Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 12


    అతను ఫోను పెట్టేసి "ఏమిటి అంత పరధ్యానంగా ఆలోచిస్తూన్నారు. ఎనీధింగ్ రాంగ్ ."
    "నో సార్ .....నో" గాభరాగా అంది. అతను అదోలా చూసాడు అతని పెదాల మీద చిన్ననవ్వు మెదలింది.
    ఫతిమాలో యీ వారం పదిరోజులుగా మంచి స్నేహం, కుదిరింది వసంతకి. ప్రత్యేకంగా ఫతిమా కోసం యింట్లో తల్లి ప్రాణం తీసి రోజుకో రకంగా టిఫిన్లు తెచ్చేది. యిద్దరూ ఒకరివి ఒకరు పంచుకుని తినేవారు. సాయంత్రం బస్ స్టాప్ వరకు యిద్దరూ కల్సి వెళ్ళేవారు. ఒక ఆదివారం ఫతిమా వసంతని యింటికి రమ్మని పిలిచింది. ఫతిమా కి తండ్రి లేడు. ఒక తమ్ముడు, చెల్లెలు, తల్లి వాళ్ళ సంసారం. ఫతిమా సంపాదన, తండ్రికి వచ్చిన ప్రావిడెంటు ఫండు, తల్లి కిచ్చే ఫేమిలీ పెన్షన్ లో ఆ సంసారం నడుస్తుంది. చిన్న యిల్లు, అయినా చక్కగా , నీట్ గా పెట్టుకున్నారు. ఫతిమా తల్లి చాలా చిన్న ఆవిడ. నలభై కూడా నిండి వుండవు. ఎంతో అందంగా వుంది. ఆ కుటుంబం, ఆ యింటి వాతావరణం ఎంతో నచ్చింది వసంతకి.
    ఫతిమా ద్వారా రతన్ లాల్ కింకా పెళ్ళి కాలేదని, రతన్ లాల్ ఎమ్ కాం చదివి బిజినెస్ మానెజిమెంటు కోర్సు కూడా పాసయ్యాడని విన్నాక వసంతకి గౌరవం కూడా పెరిగింది. సాధారణంగా మార్వాడిలలో చదువులలో కంటే బిజినెస్ లో రాణిస్తారని , అట్టే చదువుకోకుండా తండ్రి తాలుకూ బిజినెస్ అంది పుచ్చుకుంటారని తెలుసు. బాగా చదువుకున్నాడు కనకే మేనర్స్ అవి బాగా తెలుసనీ అనుకుంది.
    "వసంతా నీవెంత లక్కో తెలుసా . రియల్లీ ఐ ఎన్ లీ యూ ...." అంది హాస్యంగా ఒక్కసారి.
    "ఎందుకు" అంది వసంత ఆశ్చర్యంగా.
    "పోవోయ్ తెలియనట్టు నటించకు.....నేను చూడ్డం లేదనుకోకు."
    "ఏం చూస్తున్నావు....." తడబడ్తూ అడిగింది వసంత.
    "నీ బుగ్గల్లో గులాబీలు..... బాస్ ని చూడగానే.....' చిలిపిగా అంది.
    "ఛీ...ఛీ.... ఏం మాట్లాడుతున్నావు...." సిగ్గుపడ్తూ అంది. ఫతిమా చనువుగా చెయ్యి నొక్కి "ఇంక నేనేమననులే, కారీ అన్, కారీ అన్....' అంది నవ్వుతూ.
    "నీకెందుకు జలసీ.....నీవు ట్రై చేసుకో.....' వసంత సిగ్గు పడటం, ఉడుక్కోవటం మానేసి తనూ అట పట్టిస్తూ అంది.
    "ట్రై చెద్దును. ముస్లిం అయిపోయాను. ఎంతయినా మీ హిందూవులు మమ్మల్ని వేరుగా చూస్తారు. మతం, జాతి అన్నీ వేరయిపోయాయి. అతను నన్ను లైక్ చేసినా పెళ్లాడడు....లేకపోతే గాలం వేద్దును" ఫతిమా హాస్యంగా అంది.
    ఆ ఉద్యోగంలో చేరాక వసంతకి యింట్లో కూర్చునప్పటి సజ్జు వదలి చాలా చలాకీగా , స్మార్టుగా వుంటుంది. నలుగురితో కల్సి మెల్సి తిరుగుతూ మాట్లాడుకుంటే పదిపదిహేను రోజుల్లోనే ఎన్నో నేర్చుకుంది. ప్రపంచిక విషయాలు. ఫతిమా నించి చీర అందంగా కుచ్చిళ్ళనీ బిగుతుగా ఓ పక్కకి ఎలా కట్టుకోవాలో, కనుబొమ్మలు ట్రిక్ చేసుకోడం, కనురెప్పలపై క్రీమ్ రాసుకుంటే ఎఫెక్ట్ ల్ లో ఎంత మార్పు వుంటుందో, ఏ షెడ్ లిప్ స్టిక్ ఎప్పుడు వేసుకోవాలో వగైరా మేకప్ టిప్స్ నేర్చుకుంది. తల్లి ప్రాణాలు తీసి అప్పుడప్పుడు కొనుక్కున్న లిప్ స్టిక్ లు, ఐబ్రో పెన్సిల్సు యిదివరకు వాడనవన్నీ ఒక్కొక్కటీ వాడుకలో పెట్టింది. అందం దేముడిచ్చిన వరం అయితే వున్న అందాన్ని యినుమడించుకుంటూ తీర్చి దిద్దుకోడమూ ఒక కళే అన్పించింది. యింట్లో అందరి చీరలు బతిమాలి రోజూకోటి కట్టుకు వెళ్ళేది. చక్కటి చీర కట్టుకుని, జుత్తు రబ్బర్ బ్యాండ్ తో కట్టుకుని మేకప్ చేసుకుని హాండ్ బ్యాగు బుజాన తగిలించుకుని వెళ్ళే వసంతని చూసి యింట్లో అంతా ఎంతలో ఎంత మార్పు వచ్చింది వసంతలో . ఎన్ని నేర్పించి అని ఆశ్చర్యంగా , వింతగా చూసేవాళ్ళు. మన వసంతేనుటే అని కాంతమ్మ పైకే ఆశ్చర్యపోయేది.
    "అవునమ్మా , దాన్ని చూస్తుంటే దాని కున్న ధైర్యం , తెగువలో పదోవంతన్నా నాకు వుంటే బాగుండుననిపిస్తుంది" కమల అంది.
    "అమ్మా.....చిన్నక్క మీ చేయి దాటిపోయింది. చూసుకో యీ యిల్లు బోర్ అంటుంది. మనం అందరూ డర్టీ అంటుంది. నీవు తెచ్చే గుమస్తా సంబంధాలు ఛీ....ఛీ.... అంటుంది. రాజుని చూసిన కళ్ళయిపోయాయి దానివి" మాలతి హాస్యంగా అన్నా ఆ మాటల్లో నిజం అందరికి తట్టింది. నిజమే బి.ఏ వెలగబెట్టి ఉద్యోగం చేస్తున్న పిల్ల మన చెప్పు చేతల్లో వుండదు. కమల కంటే ఏదో గుమాస్తాకి కట్టబెట్టారు. యిది అలాంటి సంబంధం యిదివరకే ఛా...ఛా... అనేది. యిప్పుడు చేసుకుంటుందా. చేసుకోకపోతే అంతకంటే గొప్పని తెచ్చే తాహతు తమకుందా? మంచో చెడో దాని భవిష్యత్తు దాని చేతుల్లో పెట్టి వూరుకోడం తప్ప తామేం చెయ్యగలరు. పోనీ ఏదో ఆ ఆఫీసులో పనిచేసే ఎవరినన్నా చేసుకున్నా బాగుండును. ఆవిడ ఆలోచన అది. కాంతమ్మ భయం వెంకట్రావుగారికీ వున్నా అయన ఆవిడలా బయట పడలేదు. అరువందలు తెచ్చే కూతురుని యిప్పట్లో దూరం చేసుకోవటం యిష్టం లేదు. తాను కాస్త కాలు చెయ్యి కూడదీసుకునే వరకన్నా వసంత పెళ్ళి మాట తలపెట్టడం కుదరదు. ఆ తరువాత దాని పెళ్ళి దానిష్టం వచ్చినవాడితో చేసుకుంటే మరీ మంచిది అనుకున్నారాయన.
    ఎవరి ఊహలు ఎలా ఉన్నా.....జరగవలసింది జరుగుతూనే వుంటుంది ఎవరి ప్రమేయం లేకుండా అవి అందరికి తెల్సినా ఆలోచించడం మానవ నైజం!
    
                                                *    *    *    *
    ప్రసాద్ పెళ్ళి లతతో వైభవంగా జరిగింది. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు లాగ అట్టహాసంగా , వైభవంగా జరిపించారు నారాయణమూర్తిగారు. ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లి చేసిన ఏర్పాటులే కన్పించాయి అందరికి. ధరించిన వజ్ర వైడూర్యాలు, ఆ చీని చీదాంబరాలు ఏవి కూడా పెళ్ళి కూతురిలో లోటు కప్పలేకపోయాయి. చేతులలో ఎత్తు కొచ్చి పీటల మీద కూర్చోపెట్టిన పెళ్ళి కూతురిని చూసి అంతా జాలి పడ్డారు. ఆమె మీద కంటే ప్రసాద్ మీద అంతా ఎక్కువ జాలి పడ్డారు. పాపం చక్కటి కుర్రాడు అని కొందరు, డబ్బు కోసం అని మరికొందరు అనుకున్నారు.
    నారాయణమూర్తిగారిచ్చిన లాంఛనాలు, వెయ్యి నూటపదహార్లు జన్మలో కట్టలేనంత విలువైన పట్టు చీరలు, వెండి పానకం బిందెలు, అడుగడుగున ఫలహారాలు, విందులు మర్యాదలు.... తాము ఊహించలేని, అనుభవించలేని ఆ వైభవాన్ని చూసి అంతా అవాక్కయి పోయినా, ఓ కంట నీరు, ఓ కంట సంతోషంలా ప్రసాద్ అదృష్టానికి ఒక పక్క సంతోషం , దురదృష్టానికి ఒక పక్క విచారంతో యింటిల్లిపాది ఏదో అయ్యారు. తెల్సిన అందరూ తాము డబ్బు కోసం కక్కుర్తిపడి కొడుక్కి అలాంటి సంబంధం చేశారని చెవులు కోరుక్కోడం విని మరింత బాధ పడింది కాంతమ్మ.
    "ఊరుకోమ్మా ...... అందరికి అసూయ మనకింత బాగా అన్నీ జరిగాయని..." ప్రసాద్ మందలించాడు కాంతమ్మ బాధపడ్తుంటే--
    అందరికంటే వసంత ప్రసాద్ అదృష్టానికి ఆనందించింది. ఆ డబ్బు వైభోగం, అదంతా ఎన్ని జన్మలెత్తినా ప్రసాద్ కి దొరికేదా కాళ్ళు లేని అవిటిదయితే వచ్చిన నష్టం ఏమిటి అని వాదించింది. దొరికిన పట్టుచీరలు చూసి సంతోషపడి పోయింది. ప్రసాద్ ధర్మమా అని యింక తమ బతుకులు బాగుపడతాయి. ఆరెండు గదుల కొంపలో, ప్రతిదానికి తడుముకుంటూ బతికే ఖర్మ తప్పుతుంది. అని సంతోషించింది. ఎవరికి వారే భవిష్యత్తుని అందంగా ఊహించుకుంటూ ప్రసాద్ కి ఏదో అన్యాయం జరిగిందన్న విషయం తేలిగ్గా మరచిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS