Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 12


    "డబ్బుకోసం కాదండీ! భగవంతుడు దానికి రూపమూ, శక్తి సామర్థ్యాలూ రెండు ప్రసాదించాడు. వాటిని ఉపయోగించుకోకపోవడం వెర్రితనం. కీర్తీ, ప్రతిష్ఠా డబ్బుతో కొంటే వస్తాయా? అదృష్టం ఉండాలి!" అంటూ ఇక అతని సమాధానికి ఎదురు చూడకుండా వెళ్లిపోయింది సరోజిని.
    రామానుజంగారు లోపలికెళ్లి పడుకున్నారు. ఇక ఆ ఇంట్లో ఎవరికీ ఏమి చెప్పీ లాభంలేదని.
    భరణి ఈ విషయాల్లో అసలు జోక్యం చేసుకోదు. రాగిణి మాత్రం రకరకాల హీరోలతో రకరకాల ఊళ్లల్లో షూటింగులూ, ప్రెస్ వాళ్ల ప్రశ్నలూ తన సమాధానాలూ, జనం తనని చూడటానికి వచ్చిపడే ఇబ్బందులూ అన్నీ తలచుకుని కమ్మని కలల డోలికలలో తేలిపోతోంది.
    ముందు రేపటి అయిదువేలల్లో ఏం కొనాలి? ఒక జత గాజులా? లేకపోతే ఏదయినా సన్న నెక్లెసా? తనూ రాగిణీ, భరణీ ఎవరయినా పెట్టుకునేలా ఏ వస్తువు కొంటే బాగుంటుందా? అని ఆలోచిస్తోంది సరోజిని.
    "నేనో లూనా కొనుక్కుంటాను! అక్కనయినా నిన్నెయినా ఎక్కడికయినా దింపాలంటే పనికొస్తుంది" అంది భరణి.
    "చూద్దాంలే పడుకో!" అంటూ మంచంమీద వాలిపోయింది సరోజిని.
    మర్నాడు ఉదయం పదింటికల్లా వచ్చి అన్నప్రకారం మాట తప్పకుండా డబ్బిచ్చి వెళ్ళాడు భార్గవ. ఆగస్టులో టెలిగ్రాం కొట్టగానే వచ్చెయ్యమన్నాడు షూటింగుకి భార్గవ. తలూపింది రాగిణి.
    ఆ రాత్రి ఫ్లయిట్ లో భార్గవ వెళ్ళిపోయాడు.
    సరోజినీ, రాగిణీ, భరణీ బజారుకెళ్ళారు. వాళ్ళకి పట్టలేని ఆనందంగా ఉంది.
    ముందు బట్టల దుకాణానికెళ్లి మూడు ధర్మవరం చీరలు రిడక్షన్ లో కొన్నారు.
    ఆ తరువాత బంగారం దుకాణానికి వెళ్ళి చిన్న గజ్జెల గొలుసు కొన్నారు. మనసు గాలిలో తేలిపోతోంది. భవితవ్యాన్ని గురించి బంగారు కలలు కంటూ ఇంటికొచ్చి భోంచేసి నడుం వాల్చారు.
    కానీ రామానుజంగారు మాత్రం ఆ రోజునుంచి ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళెవరికీ తన మాటంటే గౌరవం లేదన్న బాధ కొంత ఆయనని పట్టి పీడిస్తోంది. అశాంతితో ఆయన కుమిలిపోతున్నారు.
    ఒక శుభ ముహూర్తాన ఎదురుచూస్తున్న టెలిగ్రాం వచ్చేసింది. రాగిణిని వంటరిగా పంపడానికి లోలోపల భయపడుతున్న సరోజిని తనుకూడా రాగిణితోపాటే ఉందామనుకుంది. రామానుజంగారికి వండిపెట్టడానికీ, ఇల్లు చూసుకోవడానికీ, భరణి ఉంటుందని చెప్పి శిల్పకూడా ఇక్కడలేదు కాబట్టి ఈ ప్లానే మంచిదని అనుకుంది.
    కానీ, విధి మరోలా ఆలోచించింది. రామానుజంగారికి మైల్డ్ స్ట్రోక్ లా వచ్చింది. ఆసుపత్రిలో ఉంచవలసి రావడంతో సరోజిని రాగిణితో వెళ్ళే ఆలోచనకి స్వస్తిచెప్పింది. రాగిణి ఒక్కతే ప్రయాణమైంది మద్రాసుకి.
    "నాన్నా! మీరేమీ బెంగపెట్టుకోకండి. ఈ పరిస్థితిలో మనకు డబ్బు అవసరం కూడా బాగానే ఉండిగదా! నాకీ ఛాన్సు రావడం కూడా మంచిదే. తొందరగా మీ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నాను." అంది రాగిణి రామానుజంగారి మంచం దగ్గరకు వచ్చి.
    అతనేమీ మాట్లాడలేదు. కాసేపు కూర్చొని....... "రేపు ఉదయం ఫ్లయిట్ లో వెళ్లిపోతున్నాను" అంటూ లేచింది రాగిణి.
    "దాన్ని పంపించాక వస్తాను ఆసుపత్రికి" అంది సరోజిని.
    రామానుజంగారు తలూపారు. బట్టలూ, తన సామానులు రెండు సూట్ కేసులలో సర్దింది రాగిణి.   
    "అక్కా! అదృష్టం అంటే నీదే! భగవంతుడు నీకూ, నాకూ ఎంత తేడా పెట్టాడు? అక్కా నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది!" అంది సూట్ కేసులు ఆటోలో పెడుతూ.
    "నువ్వు నీ హాబీలని ప్రొఫెషనల్ గా మార్చుకో, అవసరమైతే ఫోటోగ్రాఫ్ కోర్సులో చేరు. లేదా నీకెంతో ఇష్టమైన పనుందికదా! ఎప్పటినుంచో, మాంటిసరీ స్కూలు పెట్టాలనుకుంటున్నావు కదా! ఏదయినా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ బడి పెడితే సరి."
    "అవునక్కా! అలాగే చేస్తాను..... విష్.... మీ గుడ్.....లక్....." అంది భరణి.   
    "విష్..... యూ..... ఆల్ ది బెస్ట్....." అని భరణిని ఆశీర్వదించి ఆటో ఎక్కింది. భరణీ, సరోజినీ ఏర్ పోర్ట్ వరకూ వెళ్ళారు.
    సరోజినీ, భరణీ ఇల్లు చేరుకున్నారు. ఇల్లంతా బోసిపోయి ఉంది. శిల్ప వెళ్ళిన రోజు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలా వుంది. "అమ్మా! ఇలా మనం బోసిపోయిన ఇంట్లో ఉండడం కష్టం. అక్క లేకపోతే ఇల్లంతా చిన్నబోయింది. నేను రేపటినుంచే స్కూలు ఏర్పాట్లు చేసుకుంటాను" అంది భరణి.
    "అలాగే!" అంది సరోజిని.
    అప్పటికప్పుడు కూర్చుని కొన్ని చార్ట్స్ తయారుచేసింది భరణి. మంచి మంచి పళ్ళూ, కూరలు ఉన్న బోర్డులు కొన్ని. అక్షరాలూ, చిన్న చిన్న పదాలూ ఉన్న బోర్డులు కొన్ని తయారుచేసేసింది. ఆ మర్నాడే పేపర్లో చిన్న ప్రకటన వేయించింది. "భరణి మాంటిసరీ స్కూల్, బొల్లారం" అంటూ వారి ఇంటి అడ్రస్ ఇచ్చింది. తమ స్కూలు తెరవడానికి ప్రకటించిన టైమ్ లో పదిహేను ఇరవై అప్లికేషన్స్ వచ్చాయి! ఇంట్లో సగం భాగం స్కూలుకని కేటాయించారు. స్కూలు పని పెట్టుకున్నప్పటి నుంచీ భరణి బిజీగా ఉంటోంది. రామానుజంగారు ఇంటికొచ్చేయడంతో ఆసుపత్రికి తిరగవలసిన అవసరం తగ్గిపోయింది.
    ఆ రోజు రామానుజంగారిని చూడటానికీ అతని పాత ప్రియశిష్యుడు కాశ్యప్ వచ్చాడు.
    కాశ్యప్ రామానుజం మేష్టారు దగ్గర ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. క్లాసులో ఫస్తొస్తూ. ఎంతో వినయ విధేయతలతో మెలిగే కాశ్యప్ అంటే రామనుజం గారికి ఎంతో ఇష్టం.
    అతడు ఇంటర్ వరకు ఇక్కడే చదువుకుని తరువాత ఇంజనీరింగ్ కోర్స్...... వాళ్ళ వాళ్ళెవరో స్పాన్సర్ చేస్తే వెళ్ళి హాస్టల్లో చదువుకున్నాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కనబడకుండా పోయిన కాశ్యప్ ఇంజనీరై తిరిగి రావడం, చిన్నప్పుడు చదువుచెప్పిన రామానుజంగారిని చూడ్డానికి రావడం - రామానుజంగారు ఉప్పొంగిపోయారు.
    కాఫీ అందిస్తున్న భరణిని "నువ్వేం చేస్తున్నావ్?" అడిగాడు. అమెరికా ఆరునెల్లకోసం వెళ్ళేసరికి వాళ్ళ వేషం, మాటా అన్నీ మారిపోతాయి. తెచ్చిపెట్టుకున్న యాసతో, అవస్థపడుతూ మాట్లాడతారు. కానీ కాశ్యప్ ఇన్ని సంవత్సరాలున్నా అతనిలో ఏ మార్పూ రాకపోవడం, రామానుజంగారికి ఎంతో ముచ్చటగా, గర్వంగా అనిపించింది.
    "మాంటిసరి స్కూల్ నడుపుతున్నాను" అంది భరణి.
    "నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తున్నావన్నమాట. అక్కేం చేస్తోంది?"
    "తైతెక్కలాడుతూ డాన్సులూ, ఇప్పుడు సినిమాల్లోకి కూడా రాబోతుంది" సరోజిని అక్కడలేదన్న ధీమాతో తన కోపాన్నంతా బయటపెట్టారు రామానుజంగారు.
    "చిన్నప్పటినుంచి రాగిణి అంచే కదా మాస్టారూ. ఆ అమ్మాయికి చదువుకన్నా ఈ కళలమీదే ఎక్కువ మక్కువ" అన్నాడు కాశ్యప్ సర్దిచెబుతూ.
    భరణి కాశ్యప్ కి తన బడిని చూపించింది. కాశ్యప్ ఎంతో మెచ్చుకున్నాడు.
    "నిజం చెప్పు కాశ్యప్! నన్ను పొగడాలని అంటున్నావా? లేకపోతే నిజంగానే బాగుందా?"
    "నిజంగా బాగుంటేనే, పొగడాలనిపిస్తుంది" నవ్వుతూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS