ఎండుటాకుల సుడిగాలికి తిరిగెను
గిర్రున, పడగొట్టిన భిక్షుకి అరచెను
వెర్రిగ.
పంకాకింద శ్రీమంతుడు ప్రాణం
విడచెను, గుండెకింద నెత్తురు
నడచెను.
ఆకాశం తెల్లని స్మశానమై
చెదరెను, సూర్యుడి తలలో పెన
మంటలు కదలెను.
కాలం కదలదు, గుహలో పులి
పంజా విప్పదు, చేపకు
గాలం తగలదు.
నిశ్శబ్ధం అంటుకుంది
మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు,
నగ్నంగా రోడ్లమీద తిరుగుతూంది,
పిచ్చిదాని వొంటిమీద నెత్తురు కల,
పిల్లవాడి సంధిలోన భూతం తల.
* * *
---1943
శిక్షాపత్రం
ఒకనాడు
గల గలా ఫెళ ఫెళా
విరిగి పడుతుంది నీ రంగు గాజు పెంకుల మేడ!
ఒకనాడు
తెరచుకొని, పరచుకొని
పంజాను చరచుకొని
బోను విడివస్తుంది క్రౌర్యమనే పసుపు వన్నెల పెద్దపులి!
ఒకనాడు
వేదం శాస్త్రం విజ్ఞానం
పట్టణాలు, పల్లెటూళ్ళు
ప్రాక్పశ్ఛిమాల విషపు పరిధులు
తిరిగి తిరిగి గిర్రున తిరిగి తిరిగి
పిడికెడు బూడిదలో పేర్లు వ్రాసికొనును!
కాని, నీ
కనురెప్పల సందుల నుండి
బ్రతుకు గోడ చీలికల నుండీ
వినవచ్చును ఒక కష్టజీవి మూలుగు
ఒక పేదవాని యీలుగు!
కనవచ్చును
నీ యుద్ధానికి స్వార్ధానికి బలి యిచ్చిన
సైనికలోకపు సీసపు నాలుకలపై కసితో కత్తులు! కసికత్తులు
ఎపుడో, ఎపుడో
న్యాయం తన భయంకర ఛత్రం విప్పినపుడు
ధర్మం కత్తుల బావుటా ఎగురవైచినపుడు
గత చరిత్రలు నక్షత్రాలై కన్నీళ్ళు కార్చినపుడు
ఓ వర్తకుడా! ప్రభుత్వాధ్యక్షా
ఓ స్వార్ధజీవి!
మీరే జవాబుదారీ
మీకే శిక్ష వుంది
అదిగో అదిగో
భావి మైదానంల మీకోసం
విద్యుత్ రజ్జులతో ఉరి వుచ్చులు! ఉరి వుచ్చులు!
నవ్వే, అరచే చప్పట్లు చరచే చీకటి ఉరి ఉచ్చులు
* * *
---1943
