Previous Page Next Page 
నా కథవింటావా పేజి 12

  "కళ్యాణీ! నిర్మలకి  ఇంకో చెల్లెలు  కూడా వుందికదూ ?"
    "ఆ!....ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ కొచ్చింది. మధ్యలో ఒక తమ్ముడున్నాడు."
    "నిర్మలలో  ఇంత స్వార్ధం  వుందన్నమాట!"
    "మరి ?"
    "అదే నేనైతే ఇన్ని రకాలుగా  డిమాండు చేస్తున్న  మగపెళ్ళివారిని చూసి 'నేను చేసుకోను' ఈ పెళ్ళి. ఉన్నదంతా  ఊడ్చి  నాకే ఖర్చు పెట్టేస్తే మావాళ్ళు నా తరువాత, చదువుకుని  వృద్ధిలోకి  రావలసిన మా తమ్ముడి సంగతి, మా చెల్లెలి పెళ్ళి  సంగతేమిటి ? "అని నిలదీసి   అడిగేదాన్ని." అంది.
    ఈ సంభాషణంతా  వింటోందేమో, మెషీన్ తొక్కుతూ  బ్లౌజు కుడుతున్న తల్లి, వెంటనే మెషీన్  తొక్కడం ఆపి, "అమ్మా! నువ్వైతే అలాగే చేసేదానివి. పీటలమీద  పెళ్ళి  ఆగిపోయేది. ఆ తరువాత సంబంధాలు రాక, తల్లీ తండ్రి  కుళ్ళి కుళ్ళి  ఏడ్చేవారు. అన్నింటికీ  నీకు ఆవేశం ఎక్కువ. న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ  పుస్తకాల్లో  చదివినంత  కమ్మగా  జీవితంలో కనిపించవమ్మా. వాటి కోసం  పోట్లాడి  ఆదర్శాల పేరుతో, అపహాస్యాలపాలవడమే  మిగులుతుంది  నలుగురిలోనూ!" అంది.
    కావ్యకి నోటిమాట  రాలేదు. ఎన్నడూ  నోరువిప్పి  తన బాదేమిటో వ్యక్తం చెయ్యని వ్యక్తి ఇంత  ఆవేశంకాదు. ఆవేదనతో మాట్లాడు తోందీ అంటే, ఆమెలో ఎంత బాధ ఇముడుకుని  వుందో! ఊహించుకుని  కళ్ళ నీళ్ళు పెట్టుకుంది కావ్య. వెంటనే ఎవ్వరూ  చూడకుండా  మెల్లగా తుమ్మొస్తున్నట్టుగా  మొహానికి  చేతులు అడ్డం  పెట్టుకుని, కళ్ళనీళ్ళు తుడుచుకుంది కావ్య!
    కావ్య  చిన్నబుచ్చుకోవడం  గమనించిన  సీతాదేవి, లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి కూర్చుంది. కావ్యనీ, కళ్యాణినీ ఉద్దేశించి  అంది "చూడండమ్మా! పెళ్ళిళ్ళలో పేరంటాలల్లో ఎన్నో కర్చులు అనవసరమైనవని  అందరికీ తెలుసు. అయినా  అందరూ  చేస్తూనే  వున్నారు. అలా చెయ్యనివాళ్ళ గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడతారనిభయం! అందుకే  ఎందరెన్ని  చెప్పినా ,మళ్ళీ  ఆ ఊబిలోనే  గిరగిరా తిరుగుతారు కానీ సంప్రదాయాల పేరిట, వాటిని కాదని బయటపడలేరు." అంది.
    కావ్య ఆలోచనలు ఇక్కడ లేవు. తల్లి తన గురించి  ఎంత బాధ పడుతోందో  ఊహించుకుని  మధనపడుతోంది! 'ఆమె ఎప్పుడూ  ఇటువంటి సలహాలే ఇచ్చేది. వాటిని తనే తోసి పుచ్చేసింది. ఆమె ఆడపిల్లకి చదువు సంధ్య లొద్దనే రకం కానీ, స్వాతంత్ర్యం ఇవ్వకూడదనే భావాలు గల వ్యక్తి గానీ కాదు! కాకపోతే, ఏదైనా మోతాదు మించకూడదంటుంది. నలుగురూ  నడిచే తోవలోనే  నడిస్తే, ప్రమాదం వుండదని  నమ్మే వ్యక్తి! అసలు మనలో చాలామంది, ఈ విధానాన్నే  ఎంచుకుంటారు! తను ఆమె మాటల్ని నిర్లక్ష్యంచేసి, ఏదో సాదిద్దామనుకుని ఏదో అయింది.'
    "ఏంటే, ఆలోచనల్లో  మునిగిపోయావ్ ? "అది కళ్యాణి, కావ్య భుజాలుపట్టి  ఊపుతూ.
    "ఏం లేదు." అంది కావ్య!
    సీతాదేవి గబగబ కాఫీ కలిపి మూడు కప్పుల్లో పోసి, వాళ్ళకి కాఫీ ఇచ్చి తనూ తాగింది.
    మరి కాస్సేపు  కూర్చుని, మళ్ళీ ఒస్తానే అంటూ  సెలవు తీసుకుని వెళ్ళిపోయింది కళ్యాణి.
    కావ్య మెదడులో తల్లి  మాటలు సుళ్ళు  తిరుగుతున్నాయ్.
    "ఈసారి ఏ సంబంధ  మొచ్చినా, తను ఎవరినో ఒకరిని చేసేసుకోవాలి! తన పెళ్ళి ఒక సమస్య కాకూడదు అమ్మకి! అనుకుంటూ  ఏవేవో ఆలోచనలతో  సంతమతమై పోతూ, ఆంధ్రప్రభ  వీక్లీ తీసుకుని చదువుతూ మంచంమీద వాలిపోయింది కావ్య !
                                                                                   8
    సీతాదేవి  అత్తగారి తరపు  బంధువూ, కాస్త హోదాలో వున్న ప్రభుత్వోద్యోగీ అయిన  విశ్వనాథంగారు, కావ్యకి ఒక సంబంధం తీకుకొచ్చారు. అబ్బాయి, బి.ఏ. ప్యాసయ్యాట్ట. ఆంధ్రా బ్యాంకులో అసిస్టెంటుగా పనిచేస్తున్నాట్ట. వాళ్ళు ముగ్గురన్నదమ్ములూ, ఇద్దరక్క చెళ్ళెళ్ళూనట. ఒక అమ్మాయికి పెళ్ళయింది. ఇంకో అమ్మాయి పెళ్ళి కుందిట. ఇతనే ఇంటికి పెద్దవాడట. తమ్ముళ్ళిద్దరూ  ఒకరు, బి.ఎస్.సి.లోనూ ఇంకోతను  ఇంటర్ ఫైనలియర్ లోనూ  వున్నారట. కుటుంబం మంచిది.
    సీతాదేవికి చాలా నచ్చింది. "అమ్మాయి నలుగురున్న  కుటుంబంలో పడితే, పదిమందిలోనూ  కలిసుంటుంది. ఒంటరిగా  ఏకాకిగా బతకవలసిన బాధ వుండదు" అంది.
    అయితే పిల్లవాడు  తాలూకూ వాళ్లంతా  విజయవాడలో  ఉండడంవల్ల వాళ్ళందరూ  అమ్మాయిని చూడ్డానికి రావడం కష్టమని వీళ్ళనే విజయవాడకి వెళ్ళమని సలహా ఇచ్చారు విశ్వనాధంగారు.
    వెంటనే  ఒప్పుకుంది  సీతాదేవి. ఒకరకంగా  ఆమెకి ఇదే బాగుందనిపించింది. ఇక్కడయితే  ప్రతీ  సంబంధాన్నీ ఏదో  ఒకటి చెప్పి తప్పిపోయేలా  చేస్తున్నారు ఇరుగు పొరుగులు. అక్కడయితే  ఈ గొడవుండదు. విశ్వనాథంగారి మాటల్నిబట్టి, కావ్య వాళ్లకి తప్పకుండా నచ్చుతుందన్న  ధైర్యం కూడా వుంది. క్రాంతి కూడా అలాగే ఆలోచించాడు. ఒక మంచి రోజు చూసి  బయలుదేరుతూన్నట్టు  విశ్వనాథంగారికి  టెలిగ్రాం పంపించారు. పెళ్ళి చూపుల సంగతి రహస్యంగా వుంచారు.
    మనసులోనే వెయ్యి   దేముళ్ళకి  మొక్కుకుంది  సీతాదేవి! పెళ్ళి అసలు ఈ ఊళ్లోనే జరపకూడదు, అనుకుంది. చేతిలో వున్న పన్లన్నీ  పూర్తిచేసుకుని  ప్రయాణానికి  సిద్ధమైంది.
    తల్లి ఉత్సాహాన్ని  చూస్తూ వుంటే  కావ్యకి, ఎంతో ఆనందంగా వుంది. ఆమెని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ  అంత  సంతోషంగా  చూడలేదు  కావ్య! ఆమె అలా నవ్వుతూ  వుంటే తన కెంతో  తృప్తిగా  వుంది.
    క్రాంతి టిక్కెట్లు  రిజర్వు చేయించుకొచ్చాడు. విజయవాడకి కృష్ణా ఎక్స్ ప్రెస్ లో !
    కావ్య కోసం కొత్తగా  కొన్నవీ, అదివరకే వున్న వాటిల్లో మంచివీ బట్టలు అన్నీ వేసి సర్దింది  సీతాదేవి. ఒద్దంటున్నా వినక ప్రయాణంలో  తినడానికీ, అక్కడున్న  నాలుగురోజులూ  నమలడానికి  సరిపడా ఏవేవో పదార్ధాలు తయారుచేసింది. క్రాంతీ, కావ్యా సగం  ఇక్కడే  ఖాళీ చేసేశారు.
    ముగ్గురూ  ముచ్చటగా  అలా కబుర్లు  చెప్పుకుంటూ  వెళుతూ వుంటే, పిక్నిక్ కి వెళుతూన్నట్టుగా  ఎంతో సరదాగా  వుంది కావ్యకి. ఎప్పుడో చిన్నప్పుడు, మామయ్యల ఇళ్లకి  అలా బెంగుళూరు వెళ్లడం గుర్తు! పెరిగి పెద్దయ్యాక  ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు. ఎప్పుడైనా  మామయ్యలే ఒచ్చి ఏదో పనిమీద, చూసి వెళ్ళేవారు. అమ్మమ్మ కూడా ఇక్కడే వుండేదేమో అసలు ఇంకెక్కడికీ  వెళ్లవలసిన  అవసరమే వుండేది కాదు. పోనీ అలా ఊరికే ఎ ఊరైనా వెళదామా అంటే, తనకి కాకపోతే అన్నయ్యకీ, అన్నయ్యకి కాకపోతే తనకీ, సెలవులు కలిసేవికావు. అందుకని ఎప్పుడూ ఇంట్లోనే వున్నట్టుండేది! అటువంటిది ఈ రోజున ముగ్గురూ  కలిసి ఇలా ప్రయాణం  చేస్తూ వుంటే, మనసు సంతోషం పట్టలేకుండా  వుంది. తల్లికి చెరోపక్కా కూర్చుని  చిన్న పిల్లల్లా, ఆమె చెప్పే కబుర్లు వింటూ, పెడుతూన్న  టిఫిన్లు తింటూ  ప్రయాణం చేశారు.
    విశ్వనాథంగారు స్టేషనుకొచ్చి  రిసీవ్ చేసుకున్నారు. తనూంటూన్న  హోటల్ మనోరమలోనే, మరో రెండు రూములు బుక్ చేశారు. క్రాంతి ఒక రూములోనూ  కావ్యా, సీతాదేవీ  ఇంకో  రూములోనూ  సామాన్లు సర్దుకున్నారు.
    "భోజనాలు చేసి  మధ్యాహ్నం కాస్త  రెస్టు తీసుకోండి. రేప్పొద్దున్న  తొమ్మిదిన్నరకి  మంచి టైముట. తొమ్మిదీ తొమ్మిదింపావుకి  బయల్దేరి వెళదాం. సత్యన్నారాయణపురంలో  వుంది  వాళ్ళిల్లు. అబ్బాయి రాత్రికి బస్సులో  వొస్తున్నాట్ట  హైదరాబాదు నుంచి." అన్నారు విశ్వనాథంగారు.
    "అలాగే బాబాయిగారూ ! మీ మేలు ఈ జన్మలో  మర్చిపోలేను. మా కోసం ఎంతో శ్రమ తీసుకుంటున్నారు."
    "ఇందులో నాదేముంది ? వాల్లేదైనా మంచి సంబంధం  చూపించమన్నారు. మనమ్మాయి గుర్తుకొచ్చింది. చెప్పాను."
    "కానీ....బాబాయిగారూ!...."
    "నువ్వేమీ కంగారు పడకమ్మా. అన్ని విషయాలు  స్వయంగా మాట్లాడుకోండి. ఆహార వ్యవహారాలలో  మొహమాటం  పనికి రాదన్నట్టు  ఏ విషయంలోనూ సంకోచం  వుండకూడదు.
    "అలాగే"
    "సాయంత్రం ఎవరో ఫ్రెండ్సొచ్చారు హైదరాబాదు నుంచి. పైగా నాకు ఆఫీసులో కూడా కొంచెం  పొద్దు పోవొచ్చు. నాలుగింటికి మా ఆఫీసు నుంచి బండి పంపిస్తాను. ఆ జీప్ లో వెళ్ళి  కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజ్, మార్కెట్టూ అవీ ఊరు చూసిరండి."
    "మీరూ రండి మాతోటీ అంకుల్!" అంది కావ్య.
    "ఆఫీసు పనుందమ్మా! లేకపోతే  వొచ్చేవాణ్ణే!"
    "ఇక్కడ కొచ్చినా  ఆఫీసుపనేనా?" అన్నాడు క్రాంతి.
    "పని కల్పించుకునే  టూర్ వేసుకున్నాను కదా!" నవ్వారాయన.
    "మీ మేలు...."
    "ఫరవాలేదమ్మా!....మనిషికి మనిషి ఆ మాత్రం  సాయం చేసుకోవడంలో  గొప్పేముంది? మీకూ వాళ్లకీ  నచ్చి, ఆ మూడుముళ్ళుపడిపోతే  అంతే చాలు. అదే నాకు తృప్తి. మా రామారావు ఆత్మకి శాంతి!" అన్నారు విశ్వనాథంగారు  లేచి నుంచుని! సీతాదేవి కళ్లనీళ్ళు  పెట్టుకుంది.
    "పదండి భోంచేద్దాం" అంటూ  ముందుకు నడిచారు విశ్వనాథంగారు. గదులకి  తాళాలువేసి, అందరూ కిందవున్న  డైనింగ్ హాలు వైపు నడిచారు.
    భోంచెయ్యగానే అలసట  తెలిసొచ్చిందేమో, నిద్రొచ్చింది  సీతాదేవికి. విశ్వనాథంగారు  అటునుంచి  అటే ఆఫీసుకి వెళ్ళిపోయారు. వీళ్ళు పైకొచ్చి, అందరూ ఒక్క  గదిలోనే మంచాల పైన వాలిపోయారు. తల్లి పక్కన పసిపిల్లల్లా  పడుకున్నారు క్రాంతీ ,కావ్య!
    జీపు డ్రైవర్ పైకొచ్చి  తలుపు  కొట్టేంత  వరకూ  తెలీదు, టైము అయిదు కావొస్తోందని. గబగబా లేచి  స్నానాలు చేసి, కాఫీ తాగి బయలుదేరారు ముగ్గురూ  జీపులో. ముందుగా  కనకదుర్గమ్మని దర్శించుకోవాలని  గుడికే బయలుదేరారు.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS