వచ్చే హడావిడిలో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసి తీసుకురావడం మర్చిపోయాడు. అబ్బా క్యూలో నిలుచోవాలి దానికోసం అనుకున్నాడు.
మేడం ఈ గేట్ వైపు వెళ్ళాలి మనం అన్నాడు కృష్ణకుమార్.
ఈ మూడు రోజులన్నా విద్య అని పిలవండి అంది అతని మొహంలోకి చూస్తూ. లేకుంటే నేను మీతో రాను అని బెదిరిస్తున్నట్లుగా.
ఆ చూపులు తట్టుకోవడం చాలా కష్టం. దానికన్నా ఆమె చెప్పినట్లు విద్య అని పిలవడం మేలు అనుకున్నాడు.
సరే విద్య. ఇటు వెళ్ళాలి విద్య అని మాటి మాటికీ విద్య విద్య అంటున్నాడు కావాలని తనని ఉడికించాలని. అతనికి పరాయి స్త్రీలని అలా పేరు పెట్టి పిలవడం అస్సలు గిట్టదు. కాలేజీ ఫ్రెండ్స్ వరకు అమ్మాయిలను చక్కగా పేరు పెట్టి పిలిచేవాడు. బ్యాంకు లో చేరిన తరువాత తన పంథా మార్చుకున్నాడు. సంబోధన ఆఫిసియల్ గా ఉండేట్లు చూసుకుంటున్నాడు.
అన్నిసార్లు విద్య లు అనక్కర్లేదు. నేనేమీ నామ జపం చేయమనలేదు మిమ్మల్ని. మేడం బదులు విద్య అనండి చాలు అంది నవ్వుతూ.
సరే అన్నాడు.
లోపలికి వెల్లేప్పుడు చిన్న రాంప్ వుంది. తను చూసుకోలేదు. తట్టుకోబోయింది.
గట్టిగా చెయ్యి పట్టుకున్నాడు పడుతుందేమోనని. చూసుకుని నడవండి అన్నాడు.
థాంక్స్. మీరు పక్కనే ఉన్నారుగా. అందుకే చూడట్లేదు అంది.
అబ్బా ఈ చిలిపి మాటలు, కొంటె చేష్టలు మూడు రోజులు భరించాలి అనుకున్నాడు మనసులో.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ క్రిక్కిరిసి ఉంటుంది.
అందులోనూ మధ్యాన్నం జనాలు చాలా మందే ఉన్నారు.
ఆదివారం కామోసు ఇంకా ఎక్కువమంది ఉన్నారు.
బోర్డింగ్ పాస్ కోసం క్యూ లో నిలుచున్నారు.
తన ముందు నిలుచున్న విద్య జడలో మల్లెపూలు గుప్పు గుప్పున తన ముక్కును తాకుతున్నాయి.
తన బాడీ పెర్ఫ్యూమ్ అతని చుట్టూ చక్కర్లు కొడుతోంది.
ఈ క్యూలో ఇంకో పది నిముషాలు పట్టేట్లుంది.
విద్యా ! నీ జడలో పూలు పడేట్లు ఉన్నాయి అన్నాడు మెల్లగా ఆమె చెవి దగ్గర చెపుతున్నట్లు.
సర్ది పెట్టండి మీరే అంది.
అబ్బా అది కూడా నేనేనా.
ఏం సర్ది పెట్టొచ్చు గా మీరు. మీ స్నేహితురాలయితే ఆ మాత్రం చెయ్యరా. నేను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి అంది.
సరే సరే అంటూ సర్ది పెట్టాడు.
ఆమె మృదువైన వెంట్రుకలు చేతులకు తగలడం ఎదో అనిపించింది.
అందుకే ఇటువంటి వాటికి తాను దూరంగా ఉంటాడు. కానీ ఈవిడ వదలట్లేదు. చుట్టూ చూసాడు. ఎవరైనా గమనించారేమోనని. అందరూ ఎవరి బిజీ లో వాళ్ళు ఉన్నారు. హమ్మయ్య అనుకున్నాడు.
బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసి ఇస్తూ హ్యాపీ జర్నీ మిస్టర్ కె అండ్ మిసెస్ వి అని అంది కౌంటర్ ఎగ్జిక్యూటివ్.
ఇదేదో బాగుంది కదా అంది విద్య.
ఏంటి అన్నాడు.
మిస్టర్ కె అండ్ మిసెస్ వి. మీరు పూర్తిగా విద్య అనకుండా షార్ట్ కట్ వి అనొచ్చు. నేను మిమ్మల్ని కె అనొచ్చు అంది నవ్వుతూ.
కృష్ణకుమార్ ఏమీ మాట్లాడలేదు.
కాస్త నవ్వండి బాబు మీ సొమ్మేం పోదు అంది.
సరే సరే నవ్వుతాను లే అన్నాడు. పెద్దగా నవ్వబోయాడు.
వారిస్తూ అంతొద్దు. కొంచెం నవ్వితే చాలు అంది.
సెక్యూరిటీ చెక్ పూర్తయ్యింది. సూట్ కేసు వీల్స్ మీద లాగుతూ మెల్లగా వెళుతున్నారు అటూ ఇటూ షాప్స్ చూసుకుంటూ.
బోర్డింగ్ కి ఇంకా చాలా టైం ఉంది.
హాయ్ కృష్ణ అని ఓ ఆడ గొంతు వినిపించింది వెనుక నుంచి.
ఎవర్ని నన్నేనా అని వెనక్కు తిరిగాడు కృష్ణకుమార్.
తన డిగ్రీ క్లాసుమేట్ శైలజ. ఆ రోజుల్లో కాలేజీ బ్యూటీ తను.
ఓహ్ ! హాయ్ శైలూ అన్నాడు ఆశ్చర్యంగా.
నువ్వెంటి ఇలా ! ఎక్కడికి ప్రయాణం . చాల రోజులయ్యింది నిన్ను చూసి అన్నాడు.
ముంబై వెళుతున్నాను రా కృష్ణ. మా హస్బెండ్ లండన్ లో ఉంటారు. నీకు తెలుసుగా. ముంబై లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక వారం ఉండి అటు నుంచి లండన్ వెళతాను అంది. నువ్వెంటి సర్ప్రైజ్. నిజమే మనం కలిసి చాల ఏళ్ళు అయ్యింది. ఫేస్బుక్ లో హాయ్ అనడమే కానీ డైరెక్ట్ మాటల్లేవు గా. వాట్సాప్ లో నువ్వెక్కువ రెస్పాన్స్ ఇవ్వవు. అందుకే వదిలేసాను అంది కోపంగా.
విద్య ని చూస్తూ నీ వైఫ్ రేణుక కదా. ఎప్పుడో పదేళ్లక్రితం ఒక ఫోటో లో మీ ఇద్దరినీ చూసాను. మళ్ళీ ఇప్పుడే చూడటం. నా కంటే అందంగా ఉందిరా. అందుకే అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే వద్దన్నావా ఇంత అందగత్తె నీకు దొరుకుతుందని ముందే తెలుసున్నమాట.
హోల్డ్ ఆన్ శైలూ. నీ మాటల స్పీడ్ లో ఏమీ మార్పు లేదు. ఈవిడ రేణూ కాదు శైలూ. మా కల్లీగ్ విద్యావతి. మేము బ్యాంకు మీటింగ్ ఉంటె బెంగళూరు వెళుతున్నాము అన్నాడు.
ఓహ్ సారీ రా, సారీ మేడం అంది నొచ్చుకుంటూ . ఇంకా టైం ఉందిగా. రా, కాసేపు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంది శైలజ.
అందరూ కాఫీ హౌస్ లో కూర్చున్నారు.
కృష్ణకుమార్ కాఫీలు తెచ్చేందుకు వెళ్ళాడు. సెల్ఫ్ సర్వీస్ కదా.
శైలజ కబుర్ల బుట్ట. నాన్ స్టాప్ గా వాగుతూ ఉంటుంది.
ఎదుటివాళ్ళు కొత్త పాతా అనే తేడా ఉండదు.
విద్య తో కబుర్లు మొదలుపెట్టింది. వీడు నేను డిగ్రీ క్లాసుమేట్స్ అండి. వీడు అని ఎందుకు అంటున్నానంటే కృష్ణ నాకంటే ఒక సంవత్సరం చిన్న. మా క్లాస్ లో అందరికంటే చిన్న వీడు. అందరం వీడిని చీటికీ మాటికీ ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. వీడికేమో చదువు తప్పితే ఇంకో ధ్యాస ఉండేది కాదు.
అప్పుడు అందరం ఎంతో సరదాగా పేర్లు పెట్టి పిలుచుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎవ్వరూ పరిధులు దాటేవారు కాదు.
కాలేజీ పోటీల్లో కృష్ణ మిస్టర్ హ్యాండ్సమ్ గా సెలెక్ట్ అయితే నేను మిస్ బ్యూటీ గా సెలెక్ట్ అయ్యాను.
అప్పుడే కృష్ణ ని అడిగాను పెళ్లిచేసుకుందాంరా అని. పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అంటూ సాగదీసాడు.
నాకు ఓపిక పోయి మా పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకున్నాను. కాలం మారినా తరాలు మారినా వీడి మైండ్ సెట్ మాత్రం మారదు. కడిగిన ముత్యం కృష్ణ. అందుకే ఎప్పటికీ మా అందరి గుండెల్లో వీడు ఫేవరెట్ స్టార్. మా బ్యాచ్ వాళ్ళం ఎవరు కలిసినా ముందు వీడి గురించే మాట్లాడుకుంటాం అంది శైలజ.
కాలేజీ వార్షికోత్సవాలకి వరూధినీ ప్రవరాఖ్య నాటకం వేసాం. నేను వరూధిని, కృష్ణ ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడి పాత్రలో వీడు జీవించేసాడు.
నేను స్టేజి పైనే బుగ్గమీద ముద్దు పెడితే ఇక పరుగో పరుగు. మళ్ళీ పట్టుకు రావాల్సి వచ్చింది. ఆ దెబ్బకు జ్వరం వచ్చి వారం రోజులు లీవ్ పెట్టాడు అని పక పకా నవ్వుతూ చెప్తోంది శైలజ.
కృష్ణకుమార్ ఇటే చూస్తున్నాడు ఏమి మాట్లాడుతోందా ఈ శైలజ అని.
అతనికి భయం. కాలేజీ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పేస్తుందేమో అని.
అతను అనుకున్నట్లే అయ్యింది.
రా రా కృష్ణా. మన వరూధినీ ప్రవరాఖ్య నాటకం గురించి చెప్పేసాను విద్య కి అంది.
అబ్బా అని తలపట్టుకున్నాడు కృష్ణకుమార్.
చూసావా విద్యా నేను చెప్పలేదు. ఇప్పటికీ వీడింతే. మారడు కాక మారడు.
సరేలే తల్లీ నన్ను వదిలెయ్యి. నీ సంగతులు చెప్పు. ఎంతమంది పిల్లలు. ఏమి చేస్తున్నారు అన్నాడు.
ట్విన్స్. కొంచెం లేట్ గా ప్లాన్ చేసాము. ఇద్దరూ ఇప్పుడు ప్లస్ టు లో ఉన్నారు అంది. నీ సంగతేంటి అంది.
నాకు ఒకడే అబ్బాయి. బి టెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు.
ఓహ్ నైస్ రా. నీవు మీ ఆవిడ లండన్ కి రండి. హాయిగా ఒక నెల రోజులు ఉందురుగాని. అందరం ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు అంది.
తప్పకుండా. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ వాళ్ళింటికి వెళ్లకుండా డైరెక్ట్ గా మా ఇంటికే రావాలి నువ్వు అన్నాడు.
ఓకే రా బై. అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను వెళతాను అంది శైలజ.
ఓకే బై అని లేచాడు కృష్ణ కుమార్ తమ ఫ్లైట్ కి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో. విద్య కూడా అతనితో పాటే లేచింది.
****
కృష్ణ, విద్య డిపార్చర్ ఎంట్రన్స్ గేట్ వైపు దారితీశారు.
ఒక్క నిముషం ఆగండి అంది విద్య.
ఎందుకు అన్నాడు.
జస్ట్ ఒక సెల్ఫీ. ఇక్కడ బాక్గ్రౌండ్ చాలా బాగా ఉంది.
అవునూ. ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఫొటోస్ క్లిక్ క్లిక్ మని పిస్తున్నావు. ఒక వంద తీసావా ఇప్పటికి అన్నాడు.
ఒక పది తక్కువుండొచ్చు అంది నవ్వుతూ. ఫోటోగ్రఫీ నా హాబీ. అందుకే అలా క్లిక్ మనిపిస్తుంటాను. ఇక్కడ క్యూ పెద్దదిగా ఉంది. ఎక్కువ టైం పడుతుందేమో. అందరిని వెళ్లనీయండి. మనం కాసేపు కూర్చుని లాస్ట్ లో వెళదాం అంది.
యాస్ యూ ప్లీజ్ అని కూర్చున్నారు ఇద్దరూ.
మీ శైలు మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పింది. మీకు రామ్ కుమార్ అని పేరు పెట్టి ఉండాల్సింది అంది.
అలా ఎందుకు. కృష్ణకుమార్ పేరు బాగానే ఉందిగా. దానికేమయింది.
మరి మీకు అంతమంది గోపికలు లేరుగా. ఒక్కరంటే ఒక్కరేగా అంది ఉడికిస్తూ.
ఇదేమీ రాజుల కాలం కాదుగా. అంతమంది రాణులు ఉండటానికి. నా రేణూ నాకు పదివేలగోపికల తో సమానం. తనే నా జీవన సర్వస్వము అన్నాడు.
అదృష్టవంతురాలు రేణు అంది విద్య.
అలా ఏమీ లేదు విద్య. ఒక్కో జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. వారం క్రితం వరకు మన మధ్య అంత చనువు లేదు. ఈ వారంలో బోలెడు సంఘటనలు జరిగాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎన్ని సమస్యలున్నా తీర్చొచ్చు. ఒక మంచి స్నేహితుడిగా నీకు అండగా నేను, నా కుటుంబం ఎప్పుడూ ఉంటాము. ఏదికావాలన్నా అడిగే స్వేచ్ఛ నీకుంది. హ్యాపీగా ఉండు. మా ఇల్లు ఎప్పుడు నీకు స్వాగతం పలుకుతూనే ఉంటుంది.
పదేళ్ల క్రితం నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యాను. అంతలా ఆకట్టుకున్నావు నన్ను.
