Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 13



    "అదే! మీరు రోజూవచ్చి ఈ వర్కు  చెయ్యండి. నేను సలహాలిస్తాను" ప్రొఫెసర్ గారి మాటలువిని నీరుగారి పోయారు సత్యం.

    "నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని. డాక్టర్ బెడ్ రెస్టు తీసుకోమన్నాడు. నాకొడుకున్నాడంటే వాడదోరకంమనిషి" అన్నారు నిస్సహాయంగా.

    "పోనీ మీ అమ్మాయిని చెయ్యమనండి!" సలహా యిచ్చారు ప్రొఫెసర్ గారు.

    "అమ్మాయా? ఆడపిల్ల అదేం చెయ్యగలదు!" ఆయనమాట నోట్లో వుండగానే తాటెత్తున లేచారు పృథ్వి.

    "ఏం ఆడపిల్ల అయితే? రేడియం కనిపెట్టిన మేడమ్ క్యూరీ ఆడపిల్ల కాదా? గాంధీగారికి కుడిభుజంగా నిలిచినా సరోజినీ నాయుడు ఆడపిల్ల కాదా? ప్రపంచం ముక్కు మీద వేలు వేసుకునేలా రాజ్యం ఏలిన ఇందిరాగాంధి ఆడపిల్ల కాదా? ఆ పాతకాలం మాటలు మళ్ళీ నా దగ్గర మాట్లాడకండి. అమ్మాయిని రీసెర్చి మొదలుపెట్టమనండి. నాతో పాటు అమ్మాయిపేరు కూడా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతుంది" అన్నారు ఆవేశంగా.

    ఆవేశంతో ఊగిపోయింది దీపిక. భక్తిగా  ఆయన వంక చూశారు సత్యం. ఆ జ్యోతిష్యుడు చెప్పింది అక్షరాలా నిజం. ఇడుగో ఆ మహానుభావుడు అనుకుని భక్తిగా చేతులు జోడించారు. "దీపా! యిదంతా కేవలం మన అదృష్టం తల్లీ . ఆయన మనపాలిటి దైవం అంధకారంలో అలమటిస్తున్న మనకు వెలుగురేఖ. ఆయన కాళ్ళకు మొక్కు. ఆయన చెప్పినట్లు విను తల్లీ!" అన్నారు.

    వెంటనే ఆయన కాళ్ళకు దండం పెట్టింది దీప.

    "మేగాడ్ బ్లెస్ యూ!" అన్నారాయన. "రే ప్రొద్దున తొమ్మిదికల్లా వచ్చెయ్. ఉయ్ విల్ బిగిన్ అవర్ వర్క్" అన్నారు.

    యింటికిరాగానే కూతుర్ని పిల్చింది వర్ధనమ్మ. "యెక్కడికి పోయారు? యిందాకటినుంచీ చూస్తున్నాను నీ కోసం. కాస్త ఆ బట్టలుతికి ఆరేసి రేపటి ఇడ్లీకి పప్పు రుబ్బు" అంది.

    భార్యని వారించారు సత్యంగారు. "చూడు! అమ్మాయికి అలాటి పనులేమీ చెప్పకు. దానికిబోలెడంత పనుంది. రేపట్నుంచి దీప రీసర్చి చేస్తుంది. దానిజోలికి వెళ్ళకు" అన్నారు.

    ఆవిడకు కోపం వచ్చింది. కానీ అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి. అందునా ఎండనపడి వచ్చారు అందుకే ఊరుకుంది.

    దీప రీసెర్చి మొదలయింది. ద్రోణాచార్యుడికి అర్జునుడిలాగా ఆయనకి దీప అంటే బోల్డంత అభిమానం దీపకి కూడా ఆయనంటే బోల్డంత భక్తి, భయం. ఆయన మాటంటే మహాగురి. అలా గడిచిపోతున్నాయి రోజులు.

             
                                            *    *    *

    కరెంట్ పోయి ఫాన్ ఆగిపోవటంతో మెలకువ వచ్చింది మోహన్ కి. బద్దకంగా  లేచిన వెంటనే అసలు తనెక్కడన్నాడో గుర్తురాలేదు. తరువాత గుర్తొచ్చింది. నారాయణమూర్తిగారింట్లో వున్నాడని. లేచి యవతలికి వచ్చాడు. అదే సమయంలో పక్క గదిలోనించి బయటికి వచ్చింది భారతి.

    యితడిని చూడగానే నిండుగా నవ్వుతూ "హల్లో బావా! నాన్నా చెప్పారు నువ్వు వచ్చావని! నీకోసం వస్తే నిద్రపోతున్నావు. యెందుకులే లేపటం అని లేపలేదు" అంది ఆప్యాయంగా.

    ఆ ఆప్యాయతకు ముగ్ధుడై పరిశీలనగా చూశాడు మోహన్ అమ్మాయిలు రెండు రకాలుంటారు. కొందరు సన్నజాజి పువ్వులు, మరికొందరు ముద్దబంతి పువ్వులు. భారతి రెండో కోవకి చెందుతుంది. బొద్దుగా ముద్దుగా ఉంది. తెల్లటి కాంప్లెక్షన్ పొట్టిజడ ఆప్యాయత కురిపించే చిరునవ్వు కన్నార్పకుండా తనవంక చూస్తున్న  అతన్ని చూసి నవ్వేసింది భారతి.

    "ఏమిటి బావా! అలా చూస్తున్నావ్?" అంది.

    "ఏం లేదు" అనేశాడు మోహన్.

    "సరేలే. కిందకెళుతున్నావా?" అడిగింది.

    "అవును" అన్నాడు మోహన్.

    "నాన్న వంటింట్లో వుంటారు. నువ్వెలాగూ వెళుతున్నావుకదూ! నాకు కాఫీ పంపించమని చెప్పు" అనేసి చేతిలోని వారపత్రిక చదువుకుంటూ వెళ్ళిపోయింది భారతి.

    అయోమయంగా చూసి కిందికి వెళ్ళాడు మోహన్. వంటింట్లోవున్నారు సూర్యంగారు. భారతికి కాఫీ కావాలిట! అని చెప్పాడు.

    "అలాగా వస్తున్నావుండు" అనేసి కంగారుగా కాఫీ కలుపుకుని మేడమీదకి వెళ్ళాడు.

    "కాస్త అటూ__ఇటూ అయితే తట్టుకోలేదు. మరి ఏడు మల్లెపూల ఎత్తు పిచ్చితల్లి!" తిరిగొచ్చి మోహన్ కి  కాఫీ యిస్తూ కూతురి గురించి చెప్పుకుని మురిసిపోయాడు.

    కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం అయింది. బోరుగా అనిపించి సినిమాకి వెళ్దాం అని బయలుదేరాడు. వాకిట్లోకి వచ్చేసరికి మేడమీదనించి కేకేసింది భారతి.

    "బజారుకి వెళుతున్నావా బావా?"

    "లేదు. సినిమాకి వెళ్దామని బయలుదేరాను."

    "ఈ రోడ్డు చివర పుస్తకాలు అద్దెకిచ్చే షాపు వుంది. వచ్చేప్పుడు నాకు మంచి  నవల తెచ్చి పెట్టవా?" గారంగా అడిగింది.

    "యింకా టైముంది సినిమాకి పుస్తకం తెచ్చి ఇచ్చే వెళ్తాలే!" నవ్వుతూ సమాధానం చెప్పి బయటికి వచ్చాడు.

    రోడ్డు చివరవుంది భారతి చెప్పిన షాపు. లోపలికి వెళ్ళాడు. "మంచి నవల ఏదైనా ఇవ్వండి!" అన్నాడు.

    "మీరే యెంచుకోండి!" సమాధానం చెప్పాడు షాపతను.

    "నాకు అంతగా తెలీదండీ. మీరే యివ్వండి" అన్నాడు మోహన్.

    మంచి నవల ఎంచి దాని ఖరీదు డిపాజిట్ కట్టించుకుని "రోజుకి నలభయి పైసలు" అని చెప్పి పుస్తకం ఇచ్చాడు షాపతను.

    ఆ నవల చేత పట్టుకుని హుషారుగా యింటివైపు నడిచాడు మోహన్.


                                            *    *    *


    ఫస్ట్ షో సినిమా వదిలేశారు. రోడ్లంతా సందడిగా అయిపోయాయి దాదాపు అరగంట తరువాత పనికుర్రాడిని కేకేసి "యిక అన్నీ సర్దేయ్. షాపు మూసేద్దాం!" అని వురమాయించి ఆరోజు ఎకౌంట్ చూసుకుంటూ కూర్చున్నాడు పుస్తకాల షాపు ఓనర్. కూనిరాగాలు తీస్తూ బయట వేలాడగట్టిన పుస్తకాలు జాగ్రత్తగా తీసి లోపల పెడుతున్నాడు కుర్రాడు.

    లెక్కలు చూసుకుంటున్న ఓనరు యధాలాపంగా తలెత్తి రోడ్డువంక చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. చిరాకేసింది.

    యెదురుగా మోహన్ రొప్పుకుంటూ అప్ యెక్కి వచ్చి షాపుముందు ఆగాడు చెమట తుడుచుకుంటూ చేతిలోని పుస్తకం టేబిల్ మీద పెట్టాడు.

    "ఏమిటి యిదీ చదివేశారా?" తీక్షణంగా చూస్తూ అడిగాడు ఓనరు.

    ఆయాసపడుతూ అవునని తలూపాడు మోహన్.

    చిర్రెత్తుకొచ్చింది షాపతనికి. "ఏమిటిసార్ యిది? సాయంత్రంనుంచి యిది ఆరోసారి యిలా మీర్రావడం. నేను పుస్తకంతీసి యివ్వడం. ముందే చూసి చదవనిది సెలక్టు చేసుకుని తీసికెళ్ళాలి గానీ యిలా అరవైసార్లు మార్చి మార్చి మమ్మల్ని యిబ్బందిపెడితే యెలాగండీ? యిలా అయిలే మేం వ్యాపారం చేసినట్లే!" విసుక్కున్నాడు.

    మోహన్ కి కూడా విసుగేసింది. "బాగుందయ్యా రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుందట! కదలకుండా కూర్చుని పుస్తకం మార్చినందుకే నువ్వింత ఆయాస పడిపోతున్నావ్ సాయంత్రం ఆరింటినుంచి ఒక్కలా తిరుగుతున్నాను అట్నుంచి ఇటు ఇట్నుంచి అటూ టెన్సిస్ బంతిలా తిరిగి తిరిగి వాళ్ళు పీకేస్తున్నాయి. నా గోడు ఎవరితో చెప్పుకోమంటావ్?"

    విసుగ్గా కసిరేసి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు.

    ఆ షాపతనికి జాలేసింది. "సర్లెండి, ఇలా ఇవ్వండి మారుస్తాను" అని పుస్తకం   అందుకున్నాడు. "మిమ్మల్ని అదివరకెపుడూ చూడలేదు. కొత్తగా వచ్చారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS