Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 11

నాలుగో వరుసలో ఆరు క్యాండిల్స్...
సరిగ్గా గంట క్రితం రాబర్ట్, సుసిరియో ఆ గదిలోకి వచ్చారు.
ఇద్దరి మధ్య నిశ్శబ్దం...
"మిస్టర్ ఆఫీసర్..మనం పీటర్సన్ ని ఏ విధంగా ఎదుర్కోగలమో నాక్కూడా అర్ధం కావడంలేదు. నావంతు ప్రయత్నం చేస్తాను. 'దిశైవ' (మేలు చేసే ఆత్మ)ని పిలిచి అడిగాను. ఈ రోజు రాత్రి అతను ఈ దేశ సరిహద్దు దాటి వెళ్లబోతున్నాడు. సరిగ్గా అర్దరాత్రి అతను తన చివరి సమర్పణ మొదలెడతాడు.
ఒక దశ పూర్తవుతుంది. ఆ తర్వాత తన క్షుద్ర క్రతువుని మరోచోట మొదలెడతాడు. అతడ్ని మనం ఏ మాత్రం డిస్ట్రబ్ చేయగలిగినా, కొంత మేర ఫలితం సాధించినట్టే. అయితే ఇందులో ఓ ప్రమాదం కూడా వుంది...." అని ఆగాడు సుసిరియో..
"ఏంటది మిస్టర్ సుసిరియో...అది ఎలాంటి ప్రమాదమైన ఎదుర్కోవడానికి నేను సిద్దంగా వున్నాను" అన్నాడు రాబర్టు.
అతను చాలా పట్టుదలగా వున్నాడు.
తన వృత్తి, తన అధికారం పీటర్సన్ ని బంధించలేవని అర్ధమైంది. ఎలాగైనా సరే, పీటర్సన్ ప్రయాణాన్ని నిరోధించాలి. ఎట్ లీస్ట్ అతని ప్రయత్నాలను అడ్డుకున్నా చాలు.
"ప్రమాదం మీక్కాదు మిస్టర్ రాబర్ట్..."సుసిరియో అన్నాడు.
"మరి?"
"నాకు...ఆ ప్రమాదం నాకే..."
"మీకా?"
"అవును...బిత్రోచిని పూజించేవాళ్లకు అపరిమితమైన శక్తులుంటాయి...అదీగాక, తనని నమ్మిన వాళ్లని బిత్రోచి ఎప్పుడూ కాపాడుతూ వుంటుంది. పీటర్సన్ ని నిరోధించే ప్రయత్నంలో నాకేమైనా అయితే..."
"మిస్టర్ సుసిరియో..."
అవును ఆఫీసర్...నేను చేసే ప్రయత్నం చాలా ప్రమాదకరం...నా ప్రయత్నం బెడిసికొడితే నేను,,, నేను బ్రతకను.."
"సు...సి...రి...యో..."
"అవును ఆఫీసర్...అయినా నాకు బాధలేదు. చిన్నప్పట్నుంచి నేను తంత్ర విద్యలు నేర్చుకున్నాను. నా గురువుకు నేనో మాట ఇచ్చాను. 'ఓ మంచి ప్రయత్నంలో  నువ్వు చనిపోయినా ఫర్వాలేదుగానీ, నీ ప్రయత్నాన్ని విరమించవద్దు...' అన్న నా గురువు మాటకు కట్టుబడి ఎప్పుడూ అది విస్మరించను.
ఓ మంచి పని కోసం నేను బలి అయినా సిద్దమే...చిన్న చిన్న సమస్యలను, క్షుద్రశక్తులవల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలిగించిన నేను, ఓ మామూలు తాంత్రికుడ్ని మాత్రమే.
బిత్రోచిని ఎదుర్కొనే శక్తి నిజానికి నాకు లేదు. కానీ, మీ తాపత్రయం చూసేక...నా గురువుకు నేనిచ్చిన మాట గుర్తొచ్చాక, నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదనిపించింది. బట్...మిస్టర్ రాబర్ట్..మీరు నాకో సాయం చేయాలి..."
చెమ్మగిల్లే కళ్లతో సుసిరియో వంక చూసి..."తప్పకుండా మిస్టర్ సుసిరియో...మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. చిన్న చిన్న భయాలను కూడా భూతద్దంలో చూపించే తాయెత్తులని, మంత్రాలని...డాలర్లు వసూలు చేసే వాళ్లని చూసే చోట..ఓ మంచి పనికోసం..." రాబర్ట్ కళ్లొత్తుకుని "మీకేం సాయం కావాలన్నా చేయడానికి నేను సిద్దమే" అన్నాడు ధృడంగా...
"నాకేమైనా అయితే నా భార్య, పిల్లలు మా వూరిలో వున్నారు. వాళ్లకు నా ఆదాయమే జీవనాధారం...
ఎంతో కొంత వాళ్లకోసం సాయం చేయండి...అది చాలు..."
కదిలిపోయాడు రాబర్టు.
సుసిరియో రెండు చేతులూ పట్టుకున్నాడు.
"అది నా బాధ్యత మిస్టర్ సుసిరియో...మీకేమీ కాదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నా ఆదాయంలోని సగభాగం మీ ఇంటికి పంపిస్తాను. ప్రామిస్..." చెప్పాడు సిన్సియర్ గా రాబర్ట్.
"థాంక్యూ..థాంక్యూ..మిస్టర్ రాబర్ట్...మరో విషయం..." ఏమిటన్నట్టు చూసేడు.
"సాధారణంగా మా తాంత్రికులు...తమకు తెలిసిన మంత్ర విద్యలను తమ వారసులకు, తమ అంతిమ దశలో చెబుతారు. కానీ, నాపిల్లలకు వీటిమీద నమ్మకం లేదు. అంతేకాదు. ఈ మంత్ర విద్యలు ఎప్పుడైనా మా ప్రాణాలకే హాని చేయవచ్చు. ఆ పిల్లలు ఏదో ఓ చిన్న ఉద్యోగం చేసుకుని సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు. మీకు కొన్ని మంత్ర విద్యలను చెబుతాను. దీనివల్ల మీకు కొన్ని శక్తులు వస్తాయి. మీరు నేరుగా ఆత్మలతో లేదా మాంత్రికులతో సంభాషించవచ్చు." అంటూ రాబర్ట్ ని తన దగ్గరకి పిలిచాడు.
రాబర్ట్ కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని రాబర్ట్ చేతిలో పెట్టి పిడికిలి గట్టిగా మూశాడు.
రెండు క్షణాల అనంతరం శరీరం జలదరించింది. మంత్ర దండంలో నుంచి విద్యుత్తు తన శరీరంలోకి ప్రవహించిన పీలింగ్.       

                                        * * *
రాబర్ట్ నిలబడి వున్నాడు.
పద్మాసనం వేసుకుని కూచోని వున్నాడు సుసిరియో. పన్నెండు క్యాండిల్స్ వైపు చూస్తూ 'దిశైవ' ను పిలిచాడు.
ఒకటి...రెండు...మూడు...
దిశైవ రాలేదు.
మరోసారి...మరోసారి...మరోసారి ప్రయత్నించాడు. అతను మొహంలో రంగులు మారుతున్నాయి.
క్షణక్షణానికి అతని కళ్ళు ఎర్రబడుతున్నాయి.
కమ్...కమ్...కమ్...
దిశైవ...ది...శై...వ...ది...శై...వ...
ఆ గదిలో కిటికీలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. కర్టెన్లు గాలికి అటు, ఇటూ వూగుతున్నాయి.
రాబర్ట్ షాకింగ్ లా చూస్తుండిపోయాడు. అతనికిది మొదటి అనుభవం...
సుసిరియో మొహంలో క్షణక్షణానికి రంగులు మారుతున్నాయి.
ది...శై...వా...కమ్...కమ్...
రాబర్ట్ చూస్తుండగానే ఓ అద్భుతం జరిగిపోయింది.
సుసిరియో ఎదురువున్న క్యాండిల్స్ మొదటివరుసలో మొదటి క్యాండిల్ వెలిగింది.
కొద్ది క్షణాలవ్యవధిలో రెండు క్యాండిల్స్..తర్వాత మూడు క్యాండిల్స్...ఆపై ఆరు క్యాండిల్స్ వెలుగుతున్నాయి.
మంత్రాలకు ఏదో అతీత శక్తులున్నట్టు వింత వింత శబ్దాలు వస్తున్నాయి.
క్యాండిల్స్ చిత్ర విచిత్రమైన రంగులతో వెలుగుతున్నాయి. వాటి రంగులు క్షణక్షణానికి మారిపోతూ వున్నాయి...

                                                 * * *
ఉలిక్కిపడి కోపంగా కళ్ళు తెరిచాడు పీటర్సన్...ఆ గదంతా వేడి గాలులతో నిండి ఉన్నట్టు అనిపించింది. అంత చలిలోనూ అతని శరీరం వేడెక్కిపోతున్న ఫీలింగ్...
తన ఎదురుగా ఉన్న క్యాండిల్స్ ని ఎవరో 'ఉఫ్' మని ఊదినట్టు ఆరిపోయాయి...
క్లిమో...గ్లిమో...
శ్లుమో...క్రిమో...
ఫట్...మన్న శబ్దం...
తన వీపుమీద ఎవరో చరిచినట్టు...
బి...త్రో...చి...బిత్రోచి...
బి...త్రో...చి
పీటర్సన్ గట్టిగా అరిచాడు.
ఎంత గట్టిగా అరిచాడంటే ఆ అరుపులకు షిప్పు ఒక్కసారిగా కదిలిపోయినట్టు అనిపించింది.
ఆ క్యాబిన్ వణికిపోయినట్టు...
మరింత వేడిగాలి...ఊపిరి సలపనీయనంత వేడిగాలి. శరీరం కాలి, బొబ్బలు ఎక్కేంత వేడిగాలి...
అతని కాళ్లు రక్తవర్ణంలోకి వచ్చాయి.
ఎవరో తనని నిరోధిస్తున్నారు...
బిత్రోచికి తన 'సమర్పణ' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు కాళ్లు గట్టిగా మూసుకున్నా.
అతని దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి...
అతనికి చేతికి ఉన్న నరాలు...ఒక్కసారిగా పొంగి వెలుపలికి వచ్చాయి.
అతని కళ్లల్లో నుంచి రక్తం ఒక్కసారిగా కనుకొలకులనుంచి కిందికి కారింది.
టప్...టప్...టప్...
ట...ప్...ట...ప్...ట...ప్
రక్తపు చుక్కలు రౌండ్ సర్కిల్ లో బిత్రోచి అన్న పదం మీద పడ్డాయి.
పీటర్సన్ ఎడమ చేతిని గాల్లోకి లేపాడు.
ఒక్క క్షణం తర్వాత...
తన ఎడమ చేతని కుడిచేతి మణికట్టు దగ్గరకి జరిపి తన కుడిచేతి మణికట్టుకు ఉన్న ఎరుపు రంగు దారాన్ని పట్టి లాగాడు.
ఒక్కసారిగా ఫట్ మన్న శబ్దం...ఆ దారం పోగు అతని ఎడమచేతి పిడికిట్లోకి వచ్చింది.
క్లి...మో...గ్లి...మో...శ్లు...మో...క్రి...మో...ఆ ఎరుపు రంగు దారాన్ని సర్కిల్ లో వేశాడు. రక్తంలో ఎరుపు రంగు దారం తడిచిపోయింది.
తలను కుడివైపుకి తిప్పి తీక్షణంగా చూశాడు...మరుక్షణం కుడివైపు ఉన్న విండో డోర్ పెద్ద శబ్దంతో తెరుచుకుంది. సముద్రం కనిపిస్తోంది. తీక్షణంగా చూశాడు అటువైపు.
లిప్తకాలంలో ఆ సముద్రంలో చిన్న అలజడి...అతను చూసిన మేర..సముద్రం ఉప్పొంగినట్టుంది. నీళ్ళు సుడులు తిరుగుతూ...పెద్ద అలతో త్రీ స్టార్ షిప్ పైకి లేచింది.
ఆ అల గుండ్రంగా తిరిగింది.
వెంటనే తలను ఎడమవైపు తిప్పాడు.
గదిలో వేడిగాలి మెల్లిమెల్లిగా చల్లబడుతూవుంది.
వేగంగా ఉప్పెనలా పైకి ఎగిసిన అల...పెద్ద శబ్దంతో, సముద్ర గర్భంలోకి చీల్చుకు వెళ్లిపోయింది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS