"బాబూ!" సుశీలమ్మ నిలువెల్లా కంపించిపోయింది.
శరత్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. తల్లి ముఖంలోకి చూసే ధైర్యం లేదు.
"ఏమిట్రా నువ్వన్నది? 'కన్నా' అని పిలవొద్దా? ఆ మాటంటే నీకు 'కర్ణా' అని పిలిచినట్టు వుంటుందా చెప్పరా! ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ నాన్న ఏం చెప్పారు?"
సుశీలమ్మ భోరున ఏడవసాగింది.
శరత్ గాభరాగా లేచి కూర్చున్నాడు.
"ఎందుకమ్మా ఏడుస్తావు?"
"నాకేదో భయంగా వుందిరా! మీ నాన్న ఏం చెప్పారు."
"ఆయన నాకేం చెప్పలేదమ్మా."
"ఆయన నాకేం చెప్పలేదమ్మా."
"మరి అంతమాట ఎందుకన్నావురా?"
"కర్ణుడు కృతఘ్నుడు కాడమ్మా! మంచివాడు, కనక పోయినా, గుండెల్లో దాచుకొని పెంచిన రాధకు ద్రోహం చెయ్యలేదు!"
సుశీలమ్మ వెర్రిదానిలా చూసింది.
"తనను ఎప్పుడూ రాధేయుడుగానే చెప్పుకున్నాడు. రాజభోగాలు చూపించినా, ద్రౌపదిని భార్యగా పొందవచ్చుననే ఆశపెట్టినా కర్ణుడు లొంగలేదు." ఆవేశంగా అన్నాడు శరత్.
సుశీలమ్మ పిచ్చిదానిలా చూస్తూ కూర్చుండిపోయింది.
"కర్ణుడు ఒకరకంగా అదృష్టవంతుడు, చావబోయే ముందయినా తానెవరో తెలుసుకున్నాడు. కన్నతల్లిని కళ్ళారా చూడగలిగాడు."
"బాబూ!" అంటూ విరుచుకుపడి పోయింది సుశీలమ్మ.
శరత్ గాభరా పడిపోయాడు.
తల్లిని మంచంమీద పడుకోబెట్టాడు.
ముఖం మీద చల్లని నీళ్ళు చల్లి తుడిచాడు.
విసురుతూ తల దగ్గర కూర్చున్నాడు.
ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఆమెను బాధపెట్టినందుకు పశ్చాత్తాప పడసాగాడు.
ఛ! తనేం చేసాడు. కనకపోయినా కంటికి రెప్పలా పెంచిన తల్లిని బాధపెట్టాడు.
సుశీలమ్మ కదిలింది.
"అమ్మా! అమ్మా!"
సుశీలమ్మ కళ్ళు తెరిచింది.
"ఎలా వుందమ్మా!" తల్లి ముఖం మీదకు వంగి జాలిగా పలకరించాడు.
సుశీలమ్మ కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది.
తన నుంచి ఎవరో లాక్కువెళ్తారన్నట్టు శరత్ ను గట్టిగా పట్టుకుంది -
"ఎలా వుందమ్మా"
"బాబూ నన్ను వదిలి వెళ్ళిపోతావా?" నీ అమ్మను వదిలేసి వెళ్ళిపోతావా? ఆ కంఠం సుశీలమ్మ కంఠంకాదు. ఆ ఆవేదన సుశీలమ్మ ఆవేదన కాదు.
అది ఒక తల్లి కంఠం. ఆ ఆవేదన యుగయుగాలుగా తల్లి గుండెల్ని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన ఆవేదన.
"అమ్మా! నన్ను క్షమించమ్మా!"
"నన్ను వదలి వెళ్ళిపోతావా?"
"నిన్ను వదలి నేనెక్కడికి వెళ్తానమ్మా."
"మళ్ళీ అలా మాట్లాడవు కదూ?"
శరత్ తలవూపాడు?
"ఎలా వుందమ్మా? కాఫీ తాగుతావా?"
"బాగానే వుంది. భోజనం చేద్దువుగాని లే." అంటూ సుశీలమ్మ లేచి కూర్చుంది.
శరత్ లేచి బట్టలు మార్చుకున్నాడు.
సుశీలమ్మ కొడుకుకు వడ్డించింది.
"నువ్వు కూడా తినమ్మా!"
"ముందు నువ్వు తిను."
"ఉహూఁ! నువ్వు కూడా నాతో తినాలి" మారాం చేస్తున్నట్టు అన్నాడు.
సుశీలమ్మ కొడుకు ముఖంలోకి ఆప్యాయంగా చూసింది.
శరత్ తల్లిచేత కొసరి కొసరి తినిపించాడు.
తన భయం తనది. వాడు ఏదో మాట్లాడితే తను అనవసరంగా భయపడింది. అంతేనా? ఆఁ.... అంతే!
సుశీలమ్మ అన్నం తింటూ బాధపడుతున్న మనసును సరిపెట్టుకోవడానికి ప్రయత్నించసాగింది.
అయినా ఆమెకు ఏదో దిగులుగానే వుంది.
నిద్రొస్తుంది కాసేపు పడుకుంటానమ్మా" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శరత్.
కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు.
ఆలోచనలు పందెపు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.
అమ్మను ఎలా అడగటం? అమ్మ నుంచి రహస్యం రాబట్టటం అంత తేలికయిన పనికాదు. తను కన్నతల్లిని చూడటానికే వెళ్తానంటే ఈమె భరిస్తుందా? ఎలా? ఎలా? ఈమెను బాధపెట్టక తప్పదా?
శరత్ కు తన చిన్ననాటి సంఘటనలు గుర్తుకు రాసాగాయి.... అప్పుడు శరత్ కు పన్నెండేళ్ళు. తమ్ముడికి ఏడేళ్ళు. ఒకరోజు కూర్చుని హోం వర్కు చేస్తున్నాడు. లెక్కల మాష్టారంటే శరత్ కు చచ్చేంత భయం. లెక్కలు ముందు పెట్టుకొని కూర్చున్నాడు.
భరత్ వచ్చి కూర్చుని అన్న దగ్గర వున్నకొత్త పెన్సిల్ కావాలన్నాడు.
శరత్ ఇవ్వనన్నాడు. భరత్, శరత్ చేతిలో పెన్సిల్ లాక్కున్నాడు.
