Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 13


    ప్రసాద్ అయితే ముందే అలోచించి నిర్ణయించుకున్నాడెమో అతనికేం బాధ అనిపించలేదు. ఆ ఐశ్వర్యం అతన్ని అన్నింటిని మరిపింపచేసింది. అన్నీ వున్నాయి , అమ్మాయి మనసు మంచిదయితే చాలు కాళ్ళు లేని లోటు పెద్ద లోటు కాదు అని నమ్మించుకున్నాడు తనని తాను.
    కాని.....అతని అంచనాలు తప్పని.....లత అవిటితనం శరీరానికే కాదు, మనసుకి కూడా వుందని మొదటిరాత్రే అనుమానం వచ్చింది అతనికి ఆ అమ్మాయి మనసు , ఆలోచనలు వక్రంగా వున్నాయన్పించింది మొదటి రాత్రే.
    భూతల స్వర్గం అంటే యిలాగే వుంటుందా అంపించేటంతలా అలంకరించిన ఆ గదిలోకి అడుగు పెట్టాడు ప్రసాద్. మొదటి రోజు చూసినట్టే మంచానికి అనుకుని కూర్చుంది లత. మార్పల్లా పెళ్ళికూతురి వేషంలో, పూలదండల మధ్య, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాల వాసనల మధ్య అలంకరించి కూర్చో పెట్టిన లతని చూసి ప్రసాద్ కి ఆమెలో లోటు కూడా గుర్తు రాలేదు. గదిలోకి వెళ్ళగానే ప్రసాద్ కి ఏం చెయ్యాలో తెలియక తడబడ్డాడు. లతని మొదటిరోజు తరువాత మళ్ళీ పెల్లిలోనే చూశాడు. ఆమెతో అసలు మాట్లాడలేదు అప్పటివరకు. అతను అంగీకారం తెల్పగానే పదిహేను రోజుల్లోనే పెళ్ళి ఏర్పాట్లు చేశారు. నారాయణమూర్తి గారు. దాంతో యిద్దరి మధ్య పరిచయం, చనువు లేదు. అతను గదిలోకి రాగానే లత ఏమాత్రం సిగ్గుపడకుండా సూటిగా అతని వంకే చూసింది. ఆ చూపుల్లో మొదటిరాత్రి పెళ్ళికూతురు కుండాల్సిన సిగ్గు బిడియం లేకుండా ఓ విధమైన దర్పం కనపడింది. ప్రసాద్ ఆ చూపుకి తడబడి తర్వాత ప్రయత్న పూర్వకంగా నవ్వాడు....' ఏమిటలా చూస్తున్నావు అంత తీక్షణంగా ...." అంటూ మంచం మీద కూర్చున్నాడు.
    "మిమ్మల్నే....' అంది లత అతని వంక నిశితంగా చూస్తూ.
    "ఏం నేనో వింత మృగంలా వున్ననేమిటి?" చనువుగా నవ్వాడు.
    "ఊహు.....యింత నవమోహనా కారుడు.....యీ కుంటి దాన్నెందుకు పెళ్ళాడాడా అని ఆలోచిస్తున్నాను. జవాబు మొహంలో దొరుకుతుందేమోనని" వ్యంగ్యంగా అంది. ఆమె నోట తన రూపం ప్రశంశ కి అతని మొహం విప్పారింది ఒక్క క్షణం. కాని వెంటనే ఆమె పెదాల మీద కనపడిన వ్యంగ్యపు చిరు నవ్వు  చూడగానే ఆమె నిజంగా అంటుందో, తనని ఎత్తి పొడవడానికి అందో అర్ధం కాక జవాబుకి తడుముకున్నాడు.
    "నిజం చెప్పండి, మీరు నన్నెలా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు?" ముద్దాయిని నిలబెట్టి అడిగిన తీరులో అడిగింది.
    ఎందుకు చేసుకున్నానేమిటి చేసుకోవాలనిపించింది చేసుకున్నాను. నీకు నాకు రాసిపెట్టి వుంది జారిగింది . ఎందుకు , ఏమిటి అనేవాటికి కొన్నింటికి జవాబులుండవు . ఇంతకీ పెళ్ళయ్యాక యీ ప్రశ్న ఎందుకు..' ఆమె అడిగిన తీరుకి నొచ్చుకున్నా అది కడపడనీయకుండా ప్రసన్నంగానే అన్నాడు.
    "మాట దాటేయకండి....నాకు తెలుసు మీరు నన్నెందుకు చేసుకున్నారో, నిజం చెప్పండి నా డబ్బు చూసి చేసుకోలేదూ మీరు..... డబ్బు కోసం నన్ను చేసుకునేందుకు అంగీకరించారు మీరు. అవునా, నాకు తెలుసు నిజం చెప్పండి" ఆమె అంత ఖచ్చితంగా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు అడిగేసరికి ప్రసాద్ మొహం అభిమానంతో ఎర్రబడింది. మొదటి రాత్రి భార్య మాట్లాడే, అడిగే ప్రశ్నలా యివి అతని అభిమానం దెబ్బ తింది.
    "నిజం తెలిస్తే నన్నెందుకు మళ్ళీ అడుగుతున్నావు" అసహనంగా అన్నాడు.
    లత మొహం ఎర్రబడింది. "అంటే నా డబ్బు మీద తప్ప నామీద మీకేం లేదన్నమాటేనా , నా ఐశ్వర్యం అనుభవించడం కోసం నన్ను చేసుకున్నారు . చెప్పండి జవాబు చెప్పండి" ఆవేశంగా అంది.
    "లతా, ఏమిటీ మాటలు, ఎందుకిలా మాట్లాడుతున్నావు. మొదటి రాత్రి మాట్లాడుకోడాని కింకేం లేవా..... ' విసుగ్గా అన్నాడు. "నిన్ను ఎందుకు చేసుకున్నాననేది యిప్పుడు అప్రస్తుతం. నిన్ను చేసుకున్నాను. నిండు మనసుతో నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాను. నీవు నా భార్యవి యిప్పుడు నీలో వున్న లోపం నాకు కనపడడం లేదు. కనపడినా, నీవు నా దానివి కనుక నీకు సానుభూతి చూపి...."
    "మీ సానుభూతులు నాకేం అక్కరలేదు" మధ్యలోనే ఉక్రోషంగా అడ్డింది.
    "పోనీ సానుభూతి కాకపోతే, ధైర్యం చెప్పి , నీలోటు నీకు కనపడకుండా నేనున్నానని చెప్పడం నావిధి. నా ధర్మం లతా.....మనుష్యులని బాధించేది మనసులు. ఆ బంధం గట్టిపడితే ఒకరిలో లోపాలు ఒకరికి కనపడవు. లతా, ఒకరినొకరు అర్ధం చేసుకోవాలంటే సహృదయంతో...."
    "ఆహాహా ఏం డైలాగులు ....సహృదయులు....యిదే నేనో లేనింటి పిల్లనయితే సహృదయంతో ఆలోచించే చేసుకునేవారా" హేళనగా నవ్వింది.
    ఆమె ఎత్తి పొడుపులని, ఆ హేళనని భరించలేక పోయాడు ప్రసాద్. నిజానికంతకీ క్షణం పూర్వం వరకు లత పట్ల సానుభూతి. దయ వున్నాయి అతనికి. అన్నీ వుండి అనుభవించ నోచుకోని ఆ అమ్మాయి మీద నిజంగా జాలి కల్గింది. ఎందుకు చేసుకున్నా తన స్వార్ధం ఆలోచించుకున్నా వీలయినంత వరకు ఆమెకి కష్టం కల్గించకుండా బాగా చూసుకోవాలి , ఆమె కేదో లోటుందన్న కాంప్లెక్సు పెరగకుండా తను ప్రవర్తించాలని అనుకున్నాడు. కాని యిప్పుడు ఆమె ధోరణి చూస్తుంటే, తీరి కూర్చుని కయ్యానికి కాలుదువ్వుతూ , నిరసనగా హేళనగా ఎత్తి పొడిచే ఆ వ్యంగ్యోక్తులకి అతని మనసు నొచ్చుకుంది.
    "లతా , యీ లోకంలో అందరూ స్వార్ధం చూసుకునే ఏ పనన్నా చేస్తారు. అంత నిస్వార్ధ త్యాగాలు చేసేటంత మహనీయత నాలో లేదు. నేను మామూలు మనిషిని. నిజమే, నేను లేనివాణ్ణి కనుక మీ నాన్నగారు ఎరచూపిన ఐశ్వర్యానికి లొంగిపోయాను. అయన, కూతురికి పెళ్ళి కావాలన్న స్వార్ధంతో నన్ను వాడుకోలేదా? అలాగే నీ డబ్బుకి నేనాశపడి పెళ్ళాడడం తప్పా ఈ లోకం అంతా స్వార్ధమయం . స్వార్ధం లేని మనిషి వుంటే మనిషి కాడు అంటాం. ఏం, యింకా నీకేమన్నా సందేహం వుందా. లతా, ఒక్కమాట నీవు నమ్మినా నమ్మకపోయినా చెపుతున్నాను. పెళ్ళి డబ్బుకి ఆశపడి చేసుకున్నా నిన్ను నా చాతనయినంతగా సుఖ పెట్టాలనే అనుకున్నాను. నీకేదో లోటుందని నీవు మరిచిపోయి నన్ను మరిచిపోనీ ప్లీజ్ యింతకంటే నేనేం చెప్పలేను" ప్రసాద్ విరక్తిగా అన్నాడు.
    అతని మాటల్లో నిజాయితీకి ఆవేశానికి కొద్దిగా జంకింది లత. అంత సూటిగా అవునని వప్పుకున్న అతన్ని యింకేమనాలో, అడగాలో తెలియక మొహం ముడుచుకుని వూరుకుంది లత.
    ప్రసాద్ కూడా కొన్ని నిమిషాలు మనసు కూడ దీసుకుంటున్నట్టుగా మౌనంగా వుండిపోయాడు. లత వైఖరిలో తన అంచనాలు తప్పయా యన్న అసంతృప్తి అతనిలో చోటు చేసుకుంది. తను ఆమెని పెళ్ళాడి నందుకు, ఆమెలో లోటని తెలిసి కూడా పెళ్ళాడటానికి ముందుకు వచ్చినందుకు తనని అభిమానిస్తుందని, గౌరవిస్తుందని , ఆ కృతజ్ఞత ఆమెలో వుండి తనని ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుందని అక్షరాలా అనుకోకపోయినా అతని అంతరాంతరాలలో మెదిలిన ఆలోచనకి పూర్తిగా వ్యతిరేకంగా , అందులో మొదటి రాత్రి , మొదటి సంభాషణ అంతా జరగడంతో లత మొహం మీద స్పష్టంగా కన్పించిన దర్పం, హేళన, నిరసన, ఏదో కాంప్లెక్సు చూడగానే అతని ఉత్సాహం , మొదటి రాత్రి అనుభవం కోసం ఎదురుచూసిన ఆ ఆరాటం అన్నింటి మీద నీళ్ళు చల్లినట్లయింది. లత యింకేమన్నా మాట్లాడుకుందేమోనని ఎదురు చూశాడు. కాని ఆమె ప్రసాద్ అక్కడ లేనట్టుగా చదువుతూ పక్కన పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకు చదవసాగింది. ఆమె నిర్లక్ష్య వైఖరికి ప్రసాద్ చిన్నపుచ్చుకున్నాడు. ఏమిటీ ఆమె ధోరణి, లతకీ పెళ్ళి యిష్టం లేదా? తండ్రి బలవంతం వల్ల చేసుకుందా! తను బీదవాడని చిన్నచూపా, ఆమెకి పెళ్ళి, భర్తా.... మొదటి రాత్రి యిలాంటి అనుభూతులు ఏమి లేనట్టు అంత నిర్వికారంగా ఎలా వుంది? యీపాటిడానికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు అతనికి ఆమె ధోరణి ఏమి అంతుబట్టలేదు. ఆమె నిర్లక్ష్యం చూసేసరికి , అతని ఉత్సాహం దిగజారి , ఆగదిలోంచి వెళ్ళి పోవాలన్ననంత విరక్తి వచ్చింది. ఒక్క క్షణం అలోచించి ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు. జీవితాంతం గడపవలసిన భార్యతో మొదటి రాత్రి నించి మనస్పర్ధలయితే ఆ కాపురం ఏం సాగుతుంది. తెలిసో, తెలియకో చిన్నప్పటి నుంచి వైభవంగా పెరిగిన కారణమో, ఏదో ఇన్ ఫిరియారిటీ కంప్లేక్సో అయి వుండి అలా అని వుంటుంది. తనూ అపార్ధం చేసుకుని అలిగితే ఎలా అని మనసుని సమాధాన పరచుకుని ప్రయత్నం మీద మొహం మీదికి నవ్వు పులుముకుని చనువుగా చేతిలోంచి పుస్తకం లాగేసి "చదువుకోడానికిదా సమయం. యిది మన మొదటిరాత్రి అని మరిచిపోయావా ' అంటూ నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS