Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 12


    ఆమె సాలోచనగా, "నా సంగతే ఇలా వుంటే మిగతా అమాయకమైన ఆడవాళ్ళకి రక్షణ ఏమిటి?" అంది.

    "అతడేదో  నువ్వు అందంగా వున్నావనీ, సరదాగా పోలీసు డ్రస్సు వేసుకొచ్చి నిన్ను ఎత్తుకెళ్ళాడంటావా? అలాటి ఊహలేం పెట్టుకోకు. నీ పేరేమిటి అన్నావ్? అనూష కదూ. సలీంశంకర్ గురించి నీకు పూర్తిగా తెలీదు అనూషా! ఎంతో పకడ్బందీగా  ప్లాను వేస్తాడు. ఏదో లాభం వుంటే తప్ప ఏ పనీ చేయడు. ఇదంతా చూస్తూ వుంటే నువ్వేదో మెడలోతు వ్యవహారంలో కూరుకుపోయినట్టు కనపడుతున్నావు" అన్నాడు.

    ఆమెకి చప్పున ఏదో గుర్తొచ్చి, "రామలింగేశ్వర్రావు" అంది.

    రామలింగేశ్వర్రావేమిటి?"

    ఆ రోజు ప్రొద్దున్న ఆఫీసులో జరిగిన విషయాలు చెప్పి, "తనను పట్టుకున్నందుకు కసితో బహుశ ఆ రామలింగేశ్వర్రావే ఇతడిని పంపిచాడేమో" అంది.

    "అయ్యుండదు" అన్నాడు జానీ, "ఈ రోజే అది జరిగి, ఈరోజే సలీంశంకర్ పోలీస్  వ్యాన్ ఏర్పాటుచేసి- ఉహూ ......శంకర్, అంత తెలివితక్కువగా అనుమానం ఒకరిమీదకు వెళ్ళేలా చెయ్యడు. ఇంకెవరో శత్రువులు నీకు వుండి వుంటారు".

    "నాకింకెవరూ శత్రువులు లేరు" అంది అనూష. "అయినా అలాటి సైకిక్ పెర్వర్ట్ కి పెద్ద కారణాలు ఎందుకు? అతడెంత సైకిక్ గా ప్రవర్తించి నన్ను బెదిరించాడంటే - ఆసిడ్ చుక్క తన చర్మం మీదే పోసుకున్నాడు".

    "నువ్వు ప్రమాదంలో లేవనీ, అతడు కాకతాళీయంగానే నిన్ను ఎత్తుకెళ్ళాడనీ అనుకుంటే, ఆ భావం నీకు సంతృప్తి ఇస్తూవుంటే, అలాటి భ్రమలోనే వుండు. కానీ అతడి తెలివితేటల్ని మాత్రం  తక్కువ అంచనా వేయకు. నిన్ను అంతగా భ్రమింపచేసిన ఆసిడ్, నిజంగా ఆసిడ్  అయివుండదు. నిమ్మకాయరసం. అయివుంటుంది. అతడి చేతిమీద పరిశీలించి చూస్తే నీకు సోడాపొడి కనపడి వుండేది. సాధారణంగా అతడు ఇంత తెలివితేటల్తో పనులు చేస్తూ వుంటాడు ఎప్పుడూ".

    ఆమె అవాక్కై చూస్తూ వుండిపోయింది.

    "సరే- నేను వెళ్ళొస్తాను. పోతే ఈ మాఫియా వ్యవహారాలు తెలిసిన వాడిని కనుక నీకో సలహా ఇస్తాను. నీకున్న పరపతి ఉపయోగించి, అసలా సలీంశంకర్ కి నీ మీద దృష్టి ఎందుకు పడిందో కనుక్కో వీలైనంత తొందర్లో రాజీ చేసుకో. ఇలాటి 'రాజీ' లు పోలీసు డిపార్ట్ మెంట్ లో పెద్ద పదవుల్లో వున్నవాళ్ళు చేస్తారు".

    "అంత అవసరమేమీ లేదు నాకు."

    "నీ మంచి కోసమే చెప్పాను. ఈ సారి  శంకర్ మరో ఎత్తు వేసి తీసుకెళ్తే ఆదుకోవటానికి నాలాటివారు ఎవరూ వుండరు. ఒకవేళ వున్నా ఆదుకుంటానని అనుకోవద్దు".

    "థాంక్స్! అక్కర్లేదు. కనీసం ఆ సలీంశంకర్ కన్నా ఎక్కువ తెలివితేటలు నాకున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ సారి మరింత  జాగ్రత్తగా  వుంటాను-"

    "ఉంటే మంచిదే. కానీ నీకొక కథ తెలుసా? సరస్వతీ దేవి నేరేడు పళ్ళు తింటూ వుండగా బ్రహ్మ సృష్టి ప్రారంభించాడట. చీమ నుంచి ప్రారంభించి మనిషి వరకూ కాస్త కాస్త తెలివిని బుర్రలో పూరించుకుంటూ వచ్చాడట. పురుషుడి తయారీతో తెలివి పూర్తయి, ఇంకేమీ మిగల్లేదట. ఇక సృష్టించవలసినదిగా స్త్రీ ఒక్కటే మిగిలిపోగా అప్పుడు ఆ నేరేడు గింజల్ని పొడిచేసి తెలివికి బదులు మెదడులో వాటిని కూరి సృష్టి పూర్తి చేశాడుట" నవ్వు బిగపట్టి సీరియస్ గా అన్నాడు.

    అనూష సూటిగా అతడికేసి చూసింది.

    కలసిన మొదటి క్షణం నుంచీ తనని ఏకవచనంలోనే సంబోధిస్తున్న ఇతడికి సరిఅయిన పాఠం చెప్పాలనుకుంది.

    "మీరు నన్ను రక్షించిన మాట యదార్థమే. అందుకు మీకు నా కృతజ్ఞతలు పోతే మీకు ఆడవారి మెదళ్ళమీద  అంత తేలికైన అభిప్రాయం వుండడం శోచనీయం. దాన్ని ఈ క్షణమే పొగొట్టదల్చుకున్నాను. మీ కిష్టమైన ఏ అంశమైనా తీసుకోండి. ఫార్మకాలజీ నుంచి పాథాలజీ వరకూ, పామిస్ట్రీ నుంచి ఆస్ట్రానమీ వరకూ మీకూ బాగా వచ్చు అనుకున్న ఏ సబ్జెక్టులోనైనా, మీరు  'థరో' అనుకుంటే చెప్పండి- మీకన్నా నాకా సబ్జెక్టు కాస్త ఎక్కువే తెలుసు అని నిరూపిస్తాను".

    ఆమె మెదడు సంసిద్ధం అయింది.

    "నువ్వు ముందా? నేను ముందా?" అని అడిగాడతడు.

    "ఎవరైనా పరవాలేదు. ఇంతకీ ఏ సబ్జెక్టులో ప్రస్తావించదల్చుకున్నారు?"

    "దేంట్లో మాట్లాడమన్నావ్?" 

    "మీకు బాగా ప్రవేశమున్న ఏ సబ్జెక్ట్ అయినా  సరే! కేవలం మీకు ఆడవాళ్ళ ముఖ్యంగా నా తెలివితేటలమీద కాస్త గౌరవం కలిగించడానికి! ఇంతకీ ఎందులో అడుగుతారు?"

    "సెక్సు"

    చాలా తాపీగా అతడు అన్నది ఆమెకి లిప్తకాలం అర్థం కాలేదు. వినపడింది సరిగ్గా అర్థం కాగానే ఆమె మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. అనుకోని ఈ సమాధానానికి ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. కోపం వచ్చింది కానీ  ఆ కోపాన్ని తను పప్పులో కాలేసానన్న భావం డామినేట్ చేసింది. అతడు ఆ సమాధానం ద్వారా తనని చావబాదాడన్నది నిర్వివాదాంశం.

    అతడు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అందిస్తూ "ఆత్మవిశ్వాసం వుండడం మంచిదే. కానీ దానికి కాస్త పై మెట్టే అహంభావం. రెంటికీ మధ్య తేడా జాగ్రత్తగా గమనించు" అన్నాడు.

    ఆమె జవాబు చెప్పలేదు. ఆమెకు ఊహ వచ్చిన తరువాత ఈ విధంగా సలహా ఇచ్చినవాళ్ళు ఎవరూ లేరు.

    "నేను వెళ్ళొస్తాను-"

    ఆమె తెప్పరిల్లి "కాఫీ" అంది.

    "వద్దు. ఇది విస్కీ టైము. పొతే మరొకసారి చెపుతున్నాను. నువ్వు  ఊహించనంత తెలివితేటలు వున్నవాడు సలీం శంకర్. అంతకు రెట్టింపు వసంతదాదా. ఈ విషయం దాదా వరకూ వెళ్ళకపోతే ఫర్వాలేదు. ఈ లోపులోనే అసలిదంతా ఎవరు చేస్తున్నారో- ఎందుకు చేస్తున్నారో కనుక్కో రాజీ చెయ్యటానికి ఎవరూ దొరక్కపోతే అదిగో ఆ కార్డులో నా ఫోన్ నెంబర్ వుంది. ఫోన్ చెయ్యి. నాకు చేతనైంది చేస్తాను".

    ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చారు. ఆమె నెమ్మదిగా అంది.

    "నాకు తెలియకుండానే నేను వాళ్ళకి శత్రువునై వుండవచ్చు. ఆ వసంత్ దాదా ప్రపంచపు అత్యంత మేధావుల్లో ఒకడై వుండి వుండవచ్చు. కానీ అతడితో తలపడవలసివస్తే, ఆ మాటకొస్తే ఎవరితో తలపడవలసి వచ్చినా దానికి నేను వెనుదీయను. నా ఈ ఆత్మవిశ్వాసం మీకు అహంభావంలా కనపడితే నేనేం చెయ్యలేను....." ఆమె మాటలకి- అతడి పెదవుల మీద అదే ఆకర్షణీయమైన చిరునవ్వు కదలాడింది. "మంచిదే! ప్రతి మనిషికీ ఆమాత్రం ఆత్మ విశ్వాసం వుండాలి. నిన్ను చూస్తూంటే నాకు చిన్నప్పటి మరదలు గుర్తొస్తూంది. పన్నెండేళ్ళ వయసులో బాగా ముద్దొస్తూందని ముద్దు పెట్టుకుంటే మూణ్ణేళ్ళయాక కడుపని నానా  గొడవ చేసింది. నేరేడు గింజల పోడికన్నా బాదంపప్పు పొడి బెటరు. ఈ లోపులో నీకు తెలియని సబ్జెక్టుల గురించి కూడా చదువుకుంటే మరీ బెటరు. మనుష్యులు ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారు? ఆడపిల్లలు ఏ టైమ్ లో 'యమాతారాజభానస' అంటారు-వగైరా ప్రశ్నలన్నిటీకి సమాధానాలు తెలుసుకో. అప్పుడు నన్ను కూడా వోడించవచ్చు".

    ఈసారి ఆమెకి కోపం రాలేదు. 'గుడ్ బై' అంది క్లుప్తంగా.

    'గుడ్ బై'.

    అతడు వెళ్లిపోయాడు. ఈ సారి నిశ్శబ్దం ఆమెకెందుకో కాస్త దిగులుగా అనిపించింది.

    రాత్రి పన్నెండింటివరకూ చదువుకోవడం ఆమెకి అలవాటు. కానీ ఆరోజు మనసు నిలవలేదు. పదకొండయింది. చల్లటిగాలి వీస్తూంది. కేవలం కొన్ని గంటల క్రితం తను ఒక నరాంతకుడి పక్కన ప్రమాదం అంచు వరకూ ప్రయాణంచేసింది అని అనుకుంటేనే గమ్మత్తుగా, ఏదో కలలా అనిపించింది.

    అంతలో జానీ గుర్తొచ్చాడు.

    పదహారేళ్ళ అమ్మాయిలు తదేకంగా, అంతకు పై వయసు ఆడవాళ్ళు చాటుగా చూసే అందం అతడిది. ఊహూ. అందం కాదు. ఏదో నిట్లక్ష్యంతో కూడిన హుందాతనం అతడిలో వుంది. తనకి తెలిసిన బాడీ లాంగ్వేజికి అతీతమైన ఆకర్షణ అది.

    ఆమె చదువుతున్న పుస్తకం పక్కన పడేసింది. నెమ్మదిగా పక్కకి తిరిగి పడుకుంది. ఆ తరువాత మరింత పక్కకి. బోర్లా.

   
                                  *    *    *   

    అదేరోజు రాత్రి పన్నెండింటికి సలీం శంకర్ కి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.

    "శంకర్ . నువ్వు అర్జెంటుగా ఢిల్లీ రావాలి" అట్నుంచి దాదా కంఠం వినిపించింది.

    "రేపు కోర్టులో హియరింగ్ వుంది".

    "దాన్నించి బయటపడిపోయినట్టే. జడ్జి నాకు ఫోన్ చేసి చెప్పాడు. రేపు సాయంత్రం బయల్దేరి. వీలైనంత వరకూ మూడోకంటికి తెలియనివ్వకు-"

    "ఏమిటి ఏమైంది?"

    "చెపుతాను. రా"

    అంత అర్జెంటుగా దాదా, సలీంశంకర్ ని పిలిపించటానికి కారణం తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళాలి-


                                8


    సలీంశంకర్ ఇప్పటివరకూ చేసిన హత్యల్లో ఏ ఒక్కటీ నిరూపింపబడలేదు. కోర్టువరకూ వచ్చినా అక్కడ నిలబడలేదు.

    దీనికి కారణాలు తెలుసుకోవటం అంత కష్టంకాదు. 1.నేరాన్ని పరిశోధించే పోలీసు స్టేషను అధికారికి చాలా తక్కువ జీతం వస్తుంది. అతడిని కొనెయ్యవచ్చు. 2. అతడు లంచం తీసుకోనివాడైతే పై అధికారి నుంచి వత్తిడి తీసుకురావచ్చు. పోలీసు డిపార్టుమెంటులో ఇలాటి వత్తిళ్ళు, మరే  యంత్రాంగంలోనూ పని చెయ్యనంతగా  ఉపయోగపడతాయి. ౩. అదీ లాభంలేని పక్షంలో కేసు లోయర్ కోర్టుకి వెళుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని 'మంచి' చేసుకుంటే అతడు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసి కేసు బలపడకుండా, చూసీ చూడనట్టు వదిలెయ్యగలడు. 4. ఒకవేళ అతడూ లొంగనివాడైతే జడ్జిని బ్లాక్ మెయిల్ చేసో, వత్తిడి తీసుకువచ్చో కేసు కొట్టెయ్యబడేలా చూడవచ్చు. 5. అక్కడ కూడా ఓడిపోతే హైకోర్టులో మళ్ళీ  పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీ లేక 6. తీర్పుని తమకి అనుగుణంగా తిప్పుకోవచ్చు. -అంటే ఒక నేరం జరిగినప్పుటినుంచి, అది నిరూపించబడి నేరస్తుడు శిక్షింపబడేలోపులో కేసు ఆరుగురు వ్యక్తుల ద్వారా సాగుతుంది. ఈ ఆరుగురిలో ఏ ఒక్కరూ కాస్త 'లూజు' గా వున్నా నేరం నుంచి బయటపడవచ్చు. ఈ వ్యవస్థలో ఆరుగురిలో కనీసం ఒక్కరు డబ్బుకి గానీ, వత్తిడికి గాని లొంగని వారుండటం దాదాపు అసంభవం.

    6:1 నిష్పత్తి అసంభవం అని ఏనాడైతే వసంతదాదా తెలుసుకున్నాడో- ఆ క్షణం నుంచీ అతడు 'నేరాన్ని' -డబ్బు సంపాదించటం కోసం- అధికారం సంపాదించటం కోసం- విచ్చలవిడిగా ఉపయోగించసాగాడు. మళ్ళీ ఈ డబ్బులో కొంత భాగాన్ని ఆ నేరం నుంచి బయటపడటం కోసం తిరిగి వినియోగించాడు. సాలెపురుగు స్థిరపడ్డాక గూడు అల్లుకుపోయినట్టు అతడి కార్యకలాపాలు ఆ విధంగా దేశమంతా అల్లుకు పోయాయి. ఆ గూడులో ఇరుక్కున్న వాళ్ళలో కోటీశ్వరులైన వ్యాపారులు, పోలీసు ఉన్నతాధికారులు, హొం మినిస్ట్రీ అధికారులేకాక,

    కేంద్ర మంత్రులు కూడా వున్నారు. ఎం.పీ. లూ, ఎమ్మెల్యేల సంగతి చెప్పనవసరం లేదు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS