Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 12


    అసలే లెక్కలురాక విసుగ్గా వున్న శరత్ కు కోపం వచ్చింది తమ్ముణ్ణి ఒక దెబ్బ వేశాడు. వాడు చిరుతపులిలా అన్న మీదకు దూకి జుట్టు పట్టుకున్నాడు.


    నుదురు చిట్లి రక్తం కారసాగింది. రక్తం చూసి భరత్ తారాస్థాయిలో ఏడుపు ప్రారంభించాడు.


    శరత్ తెల్లముఖం వేసి నిల్చున్నాడు.


    తల్లీ తండ్రీ పరిగెత్తుకొచ్చారు.


    తండ్రికి చిన్నకొడుకంటే తగని ప్రేమ. రక్తం చూసేటప్పటికి అతనికి పిచ్చి కోపం వచ్చింది.


    శరత్ ను పట్టుకొని 'ఫెడీ ఫెడీ' మని కొట్టసాగాడు.


    శరత్ గొల్లున ఏడవసాగాడు.


    సుశీలమ్మ అది చూసి శరత్ ను కొట్టకుండా అడ్డం పోయింది.


    ఏడుస్తున్న శరత్ ను ఓదారుస్తున్న తల్లిమీద తండ్రికి వళ్ళుతెలియని కోపం వచ్చింది.


    "ఛీ! నువ్వు కన్నతల్లివేనా? కన్నబిడ్డకు దెబ్బ తగిలి ఏడుస్తుంటే నువ్వు ఆ వెధవను.... వాణ్ణి...."


    "ఏమండీ?" సుశీలమ్మ పిచ్చిగా అరిచింది.


    రామనాధం భార్య ముఖంలోకి చూసి, మౌనంగా భరత్ ను ఎత్తుకొని లోపలకు తీసుకెళ్ళాడు.


    అమ్మకు అంత ఉద్రేకం ఎందుకు వచ్చిందో శరత్ కు ఆనాడు తెలియదు.


    ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే నిద్రపోయాడు....


    "కన్నకొడుకు దెబ్బ తగిలి ఏడుస్తుంటే నువ్వు ఆ వెధవను.... వాణ్ణి...."


    "ఏమండీ?"


    శరత్ కు ఆ మాటలు అంతకుముందే అన్నంత స్పష్టంగా చెవుల్లో ధ్వనిస్తున్నాయి.


    ఆ రోజు అమ్మ ఎందుకు అంత గావుకేక పెట్టిందో ఇప్పుడు అర్థం అవుతోంది.


    అమ్మే అలా అరిచి వుండకపోతే నాన్న ఏమనేవాడో?


    "వాణ్ణి.... ఆ దిక్కులేనివాణ్ణి.... ఎవరో కనిపారేసిన వెధవను వెనకేసుకు వస్తావా?" అని వుండేవాడు.  


    ఆ తర్వాత రెండు రోజులు అమ్మ ముభావంగా ఉంది.


    ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు చాలా జరిగాయి.


    ప్రతిసారీ తండ్రి భరత్ నే సమర్థించేవాడు. తల్లిని ఎన్నోసార్లు "నువ్వు కన్నతల్లివేనా?" అనేవాడు.


    అందువల్లనే తనకు తండ్రి వద్ద బెరుగ్గా వుండేది.


    తండ్రికి తనమీద ప్రేమలేదని ఊహించుకుంటూ ఎన్నోసార్లు ఏడ్చాడు రహస్యంగా.


    తండ్రీ కొడుకులకు వుండవలసిన సహజమైన అనుబంధం ఏదో తమ ఇద్దరిమధ్యా లేనట్టు అనిపించేది.


    అయినా పెట్టుపోతల్లో ఆయన తనకు ఏ లోటూ చెయ్యలేదు.


    ఇద్దరికీ సమానంగా బట్టలు కొనేవాడు. ఏ వస్తువుకొన్నా ఇద్దరికీ తెచ్చేవాడు ఈరోజు ఆయన చాలా ఉద్రేకపడ్డాడు.   


    ఆయనకు తనమీద ఇంత మమకారం వున్నట్టు ఆయనకే తెలియదు. ఈరోజే అది బయటపడింది.


    నాన్నది చాలా గొప్ప మనసు. అందుకే తనెవరని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు!  


    కాని - కాని - తనకెందుకింత అశాంతిగా వుంది?


    తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని ఎందుకింత అలమటించిపోతున్నాడు. "నేను ఎవరు?" అనే ప్రశ్న క్షణం ఒకచోట నిల్చోనివ్వడం లేదు.


    కాఫీ తాగి బట్టలు మార్చుకుని బయటకు వెళుతున్న కొడుకును "ఎక్కడికి?" అని అడిగింది తల్లి. ఆమె కంఠంలో ఏదో సందేహం వుంది. భయం వుంది. ఆతృత వుంది.


    శరత్ కు నవ్వొచ్చింది.


    "అలా బయటికి వెళ్ళివస్తానమ్మా!"


    "త్వరగా వస్తావా?"


    "ఆఁ" అంటూ మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా గబగబ బయటికి నడిచాడు శరత్. సుశీలమ్మ అలా వెళ్ళిపోతున్న కొడుకును దిగాలుపడి చూస్తూ నిల్చుంది.


                                         6


    రాజేశ్వరి నాలుగు గంటలకే కాలేజీ నుంచి వచ్చింది. ముస్తాబు అయి శరత్ కోసం ఎదురు చూడసాగింది.


    రాజేశ్వరి తండ్రి ఓబయ్య డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. నలుగురూ ఆడపిల్లలే. పెద్దపిల్ల రాజేశ్వరి. ఎం.ఏ. ఫైనల్ లో వుంది. రెండోపిల్లా మూడోపిల్లా కూడా కాలేజీలో వున్నారు. ఆఖరు అమ్మాయి మాత్రం ఏడవక్లాసు చదువుతూ ఉంది.     


    ఓబయ్యకు కూతురు శరత్ ను వివాహం చేసుకోవడం ఇష్టంలేదు అయినా పైకి ఏమీ అనడు.


    తల్లి మాత్రం గోలపెట్టేస్తోంది. పెద్దకులాలవారితో సంబంధం ఏమిటి అంటుంది. అయిన వాళ్ళతో చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని ఆ తల్లిదండ్రుల నమ్మకం.


    రాజేశ్వరి శరత్ కోసం అశాంతిగా బయటకూ లోపలికీ తిరుగుతూ వుంది, మనసు పరిపరి విధాల పోతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS