ముసలివాడు
కనుగూడులు నల్లనయి
పెనుమ్రోడులు చల్లనయి
కీలు కీలుగా బాధగా
నాడు నాడులు లాగగా
చలిగాని చూరులో కసరినటు
చలిచీమ మట్టిలో దొలచినటు
వచ్చినది మూగినది ముసిరినది
ముసలితనము
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి
పై కప్పు వంగి పడు
పాడిల్లు వలె నిలిచి
వీధి పోయే వింత వింతల
చూసి రోసి
బ్రతుకొక్క ఆరిన వత్తికొడిలా తలచి మిధ్యలా కలచి
గతించిన జితించిన బ్రతుకు లోకి
గులక రాళ్ళు గలగల మ్రోగే
గుల్ల బ్రతుకు లోనికి
కల్ల బ్రతుకు లోనికి
చూసి రోసి
బ్రతుకొక్క ఆరినవత్తి కొడిలా తలచి
మిధ్యలా కలచి
పెదవి సందుల వెగటు నవ్వును బగబట్టి
కర్రనానుకు సాగిపోయే
ఎముకల గూడుని అరిగిపోయిన జోడుని
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి
ఒకనాడు నే ప్రొఫెసర్ని
సామ్యవాదిని
గ్రంధకర్తని
అపుడు భవిష్యత్తు రంగురంగుల వల
ఈనాడు గుండెలో మెదిలే పీడకల
నేడు కనుల సందుల నిరాశ
మసి మసిగ పాకిపోయే
కసికసిగ
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి
ఒకనాడు నే వలచి పెండ్లాడిన
ఒయ్యారపు నా భార్య అదిగో
విధి లిఖించిన వెర్రి చిత్రమువలె
ఎండిపోయిన ఏటిగట్టువలె
నడుమునొప్పి తనకు మిగిలిన శక్తిగా
పక్షవాత భయం తన భవిష్య దాశగా
కదలలేక మెదలలేక
మెతుకులు కతకలేక చావును
వెతికికొనే
నా వయ్యారపు భార్య అదిగో
గదిమూలల సాలిగూడులు
గది గోడల గబ్బిలాలు
గదిలోపల పక్షివాతపు
కుక్కి మంచపు కౌగిలింతలో
చెదపట్టిన భాగవతం
బిలహరి రాగంలో చదివే
ముసలివాణ్ణి నాయనలారా
