Previous Page Next Page 
రాక్షసుడు పేజి 13


    "ఏమిటి"

 

    "తను సృష్టించిన మొగవాడు తనకన్నా ఆనందంగా ఉండటం చూసి సహించలేని భగవంతుడు స్త్రీని సృష్టించాడు. వెళ్ళొస్తాను".

 

    "ఈ బ్రాందీ పెట్టుకెళ్ళండి".

 

    వద్దనలేదు అతడు. "థాంక్స్" అని పట్టుకెళ్ళాడు. తన గ్లాసు పూర్తిచేసి పది నిముషాల్లో ఫాస్టస్ పడుకోబోతుంటే తలుపుచప్పుడయింది.

 

    "కమిన్" అన్నాడు.

 

    తలుపు కొద్దిగా తెరుచుకుంది. "క్షమించాలి. మా ఆయన తన కోటు ఇక్కడ మర్చిపోయారు".

 

    "తీసుకువెళ్ళండి"

 

    ఆమె లోపలికి వచ్చి కోటు తీసుకుంటూ "ఆయన ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను. భారతీయులపట్ల మీకు చాలా తేలిక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు" అంది.

 

    "అటువంటిదేమీ లేదు. మా దేశంలో తాగటం సర్వసామాన్యం".

 

    "కానీ ఎదుటివారి గదిలోకి చొరబడి తాగటం సంస్కారం కాదు డాక్టర్ ఫాస్టస్!" ఆమె నెమ్మదిగా అంది. బెడ్ లైట్ నీలి వెలుతురు ఆమె ఆరోగ్యమయిన చెంపమీద అందంతో విషాదం మిళితమైనట్టు జీరాడుతుంది. "ఆయన ఎంత చెప్పినా వినిపించుకోరు. తాగుడు, తాగుడు, తాగుడు. అంతే!" ఏడుపు బలవంతంగా ఆపుకున్న ధ్వని.

 

    ఫాస్టస్ అనునయిస్తున్నట్టు "ఇప్పుడేమయిందనీ" అన్నాడు.

 

    దాంతో ఆమె బరస్ట్ అయి "మీరు మా గురించి ఏమనుకుంటారు డాక్టర్? - ఇంత డబ్బుండీ కక్కుర్తిపడవలసిన అవసరం ఆయనకేముంది" అంది ఏడుస్తూ.

 

    అతడు కదిలిపోయాడు. "నిజం చెప్పమంటారా?" అన్నాడు. "నాకు భారతీయ స్త్రీల పట్ల గౌరవం వుండేది. మిమ్మల్ని చూసేక రెట్టింపయింది. ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో మా దేశంలో స్త్రీ భర్తని చూసుకోదు. భర్త బలహీనతల్ని క్షమించదు. విడిపోతుంది".

 

    "అయ్యో ఇది సహనమా? కాదండీ. ఇది దౌర్భాగ్యం, చేతకానితనం. పాశ్చాత్య దేశపు స్త్రీలలో వున్న తెగింపు లేనందున మేమెంత బాధపడతామో మీకు తెలీదు. ఇదంతా ముసుగు. ఆత్మవంచన ముసుగు అంతే. మొగుడుండీ సుఖంలేక- డబ్బుండీ శాంతిలేక-" అంటూ దుఃఖంతో పూర్తి చేయలేకపోయింది. ఆమె చేతిలోంచి, కుర్చీ మీదకు కోటు జారిపోయింది. పైట జారింది కూడా చూసుకోకుండా ఆమె ఆపుకోలేని దుఃఖంతో మొహం కప్పుకుంది. మసక వెలుతుర్లో కంఠం క్రింద నుంచి నీడ సన్నటి గీతలా జారుతూంది. అతడు దగ్గరగావెళ్ళి అనునయిస్తున్నట్టు "ప్లీజ్..." అన్నాడు. ఆ మాత్రం ఓదార్పు కోసం ఒక జీవితకాలం నుంచి తపిస్తున్నట్టు ఆమె అతడి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది. ఒక సన్నటి పరిమళం అతడికి ఆమె సామీప్యంనుంచి వస్తూంది. అతడికి ఆమె శరీరం తగుల్తూంది. వాళ్ళు అలా ఎంతసేపు వున్నారో తెలీదు. అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది. తాగుడువల్ల ఎర్రబడ్డ కళ్ళతో అతడు గుమ్మం మధ్యలో నిలబడి వున్నాడు. అతడి చేతిలో పిస్టల్ వణుకుతూంది.

 

    "రాక్షసీ! నాకు తెలుసే, నేను తాగి పడిపోయానని నిశ్చయించుకున్నాక నువ్విలా తిరుగుతావని! ఈరోజు నిన్నిక వదిలిపెట్టను" అంటూ ముందుకడుగేసేడు.

 

    అప్పటివరకూ శిలలా నిలబడివున్న ఫాస్టస్ చప్పున కదిలి "ఏమిటిది, మీకు మతిపోయిందా" అంటూ దగ్గరికి వెళ్ళాడు.

 

    "ముందుకు రాకండి. మిమ్మల్నీ చంపవలసి వస్తుంది".

 

    ఫాస్టస్ ఆ హెచ్చరికని వినిపించుకోకుండా మరింత ముందుకువెళ్ళి అతడిని పట్టుకొని, పిస్టల్ లాక్కోవటానికి ప్రయత్నించాడు. ఇద్దరూ కొన్ని క్షణాలపాటు గింజుకున్నారు. ఇద్దరిమధ్యా నలిగిన పిస్టల్ పేలిన ధ్వనిలో ఆమె కెవ్వున అరిచిన అరుపు కలిసిపోయింది.

 

    పిస్టల్ చేతుల్లోంచి జారి క్రింద పడిపోయింది.

 

    దానితోపాటూ అతని గుండెల్లోంచి జారిన రక్తంకూడా.

 

    ఆమె విభ్రాంతురాలై వాళ్ళవైపు అచేతనంగా చూస్తూ వుండిపోయింది.

 

    అంతలో ఆమె భర్త నేలమీదకు జారిపోయాడు.

 

    ఫాస్టస్ శిలాప్రతిమలా నిలబడి వున్నాడు.

 

    ....ముందు తేరుకున్నది ఆమె! చప్పున భర్త దగ్గరికి వెళ్ళి వంగుతూ "ఎంతపని చేశారు" అంది. ఫాస్టస్ మాట్లాడలేదు. అసలీ లోకంలో లేనట్టే ఆమెవైపు అయోమయంగా చూశాడు. అతడి కన్నా ఆమె కాస్త నిబ్బరంగా వుంది.

 

    వంగి భర్త శరీరాన్ని పట్టుకొని చూసింది. ఆమె చాలాసేపటి వరకూ లేవకపోవటంతో ఫాస్టస్ నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చి క్రిందికి చూసేడు. ఆమె రోదిస్తూంది!!!

 

    ఆమె భర్త మరణించాడని అర్థమైంది. ఫాస్టస్ కాళ్ళు వణకసాగాయి. దేశం కాని దేశంలో ఒక స్త్రీ తన గదికి రావటం- ఆమె భర్త తన చేతుల్లో మరణించడం.... రెప్పపాటు సమయంలో జరిగిపోయిన సంఘటనల మీద సంఘటనలు-

 

    ఆమె హృదయ విదారకంగా ఏడుస్తూంది! స్వరం బయటకు రాకుండా రోదిస్తూంది!! నిస్సహాయమైన స్థితిలో అతడికి అదే పిస్టల్ ని తన నుదుటికి ఆన్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. నెమ్మదిగా పిస్టల్ ని గాలిలోకి లేపాడు. ఎందుకో తలెత్తిన ఆమె, అది చూసి చప్పున లేచింది. తన దుఃఖంకూడా తాత్కాలికంగా మర్చిపోయి విసురుగా దగ్గరకి వస్తూ "ఏమిటిది డాక్టర్ ... ఏమిటి మీరు చేస్తున్న పని" అంటూ అతడి చేతిలో పిస్టల్ లాక్కుంది. అతడు పెద్దగా ప్రతిఘటించలేదు. పిచ్చివాడిలా తనలో తనే గొణుక్కుంటున్నట్టు "నా పరువూ, ప్రతిష్టా అన్నీ నాశనమయ్యాక ఇక నేనెలా బ్రతకగలను?" అన్నాడు. ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుంది ఆ కంఠం. అతడు చాలా డీప్ షాక్ లో వున్నాడనీ, స్వంతంగా ఆలోచించగలిగే స్థితిలో లేడనీ, నిర్ణయం తీసుకొనే బాధ్యత తనమీదే ఉన్నదని ఆమె గ్రహించినట్టు అనిపించింది.

 

    "డాక్టర్ ఫాస్టస్!" అంది.... "ఈ శరీరాన్ని మా గదిలోకి చేర్చాలి!"

 

    ఆ మాటలకి ఫాస్టస్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె మొహంలో దుఃఖం గోచరమవుతూంది- కానీ దానికన్నా ఎక్కువగా ఒక నిశ్చయం కనబడుతూంది.

 

    ఆమె అంది- "జరిగిందేదో జరిగిపోయింది. మనమెవ్వరం కలలో కూడా ఇది ఇలా జరుగుతుందని ఊహించలేదు! కానీ ఈ కారణంగా మిమ్మల్ని ఇందులో ఇరికించటం నాకిష్టం లేదు. జరిగిన దేమిటో చూసిన ప్రత్యక్షసాక్షిని నేను! కానీ నా మాటలు రేపు కోర్టు నమ్ముతుందా? తరువాత పరిణామం ఏదైనా- ముందు ఒక విదేశం నుంచి వచ్చిన ప్రొఫెసర్, హత్యకేసులో ఇరుక్కోవటం ఎంతో సంచలనాన్ని సృష్టిస్తుంది. మీ సమయమూ, మీ ఏకాగ్రతా అన్నీ పాడవుతాయి. అది నాకిష్టం లేదు. అందుకే ఈ మరణం మా గదిలో జరిగిందని చెప్తాను. తరువాత ఏం జరిగినా ముందు మీరిందులోంచి తప్పుకుంటారు. అది చాలు".

 

    అతడు విభ్రాంతుడై ఆమెవైపు చూశాడు. ఆమె చెప్పింది అర్థం చేసుకోవటానికి అతడికి కొన్ని నిముషాలు పట్టింది. అయినా దాన్ని పూర్తిగా జీర్ణించుకోలేక "త... తరువాత ఏం జరుగుతుంది?" అని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS