అలా అలా వెంగమాంబను గురించి ఊరంతా ప్రాకి వెంగమాంబ మామూలు పిల్ల కాదనీ, భక్తురాలనీ, ఒకరికొకరు చెప్పుకోవడం ప్రారంభమైంది. వెంగమాంబ పాటలు రాయడమే కాక, పాడటం, దేవాలయంలో నృత్యం చేయడం, ఆ నృత్యం చూసేందుకు జనం పోగవడం కూడా నిత్యకృతమై పోయింది.
ఆనాడు జరిగిన అవమానం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు వెంగమాంబ భర్త వెంకటాచలపతి. నలుగురు తనను చూసి నవ్వుతున్నారన్న భావన అతనిలో బాగా నాటుకుపోయింది. పైగా ఆ రాత్రి వెంగమాంబ తనతో అన్నమాటలు అతని మదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. "నన్ను పొందాలనుకుంటే నీ తల వేయి ముక్కలు కాక తప్పదు" అన్నమాట అతన్ని మరీ మరీ పీడిస్తోంది. "అమ్మో! అది ఆడది కాదు. దేవత కాదు. అది దెయ్యం. అది దయ్యమే" అని పలవరించడం మొదలెట్టాడు.
వెంకటాచలపతిని చూసి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రోజురోజుకీ కుర్రవాడు కృశించిపోతున్నాడు. ఆహారం, నిద్రలేక నీరసించిపోతున్నాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా, దిగాలుగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడడు. అప్పటికీ రకరకాల వైద్యాలు చేయించారు. విబూది పెట్టారు. కనిపించిన దేవుడికి మొక్కుకున్నారు.
తల్లిదండ్రులు ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినప్పటి, వెంకటాచలపతి మామూలు మనిషి కాలేదు. ఉన్నట్లుండి, "అదిగో దయ్యం! నన్ను మింగేయడానికీ కొస్తోంది. దయ్యం... దయ్యం...." అంటూ కేకలు పెట్టడం మొదలెట్టాడు. లక్షణమైన యువకుడు ఇలా అయిపోయినందుకు, ప్రతిరోజూ కృష్ణయ్య దంపతులను, వెంగమాంబను తిట్టిపోస్తూనే ఉంది వెంకటాచలపతి తల్లి.
"దాన్నేమనొద్దూ. అది దయ్యమో..... దేవతో మనకెందుకు?" అంటుండే వాడు వెంకటాచలపతి.
"నీక్కూడ ఏమైందిరా? అది...... ఆ పిచ్చిది దేవతా? నీక్కూడ ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? దాంతో ఒక్కరోజు కూడ కాపురం చేయలేదు. అప్పుడే దాన్ని వెనకేసుకొస్తున్నావా?" తల్లి అరుస్తోంది. వెంకటాచలపతి ఏం మాట్లాడలేదు. అతనికి వెంగమాంబ అకస్మాత్తుగా అలిమేలు మంగమ్మగా కనిపిస్తుండేది. కళ్ళు నలుపుకుని చూస్తే ఎదురుగా వెంగమాంబ! అతనికి అంతా అయోమయంగా ఉండేది.
రోజులు గడుస్తున్నాయి. వెంకటాచలపతికి మరో పెళ్ళి చేయాలన్న నిశ్చయానికోచ్చేశారు అతని తల్లిదండ్రులు. "ఎన్నాళ్ళిలా ఒంటరిగాఉంటాడు? వాడికీ పెళ్ళాం, పిల్లలంటూ ఉండొద్దా?" అంటుండేది ఆ తల్లి ఎంతో బాధగా, కానీ, ప్రస్తుతం వెంకటా చలపతికి ఆ ధ్యాసే లేదు. అతనిలో వ్యథ ఎక్కువైంది. బెంగతో మంచమెక్కాడు. జ్వరం తగ్గడం లేదు. రోజురోజుకీ నీరసించి పోతున్నాడు. మానసికమైన బెంగ అతడిని మరింత కుంగదీస్తోంది.
ఆ రోజు రాత్రి మంచంపై పడుకున్న వెంకటాచలపతి పెద్దపెద్దగా కేకలు పెట్టాడు. పక్క గదిలో నిద్రపోతున్న తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చారు.
ఏమైంది?
"దయ్యం నాన్నా, దయ్యం. నా గొంతుని నొక్కేస్తోంది" అంటూనే నీరసంగా మంచంపై వాలిపోయాడు వెంకటాచలపతి. ఆ తర్వాత మూడు రోజులపాటు ఏవేవో పిచ్చి మాటలు పలవరిస్తూనే ఉన్నాడు. "వెంకూ, నిజంగా నేను నీ భర్తను కాను. నన్ను చంపొద్దు..... చంపోద్దూ" అంటూ వెంకటాచలపతి కలవరిస్తూనే ఉన్నాడు.
* * *
సీతకు పురుడొచ్చింది. ఆడపిల్ల. ఈ శుభవార్తను మంగమాంబకు, సుందరమ్మ చెబుతుండగా, పక్కనున్న వెంగమాంబ ఈ వార్తను వింది. విన్నంతనే ఊరుకోకుండా "అత్తా! మరీ అంత సంతోషపడకండి. మూడు రోజులు దాటింతర్వాత చెప్పండి" అంది. వెంగమాంబ మాటలు విన్న సుందరమ్మ ముఖం మాడిపోయింది.
"ఓసి నీ ....అదేమిటే అలా వాగుతావ్?" అంటూ వెంగమాంబ నెత్తిపై మొట్టింది మంగమాంబ.
"ఇందులో నేను వాగేదేముంది? ఆ దేవుడు చెప్పిన విషయాన్నే మీకు చెబుతున్నాను" అంది వెంగమాంబ.
"ఇందులో నేను వాగేదేముంది? ఆ దేవుడు చెప్పిన విషయాన్నే మీకు చెబుతున్నాను" అంది వెంగమాంబ.
సుందరమ్మ చటుక్కున అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రే ఆ పురిటికందు పాలు అందక, ఆ ఉక్కిరిబిక్కిరిలోనే ఆ పసిప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.
భోరుమన్న సుందరమ్మ, వెంగమాంబను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసింది. "ఆ పిల్ల ముండ.... దాని నోరు పడిపోను.... ఏ క్షణాన నోరు తెరిచిందోగానీ, అలాగే జరిగింది దేవుడో" అంటూ గుండెలు బాదుకుంది సుందరమ్మ.
"అమ్మో! దాని జోలికి పోకండి. అది నోరు తెరిచి ఏదన్నా అందంటే, అది నిజమవుతుందమ్మా! అది మంచన్నా చెడ్డన్నా.... దాని నోరు ఆగడం లేదు" అంటూ పలువిధాలుగా అనుకోసాగారు ఊరి జనం. వెంగమాంబ ఎదురైతే, పక్కకు తప్పుకుని పోతున్నారు. ఎదురుపడితే తమల్ని చూసి ఏమైనా అంటుందేమోనన్న భయం వారిని పట్టి పీడించసాగింది.
మామూలుగా కృష్ణయ్య ఇంటికి వచ్చేవాళ్లేవ్వరూ రావడం లేదు. పొరపాటున ఎవరైనా ఆ ఇంటివైపు వచ్చినా, వడివడిగా అడుగులేసుకుంటూ దాటిపోతున్నారు. కూతుర్ని చూస్తోంటే దుఃఖం కట్టలు తెంచుకొంటోంది ఆ తల్లికి. కూతురి కాపురం చక్కబడుతుందా? లేదా? అన్న దిగులుతోనే మంగమాంబ చిక్కి శల్యమైపోయింది. ఒకరోజు కృష్ణయ్య, పెద్దాచార్యులగారిని వెతుక్కుంటూ వెళ్లాడు. పెద్దాచార్యులు వైద్యంలోనేకాక, జ్యోతిష్యంలో కూడా పేరెన్నిక గలవాడు.
పెద్దాచార్యులు వెంగమాంబ జాతకాన్ని పరిశీలనగా చూసాడు. కృష్ణయ్యలో ఆందోళన. పెద్దాచార్యులు ఏం చెబుతాడోనని ఆయన ముఖం వైపే చూస్తుండి పోయాడు. దీర్ఘంగా నిట్టూర్చిన పెద్దచార్యులు, కృష్ణయ్యా! బెంగపడాల్సిన పనేమీ లేదు. ఇంకొక్క నెలరోజులు ఓపిక పట్టండి. ఆ తర్వాత పిల్లను చీరసారెలతో అత్తారింటిలో దిగబెట్టి రండి. ఈలోగా గ్రహశాంతి చేయించాలి. దానాలుచేయాలి. అమ్మాయితో శ్రద్ధగా కొన్ని పూజలు చేయించాలి. కాకపొతే కాపురం బాగుపడేందుకు కాస్త సమయం పడుతుంద" ని అన్నాడు. కృష్ణయ్య పెద్దాచార్యులు మాటలను శ్రద్ధగా విన్నాడు. పెద్దాచార్యుల వారి మాటలను అందరూ నమ్ముతారు. "ఏమో! ఆయన మాట నిజమై, నాపిల్ల కాపురం కుదుటపడితే అంతే చాలు" అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు కృష్ణయ్య.
క్రమంగా వేంకటాచలపతి జబ్బు నయమైంది. పూజారి మంత్రించి ఇచ్చిన తాయెత్తు కట్టుకున్న తర్వాత పాటు వ్యవసాయపు పనులకు వెడుతున్నాడు. అందరితో మాట్లాడుతూ, హాయిగా నవ్వుతూ, ఆరోగ్యంగా ఉన్న కొడుకుని చూస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారు తల్లిదండ్రులు.
ఒకరోజు భోజనాలు చేస్తుండగా, "మా అత్తగారింటికి వెళ్లి వెంగమాంబను మనింటికి తీసుకొస్తా"నని అన్నాడు వెంకటాచలపతి. ఆ మాట వినడంతోనే భయపడిపోయింది వెంకటాచలపతి తల్లి. "నాయనా! తొందరపడకు. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం కుదుటపడుతోంది. అయినా, ఆడపిల్లవాళ్ళకి లేని తొందర మనకేంటి? చూద్దాం..... మీ మామగారు తీసుకొస్తాడేమో?!" అంది నిదానంగా.
ఆ మాట వినగానే తల్లిపై కస్సుమని లేచాడు వెంకటాచలపతి. "నా భార్యను నేను తెచ్చుకుంటానంటే వద్దంటారేమిటి? ఎందుకిలా అంటున్నారు?" అతని ఆవేశాన్ని మౌనంగా చూస్తుండిపోయాడు తండ్రి. జన్మంతా తను బ్రహ్మచారిలా బ్రతకాల్సిందేనా అన్నది వెంకటాచలపతి ప్రశ్న.
కొడుకు పరిస్థితి అర్థంచేసుకున్న తండ్రి నిదానంగా, "అలాగే వెళ్ళరా. వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా" అన్నాడు.
"ఎల్లుండి బాగుందంటున్నారు. వెళ్ళి వెంటబెట్టుకుని తీసుకొస్తా. పాపం, నాకోసం ఎంతగా ఎదురు చూస్తోందో నా వెంకమ్మ" అంటూ వెంకటాచలపతి తింటున్న అన్నాన్ని వదిలి బయటకెళ్ళాడు.
"నాయనా! అన్నం తినరా. ఎల్లుండి కాకపొతే రేపు వెళ్ళు. నువ్వు - నీ భార్యతో కలసి ఉండటమేగా మాకు కావాల్సింది" అంది తల్లి.
వెంకటాచలపతి మనసులో కూడ ఇదే ఆలోచన.
"తను రమ్మంటే వెంకమ్మ వస్తుందా? రాను పొమ్మంటుందా? నువ్వు నాభర్తవు కావని మరలా ఈసడిస్తుందా? ఛీ.... అలా అనదు. ఆనాడు అదేదో గ్రహస్థితి. ఇవాళ వెంగమాంబ మరింత అందంగా తయారై ఉంటుంది. అచ్చం లక్ష్మీదేవిలా.... కాదు .... కాదు రతీదేవిలా తయారై ఉంటుంది. చూడాలి. రేపే వెళ్ళాలి" అనుకుంటూ నిద్రపోయాడు వెంకటాచలపతి.
వెంకటాచలపతి తల్లిదండ్రులు మాత్రం కొడుక్కి వేరే సంబంధం చూసి పెళ్ళి చేయాలని నిశ్చయించారు. మంచి పిల్లనిచూసి, పూజారితో మంచి ముహూర్తం పెట్టించి త్వరగా పెళ్ళి చేయాలని నిశ్చయించారు.
ఎప్పటిలానే తెల్లవారింది. ఇంటి పనులలో ముమ్మరమైన వెంకటాచలపతి తల్లికి, బారెడు పొద్దెక్కినా కొడుకు లేవకపోవడాన్ని గమనించలేదు. అయితే కొడుకు గదిలోకెళ్ళిన తండ్రి కెవ్వుమంటూ బయటకొచ్చాడు.
అప్పటికే వెంకటాచలపతి ప్రాణాలు అనంతవాయువుల్లో కలసి పోయాయి. ఆ తల్లిదండ్రుల శోకాన్ని నిలువరించడం ఎవరితరం కాలేదు. ఈ విషయాన్ని విన్న మంగమాంబ, కృష్ణయ్య దంపతులకు నోటమాట రాలేదు. వెంగమాంబ మాత్రం వార్త విన్నంతనే చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఊరంతా వచ్చి వెంగమాంబ తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. కానీ వెంగమాంబకు ఇవేం పట్టడం లేదు. "నా భర్త బతికే ఉన్నాడుగా? నన్ను ఓదార్చుతారేమిటి?" అంది తనను ఓదార్చేందుకు వచ్చిన వాళ్ళతో. "అయ్యో! పిచ్చి తల్లీ!" అంటూ నిట్టూర్చారు ఆ గ్రామ ప్రజలు.
ఆ అగ్రహారంలో ఉన్నవారంతా కలసి జరుగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె - జుట్టు, బొట్టు తీసేయాలని తేల్చారు. కానీ వెంగమాంబ అందుకు అంగీకరించలేదు.
ఒంటరిగా కూర్చున్న వెంగమాంబ దగ్గరకు ఒక ముత్తైదువ వచ్చి, ఎదురుగా నిలబడింది. ఏదో రాసుకుంటున్న వెంగమాంబ తలెత్తి చూసింది.
"అమ్మాయి, మన సంప్రదాయం ప్రకారం ఈరోజు బొట్టు తీసేయ్యాలి., జుట్టు తీసెయ్యాలి" అంది నెమ్మదిగా. ఆ మాటలు విన్న వెంగమాంబ మళ్ళీనవ్వింది. "నేను నిత్య సుమంగళిని" అంది. మంగళాకారుడైన ఆ వేంకటేశ్వరుడు నా పతి. ఆ పరమేశ్వరుని నిత్యం సేవించడమే తన ధర్మం కాబట్టి, ఆ ధర్మం ప్రకారం శిరోజాలు తీయనక్కర్లేదని" అనుకుంది. ఆ మాటే సదరు ముత్తైదువతో చెప్పింది.
ఆ మాటలు విన్న ఆ పండు ముత్తైదువ నొచ్చుకుంది. వెంగమాంబ తల్లిదండ్రులు దుఃఖించారు. ఈ అపచారాన్ని ఇలా కొనసాగించితే గ్రామానికి ఏం కీడు మూడుతుందోనని గ్రామస్తులంతా భయపడసాగారు. కానీ, వెంగమాంబ పూలు ధరిస్తూ, ఆభరణాలు పెట్టుకుంటూ, ఎల్లవేళలా దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆనందంగా తిరుగుతోంది. ఆమె భక్తితత్వం ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమె భక్తితత్పరత గురించి అవగాహనలేని గ్రామ ప్రజలు, ఆమెని తిట్టడం మొదలెట్టారు. వెంగమాంబ కులభ్రష్టురాలనే ప్రచారం మొదలెట్టారు. ఆ తిట్లను విన్న వెంగమాంబ ఆ పాపం మీకే తగులుతుందని చెప్పింది. ఈ తత్త్వం గ్రామస్తులను మరింత కోపోద్రిక్తులను చేసింది. ఆమె బయటకు వస్తే హేళన చేస్తూ, ఆమెను వెంబడిస్తూ అవమానిస్తున్నారు. వెంకమ్మ ఎవరినీ లక్ష్యపెట్టకుండా స్వేచ్ఛగా తిరగడాన్ని చూసి, ఆ గ్రామ ప్రజలు ఓర్చుకోలేకపోయారు.
