కృష్ణు - లేకపోవడమేంలే, ఎంతెంత చక్రవర్తుల్ని వేలుమీద తిప్పినవళ్ళున్నారు.
సుంద - ఎప్పుడో ఒకప్పుడు స్త్రి నాశించి పురుషుడు లోబడ్డా నిమిషానికేగాని,తరువాత తన్నులో, శాపమో దాని
రాత.
కృష్ణు - అందరూ అంతేనా?
సుంద - నాకేంటి! ఎంతసేపటికి అందంచేతమెరిపించారు కొందరు. కొందరు నితిపాఠం ముక్కలు వల్లవేసి భర్తల ముందు ఏకరు పట్టారు నీతులు చిలకలమల్లే. ఇంతేకాని తమ బుద్ది బలంవల్ల, ఆత్మబలం వల్ల, భర్తల సహజగుణాన్ని మర్చి, సన్మార్గానికి తిప్పగలిగినస్త్రీలు ఒకళ్ళూ లేరు. దుర్మార్గాని కిడ్చిన వాళ్ళున్నారు. ఎంతసేపటికి భర్తకోసం, తమ సుఖాన్ని , ప్రాణాన్ని, మానాన్ని ఆఖరుకి ఇచ్చారు కాని,వాళ్ళకి నిజమ్తేనఉపకారం చేసిన వాళ్ళులేరు. అందరూ బానిసలు.
కృష్ణు - పోనీ అంత స్వార్ధత్యాగం చేశారు, చాలదూ?
సుంద - చేసి ఏం లాభం? తమకి మహాపకారం చేస్తున్న పురుషుడికి ఇంకొంచెం వీలు కలిగించారు. వాళ్ళకి
ఇంకా దౌర్జన్యం నేర్పారు. స్త్రీకి గౌరవం న్యాయం లేకుండా చంపుకున్నారు. అంతే.
కృష్ణు - నేను వప్పకోను.
సుంద - దాన్ని మొండివాదం అంటారు.
శశి- చేతులు నేప్పేట్టడంలేదూమీకు ?ఇంక వెనక్కి వెడదాం.
సుంద - సరే. వెనక్కి వెళ్లడమంటే పడవని వదిలేయ్యడమేగా.
కృష్ణు - శశి, సుంధ్రరావు ఫిడేలు వాయించడం నువ్వు వినలేదు కదూ, ఈ వాళ వాయిస్తాడు.
సుందరరావు ఫిడేలు వాయించేను. ఆహ! యేమి వాయిద్యము! ఏవో ఇదివఱకేన్నడూ ఎరగని కోర్కెల నన్నిటిని బయటకు లాగుకొని వచ్చెను. వానికి అంతములేదు. ఆ కోర్కెలు ఫలించ వెన్నడునూ. అందరానివి. మానవశక్తి కతితములు. ఆహ, ఆ స్వరముల సౌందర్యము? ఆ గాలితో యూగు ఆకుల గీతములతో, ఒడ్డును ముద్దిడు అలలశబ్దముతో ఆ సౌందర్యమున ధ్వనించు ఆత్మగానముతో కలిసి మెలసి ఒకటే ఆ వెన్నెల మార్ధవమును, ఆ మేఘముల రంగులను , ఆ ఆకసపు నీలపులోతును, ఆ నీటి ప్రకాశమును, ఆ భూమి సౌజన్యమును, ఆ పచ్చిక లావణ్యమును, చెట్ల నీడల నిశ్శబ్దమును, పరిమళమును, అంతటిని ఆత్మ సామిప్యమునకు కొని వచ్చి వడిచినదా గానము. "కావలెను " "కావలెను " మహాతృష్ణతో అరచినది. "కావలెను. ఏమి కావలెనో తెలియదు. ఈ సౌందర్యముకన్న,ఈ దేహ సౌఖ్యముకన్నఅధికమ్తేనది, శాశ్వతమ్తెన దెదియో కావలెను" అని నరనరముల నుండి భూమి రంధ్రముల నుండి, చేట్లయాకుల చిన్ననోళ్ళనుండి,చంద్రకిరణములనుండి ,ఆ జలకణముల నుండి మహాబాధతో విలపించినదా గానము. దుఃఖము భరింపరానిద్తెనది. సౌందర్యము నిలువదు. మేఘ- ములు పరువేత్తుచున్నవి. రంగులు మాయమ్తెనవి చూచునంతలో, అనుభవించునంతలో, ముట్టుకోనునంతలో నిలువక - పోవుచున్నది సౌందర్యము. యేది యేది ఆ సౌందర్యము అని పర్వులేత్తినది ఆ గానము.
ఆ గాన మధుర్యమునకు కృష్ణుడు నిద్రావివశుడయ్యెను.
శశిరేఖ కండ్ల నుండి జలజలమని నీరు వ్రాలెను.
శశి- అట్లా పాడ్డంచేతకావడానికి నా ప్రాణమన్నాయిస్తాను.
సుంద - అంత ఇష్టమా సంగీతమంటే?
శశి - మీరు పాడుతున్నంతసేపు నిగూఢమయిన నా మనోభావములన్నీ, నా సర్వశక్తులున్నూ మిలితముల్తే
వ్యక్తికరింపబడినట్లు తోచింది. అట్లాంటి సంగీతానికి ప్రానమిచ్చినా తనివితీరదు.
సుంద - ఇంత ఇష్టంగా విని ఆనందించేవాళ్ళు దగ్గిర వుంటేనే కాని సంగీతంవచ్చి సార్ధకమేమున్నది? మీరు
కూడా నేర్చేకోరాదూ అంత యిష్టమ్తెతే?
శశి - నేర్పేవాళ్ళేవరు? తిరుబడిలేదు. జితమియ్యడానికి డబ్బూ లేదు.
సుంద - ఎన్నాళ్ళని యిల్లా దేనికి కరువు పడుతోవుంటారు మీరు? డబ్బు కావాలనిపించదూ మీకు?
శశి - పాపము కృష్ణుడికేమి చేతకాదు, నన్ను విడచివెళ్ళి చదువుకోలేడు!
సుంద - అందరూ లోకంలో వెళ్ళటంలేదూ? ఇన్నాళ్ళు చాలదా యేమిటి? ప్రేమ ఇంకా యెన్నాళ్ళు?
శశి- ఏమిటట్లా అంటున్నారు ?
సుంద - మరేమీలేదు. మొగాళ్ళు ప్రేమ చంచలమని.
శశి - కృష్ణుడికి నా మీద ప్రేమ పోతుందా! ఆ చంద్రుడు వేదవుతాడు గాని! నా కోసంకాదూ, వుద్యోగమూ,
చదువు లేకుండాఇట్లా వున్నాడు?
సుంద - అదో కష్టం గావును? మీ లాటి వారికోసం లోకంలో ఎవరన్నా అంతకంటే ఎక్కువే చేస్తారు. ఇంతకి
వాడి అదృష్టం.
శశి - ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు. నాకు బాగా వుండలేదు.
సుంద - ఏమనుకుంటే ఏం లాభం? నేను ఫిడేలు నేర్పితే నేర్పుకుంటారూ?
శశి - ఆయన్నాడుగుతాను. అయినా నాకు వస్తుందనుకోను.
సుంద - ఎందుకురాదు? ఇప్పుడు చూడండి. ఎంత సులభమో ఇట్లా పట్టుకుని కమాను లాగిచూడాండి.
