నిన్ననే తమ విషయం తల్లిదండ్రులకు చెప్పేస్తానన్నాడు. వాళ్ళు ఒప్పుకొని వుండరు! ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవైపు కులాలు పోవాలంటూ ఉపన్యాసాలిచ్చే రాజకీయ నాయకులే తమపిల్లల పెళ్ళిళ్ళు కులం చూసుకొని చేస్తున్నారు. కులం పేరుతో ఓట్లూ, సీట్లూ, కులం పేరుతో పదవులూ, పంచుకుంటున్నారు.
భావిభారత పౌరులైన విద్యార్థుల్లో కూడా కులతత్వం పెరిగిపోతూ వుంది. కొన్ని కాలేజీలలో, యూనివర్సిటీలలో కులం పేరుతో విడిపోయి తన్నుకుంటున్నారు.
ఉన్నత శాస్త్రీయ విజ్ఞాన పరిశోధకులు కులతత్వం పేరుతో కొట్లాడుకుంటున్నారు.
ఫిజియాలజీ, అనాటమీ చదువుతున్న విద్యార్థులు కూడా కులతత్వాన్ని మరవలేకపోతున్నారు. అంతకంటే ఎదగలేకపోతున్నారు.
ఈ దేశంలో సాధించిన ప్రగతి ఇదేనా?
ఒకరిద్దరు శరత్ లాంటివారు తల్లిదండ్రుల్ని ఎదిరించి కులాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన మనదేశంలో కుల నిర్మూలన జరుగుతుందా?
నాన్న భయం నాన్నది.
చివరికి శరత్ తల్లిదండ్రులు కొడుకు పట్టుదల ముందు తలవంచినా ఆ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అడుగడుగునా తన కులాన్ని ఎత్తిచూపుతున్నట్టు తనకు భావం కలగవచ్చును. శుభకార్యాల్లో శరత్ బంధువులు తనను చిన్నచూపు చూడవచ్చును. చూడకపోయినా మామూలు ధోరణిలో ఏదైనా ఎవరైనా అంటే తన మనసుకు అదే భావం తట్టవచ్చును. నాన్న భయాలు చూస్తుంటే తనకు నవ్వొస్తుంది.
నిజమే! కొందరు కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు. ఆ ఇబ్బందులకు భయపడి చదువుకొన్నవాళ్ళు కూడా తమ తమ కులాల్లోనే ముళ్ళు పెట్టుకుంటూపోతే మరి కులనిర్మూలన ఎలా జరుగుతుంది?
సమాజంలో ఏ కొత్తమార్పు వచ్చినా దానికి కొందరు గురికాక తప్పదు! సంధికాలంలో కొందరి జీవితాలు కష్టాలకు గురికావచ్చును.
శరత్ తో తన జీవితం సాఫీగా ఆనందంగా గడిచిపోగలదనే నమ్మకం తనకు వుంది.
శరత్ అందగాడు, శ్రీమంతులబిడ్డ. కాలేజీలో ఎంతోమంది సీతాకోక చిలుకలు అతని చుట్టూ తిరగడం తనకూ తెలుసు.
అతనికీ పై పై మెరుగుల మీద వ్యామోహం లేదు.
తను పెద్ద అందమైంది కాదు! ఒకసారి తను అడిగింది.
"శరత్! నాలో ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు."
శరత్ తమాషాగా అందంగా చిరునవ్వు నవ్వాడు.
మళ్ళీ అడిగింది.
"చెప్పు శరత్, నేను పెద్ద అందగత్తెను కాదు. కులం లేదు. ధనం లేదు. నువ్వేమో సినిమా హీరోలా వుంటావు. నీ చుట్టూ ఎందరో అందమైన అమ్మాయిలు తిరుగుతున్నారు. నాలో ఏం చూశావు?"
శరత్ ఓ క్షణం గంభీరంగా వుండిపోయాడు.
"అదేమో నాకు తెలియదు. నీ వ్యక్తిత్వం.... అంటే నీ ప్రతికదలిక.... మానసిక సంస్కారం.... ఇంకా ఏదో ఏదో - నేను చెప్పలేనిది నీవైపు నా మనసును తిప్పింది. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నీ సమక్షంలో నాకు సంపూర్ణత్వం ఏదో లభించినట్టు అనిపిస్తుంది. కేవలం అందాన్ని మాత్రమే ప్రేమించడం.... అది ప్రేమకాదు - వ్యామోహం మనసుకునచ్చిన కొత్త సోఫా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కొత్తలో దాన్ని అపురూపంగా చూస్తాం. ఎవరైనా వచ్చి దానిమీద కాళ్ళు పెట్టుకు కూర్చుంటారు. మనకు ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది. కొంతకాలానికి అది పాతదవుతుంది! దానిమీద వ్యామోహం తగ్గుతుంది. దాన్ని గురించి ఇది ఆలోచించం. కేవలం శారీరక అందం మీది మోజు కూడా ఇంతే అని భావం," చిన్నగా గంభీరంగా అన్నాడు.
శరత్ మాటల్ని మనసులో మననం చేసుకుంటూ వుంటే నిశ్శబ్దనిశీధిలో విచ్చుకునే గులాబిపువ్వులా ఆమె ముఖం వికసించింది. మనసు మల్లెపందిరిలా గుభాళించింది.
గేటు శబ్దం అయింది.
రాజేశ్వరి తలెత్తి చూసింది.
శరత్ లోపలకు వస్తున్నాడు.
కాని ముఖం వేలాడవేసుకుని ఓపిక లేనట్టు అడుగులు వేస్తూ వస్తున్నాడు.
రాజేశ్వరి అతని వాలకం చూసి గతుక్కుమంది.
"ఏమైంది? శరత్ కు ఎందుకు అలా వున్నాడు? ఏం చెప్పడానికి వచ్చాడు.
రాజేశ్వరి గుండె దడ - దడ లాడింది.
"కూర్చో శరత్!" అంది రాజేశ్వరి అతని ముఖంలోకి లోతుగా చూస్తూ.
"బయటికి వెళ్దాం, నీతో మాట్లాడాలి." అన్నాడు శరత్ రాజేశ్వరి ముఖంలోకి చూడకుండానే రాజేశ్వరి శరత్ కళ్ళలోకి చురుగ్గా చూసింది.
ఆ కళ్ళు నిర్లిప్తంగా వున్నాయి.
తను అనుకున్నంతా అయింది. నాన్న భయపడినంతా జరిగింది.
నాన్నకు తను ముఖం ఎలా చూపించాలి?
శరత్ అమ్మ ఒప్పుకోలేదు. నాన్న ఒప్పుకోలేదు "సారీ!" అని చెప్పడానికి వచ్చాడు.
"ఏం రాజూ! మాట్లాడవు? వెళదామా?"
".... ...."
"ఎందుకు అలా వున్నావు? ఏం జరిగింది? మీ పేరెంట్సు ఏమన్నారు?" ఆమె కంఠంలో ఆతృత కంటే విరక్తి ఎక్కువగా ధ్వనించింది.
