ఆయన చెప్పింది నచ్చింది దీపికకి. ఆ అలవాటే తనకూ వుంటే ఇప్పుడీ ఆకలి బాధ వుండేది కాదు కదా అనిపించింది.
"కమిన్" మరోసారి పిల్చాడాయన. మొహమాటపడుతూనే వెళ్ళింది. ముందు గదిలో పురాతనం ప్రేమ కుర్చీలున్నాయి.
"యూ సిట్ డౌన్!" అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆయన. పావుగంటలో తిరిగొచ్చాడు. "టీ శాండ్ విచేస్" ట్రేలో తీసుకొచ్చి ముందు పెట్టాడు "తీసుకో" అన్నాడు.
ఎదురుగా తిండి కనిపించేసరికి ప్రాణం లేచి రాగా వాటి మీదికి దాడి చేసింది దీప.
కడుపునిండా తినేసి టీ తాగింది. ఆకలి తీరేసరికి మొహమాటం వేసింది ఛ మరీ బకాసురుడి చెల్లెల్లా తినేశాను. ఏమనుకుంటున్నారో ఆయన అనుకుంటూ సిగ్గుగా తలెత్తి చూసింది మెచ్చుకోలుగా దీపికవంక చూస్తున్నాడు ఆయన.
"వెరీగుడ్! నాకు నచ్చావమ్మా నువ్వు. ఈ రోజుల్లో ఆడపిల్లలు నాజూకులకి పోయి సరిగ్గా తినరు. ఈసురో మంటూ వుంటారు. కానీ నువ్వలా కాదు. కడుపునిండా తింటున్నావు. నాజూకుగా కూడా వున్నావు" పొగిడాడు.
ఆయనలా పొగడడం చాలా నచ్చింది దీపకి.
ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మూడు గంటలయింది.
"ఇక నాకు టైం అయిందమ్మా. వెళ్ళి పని చూసుకోవాలు" అని లేచాడు బయటికి చూసింది దీప. ఇంకా వాన పడుతూనే ఉంది.
"మీ గొడుగు నాకిస్తారా సార్? రేపు తెచ్చిస్తాను?" అంత ఆదరంగా మాట్లాడాడు కదా ఇవ్వకపోతాడా అని అడిగేసింది.
కానీ ఆయన సీరియస్ గా చూశాడు. "ఐయాం సారీ, ఐ వొంట్ బారో థింగ్స్ ఫ్రం అదర్స్ అండ్ ఐ వొంట్ గివ్ మై థింగ్స్ టు అదర్స్!" అనేశాడు ఖచ్చితంగా.
గతుక్కుమని "సారీ సార్! థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటి!" అని చెప్పితడుస్తూనే రోడ్ ఎక్కింది లక్కీగా రిక్షా దొరికింది. ఇంటికి చేరేసరికి తల్లీ తండ్రీ ఆదుర్దాగా వరండాలో నిలబడి వున్నారు.
"ఎక్కడికి పోయేవే?" విసుగ్గా అడిగింది వర్ధనమ్మ. విషయం టూకీగా వివరించి లోపలికి వెళ్ళిపోయింది దీప. బట్టలు మార్చుకుని తల తుడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. మాటల్లో మళ్ళీ ప్రొఫెసర్ గారి ప్రసక్తి వచ్చింది.
"మంచివాడు నాన్నా! యెంతో ఆదరంగా మాట్లాడారు!చూడ్డానికి మాత్రం పిచ్చివాడిలా వుంటారు" అంది.
"మేధావులంతా అలాగే వుంటారమ్మా! ఎక్కడ పని చేస్తున్నారుట ఆయన?"
"ఏమో నాన్నా అదేం చెప్పలేదు. భూమి గురించి రిసెర్చ్ చేస్తున్నారుట ఎవరూ కనీ వెనీ ఎరుగని విషయాలు ఎన్నో కని పెట్టారుట" అంది దీప.
హఠాట్టుగా మెరుపు మెరిసింది సత్యంగారి బుర్రలో "ఏమన్నావ్ భూమి మీద రిసెర్చ్ చేస్తున్నాడా? అన్నాడు.
"అవును నాన్నా! చాలా కాలంగా చేస్తున్నారుట" అందిదీప.
"అమ్మడూ! రేపోసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళతావా?" అడిగారు సత్యంగారు.
"అలాగే, అలాగే వెళ్దాం!" అనేసింది దీప.
మర్నాడు రిక్షా కట్టించుకుని వెళ్ళారు తండ్రీ కూతుళ్ళు.
లోపలికి వెళ్ళి తలుపు తట్టింది దీపిక, అయిదు నిముషాల తరువాత తలుపు తెరుచుకుంది. బుర్ర మాత్రం బయట పెట్టి సీరియస్ గా చూస్తూ "ఏమిటీ?" అని అడిగాడు ప్రొఫెసర్ పృథ్వి.
చిన్నగా నవ్వి "ఈయన మా నాన్నా గారండీ! మీతో మాట్లాడాలని వచ్చారు" అంటూ చెప్పబోయింది. మధ్యలోనే వారించేశారు ప్రొఫెసర్ గారు.
"ఇది నా స్టడీ అవర్. యు హేవ్ టూ వెయిట్ ఫర్ వన్ అవర్" కొట్టినట్లే చెప్పేసి ధడాలున తలుపేసేనుకున్నాడు.
గతుక్కుమంది దీప. నిన్న అంతఆదరంగా మాట్లాడి శాండ్ విచెస్ పెట్టిన పెద్దమనిషి ఈయనేనా అని డౌట్ కూడా వచ్చింది.
ఇబ్బందిగా తండ్రివంక చూసింది. ఆయన కూడా నిరాశపడినా అంతలోనే తేరుకుని "పన్లో వున్నట్లున్నా రమ్మా. అలా కూర్చుందాం" అన్నాడు. తండ్రీ కూతుళ్ళిద్దరూ చెట్టుకిందవున్న సిమెంట్ బెంచీమీద కూర్చున్నారు.
ఠంచనుగా గంట అయేక తలుపు తెరుచుకుంది. లోపలికి రండి!" చల్లగా నవ్వుతూ ఆహ్వానించాడు పృథ్వి.
ఆశ్చర్యంగా లేచి లోపలికి వెళ్ళారు విజిటర్స్. "కూర్చోండి!" ఆదరంగా కూర్చోపెట్టి లోపలికివెళ్ళాడు.
"చూసేవా అమ్మా! ఆయనకి పనంటే ఎంత శ్రద్దో మరి! అసలు గొప్పవాళ్ళంతా యింతే. "వర్క్ ఈజ్ వర్ షిప్" అన్నట్లు ప్రవర్తిస్తారు" అన్నాడు తల ఊపింది దీపిక.
లోపలినుంచి మూరెడు పొడుగు గాజు గ్లాసులో పళ్ళరసం పట్టుకొచ్చేరు ప్రొఫెసర్ గారు "తీసుకోండి!" అన్నాడు.
"యిప్పుడెందుకండీ యివన్నీ?" మొహమాటపడ్డారు సత్యంగారు.
"నేనెప్పుడూ ఈ టైంలో పళ్ళరసం తీసుకుంటాను ఆలోచనలతో వేడెక్కిపోయిన మెదడుని చల్లబరుస్తుంది ప్రూట్ జ్యూస్. నాతొ పాటు నీకూను" అన్నారాయన పళ్ళరసం గుటకలు వేస్తూ.
మహానుభావుడు! అనుకుంటూ తాగేశారు సత్యంగారు.
"అమ్మాయి మీ గురించి చెప్పింది. మీతో పనుంది వచ్చాను సార్!" అన్నారు.
"సారీ! నా పనులతో నే తీరి ఏడవదు నాకు. యింకా యితర పనులు యెలా చేస్తాను?" నిర్మొహమాటంగా చెప్పేశారు పృథ్విగారు.
నీరుగారిపోయారు సత్యంగారు. "మీ మీదఆశపెట్టుకుని వచ్చాను సార్! పోనీ విని చూడండి!" అన్నారు దీనంగా.
"సరే చెప్పండి!"
గొంతు సవరించుకుని మొదలుపెట్టారు సత్యంగారు. ముందు నిరాసక్తిగా చెవులు అప్పగించినా తరువాత చాలా శ్రద్దగా విన్నారు ప్రొఫెసర్ గారు.
"ఇటీజ్ ఏన్ ఇంట్రస్టింగ్ కేస్" అన్నారు చివరిలో.
"ఐతే సార్ వాటినికనిపెట్టడం సంభవమేనంటారా?" ఆఖరు ప్రయత్నంగా ఆశగా అడిగారు.
భుజాలు యెగరేశాడు పృథ్వి. "యెందుకు సంభవంకాదూ?" యెదురుప్రశ్న వేశారు.
కొడుకుచేసిన క్రాస్ ఎగ్జామినేషన్ వివరించాడు సత్యం.
తేలిగ్గా కొట్టిపారేశారు ప్రొఫెసర్ గారు. అలా అనుమానపడి తవ్వకుండా ఊరుకుంటే నలందా విశ్వవిద్యాలయం మనకు దొరికేదే కాదు అన్నారు. చాదస్తంగా వదిలేసి ఊరుకుంటే మేన్ చంద్రమండలంమీదికి వెళ్ళేవాడు కాదు అన్నారు. ప్రాచీనమైన జ్యోతిష్యశాస్త్రాన్ని అంత తేలిగ్గా తీసి పారెయ్యడానికి వీలులేదు అన్నారు.
సత్యంగారి మొహం చింకిచేటంత అయింది. "బాబూ! ఈ మహత్కార్యం మీ వల్లనే నెరవేరాలి" అన్నారు ఆశగా.
దీర్ఘంగా ఆలోచించారు ప్రొఫెసర్ గారు "నేను భూమిమీద రీసర్చి చేస్తున్నాను. మీ విషయంకూడా చూడగలను. కానీ టైం లేదు నాకు, యెవరయినా ఇంట్రస్టు తీసుకుని మొదలు పెడితే సాయం చెయ్యగలను" అన్నారు.
అర్థంగానట్లు చూశారు సత్యంగారు.
