Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 11


    "నీ మొహం.... నువ్వు అలమేలు మంగవైతే, బావగారు వేంకటేశ్వరస్వామివారా?" అంటూ ఫక్కున నవ్వింది సీత.
    "అలా నవ్వకు. మహా పాపం. స్వామివారికి కోపమొస్తుంది" అంది వెంగమాంబ.
    "చాల్లే. ఈ పిచ్చి నీకింకా వదల్లేదు." అంది సీత.
    "పిచ్చి కాదు. ఇది నిజమే" అంది వెంగమాంబ శూన్యంలోకి చూస్తూ.
    సీతకు ఏదో అనుమానమొచ్చి "బావగారు నిన్ను బాగా చూస్తారుటే?!" అని అడిగింది.
    "బావగారెవరు?"
    "అదే నీ మొగుడే....."
    "ఛీ..... అతను నామొగుడా? గట్టిగా అనకు దేవుడు వింటాడు." అంది వెంగమాంబ.
    వెంగమాంబ మాటలు సీతకు అర్థం కాలేదు.
    ఆమెకు  కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. చివరకు "వస్తానే" అంటూ వెంగమాంబకు చెప్పి బయలుదేరి వెళ్ళింది.
    వెంగమాంబ విషయాన్ని తలచుకుంటే కృష్ణయ్య దంపతులకు నిద్రపట్టడం లేదు. పరిపరి విధాల ఆలోచించారు. వైద్యులను సంప్రదించారు. కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు. గ్రహశాంతులు చేయించారు. వెంగమాంబ దృష్టిని, భర్తవైపుకు మరల్చడానికి వారు చేయని ప్రయత్నమంటూ లేదు.
    ఇవేమీ పట్టని వెంగమాంబ ఇంటి పనుల్లో శ్రద్ధ చూపించసాగింది. ఆ పని ఈ పని అంటూ తోడుగా నిలుస్తున్న వెంగమాంబని చూసిన ఆ తల్లి దండ్రులకు ధైర్యంగానే ఉన్నప్పటికీ, ఎక్కడో కించిత్తు అధైర్యం.
    పిల్లకి వయసొచ్చింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నిషేకం (శోభనం) జరిపించడానికి నిశ్చయించారు. వెంగమాంబ సౌందర్యం రోజు రోజుకీ ఇనుమడిస్తోంది. సంసార జీవితంలోని మధురిమ తెలిస్తే తప్ప, ఆమె  భర్తని వదలకుండా కాపురం చేస్తుందని భావించారు. అలా అనుకున్నదే తడవుగా ఒక మంచిరోజు చూసి నిషేక ముహూర్తాన్ని పురోహితులను అడిగి నిశ్చయించారు.
    ఊరు నుంచి వెంకటాచలపతి, అతని తల్లి దండ్రులతో పాటు దగ్గరి బంధువులు వచ్చారు. వెంకటాచలపతి యవ్వనోత్సాహంతో, తన శోభనపు రాత్రి కోసం ఎదురుచూస్తున్నాడు. యవ్వనవతి, రూపవతి అయిన తన భార్య పొందుకోసం తహతహలాడుతున్నాడు.
    వెంగమాంబను చక్కగా అలంకరించి, గదిలోకి పంపారు ముత్తైదువులు. తమ కూతురు భర్తతో సలక్షణంగా కాపురం చేయాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు కృష్ణయ్య దంపతులు.
    శోభనం గదిలోకి అడుగుపెట్టిన వెంగమాంబ ముఖంలో ఎలాంటి భావాలు లేవు. ఆమె నిశ్చలంగా ఉంది. కొత్త పెళ్ళి కూతురులో సహజంగా ఉండే సిగ్గు, బిడియం ఆమెలో మచ్చుకైనా కనిపించలేదు. ఉత్సాహంతో, ఆపుకోలేని వెంకటాచలపతి "వెంకూ" అంటూ ఆమెను దగ్గరకు తీసుకో బోయాడు. అంతే, ఆమెలో విపరీతమైన సంచలనం. పులిని చూసి బెదిరిపోయే మేకపిల్లలా గజగజా వణికిపోసాదింగి. అతను మరింత దగ్గరగా జరిగాడు. తన బిగి కౌగిలిలో ఆమెను అదిమిపట్టుకున్నాడు. ఒక్క ఉదుటున వెంగమాంబ అతడిని పక్కకు నెట్టేసింది. ఆమె చర్యతో వెంకటాచలపతి ముఖం వెలవెలాపోయింది.
    "వెంకూ.... నాపై కోపమా?!" అంటూ లాలనగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు.
    అతనిలో ఆతృత. "నీ మనసులో ఏముందో చెప్పు. నీకు నేను నచ్చలేదా?" అన్నాడు అర్థింపుగా. వెంకమ్మ పెద్దగా ఏడుస్తూ, గది తలుపులు తోసుకుంటూ బయటకు పరుగులు తీసింది. అతను నిశ్చేష్టుడై చూస్తూండి పోయాడు.
    మధ్యగదిలో కూర్చున్న కృష్ణయ్య దంపతులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. "తల్లీ! ఏమైంది? ఏమిటి?" అని ఆతృతగా అడిగింది మంగమాంబ. కృష్ణయ్యకు, వియ్యంకులకు అసలు విషయం తెలిసిపోతుందే మోనన్న భయం పట్టుకుంది. వెంగమాంబ తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. ఇంతలో గదిలోపలికొచ్చిన అల్లునితో కృష్ణయ్య నెమ్మదిగా, "బాబూ! ఏదో చిన్నతనం. తల్లి సముదాయిస్తోంది. నువ్వేమీ అనుకోవద్దు....." అంటూ అల్లుని చేయి పట్టుకుని బ్రతిమాలసాగాడు. "ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వ వద్దు బాబూ. వాళ్ళమ్మ అన్నీ సర్ది చెబుతుంది. ఇవి చేతులు కావు. కాళ్ళనుకో" అని చెబుతున్న కృష్ణయ్యను చూసి జాలేసింది వెంకటాచలపతికి.
    వెంకటాచలపతి మంచి గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాడు. అంతకంటే గొప్ప సంస్కారవంతుడు. ఆ రాత్రి జరిగిన సంఘటనను మూడవ మనిషికి, చివరకు తన తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వలేదు.
    ఇదిలా ఉండగా, మంగమాంబ తన కూతురుకి ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించసాగింది. "ఎందుకే పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఈ భావం?" అంటూ ప్రశ్నించిన తల్లికి "అది వేరు.... ఇది వేరు" అంటూ జవాబిచ్చింది వెంగమాంబ.
    "ఏమిటి ఆ వేరు? భర్తతో చక్కగా సంసారం చేసి ఏడాది తిరిగేలోపు ఓ  పండంటి బిడ్డడినిస్తే, మాతో పాటు మీ అత్తమామలు కూడ సంతోషిస్తారు కదా! నా మాట వినవే" అంటూ మంగమాంబ కూతురుని రకరకాలుగా బ్రతిమాలింది.
    రెండవరోజు సర్వాలంకార భూషితురాలైన వెంగమాంబను శోభనం గదిలోకి పంపి, తలుపులు బిగించారు ముత్తైదువులు. వెంగమాంబ సౌందర్యం వెంకటాచలపతి మనసును గిలిగింతలు పెడుతోంది. నల్లని కేశాల నిగనిగలతో, సరిసమమైన నిగనిగలతో ఎర్రని పెదవులు అనురాగ రంజితాలుగా భాసిస్తున్నాయి. జడలోని మల్లెపూల పరిమళం గదంతా వ్యాపించింది. ఎదురుగానున్న నిలువుటద్దంలో వెంగమాంబ ప్రతిరూపం మెరిసిపోతుంది.
    తల వంచుకుని నిల్చున్న భార్యను కోర్కెతో చూస్తూ ఆమెను సమీపించాడు వెంకటాచలపతి. వెంగమాంబ నిలువెల్లా వణికిపోతుంది. వెంకటాచలపతి ఆమె భుజంపై చేతులేసి తన వైపుకి తిప్పుకున్నాడు. అంతే వెంగమాంబ నాగులా బుసకొడుతూ వెంకటాచలపతిని ఒక్క తోపుతోసింది. అతడు తూలుతూ మంచం కోడుకి కొట్టుకున్నాడు. నుదుటిపై బొప్పి కట్టింది. అతనికి నోట మాట మాట రాలేదు. రెప్పలార్చకుండా ఆమెవైపే చూస్తూండిపోయాడు.
    "నువ్వు నా భర్తవి కావు. నా భర్త, నా ప్రభువు ఆ ఏడుకొండలవాడే ఆయనతో నా పెళ్ళెప్పుడో జరిగిపోయింది. నువ్వెవరివి? నువ్వు నా భర్తవా? థూ..... ఇక మీద నన్ను పొందగోరావంటే నీ తల వేయి ముక్కలవుతుంది. పో..... పోవయ్యా భర్తట.... భర్త" వెంగమాంబ పిచ్చి పట్టినట్లుగా అరుస్తోంది. ఆవేశంతో ఆమె శరీరం వణికి పోతుంది. దేవుడికి దణ్ణం పెడుతుంది. నేలపై పడి పొర్లుతోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అంతా చూస్తున్న వెంకటాచలపతికి తల తిరిగిపోతున్నట్లుంది.
    "అయ్యో! ఈమె భక్తురాలా? పిచ్చిదా? అయినా నాకు ఈ ఖర్మేమిటి?" అనుకుంటూ బాధపడిన వెంకటాచలపతి శోభనం గది తలుపులు తీసుకుని బయటకు వచ్చేశాడు. అయినా అతని మనసులో ఎడతెగని ఆలోచనలు "ఎంత మోసం జరిగిపోయింది! వీళ్ళు పిల్ల మంచిదంటూ నమ్మించి, ఎంత పచ్చి మోసం చేశారో గదా! బుదిమంతురాలని, పని మంతురాలని నమ్మించి గొంతు కోశారు. ఖచ్చితంగా ఈమె పిచ్చిదే. అయ్యో! ఇకపై నా గతేమిటి అందరి ముందు ఎలా తలెత్తుకు తిరిగేది?" అనుకుంటూ దుఃఖించాడు వెంకటాచలపతి.
    జరిగిన తతంగాన్ని గమనించిన వెంకటాచలపతి  తల్లి గుండెలు బాదుకుంటూ, "దేవుడా! ఈ దిక్కుమాలిన సంబంధం ఎక్కడ్నుంచి వచ్చిందో? బంగారం లాంటి నా కొడుక్కి ఈ పిచ్చి పిల్లని కట్టరయ్యే! వాడి బతుకు ఈ పిచ్చిదానితో బండలు కావలసిందేనా? నా తండ్రీ, నీకెంతటి కష్టం వచ్చి పడిందిరా? ఈ దరిద్రం మనకే ఎందుకు పట్టుకుందిరా. నాయనా! తండ్రీ!!" అంటూ గొల్లుమని ఏడవడం మొదలెట్టింది.
    ఈ గొడవకీ, తనకీ ఎంత మాత్రం సంబంధం లేనట్లు వెంగమాంబ, గుడికెళ్ళి పాటలు పాడుతూ కూర్చుంది. శోభనం జరగలేదన్న సంగతి ఆ నోటా, ఈ నోటా పాకి, ఊరంతా వ్యాపించింది. కృష్ణయ్య కూతురు పిచ్చిది, పిచ్చిదని తెలిసి కూడా పెళ్ళి చేయడం వాళ్ళ తప్పే అని ఒకరు, చాల్లే ఊరుకో. అది మదపిచ్చి. డానికి మందు దాంపత్యమే అని మరొకరూ, పాపం, ఆ పిల్లాడి బతుకు నాశనమపోయింది, ఈ పిచ్చిదాని వల్ల అని ఒకరు అనుకొంటుండగా, "ఏమో! భగవంతుని లీలలను ఏమని చెప్పగలం? నిజంగానే ఆ పిల్లని భగవంతుడు వరించాడేమో! ఆనాడు గోదాదేవిని శ్రీరంగనాయకుడు పెళ్ళాడలేదూ! మనకి తెలియనంత మాత్రాన ఏమీ అనకూడదు. ఆ పిల్లకి భగవానుడి అనుగ్రహం దొరికిందేమో!" అంటూ ఓ వృద్దురాలు గొణిగింది.
    మొత్తంమీద ఊరంతా ఇదే విషయాన్ని గురించి చర్చించుకోసాగింది. కొందరు ఆమెను పిచ్చిది అంటుండగా, మరికొందరు ఆమెను మహాభక్తురాలని కొనియాడుతున్నారు. ఆమెలో ఏదో ఒక భగవచ్ఛక్తి ఉందని కొందరు అంటున్నారు. ఆమె నిజంగా అలమేలు మంగమ్మేమో! ఆ భక్తురాలీని  కన్నతల్లి ఎంత పుణ్యం చేసిందో కదా! మనం తెలియక పిచ్చి అంటున్నాంకానీ, అసలైన భక్తి అంటే అదే! మరి  ఆనాడు, గోపికలు ఇల్లు వదలి  కృష్ణుని కోసం యమునా నదీతీరానికి వెళ్ళితే, వాళ్ళందరినీ కృష్ణ భక్తురాళ్ళని మనం  అనలేదా? ఆ  కాలంలో ప్రహ్లాదుడు తండ్రిని విష్ణుభక్తుడని కొనియాడలేదా మనం? ఆనాడు మీరాబాయి కష్టపడుతుంటే, తోడునీడగా ఉండి, పిండి విసిరి పెట్టినవాడు భగవంతుడని నమ్మలేదా? మీరాబాయి, సక్కుబాయి భక్తురాండ్రని పొగడలేదా మనం? కాకపొతే, మన కిష్ణయ్య కూతురు మన కళ్ళముందే పుట్టి పెరిగినందువల్ల, ఈ రోజు వెంకటేశ్వరస్వామి భక్తురాలైందంటే, వెంటెనే నమ్మలేకపోతున్నాం. ఏమో బాబూ! నాకు  దాని చూపులు, మాటలు, దాని నవ్వు, దాని పాటలను చూస్తుంటే, అది మామూలు పిల్ల కాదనే అనిపిస్తోంది. ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో ఊరంతా వెంగమాంబను గురించే మాట్లాడుకుంటోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS