Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 13


    అయితే వసంతదాదాకి వ్యతిరేకత కూడా లేకపోలేదు. చిన్న చిన్న దళాలు, మాఫియా ముఠాలేకాక, నిజాయితీపరులైన పోలీసాఫీసర్లు కూడా కొందరున్నారు. అటువంటివారిలో ఐ.జి. అర్జున్ సింగ్ ఒకరు. తనకున్న పరిధిలో కనీసం ఒకసారైనా వసంద్ దాదామీద నేరాన్ని మోపి శిక్షింపజేయటం తన జీవితాశయంగా పెట్టుకుని ప్రయత్నాలు చేయసాగాడు. కానీ ముందు చెప్పినట్టు-వసంతదాదా ఏం చేసినా తడి తన చేతికి అంటనివ్వడు.

    సరీగ్గా ఈ సమయంలో పార్లమెంటు 'మీసా' చట్టంలో కొన్ని మార్పులు చేసింది...... థాంక్స్ టూ ప్రైమ్ మినిష్టర్. భారతదేశపు సవరింపబడిన మీసా చట్టం క్రింద అరెస్ట్ కాబడిన మొట్టమొదటి వ్యక్తి వసంత్ దాదా.

    కాని అతడిని ఏ కారణాలవల్ల అరెస్ట్ చేశారో సరీగ్గా నిరూపించలేకపోవటం వల్ల అరెస్ట్ కాబడిన పదిరోజుల్లోనే అతడిని విడుదల చేయవలసిందిగా కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కారణాలు సరిగ్గా  సేకరించకుండా ఒక గౌరవనీయుడైన పౌరుడిని అరెస్ట్ చేసినందుకు కోర్టు ప్రాసిక్యూషన్ సుతారంగా మందలించింది కూడా. (వసంత్ దాదా తరపున వాదించిన ప్రసిద్ధ లాయర్ ఆ తరువాత ఒక ఉత్తర ప్రాంతపు రాష్ట్రానికి న్యాయశాఖా మంత్రి అయ్యాడు).

    దాదాపు విసిగిపోయిన స్థితిలో అర్జున్ సింగ్- వసంత్ దాదా నివసించే సర్కిల్- 3 ఏరియాకి అధికారిగా  శ్రీకాంత్ ని  తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అప్పటికే మంచి పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు.

    వసంత్ దాదాని ఎదుర్కోవటానికి శ్రీకాంత్ కొత్త పంథా ఎన్నుకున్నాడు. దాదాని తనేమీ చేయలేడు. మూలస్థంభాలయిన నలుగుర్ని కొట్టెయ్యటం ప్రారంభించాడు. అతిడ్ అనుచరులమీద వున్న కేసులన్నిటినీ తిరగతోడి ఎంక్వయిరీ మొదలు పెట్టాడు.

    శ్రీకాంత్ అనుకున్న ఫలితం రావటం ప్రారంభించింది. అనుచరుల 'స్వేచ్ఛ' తగ్గిపోవటంతో వసంత్ దాదా మొదటిసారి కంగారుపడ్డాడు.

    సరిగ్గా ఆ సమయంలో సర్కిల్ - 3 ఏరియా పౌరులు 200 మంది- శ్రీకాంత్ తమపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. సర్కిల్-3 పార్లమెంటు సభ్యుడు, శ్రీకాంత్ బదిలీకోసం నిరాహారదీక్ష ప్రారంభించాడు. కానీ అర్జున్ సింగ్ వీటికి తట్టుకోగలిగాడు! శ్రీకాంత్ కి ట్రాన్స్ ఫర్ కాలేదు.

    ఒకరోజు అనుకున్న సమయం వచ్చింది.

    రాత్రి ఒంటిగంటకి సర్కిల్ - 3  నుంచి కుతుబ్ మినార్ వైపు వెళ్తున్న లారీలో అనుమానాస్పదమైన సరుకు వుంది అని కబురు అంది, శ్రీకాంత్ దాన్ని తమ జీపులో అనుసరించసాగాడు. లారీ హారన్ మూడుసార్లు చొప్పున మ్రోగుతూ సాగిపోసాగింది. డ్రైవర్  ఆ ప్రాంతం స్మగ్లర్లకి ఆ విధంగా సూచన్లు ఇస్తున్నాడన్న మాట. మాఫియాకి ఇది గుర్తు! ఏ దళం వాళ్ళైనా ఆపదలో వున్న తమజాతి వాళ్ళకి సాయపడాలి! తమ మధ్య ఎన్ని వైరాలున్నాసరే. దీనికి కొన్ని పద్ధతులున్నాయి....... సందుల్లోంచి రెండు మూడు స్కూటర్లు అడ్డంగా వచ్చి పోలీసు వ్యానుకి (అది ఆక్సిడెంటు అని చూసేవాళ్ళు భ్రమించేలా) అడ్డు పడతాయి.  చీకట్లోంచి రాళ్ళు వచ్చి తగిలి అద్దం బ్రద్దలవుతుంది. లారీ వెళ్ళే దిశ ముందే తెలుసున్న దళం వాళ్ళు లారీ వెళ్ళగానే రోడ్డు మీదకి, జీపు వెళ్ళకుండా మేకులు విసురుతారు.

    ఆ రోజు ఇవన్నీ జరిగాయి.

    అయినా శ్రీకాంత్ లారీని పట్టుకోగలిగాడు. నాలుగు బాదగానే రెండు పేర్లు చెప్పాడు. ఆ ఇద్దరూ వసంత్ దాదాకి రెండు భుజాలు. శ్రీకాంత్ వారిని అరెస్ట్  చేశాడు. అరెస్ట్ కాబడటానికి ముందు నాలుగుసార్లు వాళ్ళు హడావుడిగా త్రివేండ్రం మాట్లాడటాన్ని ట్రంక్ కాల్ ఆఫీసు రికార్డు చేసింది. అప్పుడు వసంతదాదా త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి కూతురి వివాహానికి ముఖ్య ఆహ్వానితుడుగా అక్కడవున్నాడు. ఫోన్లో వాళ్ళ సంభాషణ రికార్డు చేయబడింది.

    వసంత్ దాదా చుట్టూ వల గట్టిగా బిగుసుకుందనే అనుకున్నారు అందరూ! నిజాయితీ పోలీసు అధికారులు హాయిగా  ఊపిరి పీల్చుకున్నారు.

    ఇది జరిగిన రెండు రోజులకి 'ప్రమాదవశాత్తు' జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ టేప్స్ కాలిపోయాయి. టేప్ చేసిన టెలిఫోన్ ఆపరేటర్లు ఇద్దరూ రెండు స్కూటర్లు కొనుక్కున్నారు.

    శ్రీకాంత్ నిస్సహాయుడిగా వుండిపోవాల్సి వచ్చింది.

    అతడి కష్టాలు అక్కడ ఆగలేదు.

    స్వేచ్చాయుతమైన ఆరుగురు ఆరు వేర్వేరు ప్రదేశాల్లో శ్రీకాంత్ మీద చిన్న (నిజంగా చాలా ) చిన్న కేసులు పెట్టారు. తమని అనవసరంగా అరెస్ట్ చేసాడని ఒకరు, తమకి కిళ్ళీషాపుని నోటీసు లేకుండా ఖాళీ చేయించాడని ఒకరు.... ఇలాటి కేసులు ఏవీ కోర్టులో నిలవవు. కానీ శ్రీకాంత్ మూడురోజులకు ఒకసారి కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. ఒకటి కుతుబ్ మీనార్ దగ్గిర వుంటే మరో కోర్టు మొగల్ పూర్ లో వుండేది. మరొకటి కన్నాట్ ప్లేస్ లో వుండేది.

    అతడు కోర్టులో ప్రవేశించగానే దాదా అనుచరుల పిల్లికూతల్తో హాలు మారుమ్రోగేది. ఒక పోలీసు అధికారి, మామూలు నేరస్థుడిలా, క్రిమినల్ లాయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసిన వచ్చేది. ఆర్నెల్ల తరువాత, ఆ కేసు కొట్టివేయబడేది. అతడు హాయిగా ఊపిరి పీల్చుకునే లోపులో ఆగ్రా నుంచి మరొకడు కేసు వేసేవాడు ఈ విధంగా అతడి స్థితి పెనంమీద ఆవగింజలా తయారైంది.

    అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరొకటి వుంది. శ్రీకాంత్ పై వేర్వేరు కేసులు పెట్టించిన వసంత్ దాదా  అనుచరుల్లో చిట్టచివరివాడు - పోలీసు ఉన్నతాధికారి. శ్రీకాంత్ కన్నా  ఆర్థికంగా కనీసం పదిరెట్లు ఎక్కువలో వున్నాడు. ఈ కోర్టుల చుట్టూ తిరిగే ఖర్చు శ్రీకాంతే భరించవలసి వచ్చింది. ఎంత హేయమైన పరిస్థితి అంటే, అతడు అరెస్ట్ చేసినవాడు తిరిగి అతడి మీద కేసువేస్తే- వాదించే లాయరు ఖర్చు కూడా ప్రభుత్వం ఇవ్వదు. తనకొచ్చే జీతంలో ఇవన్నీ అతడు స్వయంగా భరించుకోవలసిందే. ఇవికాక కోర్టులో పిల్లి కూతులు, తోటి ఆఫీసర్ల సానుభూతి, ఆ సానుభూతి వెనుక- పెద్ద నిజాయితీ పరుడిగా ఫోజు కొట్టినందుకు అనుభవించు - అన్న చిరునవ్వు.

    శ్రీకాంత్ మానసికంగా కృంగిపోయాడు. అర్జున్ సింగ్ కూడా మునుపటంత ఉత్సాహంగాలేడు. ఇందిరా గాంధి హత్య సందర్భంగా చెలరేగిన ఢిల్లీ మత  కల్లోలాల్లో అతడి హస్తం వున్నదంటూ వసంత్ దాదా లేవదీసిన పుకారు బడబాలనంలా వ్యాపించింది. అతడు సస్పెండ్ అయ్యేవాడేగాని, హొం మినిస్ట్రీలో వున్న నిజాయితీ పరుడైన మరో ఆఫీసరు ఆదుకోవడం వల్ల రక్షించబడ్డాడు. ఆ తరువాత అతడు ఢిల్లీ నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు.

    అర్జున్ సింగ్ వెళ్ళిపోవటంతో శ్రీకాంత్ మరీ ఒంటరివాడై పోయాడు. అతడు మానసికంగా ఎంత కృంగిపోయి వున్నాడంటే- మరింత వత్తిడి తీసుకొస్తే బేషరతుగా వసంత్ దాదా షరతులు వప్పుకునే స్థితికి వచ్చాడు.

    వసంత్ దాదా! ది కింగ్ ఆఫ్ అండర్ వరల్డ్!!

    తనని ఆశ్రయించినవారిని ఆకాశంలోకి లేపి, తనను కాదన్నవారిని నిర్దాక్షిణ్యంగా నొక్కివేసి- అందరిలోనూ, "ఇతడితో మంచి సంబంధాలు పెట్టుకుంటే బావుండు" ననే భావన కలిగించి, చీకటి ప్రపంచాన్ని ప్రధానమంత్రిలా ఏలుతున్న మహారాజు దాదా!

    సముద్రం అట్టడుగున కుళ్ళిపోతున్న ఎక్సైజ్ అధికారుల శవాలు, మరణించిన నిజాయితీ పోలీసు ఆఫీసర్లు శరీరాలు- అతడి అరాచకత్వానికి నిదర్శనాలు.

    సలీం శంకర్ లాంటి మూల స్థంభాలున్నంత కాలం అతడు ఆ అరాచకత్వపు భవంతిని అంతస్తుపై అంతస్తుగా లేపుతూనే వుంటాడు. హింస, క్రౌర్యం, బాధ తమ  జీవితాల్లో ఒక భాగంగా అనుదినం భారత ప్రజలు భావించే రోజు ఎప్పుడో వచ్చేసింది. ఆ అవినీతి మహల్ పెరిగే కొద్దీ ప్రజల జీవితంలో దాని భాగం (ప్రోపోర్షన్) ఎక్కువ అవుతుంది. 'అనుదిన' మల్లా 'అనుక్షణ' మవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.

    అయితే- ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది.

    కువైట్ నుంచి వచ్చిన దంపతులకి, ఫ్రెంచి టూరిస్ట్ గైడ్ వేషం వేసుకున్న సలీం శంకర్- గోల్కొండ చూపించే నెపంమీద నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువచ్చి తమ మామూలు పద్ధతిలో చంపేశాడు. డాలర్లు దొంగిలించి, భార్యని రేప్ చేసి హుస్సేన్ సాగర్ లో పడేశాడు. అతడి అదృష్టం బావోలేక- అతడి మోటార్ సైకిల్ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారు. పటిష్టమైన కేసు నిర్మింపబడింది. హత్యా ప్రదేశంలో అతడి వేలిముద్రలు పారిపోయాడు.

    ఒక హంతకుడిని, నేరం నిరూపించబడటానికి సిద్ధంగా వున్నవాడిని తిరిగి తమదేశం తెప్పించటానికి అధికారులకి సంవత్సరంపైగా పట్టింది. (బ్యూరో క్రసీ, రెడ్ టేపిజాలు నిజంగా ఎంతగానో పేరుకుపోయి వున్నాయి అనటానికి ఇది నిదర్శనం)

    ఈ లోపులో వసంత్ దాదా  తన రంగం సిద్ధం చేసుకున్నాడు. సాక్షుల్ని కొనెయ్యటం, రికార్డులు మార్చెయ్యాటానికి ప్రయత్నం జరిగాయి. చివరికొచ్చేసరికి జడ్జీ నిజాయితీపరుడిగానూ, దేనికీ లొంగని వాడిగానూ నిలబడ్డాడు. కానీ వసంత్ దాదా నిఘంటువులో 'దేనికీ' లొంగకపోవటం అంటూ లేదు. నెల రోజులపాటూ వసంత్ దాదా అనుచరులు జడ్జి కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరిమీదా  అనుక్షణం నిఘావేసి వుంచారు. ఒకరు వంటవాడుగా చేరాడు. కారు డ్రైవరు నెల రోజుల శెలవు పెట్టాడు. జడ్జీ రెండో కోడలికీ, పెద్దకొడుక్కి సంబంధం వున్నదని తేలింది. జడ్జి- దాదాపు ఏడుస్తున్న స్థితిలో ఆ వీడియో క్యాసెట్ ని కొనుక్కున్నాడు- న్యాయాన్ని ధరగా ఇచ్చి.

    మార్చి 12వ తారీఖున- ప్రాసిక్యూషన్ సరీగ్గా నిరూపించలేని కారణంగా- టూరిస్ట్ హత్య కేసులో సలీంశంకర్ విడుదల చేయబడ్డాడు. (మర్చి 24న జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు.)

    దీనికి దాదాపు పదిహేను రోజులముందు- అంటే ఫిబ్రవరి మూడవ వారంలో ఒక విషయం తెలిసింది.

    సాధారణంగా అపాయాలు అనుకోని కోణంలోంచి వస్తూవుంటాయి. సలీం శంకర్ విషయంలో లాగే జరిగింది.

    జపాన్ లో సలీంశంకర్ మరోహత్య చేసాడు. ఈసారి అతడు, 2,00,000 యెన్ ల కోసం ఈ హత్య జరిపాడు. అయితే జపాన్  ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎంతో పకడ్బందీగా పరిశోధన జరిపింది. ఈ విషయం తెలిసిన భారత అధికారులు కూడా ఈ విషయాన్ని చాలా పకడ్బందీగా  చివరి వరకూ రహస్యంగా వుంచగలిగారు. జపాన్ న్యాయసూత్రాల ప్రకారం సలీం శంకర్ కి ఉరి ఖాయం అని ధృవీకరింపబడింది. వసంత్ దాదాకి ముఖ్య  శత్రువైన పోలీసు అధికారి అర్జున్ సింగ్  ప్రత్యేక  శ్రద్ధ తీసుకొని ఈ విషయంలో పనిచేసాడు. టూరిస్ట్ హత్య కేసులోగానీ ఒక వేళ  సలీంశంకర్ తప్పించుకున్నట్టయితే, ఆ వెంటనే అతడిని జపాను పంపే ఏర్పాట్లు జరిగాయి. అతడి చరమ సమాధి జపాన్ లో  జరగటాన్ని ఇక ఏ శక్తీ ఆపలేనంతగా ఉచ్చు బిగింపబడింది. సలీం శంకర్ విషయంలో పూర్తిగా విసిగిపోయిన పోలీసు అధికారులకి ఈ ఆశారేఖ దేదీప్యమానంగా కనపడసాగింది. జపాన్  నుంచి- కమిషనర్ ఆఫ్ పోలీస్  యమిన్ సున్ చింగ్ -  ప్రత్యేకంగా వచ్చి ఇండియాలో బసచేసాడు. ఈ కేసు పూర్తవగానే, ఆ కేసులో బుక్ చేసి శాశ్వతంగా అతడిని జపాన్ తీసుకువెళ్ళి అంతం చేయటానికి.

    మొట్టమొదటిసారి వసంత్ దాదా విసుక్కున్నాడు. అతడికి కోపం వచ్చే క్షణాలు అరుదు. హైద్రాబాద్ లో అతడి బంగారుగని సలీంశంకర్! సాలుకి పాతిక లక్షల ఆదాయం సంపాదించే ఈ దళాధిపతి యొక్క ఈ 'ఒక్క' బలహీనతా అప్పుడప్పుడు వసంత్ దాదాని చాలా ఇబ్బందిలో పడేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా శంకర్ ఈ బలహీనత నుంచి బయటరాలేకపోవటం దురదృష్టం.

    సలీం శంకర్ ని అర్జెంటుగా ఢిల్లీ రమ్మని వసంత్ దాదా ఫోన్ చేసింది ఇందుకే! వసంత్ దాదా అతడికి ఈ జపాన్  విషయం చెప్పగానే అతడి మొహం  పాలిపోయింది. అయితే అది రెండు క్షణాలే. తరువాత నిర్లక్ష్యంగా నవ్వేసి "నువ్వే చూసుకుంటావ్ గా దాదా" అన్నాడు.

    దాదాకి శంకర్ లో నచ్చేది ఈ విషయమే! వెన్ను విరిగి మీద పడ్డా చలింపడు. ఒక రకమైన క్రిమినల్ సైకో పాత్స్  కి మాత్రమే ఈ నిర్లక్ష్యం అలవడుతుంది. ఇలాటి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అయితే ఈసారి సమస్య అనుకున్నంత సులభం కాదు- పరుష్కారించటానికి! భారత సరిహద్దులవతల వసంత్ దాదా ప్రాభవం పనిచెయ్యదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS