ప్రతిరోజూ వీళ్ళ సంభాషణంతా వింటున్న రామానుజం గారు "ఏమిటి మన రాగిణి సినిమాల్లో వేషాలేస్తుందా?" అని అడిగాడు అతని మాటల్లోనే అయిష్టత కొట్టొచ్చినట్టు తెలుస్తుంటే -
"ఏం తప్పా! వేషాలెయ్యడమేమిటి? మీకు మంచి మాటలు దొరకవా? - ఈ రోజున సినిమా కళాకారులంటే ఏమనుకున్నారు! వేషాలేస్తున్నారన్న రోజులుపోయాయి. లోక్ సభలో, రాజ్యసభలో మున్సిపల్ ఎలక్షన్స్ లో, మంత్రులలో అదిక మెజారిటీతో గెలిచి, రాజ్యాలు చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా పూలదండలూ, సన్మానాలూ, ఆటోగ్రాఫుల, ఫోటోగ్రాపులే! బ్రతికినన్నాళ్ళూ హాయిగా అలా బ్రతకాలి. పేరూ, ప్రతిష్ఠా, డబ్బూ, హోదా, ఏమి తక్కువ?" ఉపన్యాసం దంచేసింది సరోజిని.
ఆ వాగ్ధాటికి తట్టుకోలేక తలొంచుకున్నారు రామానుజంగారు.
రాగిణి పెరిగి పెద్దదయి జ్ఞానం వచ్చినప్పటినుంచి ఆ ఇంట్లో తల్లీ బిడ్డల నోరు ఒక్కటయిపోయింది. భరణికి మళ్ళా ఆ స్థానం లేదు. రామానుజంగారి మనస్సులో పోరు, అతని నోరు మూతబడిపోయింది.
రామానుజంగారు మాట్లాడకుండా అవతలకి వెళ్ళిపోయారు.
దాదాపు సాయంత్రం నాలుగు గంటలకి కాల్ బెల్ చప్పుడు విని తలుపుతీసిన రాగిణి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయిపోయింది.
"అమ్మా - భార్గవగారొచ్చారు" అంటూ పిలిచింది.
లోపల్నుంచి గబగబా వొచ్చిన సరోజిని "నమస్కారం" చేసింది రెండు చేతులు జోడించి.
భార్గవ ఆమెని చూడగానే లేచి నుంచుని ప్రతి నమస్కారం చేశాడు.
"కూర్చోండి" అంది సరోజిని.
"నా పేరు భార్గవ! నేను సినిమా ప్రొడ్యూసర్ని" తనని తాను ఆమెకి పరిచయం చేసుకున్నాడు.
"మీరు ఊటిలో కలిసిన సంగతి అంతా అమ్మాయి చెప్పింది. మీరు తీసిన సినిమాలన్నీ మేము రెండేసిసార్లు చూశాం. మీకు మంచి భవిష్యత్తుంది."
"ఈసారి ఒక కళాత్మక చిత్రం తియ్యాలని సంకల్పించుకున్నాం. అందులో ఒక చక్కని సెంటిమెంటల్ రోల్ హీరోయిన్ ది. ఆ పాత్రకి మీ అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నాం"
"హీరో ఎవరు?"
"ఇంకా ఏమీ అనుకోలేదు. అంత దాకా రాలేదు"
"హీరో కొత్తవాళ్ళు కాక - పాతవాళ్ళనే తీసుకోండి. మన......"
"అదే..... వీలయితే డాన్సర్ రోల్ గాబట్టి కమల్ హాసన్ నే బుక్ చేద్దమనుకుంటున్నాం" అన్నాడతను.
వండర్ ఫుల్!" అంది రాగిణి.
సరోజినీ, భరణీ కలిసి కాఫీ, బిస్కట్లు, మిక్చరూ తీసుకొచ్చారు.
"మా రెండో అమ్మాయి" పరిచయం చేసింది సరోజిని భరణిని
"గుడ్! "అంటూ" హౌ ఆర్ యూ......?" అన్నాడు.
"ఫైన్....... థాంక్యూ......" అంది భరణి.
"మీరూ డాన్సరేనా?"
"లేదు! దానికి పెయింటింగు, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్టు - వాటిల్లో డిప్లొమా చేసింది."
"అంటే మీ పిల్లలిద్దరికీ లలిత కళలంటేనే ఇష్టమన్నమాట" నవ్వాడు.
"అవును!" నవ్వుతూ సమాధానం చెప్పింది సరోజిని.
కాఫీ ఫలహారాలయ్యాక తాను ఇదివరకు తీసిన సినిమా తాలూకు కథలు చెప్పడంతో భోజనం వేళ కూడా అయ్యింది.
"భోం చెయ్యండి ఇక్కడే!" అడిగింది సరోజిని.
"భోజనానిదేముందిలేమ్మా! మీకేందుకూ శ్రమా? అందరం కలిసి ఏదయినా హోటల్ కెళ్ళి భోంచేద్దాం" అన్నాడు.
అప్పుడే ఎక్కడికో వెళ్ళి తిరిగొచ్చిన రామానుజం గారిని పరిచయం చేసింది రాగిణి. "మా నాన్నగారు" అంటూ.
భార్గవ షేక్ హాండ్ ఇవ్వబోయాడు!
రామానుజంగారు నమస్కారం పెట్టి, లోపలికి వెళ్ళిపోయాడు.
"అసలు విషయానికొద్దాం. సినిమా ఆగస్టులో ప్రారంభిస్తాను. స్క్పిప్ట్ వర్కు జరుగుతోంది. నాలుగు నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేసేస్తాను. మరి ఈ నాలుగు నెలలూ మీరు ఇక్కడినుంచి మద్రాసుకీ...... మద్రాసు నుంచి ఇక్కడికీ తిరగటంతోనే సరిపోతుంది. టైం వేస్ట్. మీరు మద్రాసులోనే చిన్న ఇల్లు తీసుకుని వుంటే సరిపోతుంది. మీకిష్టమయితే, నేను ఇల్లు మాట్లాడిపెడతాను."
రాగిణి సరోజినికేసి చూసింది.
"షూటింగ్ హైదరాబాదులో కాదా......?" అడిగింది సరోజిని.
"కాదండీ! మద్రాసులో అయితే, నాకు ఫెసిలిటీసు చాలా వున్నాయి. ఆ సౌకర్యాలు హైదరాబాద్ లో వుండవు! త్రివేండ్రంలో కూడా వుండవు. ఫామిలీని మద్రాసుకి షిప్టు చేద్దామంటే ఆవిడ ఆస్థిపాస్తులన్నీ అక్కడే వున్నాయి. నలభై ఎకరాల భూమి. అయిదారు లక్షలు విలువచేసే ఇళ్ళు వున్నాయి. ఆ ఆస్తంతటికీ మా ఆవిడొక్కటే వారసురాలు. పంటలమీద శిస్తులు వసూలు చేసుకోవడం, ఇళ్ళ అద్దెలు వసూలు చేసుకోవడం ఆమెవంతు. అందుకని ఆమె త్రివేండ్రం విడిచి రాలేదు. మద్రాసు నుంచయితే నేను గబుక్కున వస్తూ పోతూ వుండొచ్చును."
"ఓ....." అంది.
"మీకేమయినా అభ్యంతరమా మద్రాస్ లో వుండడానికి?"
"ఏం లేదు. అక్కడొక ఇల్లు తీసుకుని వుండాలంటే అక్కడొక ఎస్టాబ్లిష్ మెంట్ పెట్టుకోవాలి."
"ఎందుకండీ! ఇంటి అద్దె నేను చూసుకుంటాను. భోజనం, ఫలహారాలూ, కాఫీలూ ఎవరయినా మా వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. అనవసరంగా వంటా, పెంటా పెట్టుకుంటే కష్టం..
"సినిమాకి ప్రస్తుతం పదివేలిస్తాను. ఇంటద్దీ భోజనం అవన్నీ కలుపుకుంటే మరో అయిదారు వేలవుతాయి కదా?"
"అవుననుకోండి! పదిహేనిచ్చెయ్యండి!" అంది సరోజిని.
"సర్లేండి, దీన్లో బేరమేముందీ" అన్నాడతను నవ్వుతూ.
"థాంక్స్" అంది ఆమె.
"రేపొక అయిదు వేలు పంపుతాను...... పిక్చర్ మొదలయ్యాక మరో అయిదువేలూ, పూర్తవగానే మిగతా అయిదు వేలూ ఇచ్చేస్తాను. రేపే అగ్రిమెంటుమీద సంతకం పెట్టండి." అన్నాడు రాగిణికేసి చూస్తూ.
"అలాగే" అంది రాగిణి.
ఆ తరువాత కాస్సేపు కూర్చుని భోజనాలయ్యాక వెళ్ళిపోయాడు భార్గవ.
అతనున్నంతవరకూ నోరు విప్పలేదు రామానుజంగారు పైపెచ్చు తన పట్టుకుని కూర్చున్నారు. తల నొప్పిగా వుందని.
"భార్గవగారు వెళ్ళిపోయారు. మీ తలనొప్పి తగ్గిందా?" అడిగింది సరోజిని.
"సరోజినీ! నీకు డబ్బు ప్రధానమా? లేక పరువు ప్రధానమా ఈడొచ్చిన ఆడపిల్లని డాన్సంటూ ఊళ్ళకు పంపించొద్దంటే నామాట వినకుండా పంపించావు. అనర్ధం నెత్తిమీదికొస్తే, ఉపాయంగా గుట్టుగా సరిదిద్దుకునే బగులు నానాగొడవా చేశారు. ఇప్పుడు కన్నబిడ్డని ఎక్కడో దూరాన పెట్టి ఈ కార్యక్రమాలూ సినిమాలూ ఎందుకు? ఏదో భగవంతుడిచ్చిన డబ్బుంది. ఇంకా ఎందుకీ ఆశ?"
