Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 12

 

    "సార్ ! ఇంజన్ ఆపి, కిందకు దిగండి. కారు గేరాజ్ లో పెడ్తాను. "విక్టర్ గొంతు వింటూనే సాగర్ ఈ లోకంలోకి వచ్చాడు. ఇంజన్ ఆపి, సాగర్ కారు దిగాడు. కారు కీస్ ని విక్టర్ చేతిలోకి విసిరి గబగబా మెట్లు ఎక్కాడు.
    "ఏం బాబు! వంట్లో బాగోలేదా? అలా ఉన్నావెం?"
    "షటప్! యు స్టుపిడ్!" మెట్ల మీద ఆగి వెనక్కు తిరక్కుండానే అన్నాడు సాగర్.
    "ఏమైంది సార్? మీకు నిజంగానే....."
    "విక్టర్! ప్లీజ్ స్టాపిట్!" సాగర్  గిర్రున తిరిగి విక్టర్ కేసి చూశాడు.
    "సారీ విక్టర్! నాకు వంట్లో బాగోలేదు. చిరాగ్గా వుంది. ఏమీ అనుకోకు. ఏదో అనేశాను."
    విక్టర్ సాగర్ ను ఎగాదిగా చూసి, తల ఓరగా పెట్టి ఊపుకుంటూ, కారులో ఎక్కాడు. విక్టర్ కారు గేరేజ్ లో పెట్టి తలుపులు మూసి సాగర్ దగ్గర కొచ్చాడు.
    "సార్ డాక్టర్ కు ఫోన్ చేయమంటారా?"
    సాగర్ ఉలిక్కిపడ్డాడు . తను ఇంకా ఎందుకు అక్కడే నిలబడ్డాడు? తనకు ఏమైంది? నిజంగా తనకు ఒంట్లో కాదు మెదడులో బాగోలేదా?
    "నాన్నగార్ని లేపమంటారా?"
    "విక్టర్! నువ్వెళ్ళి పడుకో!"
    "నో సార్! నాకు ఈరోజు సెంట్రీ డ్యూటీ!"
    "ఓ.కే . అయితే నువ్వెళ్ళి పని చూసుకో!"
    "నేను బాగానే ఉన్నాను. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను. అంతే! గుడ్ నైట్."
    విక్టర్ శాల్యుట్ కొట్టి గేటు వేపు నడిచాడు.
    సాగర్ హాల్లోకి వచ్చాడు. తండ్రి గదిలో ఇంకా దీపం వెలుగుతూనే వున్నది. ఒంటిగంట దాటినా అయన ఇంకా మెలకువగానే ఉన్నాడు. తనకోసం ఎదురు చూడటం లేదు గదా? గుండెలు గతుక్కుమన్నాయి! అడుగులో అడుగు వేసుకుంటూ తన గది వైపు నడిచాడు. తండ్రి గది ముందుకు రాగానే లోపలి నుంచి మాటలు విన్పిస్తున్నాయి. ఇంత రాత్రప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తలుపు వారగా వచ్చి నిలబడ్డాడు సాగర్.
    తండ్రి ఎవరితోనో టెలిఫోన్ లో మాట్లాడుతున్నట్లు గ్రహించాడు సాగర్.
    'అలాగే డాక్టర్ సాగరుతో నేను మాట్లాడుతాను ఇంకా ఇంటికి రాలేదు."
    సాగర్ కు అనుమానం తీరిపోయింది. డాక్టర్ మూర్తి ఫోన్ చేసాడు. తనను గురించే మాట్లాడుతున్నాడు. సుజాత చెప్పి వుంటుంది. తన తల బద్దలు కొట్టానని. మైగాడ్ ఇంకా ఏమేమి చెప్పిందో? "మాధవి" ని గురించి కూడా చెప్పిందేమో?
    సాగర్ రెండు అంగలలో తన గదిలోకి వచ్చి పడ్డాడు. లైట్ అర్పి మంచం మీదకు చేరాడు. నాన్న తలుపు తట్టినా తను తీయ కూడదు. గాడ నిద్రలో ఉన్నట్టు నటించాలి.
    గది బయట తలుపు కొట్టిన చప్పుడు . అయినా తలుపు తీయడు. గాడంగా నిద్రపోతున్న వాడు తలుపు ఎలా తీస్తాడు. ఒకటి .....రెండూ.....మూడూ......ఈ సంఘటన లన్నిటికీ అతికీ అతకని సంబంధ ముంది. మాధవి అంతరాంతరాల్లో అణిగి వున్న అనుభవాలేమిటి? అగాదా లేమిటి? సాగర్ ఆలోచనా వాహిని ముందుకు వస్తున్నా నిద్రను తేల్చి  వేస్తున్నది.


                                                               7

    టప్! టప్!
    సాగర్ ఒళ్ళు తడిసి ముద్దయింది. ఎగిరి మంచం మీద నుండి దూకాడు. గది తలుపు తీసాడు. కానీ ఎవరూ లేరు. తండ్రి గదిలో లైటు కూడా లేదు. అయితే తలుపు కొట్టింది ఎవరు?
    ఎవరూ తలుపు తట్టలేదా? అంతా తన భ్రమేనా?
    తలుపు వేసి గదిలోకి వచ్చాడు. మళ్ళీ "టప్ టప్" మని చప్పుడు!
    సాగర్ లైట్ వేసి గదంతా పరిశీలనగా చూసాడు.
    కిటికీ చెక్క ఊగుతోంది.
    సాగర్ నిట్టూర్చాడు. చెమట తుడుచుకున్నాడు. గాలికి చెక్క కొట్టుకుంటూ వున్నది. అంతే! తను ఎంత ఖంగారు పడిపోయాడు.
    కిటికీ దగ్గరకు మెల్లగా నడిచాడు. కిటికీ అడ్డం పగిలి మధ్య ఖాళీగా వుంది. కిటికీ చెక్కకు వున్న స్టాపర్ కిందకు వేలాడుతూ వుంది. సాగర్ వంగి స్టాపర్ అందుకొన్నాడు.
    ఒళ్ళు జలదరించింది. తన చేతికి చల్లగా ఏదో తగిలింది! తన చేతి చుట్టూ మెత్తని వెళ్ళు చుట్టుకు పోతున్నాయి. పగిలిన అద్దం సందులో నుంచి ముందుకు వచ్చిన చెయ్యి తన చేతిని గట్టిగా పట్టుకొన్నది. ఆ ప్రయత్నంగానే తన చేతిని వెనక్కు లాక్కున్నాడు. చివ్వున రక్తం చిమ్మింది. రక్త సిక్తమయిన చెయ్యి తన చేతిని విడువలేదు! సాగరుకు గుండె ఆగినట్లయింది. శ్వాస ఆడలేదు.
    "సాగర్- సాగర్" నీరసంగా బలహీనంగా ఓ గొంతు తనను పిలుస్తోంది.
    "ముందు నా చెయ్యి వదులు!"
    "వదలను! వదలలేను! సాగర్ నువ్వేనా ఆ మాట అనేది?"
    "మాధవీ?" సాగర్ గొంతు పూడుకు పోయింది. బయట కిటికీ ప్రక్కన కుప్పగా కూలబడి కూర్చున్న మాధవిని చూశాడు సాగర్.
    "మాధవీ! మాధవీ!"
    సాగర్ కిటికీ నుంచి చెయ్యి ముందుకు చాచి మాధవిని అందుకోబోయాడు. పగిలిన అద్దం అంచు సర్రున తెగింది. సాగర్ చేతి నుంచి ఓడుతున్న రక్తం కింద కూర్చున్న మాధవి చెంపలమీద పడింది.
    "నిన్ను వదలను, నీ చెయ్యి వదలను! నన్ను బయటకు రానీయ్!" అంటూ సాగర్ మాధవి చేతి వేళ్ళూ మెల్లగా తన చేతి నుంచి తప్పించాడు. ఒక్క పరుగులో గదిలో నుంచి బయటకు వచ్చాడు. హాలు తలుపు తెరచుకొని బయట మెట్ల మీదకు వచ్చాడు. మెట్లు దిగి ఇంటి వెనుక్కు పరుగెత్తాడు.
    కిటికీ కిందగా నేలమీద కుప్పగా పడిన మాధవిని ఒళ్ళోకి తీసుకున్నాడు. మాధవి చేతులు సాగరును చుట్టి వేశాయి. అతని ఒడిలో ఆమె గువ్వలా ఒదిగిపోయింది.
    "మాధవీ! ఏమైంది? ఇంత రాత్రప్పుడు ఒంటరిగా ఎలా వచ్చావ్? ఎందు కొచ్చావ్?" ఎన్నో ప్రశ్నలు గుక్క తిప్పుకోకుండా అడగసాగాడు సాగర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS