Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 13

వెంగమాంబ వేటినీ లెక్కచేయడం లేదు. వేంకటేశ్వరుని పాదా మృతధ్యానా నందయై, ఆ పరంధాముని భక్తిలో మునిగి, గ్రంథరచన చేయడం మొదలెట్టింది. అపర సరస్వతిలా  నిత్యం తన కవితాగాన లహరితో స్వామిని సేవిస్తూ, కీర్తిస్తూ కాలక్షేపం చేయసాగింది. ఎప్పుడైనా వెంగమాంబ వీథిన వెళుతుంటే "అదిగో దొంగ భక్తురాలు - వితంతువు" అంటూ యువకులు హేళన చేయసాగారు. ఆమెపై రాళ్ళు రువ్వుతున్నారు. ఆమె పొడవైన జుట్టును పత్తి లాగుతున్నారు. వెంగమాంబ ఇవేమీ పట్టించుకోకుండా, ఆ దేవుని నామస్మరణ చేస్తూ ముందుకు సాగిపోతోంది.
కానీ, వెంగమాంబ వాలకం ఊరి పెద్దలకు నచ్చలేదు. ఇలాగే ఊరుకుంటే ఈ వింతతువు వల్ల గేఆమానికి కీడు వాటిల్లుతుందని వారు భావించారు. కొందరు వెంగమాంబను "వ్యభిచారిణి" అంటూ నిందించారు.
తెల్లవారగానే కొంతమంది గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర చేరారు. భవిష్యత్ కార్యక్రమంపై వారు చర్చించడానికి  నిర్ణయించారు. ముందు వెంగమాంబ శిరోజాలు తీయించాలి. "అదెలా సాధ్యం? ఆమె వినదు" అని ఒక ఊరి పెద్ద అన్నాడు. ఇలాంటి వారివల్ల కరువు కాటకాలు సంభవిస్తాయి. గ్రామానికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. "ఒక వితంతువు ఇలా బరితెగించి తిరుగుతుంటే, గ్రామంలో పసుపు కుంకుమలకు లోపం వస్తుంది" అని అన్నాడు ఒకాయన గంభీరంగా. ఏం చేయాలన్న తర్జన భర్జనలు జరిగాక, అందరూ ఏకగ్రీవంగా ఒక మాట అన్నారు. మంగలిని వెంటబెట్టుకుని వెళ్ళి వెంగమాంబకు నచ్చజెప్పాలి. ఆమె వినకపోతే బలవంతంగానైనా శిరోజాలు తీయించాలి అని!! ఆ మాటకు అందరూ తలలూపారు.
                                                     *    *    *
సీత మళ్ళీ పురిటికొచ్చింది. "నువ్వు వెంగమాంబ కంట్లో పడమాక" అంది తల్లి సుందరి.
సీత సరేనని తల ఊపినప్పటికీ, ఆమెకు వెంగమాంబను చూడాలని ఉంది. ఓరోజు, తల్లి లేని సమయం చూసుకుని, గబగబా వెంగమాంబ దగ్గరకొచ్చింది సీత. అప్పుడు మాలను అల్లుతున్న వెంగమాంబ, సీతకు మాలలో కొంత భాగాన్ని తుంచి ఇచ్చింది. ఆ మాలను సీతని తలలో పెట్టుకోమని చెబుతూ, మిగతా మాలను తన తలలో తురుముకుంది వెంగమాంబ. ఆ సంఘటన సీతను ఆశ్చర్యంలో ముంచేసింది.
వెంగమాంబ సీతతో, "సీతా! మీ ఆయన చాలా మంచివాడు కదూ! గొప్ప భక్తుడనుకుంటాను" అంది. సీత వెంగమాంబ వైపే తదేకంగా చూస్తోంది. వెంగమాంబ ఒక్కక్షణం కళ్ళు మూసుకుని, "సీతా! నీకు కవల పిల్లలు పుడతారే" అంది. వెంటనే సీత నవ్వుతూ "బాబోయ్" అంది లేనిపోని భయాన్ని నటిస్తూ.
వెంగమాంబ కూడా నవ్వుతూ, "సీతా! ఎందుకే భయపడతావ్? నీకు ఇద్దరు కొడుకులు పుడతారు. అంతా స్వామివారి దయ. నువ్వు అదృష్టవంతురాలివి" అంది. ఆ మాటలు  చెబుతూనే లోపలికి వెళ్ళి స్వామి ప్రసాదం అంటూ ఓ  అరటిపండు తెచ్చి ఇచ్చింది.
"సీతా! నా స్వామి మందిరమైన ఈ పూజా మందిరమే నా ఇల్లు. శ్రీ వేంకటేశ్వరస్వామియే నాభర్త. నీకు ఇంకేం కావాలి?" అంది. వెంగమాంబ మాటలు వింటుంటే సీతకు నిజమేననిపించింది. "ఇంత గొప్ప భక్తురాలి స్నేహం దొరకడం తన అదృష్టం" అని భావించిన సీత, వెంగమాంబకు పాదాభివందనం చేసి, ఉత్సాహంగా ఇంటికి మళ్ళింది.
సీత అలా వెళ్ళగానే, ఊరి పెద్దల్లో ఇద్దరు లోపలికివచ్చారు. వారిని చూసిన వెంటనే సంతోషంతో ముఖం విప్పారిన వెంగమాంబ, "రండి, నా  దేవుణ్ణి చూడండి" అంది వారిని లోనికి ఆహ్వానిస్తూ.
"నీ దేవుడూ - దెయ్యం మాకు తెలియదు. ఇంతకీ నీ అభిప్రాయం మార్చుకున్నవా? లేదా?" అన్నారు.
"ఏ అభిప్రాయం?!"
"అదే ..... నీ జుట్టు తీసేయాలనే విషయం?!"
"ఎందుకు తీయాలి. నాభర్త ఉండగా నేను గుండు చేయించుకోవాల్సిన అవసరమేముంది?" అంది వెంగమాంబ.
ఇహ, లాభం లేదు. ఈ పిల్ల మొండిఘటం అనుకుంటూ కొంతమంది వెంగమాంబను చుట్టేశారు. ఆమె చేతులు కదలనీయకుండా ఒకడు తన ఉత్తరీయంతో, ఆమె చేతులను చుట్టేశాడు. పక్కనున్న మంగలి, క్షణాలలో వెంగమాంబ శిరోజాలు గొరిగాడు.
క్షణాలలో మంగలి వెంగమాంబ శిరోజాలు గొరగడంతో ఆమె కళ్ళల్లో నిప్పులు చెరిగాయి.
వెంటనే గ్రామపెద్దకు ఒక కాలు చచ్చుబడిపోయింది. తల గొరిగిన మంగలి చేయి పడిపోయింది.
"అయ్యో! ఇదేం చోద్యం?!" అంటూ ఇంటిదారి పట్టారు వాళ్ళు. వెంగమాంబ దేవుని స్తుతిస్తూ, ఆ పక్కనున్న సరస్సులో మునిగింది.
ఆశ్చర్యం!?
మరుక్షణంలో ఆమె తలపై నిగనిగలాడుతూ నల్లని జుట్టు!!
ఈ వార్త ఊరంతా దావానలంలా వ్యాపించింది. వెంగమాంబ ఇంటిముందు ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. "తల్లీ! వెంకమ్మా!!" అంటూ ఆమె శక్తిని చూసి కొందరు కాళ్ళపై పడుతుండగా, మరి కొందరు భక్తితో హారతులివ్వసాగారు. మరికొంతమంది సాష్టాంగ దండప్రణామా లర్పిస్తున్నారు. ఆమె మాట నిజమవుతోందని తెలియడంతో, జనం తండోపతండాలుగా వెంగమాంబ ఇంటివైపు పరుగులు తీస్తున్నారు. ఆమె భూలోకంలో వెలసిన అమ్మవారేనని అంటున్నారు. కొంతమంది ఆమెను "దేవుడమ్మ" అని పిలుస్తున్నారు.
కాలు చచ్చుబడిపోయిన గ్రామ పెద్ద, చేయి పడిపోయిన మంగలిమాత్రం ఎలాగైనా వెంగమాంబపై కక్ష సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నారు. "ఆ  పాపిష్టిరాలు వల్లనే మాకు ఈ గతి పట్టింది. ఆమెను ఇలాగే వదిలేస్తే ఇంకా చాలా మందికి ఇదే పరిస్థితి దాపురిస్తుంద"ని ప్రచారం చేస్తున్నారు. ఆ  మాటలను నమ్మిన కొందరు గ్రామస్తులు, వయసులో ఉన్న ఆడది, అలా ప్రవర్తిస్తుందంటే. ఇందులో ఏదో మోసం తప్పకుండా ఉంటుంది. మనవాళ్ళు వెర్రివాళ్ళు కాకపోతే ఆమెను దేవుడమ్మ అని మొక్కడం ఏమిటి? అంటూ దుష్ప్రచారం మొదలెట్టారు.
ఇవేమీ పట్టని వెంగమాంబ గ్రంథరచన చేస్తోంది. స్వామిపై శతకాలు రాస్తోంది. ఆమె ఏ పని చేసినా, ఆమెను ఆడిపోసుకునేందుకు, ఊర్లో ఓ వర్గం తయారైంది. "అమ్మా! దేవుడమ్మ! పిల్లాడు రెండు రోజుల్నుంచి పచ్చి మెతుకు ముట్టడం లేదు. పాలు కూడా తాగడం లేదమ్మా!" అంటూ పనిమనిషి పరుగెత్తుకొచ్చింది. తన బిడ్డని వెంగమాంబ కాళ్ళపై పడేసింది ఆ పనిమనిషి. ఆ పసివాడిని తన చేతుల్లోకి తీసుకున్న వెంగమాంబ, "స్వామీ! పాలు తాగవా? అన్నం తినవా? ఎందుకయ్యా?!" అని ముద్దుచేస్తూ, అక్కడున్న అరటిపండు ముక్కని తీసి నోట్లో పెట్టింది. ఆ బిడ్డ , పండుని గబగబా తినేయడాన్ని చూసిన తల్లి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. "బిడ్డ అన్నం తిని రెండు రోజులైందమ్మా" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆ తల్లి. ఆ పసివాడిని తల్లికి అందిస్తూ. "ఇకపై రోజూ తింటాడు" అంటూ పలికింది వెంగమాంబ. ఇలా రోజురోజుకీ వెంగమాంబపై గురి కుదురుతోంది.
"అవునే. ఆమె దేవుడమ్మ. మనలాంటి ఆడది కాదుగా. తనేమో నాభర్త ఆ స్వామే అని అంటుంటే.... కాదు నీ భర్త మరణించాడు. గుండు చేయించుకోమనడం ఏమంత సబబు?" అని అంది చెరువు నీళ్ళకోసం వెళ్ళిన సుందరమ్మ. సుందరమ్మ మాటలను విన్న వాళ్ళలో ఒకామె నవ్వుతూ, "ఏం నీ కూతురికి కవల పిల్లలు పుడతారని చెప్పినందుకు మురిసిపోతున్నావా? చాల్లే ఊరుకో. విధవరాలు అలా పసుపు కుంకుమలతో తిరగడం, మనకే అరిష్టం తెల్సా?" అంటూ దీర్ఘం తీసింది. అలా మాటా మాటా పెరిగింది. "తిరుగుబోతు ఆడదాన్ని నువ్వే సమర్థిస్తున్నావ్. నాకు తెలిసి ఇంకెవరూ సమర్థించడం లేదు" అందామె రోషంగా. ఆ మాటలకు గయ్యిమంటూ లేచిన సుందరమ్మ, "నోర్ముయ్, దేవుడమ్మను ఏమన్నా అంటే నీ నోరు పడిపోతుంది" అంటూ శాపనార్థాలు పెట్టింది.
సంధ్యాసమయమవుతోంది. ఆ చెరువు గట్టు వెంబడి నడుచుకుంటూ వస్తున్న  వెంగమాంబ  వీళ్ళిద్దరి మాటలను వింది. ఆ ఇద్దరి మాటలను విన్న వెంగమాంబ, వాళ్ళతో, "కడపటనున్నది కైవల్యమంటాడు దేవుడు. తెలుసా మీకు?" అంది గబగబా వచ్చి. అక్కడున్న ఆడవాళ్ళు భయంతో పరుగులు తీసారు. వెంగమాంబ అలా ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయింది.
ఊరి పెద్దలంతా ఒకచోట గుమిగూడారు. ఎలాగైనా వెంగమాంబకు మరలా గుండు చేయించాలని పట్టుబట్టారు. అలా చేయకపోతే ఊరే ఉప్పెనలో మునిగిపోతుందన్నారు. అయితే ఎవరికీ వెంగమాంబ  దగ్గరికెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. ఇదిలా వుండగా, ఆ ఊరు చేసుకున్న భాగ్యం అన్నట్లు ఈ ఊరికి శ్రీ శంకరాచార్య పరంపరాచార్యులు వారు వేంచేస్తున్నట్లుగా వార్త అందింది. భక్తులంతా స్వామి వారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆచార్యులవారు అనేక బిరుదులతో, కమండల కుండల నవరత్న ఖచిత కంకణాభరణాదులతోను అలంకృతులై, గజతురగాది వాహనాలతో స్వర్ణసింహాసనారూఢులై వచ్చారు. భక్తులు స్వామికి ఎదురేగి, మర్యాదలు చేసి, గొప్ప ఉత్సవంలా వెంటతెచ్చి ఒకచోట విడిది చేయించారు. అక్కడికి తరిగొండ గ్రామ ప్రజలే కాక, ఇరుగుపొరుగు గ్రామాలవారు కూడా తరలివచ్చారు. తమ తమ స్థితిని బట్టి ధనకనక వస్తువాహనాలను, పండ్లు, పూలను సమర్పించుకుని స్వామి దర్శనం చేసుకుని నమస్కరించి వెళ్ళారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS