"సాగర్! ఓ సాగర్! ప్లీజ్ నన్నడగకు! నాకు భయం వేస్తున్నది!" సాగర్ చేతుల్లో వణికిపోయింది మాధవి.
",మాధవీ! భయం లేదు. నువ్వు నాదగ్గర వున్నావు. నీకేం భయం లేదు. జరిగిందేమిటో చెప్పు, ఇప్పుడే చెప్పాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతావు?"
"సాగర్! అది మర్చిపోయేది కాదు. వద్దనుకున్నా జీవితాంతం గుర్తుకు వస్తుంది."
"సాగర్ మాధవినో గుండెలకు హత్తుకొని అనునయించాడు.
"మాధవి - నా మాధవి?"
"ఊ!"
"ఏం జరిగిందో నాకు చెప్పవా?"
"నా ప్రెషర్ కుక్కర్ ను ఎత్తుకుపోయాడు."
"ఏదీ నీకు ఫ్రైజ్ గ వచ్చినదా?"
"అవును౧ అదే!"
"ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?"
"టైం సరిగ్గా గుర్తులేదు. రాత్రి పన్నెండు దాటి ఉంటుందనుకొంటాను. బాత్ రూమ్ నుంచి వంటగదిలోకి వెళ్ళాను. వంటగది వెనుక తలుపులు తెరిచి వుంది. లైట్ వేసి చూశాను. గదిలో గిన్నెలు వంట పాత్రలు చిందర వందరగా పడి వున్నాయి. దొడ్లోకి వచ్చాను. అప్పుడే వాడు గోడ దూకేశాడు. ప్రెషర్ కుక్కర్ తీసుకొని పారిపోయాడు. నేను దొంగ! దొంగ! అని అరుస్తూ నాన్నగారి గది ముందుకు పరుగెత్తు కొచ్చాను, నాన్న గది తలుపు తెరచి ఉంది...."
"ఊ ఆగిపోయావేం/ తర్వాత?"
"నాన్న - మంచం పక్కన రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు! నాన్న పక్కనే అమ్మ బోర్లా పడి ఉంది. మెడ కింద రక్తం గడ్డకట్టి ఉన్నది."
"మాధవీ! నువ్వేం మాట్లాడుతున్నావు?' సాగర్ కంఠం వణికింది.
"అమ్మా నాన్నను హత్య చేసి నా ప్రెషర్ కుక్కర్ ను ఎత్తుకు పోయాడు."
"ప్రెషర్ కుక్కర్ కోసం రెండు హత్యలు చేశాడంటావా?" సాగర్ ఆలోచనలో పడ్డాడు. మాధవి చెప్పిందంతా ఓ కధలా వుంది. ఇది ఆమె మరొక ఊహ చిత్రం. మతి భ్రమణకు ముందు ఉండే మానసిక స్థితిలో ఉన్నా మాధవి మస్తిష్కంలో అసంభవమూ, అనూహ్యమూ అయిన సంఘటనలు ప్రకోపన చెంది, అవి వాస్తవిక సంఘటన లానే భ్రమను కల్పించి , ఆమె మనసులో అనేక ప్రేరణలను, పీడనలకు దారి తీస్తున్నాయి.
"మా అమ్మా, నాన్నను హత్య చేశాడు!' మాధవి చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఎదవా సాగింది. మాధవి గొంతు నిజంగా చిల్లపిల్ల గొంతులా అయిపొయింది.
"ఎవడు వాడు?"
"వంటవాడు!"
"వంటవాడా?"
"అవును! వంటవాడే! వంటవాడే! అమ్మా నాన్నను చంపేశాడు! ...చంపేశాడు.....చంపేశాడు!" మాధవి పెద్దగా అరిచి అరిచి సొమ్మసిల్లి పోయింది.
"మాధవీ! మాధవీ!' సాగర్ మాధవిని పిలిచాడు.
ఆమె పలకలేదు.
ఆమెను కుదిపి కదిలించాడు.
ఆమె కదల్లేదు.
సాగర్ మాధవిని భుజాల మీద వేసుకుని ఇంటి వెనుక నుంచి గేటు దగ్గర కొచ్చాడు. గేటు దగ్గర షెడ్ లో కునుకు తీస్తున్న విక్టర్ ను లేపాడు.
"విక్టర్! త్వరగా కారు బయటకు తీయ్!"
విక్టర్ గ్యారేజీ లో నుంచి కారు బయటకు తీశాడు. సాగర్ మాధవిని వెనుక సీట్లో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు.
"విక్టర్! త్వరగా డాక్టర్ మూర్తి గారింటికి వెళ్ళాలి."
"ఎస్సార్' విక్టర్ కారు వేగంగా నడప సాగాడు. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వెలిగి పోయింది. ఎక్కడో దూరంగా పిడుగులు పడ్డ ప్రళయ భీకర గర్జన! కారు టాపు మీద దడదడా చినుకులు పడసాగాయి. చల్లని గాలి కారులోకి వీచసాగింది. వానజల్లు విసిరి విసిరి లోపలకు కొడ్తుంది. మాధవి ముఖం తడిసి ముద్దయి పోయింది. గాయమయిన చేతిని వానజల్లు తాకి కడిగేయసాగింది.
"అబ్బా!" మాధవి కళ్ళు తెరిచింది.
"మాధవీ!"
"సాగర్! నేను ఎక్కడ వున్నానిప్పుడు?"
"నా ఒడిలో!"
"ఛీ పో!"
"సుఖంగా నిద్రపోయి లేచావు"
"మరి నువ్వేం చేస్తున్నావ్?"
"ఏం చేస్తున్నానా? నిద్రపోతున్న నీ ముఖంలోని అందాన్ని చూస్తూ కూర్చున్నా!"
మాధవి పెదవులపై విరిసిన దరహాసం అప్పుడే వెలిగిన మెరుపుల వెలుగుల్లో కలిసిపోయింది.
సాగర్ ముంజేతిని గోముగా నిమురుతూ మాధవి చివాలున లేచి కూర్చుంది.
"ఏమిటీ రక్తం! నీ చెయ్యి తెగింది. ఎలా జరిగింది?"
"నీ చెయ్యి కూడా తెగింది కదా? యెలా తెగిందో తెలుసా?"
"తెలియదు! మన యిద్దరి చేతులు ఎవరు కోశారు?"
"నేనే!"
"నువ్వా?"
"అవును! ,మాధవీ నేనే"
"సాగర్! నువ్వు కడు నాకు తెలుసు . నువ్వెన్నడూ అలా చేయవు. ఎవడో దుర్మార్గుడు చేసుంటాడు. నాకు నిజం చెప్పవూ? వాడెవడూ?"
"డాక్టర్ మూర్తి గారింటికొచ్చేశాం సార్!" విక్టర్ కారాపుతూ అన్నాడు.
సాగర్ కారు దిగి డోర్ తెరచి పట్టుకొని మాధవీ! కమాన్! అన్నాడు.
"సాగర్! డాక్టర్ మూర్తి గారి దగ్గరికెందుకు?"
"ఎందుకేమిటి మాధవీ? డాక్టరు గారి చేత కట్టు కట్టించుకుందాం."
"కావాలంటే నువ్వెళ్ళు. నేను రాను."
"ఎందుకని? ఈ డాక్టరు గారంటే ఇష్టం లేదా?"
"లేదు!"
"ఎందుకని?"
మాధవి మౌనం వహించింది.
"మాధవీ మాట్లాడవేం? డాక్టర్ మూర్తిని చూస్తే నీకు...."
"సాగర్! ప్లీజ్ స్టాపిట్!"
"సో! కమాన్ మాధవీ! యూ మస్ట్ టెల్ మీ!"
"సాగర్! దయచేసి నన్నేమీ అడక్కు! నాకు ఎలాగో అయిపోతున్నది . ప్లీజ్ సాగర్!"
"ఎందుకు సార్ ! అంత బలవంతం చేస్తారు. అమ్మాయిగారికి ఇష్టం లేకపోతే మరో డాక్టరు దగ్గరకు వెళదాం పదండి" విక్టర్ సాగర్ దగ్గరకు వచ్చి అన్నాడు. సాగర్ ఓ క్షణం ఆలోచించాడు.
