Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 12

(దిశైవ-
మంచి ఆత్మని దిశైవ అని, చెడు  చేసే ఆత్మని కుశైవ అని అంటారు. చెడు నడతతో, క్షుద్రశక్తుల పట్ల నమ్మకంతో చనిపోయిన వాళ్లు చెడు ఆత్మలుగా మారి పోతారని కొందరి నమ్మకం. దిశైవ అభిమానం పొందాలంటే దిశైవ పెట్టే
చాలా పరీక్షల్లో నెగ్గాలి. ఎన్నో కష్టతరమైన పరీక్షలు పెడుతుంది.
డబ్బుకు, సెక్స్ కు, కీర్తికి బానిసలు కాకూడదు. ఏ ప్రలోభాలకు లోనుకాకూడదు. కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టకూడదు.
మాంసాహారం భుజించకూడదు. చాలా నిష్టగా వుండాలి. చెడు సావాసాలు చేయకూడదు. ఇలాంటి సలక్షణాలు ఉన్న వ్యక్తులను 'దిశైవ' కరుణిస్తుంది. మంచి పనికి చేయూత నిస్తుంది.
దిశైవకు 'కుశైవ' ను ఎదుర్కొనే శక్తి లేదు. కుశైవలు బిత్రోచికి బానిసలు...ఎప్పుడూ చెడు ఆలోచనలు చేసేవాళ్ళు, డబ్బుకోసం, సెక్స్ కోసం, కీర్తికోసం ఉచ్చనీచాలు మరిచే వాళ్లను ఇష్టపడతాయి కుశైవలు. బిత్రోచిని పూజించేవాళ్లకు మేలు చేస్తాయి.
సుసిరియో అనేది తాంత్రియ తెగ అని...వాళ్ళు దిశైవని ఆరాధించి, మంచి పనులు చేస్తూ వుంటారని...చాలా ఏళ్లక్రితం మంత్రి తంత్రాలకు సంబంధించిన ఓ పుస్తకంలో చదివాను. గెస్ట్ హౌస్ కోసం ఆ సమాచారం ఇక్కడ వాడుకోవడం జరిగింది-రచయిత్రి)

                                                        * * *
ఒక్కసారిగా వణికిపోయేడు సుసిరియో...
దిశైవ చేష్టలుడిగి నిలుచుండిపోయింది.

                                                  7
దిశైవ ఆత్మను కుశైవ ఎదుర్కొంటుంది.
ఎప్పుడైతే బిత్రోచిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కుశైవ సాయాన్ని పీటర్సన్ అర్ధించాడో, ఆ వెంటనే కుశైవ రెచ్చిపోయింది.
కుశైవ ఆత్మ గాలికన్నా వేగంగా ప్రయాణించి, సుసిరియోని చేరుకుంది.
టప్..టప్..టప్...
చిన్న శబ్దం పెద్దదై ఉ..ప్..అన్న శబ్దంగా రూపాంతరం చెందింది.
సుసిరియో శరీరాన్ని కుశైవ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. నాభి నుంచి వెలువడే అతని మత్రాక్షరాలు స్వరపేటికను దాటి బయటకు వస్తోన్న క్షణంలోని వెయ్యోవంతులో కుశైవ ఆత్మ అతని నాభిని చీల్చుకుని స్వరపేటికను దాటి, మెదడును చేరి...సుసిరియో మొహమంతా క్షణక్షణానికి వికృతమవుతోంది. శరీరం పూర్తి రక్తవర్ణంలోకి మారింది.
ఫ...ట్..మన్న శబ్దంతో అతని తల రెండు చీలిపోయింది. రక్తం చివ్వున చిమ్మింది.
రాబర్ట్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో కళ్ళు మూసుకున్నాడు.
అక్కడ నిశ్శబ్దం...భయం భయంగా విషాదం అంచున నిలబడింది.
కుశైవ ఆత్మ తన పని ముగిసిందన్నట్టు వెనుదిరిగింది సంతృప్తిగా.

                                       * * *
తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన డేనియల్ బట్టలు మార్చుకుంటోన్న పీటర్సన్ ని అడిగాడు.
"ఎనీథింగ్ రాంగ్? షిప్ వూగినట్టనిపించింది. నీ గదిలోనుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. వెంటనే డెక్ పైకెళ్లి నాకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద అల సముద్రం మధ్యనుంచి షిప్ డెక్ ని తాకేలా లేచింది. అంతే వేగంగా లోపలికి వెళ్లి పోయింది..."
"యస్.నా సమర్పణని ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుశైవను ప్రయోగించాను. అవతలి వ్యక్తి మెదడు చీలి చనిపోయి వుంటాడు..." తాపీగా చెప్పాడు పీటర్సన్.
"మనం కేర్ ఫుల్ గా ఉండాలి..."
"యస్సెస్..." అంటూ డేనియల్ తోపాటు బయటకు వచ్చి...రెస్టారెంట్ వైపు నడిచాడు పీటర్సన్...

                                                 * * *
రాబర్ట్ రెస్ట్ లెస్ గా వున్నాడు.
సుసిరియో మరణం అతడ్ని తీవ్రమైన వేదనకు గురిచేసింది. తన కళ్ళముందే అతను మరణించడం అతడ్ని బాదిస్తోంది. అంతకన్నా ఎక్కువగా అతను చనిపోవడానికి కారణం తనే కావడం.
చనిపోయేముందు సుసిరియో మాట్లాడిన మాటలు అతని చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి.
రాబర్ట్ వృత్తిలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. అతడ్నంతా డ్యూటీమైండెడ్ ఆఫీసర్ అంటారు. వ్యక్తిగతంగా అతనికి అతీత శక్తులమీద విపరీతమైన నమ్మకం.
సుసిరియో విషయంలో ప్రత్యక్షంగా చూశాడు. సుసిరియో ఆత్మ శాంతించాలంటే మిగిలిన పనిని తను పూర్తి చేయాలి.
ముందుగా సుసిరియో కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సేవింగ్స్ లో ఉన్న మొత్తం డబ్బును సుసిరియో కుటుంబం పేర వేశాడు.
హయ్యర్ ఆఫిషియల్స్ కు పీటర్సన్ కేసు గురించి వివరించాడు.
పీటర్సన్ దేశం వదిలిపెట్టి వెళ్లిపోయాడన్న విషయం తెలుసుకున్న హయ్యర్ అఫీషియల్స్ ఇక ఆ కేసును వదిలేయమన్నారు. ఆ ఫైల్ క్లోజ్ చేయమన్నారు.
అక్కడే రాబర్ట్ కు, పై అధికారులకు ఘర్షణ జరిగింది.
ఓ నేరస్తుడు నేరం చేసి తప్పించుకుపోతే ఆ కేసు తాలూకు ఫైల్ క్లోజ్ చేసి చేతులు దులుపుకోవడం రాబర్టుకు నచ్చలేదు.
ఆ కేసు గురించి ఇండియా గవర్నమెంటుకు చెప్పడం,ఇంటర్ పోల్ కు చెప్పడం...ఇదంతా అనవసరమైన రిస్కని ఉన్నతాధికారుల వాదన.
రాబర్ట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.
ఇక్కడ ఓ విషయం రాబర్ట్ కు తెలియదు.
రాబర్ట్ డ్యూటీలో ఎంత సిన్సియరో తెలిసిన పీటర్సన్ తన దగ్గరున్న డాలర్లు వెదజల్లి ఎలాగైనా కేసు తాలూకు ఫైల్ క్లోజ్ చేసేసేలా హయ్యర్ అఫిషియల్స్ మీద వొత్తిడి తెప్పించాడు.
తన మీద కేసు తిరగదోడితే ఉండే రిస్క్ ఏమిటో అతడికి తెలుసు. సరిగ్గా ఇదే విషయంలో రాబర్ట్ ఉన్నతాధికారులకు ఎదురు తిరిగాడు.
తమవల్ల, తమ డిపార్టుమెంట్ వల్ల ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది.
సుసిరియో చనిపోవడానికి కారణంకూడా ఓ విధంగా తమ అసమర్ధత...
రాబర్ట్ కు ఈ కేసు వదిలివేయాలని అనిపించలేదు. ఇక్కడితో ఏ వృత్తిపరమైన బాధ్యత లేకపోయినా సుసిరియో ఓ మంచి పనికోసం తన ప్రాణాన్నే 'బలి' చేసుకున్నాడు.
అలాంటి సుసిరియో ఆత్మ శాంతించాలి. అతడ్ని తను స్పూర్తిగా తీసుకోవాలి.
అందుకే...
అలా స్థిరమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు రాబర్ట్.
ఓ సాధారణ పౌరుడిగా తను పీటర్సన్ ని పట్టుకోవాలి.
అదే రోజు రాబర్ట్ ఇండియా బయల్దేరాడు అన్ని సన్నాహాలతో...అదే పెద్ద మలుపు అతని జీవితంలో...

                                                          * * *
భయంతో వణికిపోతున్నాడు ప్రభు.
గత రెండు రోజులుగా రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టడంలేదు. రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
ఆ రోజు డెడ్ బాడీని మార్చురీలో అప్పగించడానికి ప్రొఫెసర్ తో కలిసి తను మార్చురీకి వెళ్లాడు. అప్పటికే మార్చురీ వాళ్లు ఆ శవాన్ని పాతిపెట్టినట్టు రికార్డుల్లో రాసుకున్నారు.
తాము ఆలస్యంగా తీసుకురావడంవల్ల ఈలోగా చెక్ చేస్తే ప్రాబ్లం...అని అన్ ఐడెంటిటీ శవంగా రికార్డులో రాసి కార్పోరేషన్ కు  అప్పగించినట్టు రాసుకున్నామని, దాన్ని పాతి పెట్టాల్సిన బాధ్యత తమదేనని చెప్పారు.
ప్రొఫెసర్ పరమహంస ఆ శవాన్ని పాతిపెట్టించే బాధ్యత తనకు అప్పగించాడు.
శవాన్ని పాతిపెట్టిస్తానంటే ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి చూసినట్టు అనిపించి వొళ్ళు జలదరించింది.
ఇదంతా తన భ్రమే కాబోలు అనుకున్నాడు కానీ రెండు రోజులుగా కలలు వస్తున్నాయి.
ప్రొఫెసర్ పరమహంస ఎప్పుడో అన్న మాటలు గుర్తొచ్చాయి. దుష్టశక్తులు ఉన్న వ్యక్తులు మరణిస్తే వాళ్లని
పాతిపెట్టిన మూడోరోజు ఆ శవం నిద్రలేస్తుందిట. ప్రొఫెసర్ ఎవరితోనే చెబుతుంటే విన్నాడు.
ఇవ్వాల్టికి సరిగ్గా మూడవరోజు. తను స్వయంగా ఆ శవాన్ని పాతిపెట్టాడు.
పదమూడవ నంబర్ అచ్చిరాదు, మంచిదీ కాదు. సంఖ్యలోని చివరి అంకె అయిన మూడవ నెంబర్ కూడా చెడునే సూచిస్తుందిట...
రెండ్రోజులుగా ఫ్రెండ్స్ కూడా కలువలేదు. ఒక్కడే ఆ ఇంట్లో పాడుకోవాలంటే భయమేసింది.
గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి తన పడగ్గదిలో వచ్చి బ్లాంకెట్ వంటికి చుట్టుకుని టీవీ రిమోట్ చేతిలోకి తీసుకుని నొక్కాడు.
ఇంగ్లీష్ ఛానెల్..
ఏదో హర్రర్ సినిమా వస్తోంది.
ఓ ఆత్మ హీరోయిన్ వెంటపడుతూ తరుముతోంది.
ఆత్మ హీరోయిన్ ని చుట్టేసింది. ఓ చెట్టు వూడలు హీరోయిన్ ని బంధించాయి.
హీరోయిన్ కెవ్వుమని కేకలు వేస్తూనే వుంది.
ఆత్మ వికృతంగా నవ్వుతోంది.
భయంగా కళ్ళు మూసుకుని రిమోట్ తో టీవీ ఆఫ్ చేశాడు.
ఫ్రిజ్ దగ్గరకెళ్లి చల్లటినీళ్ళు తాగాక, కాస్త స్థిమిత పడ్డాడు.
బ్లాంకెట్ నిండుగా కప్పుకుని మునగదీసుకుని దండకం మనసులో చదువుకోవడం మొదలు పెట్టాడు.

                                                  * * *
ఠంగు...ఠంగు...మంటూ గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టింది. స్మశానంలో ఓ తీతుపుపిట్ట అరిచింది. గుడ్ల గూబలు రొద భయంకరంగా వుంది. కుక్కలు ఏడుస్తోన్న ధ్వని...చెట్ల కొమ్మలు  గాలికి వూగుతున్నాయి. ఎక్కడో, ఎవరిదో శవం కాలుతున్న వాసన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS