Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 11


    'లేదు బాబూ, నవ్వుతూ , తుళ్ళుతూ, గెంతుతూ, ఆరేళ్ళ అల్లారు ముద్దుగా పెరిగింది. ఆరేళ్ళకి మాయదారి జ్వరం , అదేం జ్వరమో మహమ్మారిలా వచ్చి నా కూతురి కాళ్ళు పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి యీ పదిహేనేళ్ళుగా అది, దాన్ని చూసి మేం ఏడుస్తున్నాం. లోకం మా యిల్లు, కార్లు, డబ్బు చూసి చాలా సుఖంగా వుంది అనుకుంటుంది. మా బతుకులో బాధ ఎవరికి తెలుస్తుంది ప్రసాద్. నీకు అంతా చెప్పాను.....నీకు ఉద్యోగం లేదు. మీ ఇంటి స్థితిగతులు అంతంత మాత్రం. ఈ లోకంలో యిప్పుడు ప్రతిదానికి రేటుంది. అలాగే నాకూతురి మెడలో పుస్తె కట్టడానికి రేటు పెట్టానని నీవు అనుకున్నా సరే, నేను నిన్ను నా కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్ ని చేస్తానని, యీ యిల్లు, యీ కార్లు, యీ ఐశ్వర్యం అంతా యిస్తానని ప్రలోభ పెట్టి నా అవిటి పిల్లకి మొగుణ్ణి సంపాదించాలని నీవనుకున్నా సరే, ఎలా అనుకున్నా ఫరవాలేదు. ఉన్న సంగతి చెప్పాను. నీకిష్టమైతే నాకు నాల్గు రోజులలో జవాబు చెప్పు. కాని ఒక్క మాట డబ్బు ఆశతో యీ పెళ్ళి చేసుకుని తరువాత నా కూతుర్ని నిర్లక్ష్యం చేసి, దాన్ని చిన్న చూపు చూసి, అవమాన పరచి  బాధ పరిస్తే మాత్రం నేను సహించను. దాని కోసం, దాన్ని బాధపెట్టిన వాళ్ళని నిలువునా హత్య చేయగలను అన్నది మరవద్దు. నిజాయితీగా, నిండు మనసుతో దాన్ని భార్యగా చూడగలననుకుంటేనే ముందుకు రా....లేదంటే యీ విషయం మర్చిపో" అంటూ అయన వాచీ చూసుకుని ప్రసాద్ తో చెయ్యి కలిపి "నేయింక ఓ మీతింగ్ కి వెళ్ళాలి....నీవు వెళ్ళి ఏ సంగతి చెప్పు" అంటూ ప్రసాద్ ని వదలమని డైవర్ కి చెప్పి అయన యింకో కారులో వెళ్ళిపోయాడు.
    జరిగినదంతా కలలా అన్పించి ప్రసాద్ ఎటూ తేల్చుకోలేక ఆలోచనలతో రోజంతా నలిగిపోయాడు. కళ్ళ ముందు కన్పించే ఆ ఐశ్వర్యం, ఆ భోగభాగ్యాలు అతన్ని ప్రలోభంలో పడేశాయి. కంపెనీ మేనేజింగ్ డైరక్టర్.... ఎయిర్ కండిషన్ ఆఫీసు రూము , నాల్గురకాల ఫోనులు, సెక్రటరీ, కారు ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా దర్జా.....వాటన్నింటి ముందు ఆ అమ్మాయిలో లోపం ముందు కొట్టచ్చినట్టు కనబడింది కాస్త క్రమంగా అణువంతయి పోయింది. డబ్బు లేని ఈ బతుకు కంటే ఆ బతుకు చాలా నయం అన్న నిర్ణయానికి వచ్చేశాడు.
    
                                               *    *    *    *
    "ఏమిటే ఆఫీసు కెళ్ళడనికి అంత ముస్తాబు. ఆ గంటల కొద్ది అద్దం ముందు కూర్చుని ఏమిటా షోకులు ?" కాంతమ్మ విసుక్కుంది.
    అసలే వసంత ఎప్పుడూ యింటిపని ముట్టదు. ఇదివరకయితే విసుక్కుంటూ కసురుకుంటూ ఏవో చిన్న చిన్న పనులున్నా చేసేది కాని ఉద్యోగంలో చేరిం దగ్గిరనించి యిటు పుల్ల తీసి అటు పెట్టడం మానేసింది. కమల పురిటాలు - పాపం మాలతి ఒక్కర్తే కాలేజీకి వెళ్తే లోపల కాస్త సాయం చేసేది. ముస్తాబెందుకో నీకేం తెలుసమ్మా..... వసంత నవ్వుకుంది.
    వసంత చెప్పలేని జవాబు మాలతి నవ్వుతూ చెప్పింది. "నీకేం తెలీదమ్మా.....రాజశేఖరం ఆఫీసులో బాస్ గా వుండగా ముస్తాబు లేకుండా ఎలా వేడ్తుండమ్మా?"
    "రాజశేఖరం ఎవరే?' కాంతమ్మ తెల్లబోతూ అంది.
    'అమ్మా, అందుకే నీకేం తెలీదు వూరుకో అన్నాను." మాలతి మరింత నవ్వింది.
    "ఏమిటో బాబూ మీ మాటలు, మీ అర్ధాలు నాకేం తెలుస్తాయి. ఆవిడ విసుక్కుని లోపలికెళ్ళి పోయింది. అక్క, చెల్లెళ్ళీద్దరూ నవ్వు కున్నారు.
    "చిన్నక్కా , కధ ఎంతవరకు వచ్చిందే. కళ్ళు కలిపాడా రాజశేఖరం, ఠీవిగా , మృదువుగా చిరునవ్వులు చిందించాడా! కాఫీకి పిలిచాడా.... ప్లీజ్ చెప్పవే సరదాగా . ఒకసారి మీ అఫీసుకొస్తానే చూపించవే. ఆ అజానుబాహుడ్ని , అరవింద దళాయతాక్షుడిని....." అంటూ మాలతి అట పట్టించింది.
    మాలతి అలా హాస్యం ఆడడం సరదాగా వున్న పైకి కోపం నటించి, "నోరుముయ్యి! వెధవ హాస్యాలు నీవూ. రాజశేఖరం రాజశేఖరం....ఎవడు వాడు?"
    "అబ్బ, పాపం తెలియదు. మూడు వందల సార్లు చదివుంటావు ఆ పుస్తకం...."
    "పిచ్చి మాటలు మానేయ్. యితనేం తెలుగువాడు కాడు.... మార్వాడి.'
    "ప్రేమకి భాషాబేధాలు లేవండి అక్కయ్యగారూ?" మాలతి హాస్యంగా అంది.
    వసంత కోపంగా లేచి వెళ్ళిపోయింది. మాలతి పైకి అంది తను అదంతా లోలోపల అనుకుంటూ ఊహిస్తుంది అంతే తేడా.
    మొదటిరోజు తప్ప యీ వారం పదిరోజులుగా రోజూ కొడుకే ఆఫీసుకి వస్తున్నాడు. రతన్ లాల్ మొదటిరోజు ఆఫీసుకి వచ్చి సీటులో కూర్చునేసరికి వసంతకి కాళ్ళు వణికాయి. తండ్రి వచ్చినప్పుడు అయన దగ్గిర ఫ్రీగా మసలగల్గింది కానీ రతన్ లాల్ ని చూడగానే ఏదో బిడియం, సిగ్గు కల్గాయి.
    "మిస్ వసంతా! ఐహోప్ యు లైక్ ది జాబ్..... ఎలా వుంది పని.... అలావాటు అయిందా" రాగానే అడిగాడు.
    వసంత ఆ మాటకి పొంగిపోయింది. "ఎస్ సార్. ఐ లైక్ దిస్ అట్ మాస్ఫియర్ వెరీ మచ్. ఎవిర్ బడీ యీజ్ ఫ్రెండ్లీ లీ విత్ మీ...." అతి ప్రయత్నం మీద అంది. అతను తన మొహం వంక సూటిగా చూసి మాట్లాడుతుంటే వసంత సిగ్గుపడి తలదించుకుంది. అతి తెల్లని ఆ మొహంలో నల్లటి ఆ సైడ్ బరన్స్ సునిశితంగా చురుకుగా కదిలే ఆ కళ్ళు.....ఎంత స్మార్టుగా వున్నాడు. ఆ కళ్ళు అతను ఆఫీసు కాగితాలు చూస్తున్నా, ఫోనులో మాట్లాడుతున్నా తనని వెంటాడుతూ, తన ప్రతి చార్య సునిశితంగా గమనిస్తున్నట్టే అన్పించసాగింది. టైపు చేస్తుంటే ఏకాగ్రతకుదరక యిబ్బంది పడసాగింది వసంత. షార్ట్ హాండ్ తీసుకుంటుంటే అతను మరీ అంత సూటిగా తనవంక చూస్తూ చెప్తుంటే ఎలా రాసుకోడం అన్పించేది. అతను ఆఫీసులోకి రాగానే వసంత లేచి గుడ్ మార్నింగ్ చెప్పే లోపలే "గుడ్ మార్నింగ్ మిస్ వసంత" అనేవాడు. తన కింద పనిచేసే అతి మామూలు స్టెనో కి అంత ప్రాముఖ్యత యిస్తూ అతనంత మర్యాదగా మాట్లాడుతుంటే అది తనకి చూపిస్తున్న ప్రత్యేకత అనుకుని పొంగిపోయింది. అతనెంత మంచి బట్టలు వేస్తాడు. అతని తెల్లటి తెలుపుకి ఏ రంగు వేసినా అందంగా వుండేవాడు. ముఖ్యంగా చాకలేట్ కలర్ ప్యాంటు, లేత గులాబి రంగు షర్టులో ... అబ్బ ఏం పర్సనాలిటి అన్పించేది. తన అదృష్టం కొద్ది ఈ ఆఫీసులో పని దొరికింది. లేకపోతే ఏ ముసలి , చెమట కంపు అఫీసరో దొరికితే చచ్చేది. అబ్బ కొందరు ఆఫీసరు హోదాలో వున్న చెమట కంపు టెర్లిన్ బట్టలు, చిరిగిపోయిన అకుచెప్పులు.....ఛా....చూస్తె గుమాస్తాల కంటే నికృష్టంగా వుంటారు. మాలతి అన్నట్టు తనకు మంచిరోజులు వచ్చాయి కనకే ఆ రాజశేఖరంని మించిన బాస్ దొరికాడు . దేముడు దయ తలిస్తే......
    "మిస్ వసంతా, "రావ్ అండ్ బ్రదర్స్ '.... డ్రాప్ట్ పంపామంటున్నారు అందిందా ....' ఫోనులో మాట్లాడుతున్న రతన్ లాల్ మౌత్ పీస్ మూసి వసంతని అడిగాడు. పరధ్యానంగా వున్న వసంత అతను రెండు సార్లు పిలిస్తే గాని పలకలేదు.
    "మిస్" రతన్ లాల్ కాస్త అసహనంగా పిల్చాడు.
    ఆలోచనల్లోంచి తేరుకున్న వసంత ఉలిక్కిపడి "ఎస్సార్" అంది. ఆమె పరధ్యానాన్ని , ఆ ఎర్రపడిన మొహాన్ని వింతగా చూస్తూ మళ్ళీ చెప్పాడు.
    "ఎస్ సర్, యివాళ ఉదయం పోస్టులో అందింది" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS