాగర్ బుర్ర కుతకుతా వుడికి పోసాగింది. మాధవికి ఇదేమి పట్టలేదు. చేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటూ కూర్చున్నది.
    "సాగర్! మౌనంగా కూర్చున్నావ్. ఏమిటో ఆలోచిస్తున్నావు కదూ?"
    "అబ్బే ఏమీ లేదు మాధవీ!"
    "నా గురించే కదూ!"
    "నో! నో!"
    "నా వల్ల నీకు చాలా కష్టం కల్గుతోంది కదూ?"
    "నాట్ ఎటాల్ మాధవీ!"
    "మరయితే ఏదైనా మాట్లాడు."
    "ఏం మాట్లాడ మంటావ్?"
    "ఏదైనా ఓ కధ చెప్పు"
    సాగర్ మనసులో ఒక్కొక్క సంఘటనా మెదల సాగింది. ఓ అందమైన అమ్మాయి ఆ అమ్మాయి మనసు ఎప్పుడో ఎక్కడో దెబ్బ తిన్నది. ఆ దెబ్బ ఎలా తగిలిందో ఆ అమ్మాయికే తెలియదు. ఆ అమ్మాయి స్నేహితుడొకడు స్నేహితుడేమిటి! ప్రియుడే - ఆ అమ్మాయి మనసుకు తగిలిన గాయాన్ని నయం చేయాలని ప్రతిన పూనాడు. ఆ అమ్మాయికి నీడలో నీడై, మనసులో మనసై మెసులుతూ కార్యసాధనకు ఉపక్రమించాడు. మానసికంగానూ, శారీరకంగానూ, ఆరోగ్య వంతురాలయిన ఆ అమ్మాయి ఆటపాటల్లోనూ , అందచందాల్లోనూ అందరికంటే ముందుండే ఆ అమ్మాయికి ఓ రోజున వేలు తెగిన ఓ చేయిని చూడగానే మనసు వికలమయింది. ప్రెషర్ కుక్కర్ చూడగానే ఏవో అంతరాంతరాల్లో ఎవడో వంటవాడు - హంతకుడిగా తిరుగుతున్నాడు . ఆ అమ్మాయి కుటుంబానికి స్నేహితుడయిన డాక్టరును చూడగానే ఆమె మనసు వశం తప్పుతోంది. ఇలా వుండగా ఓ రాత్రి ఆమె తల్లి దండ్రిని హత్య చేసి కుక్కర్ ఎత్తుకు పోయాడా హంతకుడు. వేలు తెగిన చెయ్యి - కుక్కరూ- డాక్టరు- వంటవాడూ - తల్లీ తండ్రీ  హత్య - రామనాధం- నాగరత్నం హత్య - సాగర్ బుర్రంతా గాజు పెంకులతో కోసినట్టయిపోతున్నది.
    "సాగర్! మాట్లాడవేం? నీ మౌనాన్ని నేను భరించలేను. ఏదయినా ఓ కధ చెప్పమన్నానుగా" ప్లీజ్!  మాధవి సాగర్ భుజాల మీద వాలిపోయింది.
    "మాధవీ నీకు కధలంటే చాలా ఇష్టం కదూ?"
    "అవును! నీకు తెలియదా?"
    "కదా లల్లి చెప్పడం కూడా నీ కిష్టమే గదూ?"
    "అంటే నీ ఉద్దేశ్యం ?" మాధవి విసురుగా అన్నది.
    "సాగర్ బాబు! అటు చూడండి జడ్జి గారింటి ముందు లైట్లు వెలుగుతున్నాయి! చాలా మంది ఇంటి ముందున్నారు?" విక్టర్ గొంతు ఆశ్చర్యం, ఆదుర్దా రెండూ చోటు చేసుకున్నాయి.
    సాగర్ గుండె గొంతులోకి వచ్చి అడ్డు పడ్డట్టయింది! మాధవి రెప్ప వాల్చకుండా ఇంటికేసి చూడసాగింది. మరో నిమిషంలో విక్టర్ కారు జడ్జి రామనాధం గారింటి ముందు ఆపాడు.
    సాగర్ కారు దిగాడు. అతడి వెనుకే మాధవి దిగింది. ఆవరణలో లైట్లు వెలుగు తున్నాయి. గేటు దగ్గిర ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. సాగర్ను చూసి ఏటన్షన్ లో నిలబడి శాల్యుట్ చేశారు.
    సాగర్ కు చెమటలు పట్టాయి. మాధవి చెప్పింది నిజమేనా? మాధవి తండ్రీ, తల్లీ హత్య చేయబడ్డారా? లేకపోతే యీ పోలీసు హంగామా ఎందుకు? ఇంటిముందు ఆవరణలో మాప్టీలో ఉన్న సి.ఐ.డి.లు కూడా తిరుగుతున్నారు! తను ఎంత పొరపాటు చేసాడు. నేరుగా మాధవిని తెసుకొని జడ్జిగారింటికి రావలసింది నాన్నకు ముందుగా తెలియపరచవలసింది. ఏమేమో అలోచించి అమూల్య మయిన కాలాన్ని వృధా చేసాడు. అనవసరంగా మాధవిని తీసుకొని డాక్టరుగారింటికి వెళ్ళాడా? తన వెనకే నడుస్తున్న మాధవి కేసి చూసాడు. ఆమె ముఖంలో ఎలాంటి ఆదుర్దా గాని, బాధ గాని కన్పించడం లేదు. తను చూసిన హత్య దృశ్యం ఆమె మెదడు పొరల్లో మరుగున పడిపోయి వుంటుంది. నింపాదిగా, నిండుగా ఏమీ జరగనట్టే తన వెనక నడుస్తున్న మాధవిని చూస్తుంటే సాగర్ కు మతి చలించి పోతున్నది.
    సాగర్ అడుగులు భారంగా పడుతున్నాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అడుగడుగే వేస్తూ పోర్టికోలోకి వచ్చాడు. మెట్లెక్కి, వరండా దాటి హాల్లోకి ప్రవేశించాడు. మాధవి అతడ్ని అనుసరించి నడుస్తున్నది . సాగర్ కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. వరండాలో వున్న వాళ్ళంతా మసక మసక గా కన్పించారు.
    'అరుగో వచ్చారు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS