Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 12


    "చాల్లే_ఊరుకొండీ_పోనీ అయినా ఆ జబ్బుకు చికిత్స ఏమిటో చదవండీ చూద్దామూ" అన్నది.

    ""ఈ రోగాలకూ__కాషాయాలు పనికిరావట!

    "ఊ"

    "లేహ్యాలు అసలే పనికి రావట!"

    "మరి ఏమన్నాడండీ__" అన్నది తన చేతితో నా చేతిని నొక్కుతూ.

    "శ్లోకం విను"

    "అర్ధం చెప్పుదురూ. ఇపుడు శ్లోకాలువినటానికి ఓపికెక్కడ ఉందీ! నిద్రవస్తున్నది." అని పక్కపైన ఒరిగి పండుకొని ఆవలించి రెండు చిటికలు వేసింది. మెళ్ళో గొలుసు పక్కకు జారి తళుక్కుమన్నది వెన్నెల్లో. ఆ తెల్లని వెన్నెల్లో ఆమె బుగ్గలు నీటి బుడగలలాగా మెరసినవి. ఆ ముఖ చంద్రుడి దగ్గర ఆర్ద్ర నక్షత్రంలాగ ఆ క్రింది పెదవి ఎర్రగా వుంది. మల్లెపూలు జారి కొన్ని పక్కమీద పడ్డాయి.

    దృఢమాలింగనం పథ్యం

    క్వాధశ్చాధరచుంబనమ్_

    "వింటున్నావా_ప్రియురాలి యొక్క అధర చుంబనమే కాషాయమట__ఆమె గాఢాలింగనమే పథ్యమట, ఆఁ విన్నావా? కాబట్టి..." 

    "ఊఁ కాబట్టీ_ఆఁ  కాబట్టీ_చెప్పండి ఏమిటో"

    "కాబట్టీ ఇప్పుడేం చేయాలో తెలుసునా నా ఈ రోగం నయం కావాలంటే!"

    "ఊఁ ఏం చెయ్యాలా?...ఆ...

    "అబ్బా! ఊరుకోండి"

    పుస్తకం, ఇక మా ప్రక్కన ఉండటానికి ఇష్టం లేక ఠపీమని కింద పడిపోయింది.


                                 * * *


                          ప్రయాణ సన్నాహం
         

    (ఆంధ్రదేశంలోని కథకుల్లో మునిమాణిక్యం, ముని మాణిక్యమే!_అని 'ఢంకా' బకాయించి చెప్పగలం.

    "మా ఆవిడ ముడిలోని ఎర్రని మందార పుష్పం ఒంటరిగా ఉండి నా వొంక చురచుర చూసింది..."

    ఆహా! యేమి వర్ణన! కాంతం యొక్క ప్రణయంతో కూడుకొన్న కోపాన్ని సూచించేందుకు వుపమానంగా ఎర్రని మందారపుష్పం తీసుకొన్నాడు. అందులో ఆ పుష్పం కాంతం తలలో ఒంటరిగా వుందట_అంటే కాంతం యొక్క కోప తీవ్రత తన మనస్సులో యెంత వేదన తపన కలిగిస్తుందో ప్రత్యక్షంగా చూపెట్టారు.

    అసలు కాంతం కాలం చేసిన తర్వాత కాంతం కథ కుడి కలం సాగదని అతడు అధైర్యపడ్డాడు. మనం అధైర్య పడ్డాం కాని, అసలు తానూ తానే కాంతంగా వున్న ముని మాణిక్యం గారి కలానికి ఆటంకం మేముంది?)

                                         1

    హంపీ ప్రయాణం అనుకొన్న రోజునుంచీ ఆవిడకు నా మీద ఇంతవరకుంది ముక్కు ముడుచుకొని, మూతి మూరెడు పొడుగు చేసికొని బుసలు కొడుతూ వుంది. పోనీ ఆవిడకు కూడా తీసుకొని వెడదామా అంటే, అయిదుగురు పిల్లలతో ఆమె కదలటమూ కష్టమే. కదిలినా వంద రూపాయలన్నా వదలంది యాత్ర పూర్తిగానూ కాదు. నేనైతే ఒంటరిగా పదిరూపాయల టిక్కెట్టుమీద ఇట్టే వెళ్ళి రావచ్చు.

    ఆవిడతో ఈ మాట అనకముందే నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసుకొన్నాను. జీర్ణ కర్ణాటక సామ్రాజ్యం హంపీయాత్ర, హంపీక్షేత్రం మొదలైన పుస్తకాలన్నీ కొని ఓ మారు చదివేసి పెట్టెలో జాగ్రత్త చేశాను. ప్రయాణానికీ, అక్కడ మూడురోజుల మకాంకూ, కావలసిన సరంజామా అంతా కూర్చుకొన్నాను. చలికి రెండు స్వెట్టర్ లూ, కప్పుకుంటానికి ఒక మంచి రగ్గూ, అందు ముఖ్యమైనవి జ్వరం రాకుండా జాగ్రత్త పడటానికి క్వినయినూ, తలనొప్పి వస్తే వుపయోగించటానికి కెఫియాస్ఫిరిస్, ఒక అమృతాంజనంసీసా, ఒక ఫ్రూట్ సాల్టు బుడ్డీ కూడా సంపాదించి ఉంచేశాను.

    అన్ని ప్రయత్నాలూ ఐన తరువాత మా ఆవిడతో అనేశాను హంపీ చూసివస్తానూ అమటా అని. "ఎందుకండీ వెళ్ళటం, మీకు సెలవొస్తేసరి ఇంట్లో కాలు నిలువదు, హాయిగా పిల్లలతో కలిసి ఇంటిపట్టున వుండకా, పైగా ఇరవై రూపాయలదో దండగా!" అన్నది ఆవిడ. "ఆడదానికి నీకేం తెలుస్తుంది. అక్కడ చాలా విషయాలు వున్నాయి చూడటానికి అది రాజధాని. వాళ్ళు కట్టిన భవనాలూ సుందరమైన దేవాలయాలూ, తీర్చిన వీధులూ అక్కడ వున్నాయి. ప్రకృతి పచ్చపట్టుచీర గట్టుకొని, పూలరెవిక తొడుక్కొని రత్న ఖచ్చితమైన కిరీటంతో అక్కడి నృత్యం చేస్తూంటుంది. ఆ రాచనగర భవన నిర్మాణమూ, ఆ శిల్పం చాతురీ, ఆ దేవాలయాల శోభా, చూచి తీరాలె, అన్నాను.

    నేను ఈ విషయాలన్నీ చెబుతున్నంత సేపూ ఆవిడ ఎంతో ఓపికగా విన్నది. ఆవిడ అంత ఓపికగ్గా వినటమూ, ఆనందించటమూ, చూచి నేను ఎంతో గర్వపడ్డాను. ఒక్క పెంకి మనిషికి నేను ఒకానొక విషయాన్ని గురించి నచ్చజెప్ప గలిగాను గదా అని నా అహంకారము. ఆమె చివరదాకా విని "అయితే అటువంటి ప్రదేశం చూడటం నాకూ ఇష్టమే" అన్నది. ఒక అఖండ విజయాన్ని సంపాదించినట్లు సంతోషించాను.

    ఒక్క క్షణముండి, "హంపీ, అంత చక్కని ప్రదేశమైతే నేనూ వస్తాను. నా కర్మం ఏం కాలింది?" అన్నది మా ఆవిడన్నమాట తప్పేమనిషి కాదు. వస్తానూ అని అన్నదో వచ్చితీరిందన్న మాటే? ఏమిటాగతీ అని ముఖం వేలేశాను. ఆవిడ రావటం అంటే చాలా ప్రయాసతో కూడుకొన్న విషయమని మళ్ళీ నచ్చజెప్పాలె. ఇప్పుడు కాదు రాత్రికి.

    ఈ విషయమై ముచ్చటిద్దామూ అనుకొని అప్పటికి మౌనం వహించాను. అయితే మా కాంతం ముఖ కవళికల్లో నా అనుమానాన్ని గ్రహించింది. నేను సందేహిస్తున్నానని పసిగట్టేసేసింది. "పోనీలెండి, నన్ను తీసికెళ్ళటం అంటే వస్తుంది! తమరు ఎన్ని దేశాలైనా తిరగవచ్చు; ఆఁ,ఇవన్నీ సాగవు. నేనూ మీతో వచ్చితీరుతాను." అని కచ్చితంగా చెప్పేసిందావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS