Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 13

 

    శంతనుడు రాజ్యమును ధర్మముగా పాలించుచున్నాడు. ప్రజలను రక్షించినాడు. రాజులందరును అతనికి లోబడి ఉండినారు. అతని కీర్తి నలుదిశల ప్రాకినది. లోకమంతటా అతని చరిత్ర వినవచ్చినది.
    శంతనుడు ఒకనాడు గంగాతీరమునకు వెళ్ళినాడు. గంగ నీరసించి కనిపించినది. అందు నీరు చాల తక్కువగా ఉన్నది. శంతనుడు కారణము గ్రహించ దలచినాడు. కొంత దూరము నడిచినాడు. అక్కడ బానములతో గంగకు కట్ట కట్టినాడు. అతడు శంతనుని పోలి ఉన్నాడు. తన బానములతో గంగకు కట్ట కట్టినాడు. ఆ బాలుని చూచినాడుశంతనుడు ఆశ్చర్యపడినాడు.
    అప్పుడు గంగ మానవరూపము ధరించి వచ్చినది. ఆమె దేవపుత్రుని కుడి చేయి పట్టుకొని శంతనునకు అందించింది.
    "రాజా! ఇతడు దేవపుత్రుడు. నీ కుమారుడు. వశిష్టుని శిష్యుడు అయినాడు. వేద వేదాంగములు అభ్యసించినాడు. ఇతనికి శుక్ర బృహస్పతులంతటి ధర్మ శాస్త్రజ్ఞానమున్నది. పరుశురామునంతటి అస్త్ర విద్య సనత్కుమారులంతటి బ్రహ్మవిద్య ఉన్నది. ఇంతవరకు ఇతనిని నేను పెంచినాను. నీకు అప్పగించుచున్నాను." అని అప్పగించి అంతర్ధానము అయింది.
    దేవపుత్రుని పొందినాడు శంతనుడు. హస్తినకు వచ్చినాడు. సంతోషమున పొంగినాడు. రాజుల, మంత్రుల , పురోహితుల ఎదుట దేవపుత్రుని యువరాజును చేసినాడు.

                                              ఆలోచనామృతము


1. ఇదొక విచిత్ర కధ. ఆశకు లొంగిన కధ శంకుతలది. కామమునకు లొంగిన కధ శంతనునిది. అక్కడ ఆమె సాద్వి. ఇక్కడ ఇతడు సాధువు. ఇతడు గంగకు లోంగినాడు. ఆమెకు వశవర్తి అయినాడు. గంగకు కామము ప్రధానము. సంతానము అందుకు నిరోధము. అందుకు ఏడుగురిని గంగకు అర్పించియుండును. అట్టి తల్లులున్నారు. అందమునకు అవరోధమని పిల్లలకు చన్నీయని తల్లులను మనము చూచున్నాము. పిల్లను  కనీ పారవేసిన వారున్నారు. కాని అందరు కారు. అరుదుగా ఉన్నారు.
 ఎనిమిదవ సంతానము కలుగునాటికి శంతనుడు మోహము నుండి బయటపడినాడు. ఆమె మానవకాంత కాదని గ్రహించినాడు. మానవులకు ఉండు మాతృత్వ కాంక్ష ఆమెకు లేదు. అందువలన ఆమె అమానుష కాంత అయినది. అప్పటికి అతనికి జ్ఞానోదయము  అయినది. సంతానమును కోరుకున్నాడు. గంగను వదులుకున్నాడు.
2. వశిష్టునకు కామదేనువుకు సంబంధించిన కధలు చాల ఉన్నవి. విశ్వామిత్రుడు కూడా వశిష్టుని కామధేనువును హరించుటకు ప్రయత్నించిన కధ ఉన్నది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుటకు మూల కారణము అట్టి ఉదాంతమే.
 ఇక్కడ వశిష్టుని ఆవు - అష్టవసువులకు సంబంధించిన కధఉన్నది. "ఈ ఆవుపాలు తాగినవారు ముదిమిగాని, రోగము గాని లేక ఆరోగ్యవంతులయి వర్ధిల్లుదురట" అనుచున్నది ప్రణయిని. అందువల్ల అవును దొంగిలించినారు వసువులు.
 ఇచట ఓక విషయము పరిశీలించవలసి ఉన్నది. అవును పెంపుడు జంతువు చేసినాడు వశిష్టుడు అయి ఉందును. అంతియగాక ఆవుపాలు పిదుకుట త్రాగుట కనిపెట్టినవాడు కూడ అతనే కావలయును.
        
                                             భీష్ముడు


    శంతనుడు తన కొడుకును యువరాజును చేసినాడు. అతనితో ఆనందముగా కాలము వెళ్ళ బుచ్చినాడు. అట్లు నాలుగు సంవత్సరములు గడచినవి. ఒకనాడు అతడు వేటకు వెడలినాడు. గంగానదీ తీరమున్ విహారించు చున్నాడు. అక్కడ, అతనికి మంచి పరిమళము తోచినది. అది మైమరపించు సువాసన. ఆ పరిమళము వచ్చిన వైపు నడచినాడు నడచినాడు. ఒక యోజనము నడచినాడు.
    శంతనుడు అక్కడ ఆగినాడు. అచట ఒక సుందరి కనిపించినది. అమె సత్యవతి. ఆమెకు యోజనగంధి అను మారు పేరున్నది. శంతనుడు ఆమెను చూచినాడు. ఆమె అందమును చూచినాడు. ఆమె సోయగము చూచినాడు. ఆమె వయ్యారము చూచినాడు. ఆమె దేవతా కన్య వలె కనిపించినది. ఆమెను అడిగినాడు.
    "బాలా! నీవు ఎవ్వరవు? ఎచటిదానవు? ఒంటరిగా ఇచట ఏల ఉన్నావు?"
    సత్యవతి పలికినది. శంతనునకు ముత్యాలు రాలినట్లనిపించింది.
    "రాజా! నేను సత్యవతిని. దాశరాజు నా తండ్రి. ప్రయాణీకులను ఉచితముగా నది దాటించుట నాపని. నా తండ్రి నన్ను ఇందుకు నియమించినాడు."
    శంతనునకు సత్యవతిపై మోహము జనించినది. అతడు దాశరాజు వద్దకు వెళ్ళినాడు. తన అభిమతము వెల్లడించినాడు. తన కోరిక తీర్చవలసినదని అర్ధించినాడు.
    "రాజా! కన్యను వరునికి ఇచ్చుట ఆచారము. నీవంటి వీరుని దొరుకుట మా అదృష్టము. నీకు సత్యవతిని తప్పక ఇత్తును. కాని మదొక కోరిక ఉన్నది." అని సగము మాట చెప్పినాడు దాశరాజు.
    శంతనుడు మోహమున ఉన్నాడు. ఒక్క రాజ్యము తప్ప ఏది కావలెనన్నను ఇత్తును అన్నాడు. అప్పుడు దాశరాజు తన కోరిక వెల్లడించినాడు.
    "రాజా! నా కూతురు సత్యవతి పట్టపురాణి కావలె. ఆమెకు కలిగిన మగబిడ్డ యువరాజు కావలె. నీ అనంతరము నా మనుమడే రాజు కావలె" శంతనుని మీద పిడుగుపడినది. దేవపుత్రుడు తన కొడుకు. ఇదివరకే యువరాజు అయినాడు. తాను రాజ్యము ఇతరులకు ఇవ్వలేడు. అందువలన శంతనుడు దాశరాజు కోరికను మన్నించలేదు. అతడు హతాశుడయిపోయినాడు. హస్తినకు మరలినాడు.
    శంతనుడు హస్తినకు చేరుకున్నాడు. కాని అతని మనసు మనసులో లేదు. అది గంగాతీరమున వదలివచ్చినాడు. సత్యవతి అతని కనులలో చేరినది. నిద్ర మరచినాడు. విచారముగను, చిరాకుగను కాలము వెళ్ళబుచ్చుచున్నాడు.
    దేవపుత్రుడు అది చూచినాడు. తండ్రిని సమీపించినాడు. "తండ్రీ! నీ రాజ్యమునకు శత్రుభయము లేదు. ప్రజలు సుఖముగా ఉన్నారు. సామంతులు విధేయులు. అట్టి సమయమున మీకు విచారమేల?" అడిగినాడు.
    "నాయనా దేవపుత్రా! పుత్రులు లేనివారు , ఏక పుత్రులు; సమానులని ధర్మశాస్త్రములు అనుచున్నవి. నీవు వీరుడవు. యుద్ద విద్యా విశారదుడవు. యుద్దమున ఎప్పుడును మనమే పరుల చంపుదుమనుట నిశ్చయము కాదు. కావున నీ జీవితము నమ్మదగినది కాదు. కాబట్టి బహుపుత్ర లాభమును ఆశించి, పెండ్లాడవలెనను కోరిక కలిగినది" అని శంతనుడు చెప్పినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS