Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 11

 

    మానికొండ రామాయణం (తెలుగు వాల్మీకం)

    ఈ రామాయణం మానికొండ సత్యనారాయణశాస్త్రి గారు రచించారు. వీరు తమ గ్రంధానికి "తెలుగు వాల్మీక" మని పేరు పెట్టారు. పట్కందలు పూర్తి చేసి ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని చరణాలపై సమర్పించారు. శాస్త్రి గారి రచన చాలా సరసంగా సహజంగా సరళంగా సాగింది. సుప్రసిద్దాలైన వాల్మీకి రామాయణ శ్లోకాలకు వీరి అనువాదం చిత్తగించండి-

        సరస కవితా మహీరుహశాఖ నెక్కి
        "రామారామా" యటంచు నిరంతరము'
        మధుర మధురాక్షరంబుల మధురఫణితి
        కూయు వాల్మీకి కోకిలకును "నమోస్తు".
    
        వేదవేద్యుండు పురుషుడవ్విభుండు పరుడు
        దశరధాత్మాజుడగుచు నిద్దర జనింప
        వేద ముడయించే వాల్మీకి ఋషి ముఖమున
        నవని సాక్షాత్తు రామాయణాఖ్య మగుచు.

        ఓ నిషాద! ప్రతిష్ట నీ వొందవోయి!'    
        శాశ్వతంబైన వత్సర సముదయంబు;
        వధ మొనర్చితి వీ క్రోంచమిధునమందు
        కామమోహిత మేకమ్ము నే మనందు.

    "ప్రతిష్ట నీ వొందవోయి!" అన్నప్పుడు "నీవు ప్రతిష్ట పొందవు లేవోయి" అనీ, "నీవు ప్రతిష్ట పొందవలసిన దొయీ" అనీ రెండు అర్ధాలు. "ఓ నిషాద" అన్నప్పుడు "మా నిషాద" అన్నప్పటిలాగే రెండు అర్దాలూ వస్తాయి. 'ఓ' అనగా 'లక్ష్మీ' అని అర్ధం ఉందట. ఈ విధంగా సంస్మృత శ్లోకంలో ఉన్న శ్లేషను ఎంతో సున్నితంగా తెలుగులో పలికించారు. శాస్త్రిగారు. తెలుగు వాల్మీకం యధావాల్మీకంగా ఉండాలని వీరు అనుష్టుప్పులకు అనుగుచుట్టలైన తేటగీతుల్లో అటవేలదుల్లో కలం నడిపారు. వీరు కావాలనే అక్కడక్కడ ఛందోనియమాలు ఉల్లంఘించారు. వీరి రచన సరళ సుందరమై చావులూరుతూ ఉంటుంది.

    యోగానందాంధ్ర రామాయణం
    
    ఇందులో 1100ల గద్య పద్యాలున్నాయి. చిల్లరిగె యోగానందయ్య పంతులుగారు దీనిని రచించారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించిన వీరి రామాయణం పండిత పామర రంజకమై పరిడవిల్లుతున్నది. అహల్య ఘట్టంలో మాత్రం వీరు ఇంద్రుణ్ణి కోడిపుంజుచేసి "కొక్కొరోకో" అని కూయించారు -

        చొరబడి, యెక్కి కుటీరము,
        వెరవున నెఱకలు విదిల్చి, వేగిన దని "కొ
        క్కొరోకోకో" యని యఱవగ
        సరిదాప్లా వార్ధము ముని చయ్యన జనియెన్.

    జగన్నాధ రామాయణం
    
    తంగిరాల జగన్నాధశాస్త్రిగారు దీన్ని రచించారు. పార్వతికి శివుడు రామచరిత్ర చెబుతాడు. సుకన్యా వృత్తాంతం, అరుంధతి సీతను శపించటం మొదలైన విశేషాలు కూడా ఉన్నాయి. వీరిది ప్రసన్న మధురమైన శైలి, మచ్చున కోక పద్యం. గుహుడు శ్రీరామునితో అంటాడు గంగదాటిస్తూ -

        ఏనును నీవు నొక్కటియే వృత్తిగలారము రామ! నేను గం
        గానది దాటజేయుడు;  నఖండ భవాబ్ది దరియింప జేయగా
        బూనితి వీవు; నావికులు మూల్యము నొక్కరియెద్ద నొక్కరుం
        దూనుట లేదు! ధర్మ మదియున్ మఱికాదు! నిజంబు నమ్ముమా!'
    గ్రంధమంతా మృదుపద విన్యాసంతో హృదయంగమంగా నడిచింది.

    దాశరధీ విలాసం

    క్రొత్తపల్లి అచ్చయ్య కవి రచించారు. 19 శతాబ్దం వాడు. ఇందులో 7 అశ్వాసాలు ఉన్నాయి. సుమనోజ్జమైన ఈ కృతి తిరుపతి వెంకటేశ్వరస్వామికి అంకితం.

    రామోదయం
        
    చిన్నయసూరి కాలం వాడని భావింపబడుతున్న రంగయకవి "రామోదయ" మనే రామాయణం రచించాడు. ఒడుదుడుకులు లేని సహజ సుందరమైన రచన, అక్కడక్కడ శ్రీరాముని భగవత్తత్త్వం నిరూపితమౌతూ ఉంటుంది. శివ ధనుర్భంగ సందర్భంలో శ్రీరామచంద్రునితో విశ్వామిత్రుడు అనే పద్యమిది -
    
        అదివరాహంబై యి
        మ్మేదిని నొక కొఱ నిల్పి మెఱసిన నీ కీ
        పేద యగు ధనువు నెత్తగ
        రాడే! యెక్కిడగదయ్య! రాజీవాక్షా!

    ఆధ్యాత్మరామాయణం, రంగనాధరామాయణం , భాస్కరరామాయణం, మొదలైన వానిలోని కొన్ని విశేషగాధలు ఇందులో చోటు చేసుకున్నాయి.

        "సంగ్రహము గాక మిగుల విస్తరము గాక
        పుడమి పండిత పామర బోధకముగ
        పద్యఫణితిని శ్రీరామభద్రు కధను
        ఎఱుగ బల్కుము మా పేర నింపు మీఱ,"
    అని రంగనాధస్వామి స్వప్నంలో అదేశింపగా రంగయ్యకవి ఈ రామోదయం రచించాడు.

    శ్రీమద్రామాయణ కల్పవృకం

    "కవి సమ్రాట్" విశ్వనాధ సత్యనారాయణ గారి అమరకృతి యిది -
    "వ్రాసిన రామచంద్రకధ వ్రాసితివం చనిపించికో వృధా
    యాసము గాక కట్టుకధ లైహికమా! పరమా!' అన్న తండ్రి గారి అనుశాసనమూ తనలోని ఉత్కంఠా రెండూ సమైక్యం కాగా విశ్వేశ్వరాంకితంగా దిద్దుకొన్న విశ్వనాధవారి రచన ఇది.

    "నా మార్గంబును గాదు వీని దరయన్ నాతాత ముత్తాతల
    దే మార్గంబును గాదు" అని కవితా గురువులు చెళ్ళపిళ్ళవా రన్నట్లు ఒక వినూత్నమైన విలక్షణమైన విచిత్రమార్గం విశ్వనాధ వారిది. సన్నివేశ కల్పనంలో పాత్ర పోషణంలో రసోన్మీలనంలో సత్యనారాయణగారిది విశిష్టదృక్పదం. ఇంతకుముందే వీరి రామాయాణాన్ని గూర్చి మిత్రులు ప్రసగించే ఉన్నారు కనుక వారి ప్రతిభకు "జయపతాకలైన ' ఒకటి రెండు పద్యాలు మనవి చేస్తాను -"
        తోరము కట్టిన కత్తిని
        గోరడమున మంత్రసాని కోసెను బోడ్డున్
        నీరజము కాడ జిదిమిన
        నేరిమిని గలుక్కుమనే మనీషన్ విధియున్.

    పసిరాముని బొడ్డుకూ బ్రహ్మదేవునికీ ఉన్న బందుత్వాన్ని పసికట్టిన "బ్రాహ్మీమయమూర్తి" విశ్వనాధ.
    మరొక్క చక్కని సన్నివేశం. సంధ్యాకాలం పక్షులు సంచరించే సమయం. అప్పుడు -

        'వెలికి గొనిరాకుడీ బిడ్డ బిట్టలాడు
        సంజవేళల' నంచు గౌసల్య పలుక
        గరుడి వైకుంఠమున భయకంపితుండు
        మదమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనును.
    పాపం, ముడుచుకోక ఏం చేస్తాడు మరి! అవి అంత పెద్ద ఱెక్కలాయే. పొరపాటుగా ఆ నీడ తన స్వామి మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా?

        మొలచెడు చివుళ్ళ కందూతి సెలవుల జన
        నురుసు, శ్రీరామచంద్రుండునొక్కినంత
        కందిగింజయ్యె గొసల క్ష్మాతలెంద్రు
        సుత 'జగన్నాధ' మౌ స్తనచూచుకంబు.
    ఈ జగన్నాధ దర్శనం విశ్వనాధ ప్రతిభాచక్షుస్సుకు నిదర్శనం.

        రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతు
        లొత్తి చూచును పూరుషు లెత్తికొనిన;
        లక్షణుడు ముక్కులును, జేవుల్ తడిమి చూచు
        నెవ్వరే సంగనలు దన్ను నెత్తికొనిన.
    ఈ మనస్తత్వ పరిజ్ఞాన ప్రజ్ఞావిశేషమే మహాకవిని చేసింది విశ్వనాధ వారిని. అత్రి ఆశ్రమంలో విమానం బయలుదేరుతూ ఉంది. అంతలో 'మునిపత్ని అనసూయదేవి నడలి వచ్చి శ్రమ పడుచు మెట్లెక్కి రెండు ఫలంబులు సీత చేతిలో నిడి దిగిపోవుచుండ సీత యా ఫలంబులు రాముని చేతి కిచ్చి ఆమెను మెట్లు దించి' వచ్చిందట. 'కవిః క్రాంతదర్శీ" చాలు! విశ్వనాధవారు ఉత్తరకాండం వ్రాయకపోయినా వ్రాసినట్లే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS