ఉత్తర రామాయాణాలు
అమలమూ ఉదాత్తమూ అయిన మనీషతో ఉభయకావ్య ప్రౌడిని పాటించే అసల్పశిల్పంతో తిక్కన్నగారు వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను నిర్వచన పద్యకావ్యంగా ఆంధ్రీకరించారు. అదే "నిర్వచనోత్తర రామాయణం". మూలంలో ఉన్న 110 సర్గలలోని 3276 శ్లోకాలను 10 ఆశ్వాసాలలో సుమారు 1300 పద్యాలలో కుదించి "అలాతి అలతి తునియల కాహల సంధించినట్లు రచించారు తిక్కన్నగారు.
చోత్తెంచిన వనపాలిక
మత్తమధుపములకు దప్పి మధుభరితంబై
క్రొత్తవి గ్రమ్ము నరవిరి
గుత్తి విభున కిచ్చే వినయకుంచిత తనువై.
వైదేహీ సహితుడై వనవిహారానికి వచ్చిన శ్రీరామునికి వనపాలిక క్రొత్తవుల విరిగుత్తి కానుకగా సమర్పించింది. తిక్కన గారు "ధీరోదాత్త నృపోత్తముని సద్వ్రుత్త "మైన "ఉత్తరరామయణ" మనే ఈ నేత్తావుల పూలగుత్తిని ప్రాజ్జరసజ్ఞులకు బహూకరించారు.
తిక్కనగారి అనంతరం 350 సంవత్సరాలకు కంకంటి పపరాజుగారు (1575- 1630) ఉత్తర రామాయణం రచించారు. ఈయన తన మహా ప్రబంధాన్ని ఎనిమిది అశ్వాసాలుగా విభజించి సుమారు 3000 గద్య పద్యాలలో విస్తరించి ప్రస్తరించి వ్రాశారు. తిక్కన్నగారు తమ కృతి సుఖాన్టంగా ఉండాలని శ్రీరామనిర్యాణం ప్రస్తావించలేదు. కంకంటివారు శ్రీరాముని అవతారసమాప్తి వర్ణించి సీతారాములు లక్ష్మీ నారాయణులై వైకుంఠం లో కలుసుకోన్నట్లు చెప్పారు. తిక్కన్న గారు విడిచిన ఘట్టాలు కుర్కురోపాఖ్యానం, ఉలూకోపాఖ్యానం, కుశలవ పట్టాభిషేకం , దుర్వాస ప్రవేశం మొదలైనవి గ్రహించారు కంకటివారు.
కంకటివారు కవిత్వం తత్సమ పద భూయిష్టమై ధారాళమై ఉత్రుంగ గంగా తరంగివలె పొంగి పొరలి ప్రవహిస్తుంది. సీత లక్షణుడితో అంటుంది -
ఆకర్ణాయతనేత్రమై మణిమయోద్యత్కుండలద్వంద్వ శో
భాకీర్ణాంచితగల్లమై సురదనంబై సుందర భ్రూయుతం
బై కమ్రస్మితచంద్రికా విలసితంబై యొప్పు
మీ కాయంబున జూచు భాగ్యమిక లేదేమో సుమిత్రాత్మజా!
ఘట్టు వెంకట రామకృష్ణకవి అనేవారు కూడా ఉత్తర రామాయణ కధను "పట్టాభిరామాయణం" అన్న పేరుతొ ఆ రాశ్వాసాల ప్రబంధంగా రచించారు. ధారాశుద్ధి గల రచన. ఈయన 1800 సం|| కు పూర్వమువాడని విమర్శకుల అభిప్రాయం.
ఉపాఖ్యాన రామాయణాలు
ఆంధ్రమహాభారతం అరణ్యపర్వంలో దాదాపు 300 గద్య పద్యాలలో ఎర్రాప్రగడ రచించిన రామాయణ కధ ఉన్నది. దీనిని మర్కేండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినాడు. ఇదే విధంగా ఆంధ్రమహాభారతంలో నమమస్కంధంలో సుమారు 100 పద్యాలలో బమ్మెర పోతన్నగారు రామాయణ కధ అంత్యాను ప్రాసమహితంగా వర్ణించారు. జైమిని భారతంలో పిల్లల మఱ్ఱి పినవీరభద్రుడు రచించిన ఉత్తర రామాయణగాధ ఉన్నది. ఇందు కుశలవులు అశ్వమేధాశ్వాన్ని పట్టిన వృత్తాంతం రసవత్తరంగా వర్ణించబడింది.
చంపూ రామాయణాలు
సంస్కృతంలో భోజదేవుడు సుమనోమనోహారంగా రచించిన చంపూ రామాయణాన్ని ఋగ్వేదకవి వెంకటాచలపతి, అల్లామరాజు రంగశాయి, బులుసు సీతారామ కవి, పూసపాటి రంగానాయకామాత్యుడు, జయంతి రామయ్య పంతులు, బుద్దవరపు మహాదేవుడు మొదలైన కవివారెణ్యులు తెలుగులో అనువాదం చేశారు.
ఈ సందర్భంలో భవభూతి కృతికి అనుకృతియైన సీరము సుభద్రయంబగారి "ఉత్తరరామచరిత" పద్య కావ్యమూ, "జానకీపరిణయ" సంస్కృత నాటకానికి పద్యానువాదమైన వంగీపురపు వెంకటశేషకవిగారి "శ్రీ శేష రామాయణము" పేర్కొనదగినవి.
ఆనంద రామాయణం
అత్యద్భుత సన్నివేశ సమలంకృతమైన ఈ సంస్కృత రామాయాణాన్ని గుండు లక్షణకవి పద్యకావ్యంగా ఆంధ్రీకరించాడు. నూతలపాటి పేరరాజు గారు దానిని గద్యంలోనికి అనువదించారు.
ఆధ్యాత్మ రామాయణాలు
పరమశివుడు పార్వతికి చెప్పినట్టుగా సంస్కృతంలో రచింపబడిన ఆధ్యాత్మరామాయణాన్ని కంచర్ల శరభకవి , కాణాదం పెద్దన సోమయాజి, మామిడన్న సుభద్రాంబ బులుసు వెంకటేశ్వర్లు మొదలగు పదునైదుగురు కవులు వేరు వేరుగా ఆంధ్రీకరించారు. మునిపల్లి సుబ్రహ్మణ్యకవిగారు కీర్తనలుగా అనువాదం చేశారు. అవె తెనుగుదేశంలో ప్రఖ్యాతిపొందిన ఆధ్యాత్మరామాయణ కీర్తనలు.
యధాశ్లోక తాత్పర్య రామాయణం
గద్వాల సంస్థానాధిపతి సోమభూపాలుడు తన ఆస్తానంలోని ఆరుగురు కవుల చేత ఆరు కాండలు అనువాదం చేయించిన రామాయణమిది. 1793 సం|| ప్రాంతపు రచన.
మాలికా రామాయణం
ఒక్కొక్క కాండను ఒక్కొక్క వృత్తంలో ఒకే ప్రాసతో చివరంటా ఆరుగురు పేరెన్నికగన్న కవులు అందంగా రచించిన గ్రంధం మాలికా రామాయణం. అకుండి వెంటకశాస్త్రి పంతుల లక్ష్మీ నారాయణశాస్త్రి దేవగుప్తాపు వెంకటరమణ కవిరాజు, చింతలపూడి సన్యాసిరావు, మూలా పేరన్నశాస్త్రి ఉప్మాక నారాయణమూర్తి అన్న కవిషట్కం కమనీయంగా ఏర్చి కూర్చిన రామకధా మాలిక ఇది.
వచన రామాయణం
వావిళ్ళ రామస్వామి శాస్త్రి , దేవరాజసుది , నోరి గురులింగశాస్త్రి , దొడ్డా వెంకటరామిరెడ్డి, సరస్వతుల సుబ్బరామశాస్త్రి, మోడేపర్తి గున్నయ్య, మున్నగువారు సులభగ్రాంధికంలో "వచనరామాయాణాలు" రచించారు. శ్రీనివాసశిరోమణి, శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి, పురిపండా అప్పలస్వామి, ఉషశ్రీ గార్లు శిష్ట వ్యావహారికంలో గద్య రామాయాణాలను హృద్యంగా వ్రాశారు. కల్లూరి చంద్రమౌళిగారి "రామాయణ సుధాలహరి" ధర్మవరం సీతారామాంజనేయులు గారి "ఆంజనేయరామాయణం" రామాయణం పై పరిశీలనాత్మకాలైన రసవద్రరచనలు.
తులసీ రామాయణం
మహా పండితుడైన "మధుసూదన సరస్వతి" చే
'ఆనందకాననే హ్యస్మిన్ జంగమ స్తులసీతరుః
కవితామంజరీ యస్య రామభ్రమర భూషితా"
అని పొగడ్త అందుకొన్న తులసీదాసు హిందీ బాషలో "శ్రీరామచరితమానసం" అనే మహాగ్రంధం రచించారు. ఈ తులసీరామాయణాన్ని భాగవతుల నరసింహశర్మ , మైలవరపు సూర్యనారాయణమూర్తి పద్యకావ్యంగా ఆంధ్రీకరించారు. యేలూరిపాటి లక్ష్మీ సరస్వతి నేలనూతల పార్వతీ కృష్ణమూర్తి, శ్రీనివాస శర్మ గద్యంలోకి అనువదించారు. శ్రీ కేశవతీర్ధస్వామి పాటీలు తిమ్మారెడ్డి ఉభయులూ కలిసి "శ్రీరామచరితమానసం" అనే పేరుతో తులసీరామయణాన్నీ ద్విపద కావ్యంగా దిద్దితీర్చారు.
విచిత్ర రామాయణం
సిద్దేంద్రయోగి ఉత్కళ (ఒరియా) భాషలో రచించిన విచిత్ర రామాయణాన్ని డొంకా గోపీనాధకవి 1670 ప్రాంతంలో గద్యకావ్యంగా ఆంధ్రీకరించాడు. దాన్ని అనుసరించి తుమురాడ పాపకవి , నరసింహ దేవర వెంకటశాస్త్రి , కొమ్మాజీ సోమనాధ శిల్పాచార్యుడు , వేల్పూరి వెంకటకవి పద్యకావ్యాలు రచించారు.
కంబ రామాయణం
దీనిని రచించిన కంబకవి రాజరాజనరేంద్రుని మునిమనుమడైన కులోత్తుంగుని ఆస్థానం అలంకరించినవాడు. "కవి చక్రవర్తి" బిరుదం కలవాడు. "కంబని యింటి కంబమును కమ్రకవిత్వము చెప్పు" నన్న ప్రశంస లండుకున్న మహాకవి. ఈ తమిళ రామాయణాన్ని పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు పద్యకావ్యంగా అనువదించారు. మృదు మధుర పద విన్యాసాలతో ముచ్చటగా రచించిన ఈ రామాయణాన్ని రెడ్డి గారు తమ ఇలువేలు పైన శ్రీరామచంద్రమూర్తికే సమర్పించి ధన్యులైనారు.
వివాహానికి ముందే సీతారాములు ఒండొరులు చూచుకొని ప్రేమించుకుంటారు రావణుడు సీతను పర్ణశాలతో కూడా పెళ్ళగించుకుని పోతాడు. వాలి వధానంతరం తారను సుగ్రీవుడు పత్నీగా స్వీకరించక తల్లిగా గౌరవిస్తాడు. ఇత్యాది వినూత్న విశేషాంశాలు కంబ రామాయణంలో ఉన్నాయి.
ఇంకా ఎందరో మహానుభావులు రామాయణాలు వ్రాసి ఉంటారు. గడియారం వెంకటశేషశాస్త్రి గారు రామాయణం రచించినట్లు తెలుస్తుంది. పుటపర్తి నారాయణాచార్యుల వారు తమ జనప్రియ రామాయణాన్ని పూర్తి చేశారని వినవస్తుంది. వెంకట పార్వతీశ్వర కవులు సుందరకాండ పర్యంతం రామాయణం వ్రాశారుట. కోపల్లె శివకామేశ్వరరావు గారు బాలకాండ పర్యంతం రామకధ రచించారు. దనకుధరం వెంకటాచార్యులు తమ "ధనకుధరరామాయణం" త్వరలో పూర్తి చేయనున్నారు. బులుసు వెంకటేశ్వర్లు గారు 'గీత రామాయణం" అనే పేరుతొ తేటగీతులతో పండిత పామర రంజకంగా రామాయణం రచించుతున్నారు.
ఈ విధంగా రామాయణం తెలుగుదేశం నలుమూలలా వెలుగులు వెదజల్లింది. భారతీయ భాషలన్నింటి'లో వ్యాపించింది. ఖంగఖండాంతరాలలో ప్రవేశించింది. విశ్వవిహారం చేస్తున్నది.
బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో అన్నాడు-
"యావత్ స్థాస్యంతి గిరియః సరితశ్చ మహీతలే,
తావద్ రామాయణకధా లోకేషు ప్రచురిష్యతి",
"భూమిపై కొండ లున్నంత కాలం , నదులు ప్రవహిస్తున్నంతకాలం రామకధ ఈ విశాల విశ్వంలో విరాజిల్లుతూ ఉంటుంది." ఇది బ్రహ్మవాక్కు - దీనికి తిరుగులేదు.
