ఆకసాన హరివిల్లు విరిస్తే....
"ఊ.... వెళ్లు"
"వెళ్ళనండి...."
"అంటే?"
"మీరు అన్నం తినేవరకూ ఇక్కడే నిలబడమన్నారండి. ఈ సీసాలో నీళ్ళు గ్లాసులో నన్నే పొయ్యమన్నారండి- ఆపిలు పండుకోసి పళ్ళెంలో పెట్టమన్నారండి- మరేమో-" రంగయ్య మూడు గిన్నెల కారియర్ పక్కనపెట్టి, బుట్టలో వస్తువులు బయటకు తీస్తూ చెప్తున్నాడు.
"చాల్లే ఆపు. సీసాలో నీళ్ళు నేను గ్లాసులో పోసుకోలేనా? పో. నే పిలిచేవరకూ రాకు. అమ్మకి చెప్పావో చూసుకో- వెళ్ళు" కసిరాడు రవి. రంగయ్య కదిలాడు. గేటు దగ్గర బీడీ కాలుస్తూ కూచున్నాడు. నిజానికి యిదే బావుంది 'యాపిల్ కొరుక్కు తినలేవా?' నవ్వాడు విజయ్. రవి మాటాడలేదు.
అవును ఎందుకు కొరుక్కుతినలేడూ- తనని తిననిస్తేగా. అసలు మూడు గిన్నెల కారియర్ ఏమిటి- బోర్- హాయిగా చిన్న టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే గబగబా తినేసి ఆడుకోవచ్చు. పనిమనిషి ఓ గిన్నె ఇందులోది పారేస్తే ఎంత బావుంటుంది. ఛ, ఏమిటో- ఆ కారియర్ లోది ఏదీ తినాలనిపించలేదు ఆ రోజు రవికి- కాస్తకాస్త తిని నెమ్మదిగా దూరంగా ఉన్న చెత్తబుట్టలో పోసేశాడు.
లంచ్ టైము అయేసరికి మూడు గిన్నెల కారియర్ సద్ది, బుట్టలో సీసాతో నీళ్ళు, ఓమూల ఏదో ఒక పండు, ఒక్కోసారి ఏదన్నా స్వీటు, లేకపోతే కాడ్ బరీ చాక్లెట్సు, ఇలా బుట్ట నిండుగా పంపడం రాధారాణికి అలవాటు. అవన్నీ తినేలా చూడ్డానికి రంగయ్య పక్కన నుంచోవాలి.
ఈమధ్య రవి ఒక ఉపాయం కనిపెట్టాడు, రంగయ్యని దగ్గర నుంచోకుండా పొమ్మనడం.
విజయ్ టిఫిన్ బాక్సు, రవి కారియర్ మూతలు తీసి ఎవరికిష్టమైనవి వాళ్ళు తినడం మొదలుపెట్టారు. ఇద్దరికీ ఎక్కువై మిగిలినవి చెత్తబుట్టలో గుమ్మరించి ఒట్టి కారియర్ రంగయ్య చేతికియ్యడం అలవాటయి పోయింది రవికి.
గేటు దగ్గర కూచుని బీడీ కాలుస్తున్నా, అమ్మగారి పురమాయింపు గుర్తుంది రంగయ్యకి!
కారియర్ ఓ మూలపెట్టి "ఇయ్యాల చినబాబుగోరు పెరుగన్నం తిననని పేచీ పెట్టారండి- నేను బతిమాలి తినిపించానండి" అంటాడు అమ్మగారికేసి చూస్తూ.
"మంచిపని చేశావు" మెచ్చుకుంటుంది రాధారాణి.
మరోరోజు "చినబాబుగోరు ఆపిలు ముక్కలు కొయ్యద్దు అంటారండి...."
"వాడికేమి వస్తుంది పండు కొయ్యటం- వేలు కోసుకుంటే!"
"అదేనండి.... ఇనరండి- పైగా ఆ బాబుగోరి దోస్తండి- ఆపిలు కొయ్యకూడదటండి- కొరుక్కుతినాలట."
"ఇంతకీ తిన్నాడా- ఆ దోస్తుకి పెట్టేశాడా?"
"అమ్మా ! నేను లేనటండి- అంతా మన బాబే తినేలా, ఆ దోస్తు తినకుండా ఆడ నిలబడ్డానండీ...." ఇలా రంగయ్య చెప్తుంటే రాధారాణికి ఆనందంగానే వుంది. కాని మధ్యలో రంగయ్య "ఆ మూడు గిన్నెల్లో అన్నం బాబే తినేశారండి" అన్నాడు.
"ఊరుకో, అస్తమానం- మూడు గిన్నెలు, మూడు గిన్నెలు అనకు- కారియర్ అను చాలు" విసుక్కుంది రంగయ్యపై రాధారాణి.
ఈ రంగయ్య దగ్గర నిలబడి తినేట్టు చేస్తున్నాడు కనక పిల్లాడు ఒక్కరవ్వ బాగున్నాడు- నిజానికి ఈ రంగయ్య మధ్య దారిలో కారియర్ తెరిచి తింటేనో! అనే అనుమానం మొదట్లో రాధారాణికి కలగకపోలేదు. ఊఁ ఏదో ఒకటి- రంగయ్య మంచివాడే, పిల్లలవాడు అని సద్దుకుంది మనసులో.
షాపింగ్ పూర్తి చేసుకుని స్కూలు ముందు ఆగింది రాధారాణి ఆరోజు. లోపల కాంపౌండులో పిల్లలు కొందరు సందడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకొందరు ఆడుకుంటున్నారు. కొందరు పిల్లలు గుంపులు గుంపులుగా కూచుని లంచ్ తింటున్నారు. చెట్టుకింద కూచుని నవ్వుతున్న రవి, ఎదురుగా మరో అబ్బాయి కనిపించారు రాధారాణికి. అక్కడే అలాగే నిలబడిపోయింది. గిన్నెలో పాయసం పక్కవాడి టిఫిన్ బాక్స్ లో కొంతపోసి, కొంత ఆ గిన్నెతోనే తాగుతున్నాడు రవి. రాధారాణి పంపిన చిన్నగ్లాసు బుట్టలోనే వుంది. "రవీ, ఏమిటా తాగడం" గొంతు పైకిలేవబోయింది. వెంటనే నోటికి చెయ్యడ్డం పెట్టుకుంది.
కారియర్ లో మిగిలిన అన్నం, కూర, మిగిలిన పాయసం అన్నీ కలిపి ఓ గిన్నెలోపోసి చెత్తబుట్టలో దిమ్మరించి వచ్చాడు రవి. రాధారాణి ఒళ్ళు మండిపోతోంది. ఇద్దరూ నీళ్ళపంపు దగ్గరకెళ్ళి నీళ్ళు తాగారు. రవి బూట్లు తడిసిపోయాయి. "తను ఫ్రిజ్ లో నీళ్ళు పంపినవి ఏమయ్యాయి" రాధారాణి కోపంగా చూస్తోంది. బుట్టలోంచి కాడ్ బరీ తీసాడు రవి. సగం తుంచి పక్కవాడి చేతిలో పెట్టాడు. ఇంతలో మరో కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చి పల్లీలు రవి చేతినిండా పోశాడు. కాడ్ బరీ ముక్క ఆ పిల్లాడి నోట్లో పెట్టాడు రవి. రాధారాణి కళ్ళు నిప్పులు కురిశాయి. రంగయ్య ఏమయినట్టు? రంగయ్య చెట్టుకింద కునికి పాట్లు పడుతున్నాడు. ఇంక అక్కడ క్షణం నిలవబుద్ధి పుట్టలేదు రాధారాణికి. మరు నిముషంలో కారు స్టార్టయింది. ఛా, వీణ్ణి స్కూలయినా మాన్పించాలి, లేకపోతే ఈ స్నేహాలయినా మాన్పించాలి. పంపు దగ్గర నీళ్ళు తాగటం, పల్లీలు తినటం, తను పంపే ఖరీదయిన పదార్థాలన్నీ అందరికీ పంచి పెట్టడం! పిల్లాడిని ఎంత ప్రత్యేకంగా పెంచాలనుకుందో వాడంత యిదిగా తయారవుతున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చింది రాధారాణి.
ఉన్నట్టుండి రాధారాణికి ఓ మంచి ఆలోచన వచ్చింది. ఫస్టురాంక్ అబ్బాయితో వీడికి స్నేహం చేయించాలి- చదువన్నా వస్తుంది. ఎన్నెన్ని ట్యూషన్లు పెట్టించింది? అయితే మాత్రం, ఇరవై రాంక్ కి తక్కువ ఎప్పుడూ రాడే? చూద్దాం- రాధారాణి పరిపరివిధాల ఆలోచించింది. ఆ సాయంత్రం భర్తతో ఈ విషయం మాట్లాడింది.
"స్కూలుకి వెళ్ళే పిల్లాడు పల్లీలూ తినక, గోళీలు ఆడక ఏం చేస్తాడూ? అసలు నువ్వెందుకెళ్లావ్" రాధారాణి భర్త ఒక్క నిముషంలో ఆ విషయం తేల్చేసి పేపరు తిరగేయటం మొదలు పెట్టాడు.
* * *
ఆ పెద్ద హాలు, సోఫాలు, గోడల పెయింటింగ్స్ చూసి విస్తుపోయాడు విజయ్. ఇలాటివి కొనమని డాడీకి రాయాలి అనుకున్నాడు మనసులో! 'కూచో' రవి సోఫా చూపించాడు. "మమ్మీ, మా ఫ్రండు వచ్చాడు" గదిలోకి పరిగెత్తాడు రవి. హాల్లోకి వొచ్చి చూసి "వీడా" అంది వెంటనే. తెల్లని యూనిఫాం, పాలిష్ తో ధగధగలాడే బూట్లు, పాలు వెన్నతో నిగనిగలాడే బుగ్గలు - విజయ్ మహముద్దుగా ఉన్నాడు. కానీ ఆనాడు వీడి గిన్నెలో పాయసం తాగిందీ, బహుశా రోజూ వీడి యాపిల్ తింటున్నదీ, కేడ్ బరీ తింటున్నది వీడేనా - ఏ బీద పిల్లాడో రవిని కబుర్లతో మోసంచేసి, బెల్లించి తను పంపించేవన్నీ తినేస్తున్నాడనుకుంటోంది- కానీ ఏమిటో....రాధారాణి లోపలకొచ్చి ఇద్దరికీ బిస్కట్లు, కాఫీ పంపింది.
రాధారాణి వచ్చి సోఫాలో కూచుంది. విజయ్ ని చూస్తోంది - తను పంపే ఖరీదయిన తిండి వీడే తిని ఇలా నిగనిగలాడుతున్నాడన్నమాట!
ఫోన్ మోగింది- రవి లోపల కెళ్లాడు- అంతలోనే వచ్చి "వీడు ఎప్పుడూ ఫస్టురాంక్ వస్తాడు మమ్మీ !"
"నేను కిందటేడు కూడా ఎప్పుడూ ఫస్టురాంక్ లోనే వచ్చానండి!" రాధారాణి ఏమీ పట్టించుకోలేదు.
"అవునబ్బాయ్, మీ బళ్లో ఎవరి లంచ్ బాక్సులు వారు తెచ్చుకోరా?"
"తెచ్చుకుంటామండీ" వెంటనే విన్నాడు.
"మరి మావాడి కారియర్ లోవి ఎవరికో ఒకళ్ళకి పెట్టేస్తుంటాడుట కదా" రాధారాణి మాట పూర్తికాలేదు.
"నేను వీడికేం పెట్టడం లేదు, నేనే తింటున్నాను" అన్నాడు వెంటనే రవి. రాధారాణి నవ్వింది. విజయ్ ముఖం ముడుచుకున్నాడు. ఈ మాటలు మహా చిరాగ్గా అనిపించాయి రవికి. లోపలికెళ్ళిపోయాడు. ఎన్నెన్నో ప్రశ్నలు వేసింది రాధారాణి విజయ్ ని.
విజయ్ నడుస్తున్నాడు. ఫ్రిజ్ లోంచి యాపిల్ తీసి చొక్కాకింద దాచుకొని గబగబా వీధిలోనికి నడిచాడు రవి. 'ఇది తీసుకో' రవి బలవంతంచేసి విజయ్ సంచిలో పడేశాడు. విజయ్ వెళ్ళిపోయాడు.
ఆ రోజు విజయ్ ఇంటికి తను వెళ్ళినపుడు విజయ్ నానమ్మ తనకి యాపిల్ జూస్ యియ్యలేదూ. ఎంతోసేపు నేను, విజయ్ కారమ్స్ ఆడుకోలేదూ? మరి ఈ రోజు విజయ్ వస్తే వాడికి యాపిల్ ఇయ్యటానికి తనెందుకంత భయపడుతున్నాడు! కొంచెంసేపు క్రికెట్ ఆడుకుందామని కూడా అనుకున్నాడు. కానీ అమ్మకి కోపం వస్తుంది, స్కూలు నుంచి రాగానే ఆడుకుంటే. తను వాళ్ళింట్లో ఎన్ని గదులు తిరిగి కబుర్లు చెప్పి వచ్చాడు. ఈ రోజు విజయ్ ని ముందుగది నుంచే పంపించేశాడే! అమ్మకి ఇలాటివి ఏమీ ఇష్టం వుండవు. స్నేహితులు ఎవరూ ఇంటికి రాకూడదు. ఎవరిళ్లకీ తను వెళ్ళకూడదు. అందుకేగా అమ్మతో అబద్ధం చెప్పి ప్రయివేటు క్లాసుందని తను విజయ్ ఇంటికి వెళ్ళింది! రవికి తల్లి మీద చాలా కోపమొచ్చింది.
రవి ఇంట్లో అడుగు పెట్టగానే అడిగింది రాధారాణి-
"రవీ-మీ ఫ్రెండు నాన్న ఏంచేస్తాడు?"
"ఏమో!"
"వాళ్ళ అమ్మ?"
"ఆ....ఇంజనీరు,"
"ఏమిటీ- ఇంజనీరా" నవ్వింది రాధారాణి.
"ఏమో నాకు తెలియదు."
"నాకు చెప్పాడులే.
రవి బొమ్మల పుస్తకంలోంచి తలెత్తలేదు. వాడికి తల్లి మాటలేవీ పట్టలేదు మనసుకి, 'స్టేట్సులో ఉంటున్నారట వాళ్ళనాన్న' ఇంకా దొంగ కబుర్లు. మొగుడొదిలేసి ఉంటాడు. తల్లీ కొడుకూ మేనమామ దగ్గరపడి ఉన్నారంటే," రాధారాణి తనంత తాను అనుకుంటూ సోఫాలోంచి లేచింది. ఆరోజు పాయసం తాగిన విజయ్ రూపం మాత్రమే ఆమె కళ్ళకి కనిపిస్తూ క్షణక్షణం వాడిమీద దురభిప్రాయాన్ని పెంచింది.
స్కూలుకి సెలవలిచ్చేశారు. రెండురోజుల తర్వాత రవి పుట్టింరోజు. ముందే చెప్పింది "వాడింటికెళ్ళి వాణ్ణి పిలుచుకు రానక్కర్లేదు" అని రాధారాణి. చుట్టాలతో, స్నేహితులతో పుట్టినరోజు బాగా గడిచినా విజయ్ ని పిలిస్తే బావుండేదని చాలాసార్లు అనుకున్నాడు రవి మనసులో.
రాత్రి భోజనాలు చేస్తూ, కబుర్లు చెప్పుకుంటుంటే గుర్తొచ్చింది ఇందిర రాలేనని ఫోన్ చేసిన విషయం! "ఇందిర రాత్రి ట్రైన్ లో ఊరెడుతోంది - రాలేనని ఫోన్ చేసింది" రాధారాణి భర్తకేసి చూసింది.
"నన్నేంచేయమంటావ్?"
"మిమ్మల్నేమీ చెయ్యమనను. ఈ స్వీట్సు అవి దానికి రంగయ్య చేత పంపించాలని" రాధారాణి అంటూనే లోపలికెళ్ళింది. రంగయ్యని కేకేసి ఇందిరింటికి పంపింది.
* * *
సెలవల్లో మద్రాసు వెళ్ళి వచ్చాడు రవి. ఇన్ని రోజుల తర్వాత స్కూలుకి వెళ్ళాలంటే భలే సరదాగా వుంది. ఇంచుమించు నెలా పదిహేను రోజులు దాటి పోయింది. ఆరోజే స్కూలు తెరిచారు.
"ఒరేయ్ రవీ కారియర్ ఏదిరా. ఆరోజు స్కూలు నించి తెచ్చానా అసలు" వంటింట్లోంచి కేక పెట్టింది తల్లి.
"ఆ" రవి, పుస్తకాలు సర్దుతూ.
"గుర్తు తెచ్చుకో."
"ఆ రోజు రంగయ్య జ్వర మొచ్చి రాలేదు. నేనే తీసుకెళ్ళాను, తీసుకొచ్చాను." రాధారాణికి నమ్మకం కుదరలేదు వీడు స్కూల్లో మరిచిపోయి వుంటాడు. లేకపోతే-
"ఒకవేళ వాడేమన్నా"
"ఎవడమ్మా"
"నీ ఫ్రెండురా"
"ఛీ వాడికెందుకు. అయినా వాడికి చిన్న టిఫిన్ బాక్సు ఉందిగా. వాడు చాలా మంచి వాడమ్మా."
"మంచివాడే. ఆ రోజే అనుకున్నాను వాడి నాన్న స్టేట్సులో ఉన్నాడన్నప్పుడే. ఇలాటివాళ్లు చాలామంది ఉంటారులే, నీకేం తెలుసు" రాధారాణి విజయ్ ని దొంగగా నిరూపిస్తుంటే రవికి ఎక్కడలేని కోపం వచ్చింది.
* * *
స్కూళ్ళ ఆయాలతో, టీచర్లతో మాట్లాడి రాధారాణి తిన్నగా పిల్లలున్న చోటికి వచ్చింది. పిల్లలంతా చుట్టూ మూగారు. విజయ్ గట్టిగా మాట్లాడుతున్నాడు. కొందరు పిల్లలు రవి కేసి చూస్తూ గుసగుసలు చెప్పుకుంటుంటే రవికి చాలా సిగ్గనిపించింది. ఆ నిముషంలో అమ్మంటే అసహ్యం కలిగింది. రాధారాణి కారు స్టార్టు చేసి వెళ్ళిపోయింది. హమ్మయ్య అనుకున్నాడు రవి.
క్లాసులో విజయ్ తనని చూడనట్టే ఊరుకున్నాడు. అమ్మ చెప్పింది నిజమేనేమో అనిపించింది ఆ క్షణం రవి చిన్న మనసుకి.
"నిజంగా నేను తీయలేదురా" అని చెప్పడేం మరి? అమ్మ మాటలు రవి మనసులో ప్రతిధ్వనించాయి. ఆరోజు ఐదు రూపాయలు పుస్తకంలోంచి కిందపడి పోయాయి. ఎక్కడో పడిపోయా యనుకున్నాడు, అవి విజయ్ కాజేశాడేమో!! మామయ్య తెచ్చిన ఫారిన్ పెన్ అమ్మవద్దంటున్నా స్కూలుకి తెచ్చాడు. ఆరోజే అది పోయింది. ఇదీ విజయ్....రవి పుస్తకం మూసేసి విజయ్ ముఖంలోకి చూశాడు. విజయ్ పుస్తకంలోకి దీక్షగా చూస్తున్నాడు. రోజూ వీడికి నా భోజనం, నా కాడ్ బరీలు- ఎన్నెన్ని పెట్టాను. ఎక్కడో దాగివున్న అహం ఒకసారి తలెత్తింది ఓనిముషం పసిమనసులో!
రోజూ మామూలుగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూచుని లంచ్ తింటున్నా ఏదో నిశ్శబ్దం ఇద్దరి మధ్య.... నిర్మలమైన ఇద్దరి మనసుల్లోనూ కలత చెలరేగుతోంది....అద్దంలాంటి ఇద్దరి మనసులూ మసక చెందుతున్నాయి. "వీడి కారియర్ నాకో లెక్కా! మా నాన్నకి ఒక ఉత్తరం రాస్తే ఇలాటి కారియర్లు వందలు కొనగల డబ్బు పంపగలడు. ఈ ఏడాది గడిస్తే నేను, మమ్మీ అక్కడి కెళ్ళిపోతాము హాయిగా" అనుకున్నాడు విజయ్.
"వాడి పిచ్చి. టిఫిన్ బాక్సు బాగాలేదని నాది కొట్టేసుంటాడు. మళ్ళా నేను చూస్తానేమోనని, అమ్మ చెప్పినట్టుగా అమ్మేసివుంటాడు. వీడి అమ్మ ఇంజనీరు, వీడి నాన్న స్టేట్సులో ఉండటం, వీడు ఓ ఏడాదిలో ఫారిన్ వెళ్ళిపోడం, అన్నీ అన్నీ అబద్ధాలే అయి వుంటాయి" అనుకున్నాడు రవి.
పక్క పక్కనే కూచుంటున్నారు క్లాసులో. పక్కపక్కనే కూచుని లంచ్ తింటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి.
* * *
ఆ రాత్రి భోజనాలు చేస్తున్నారు రవి, తల్లి, తండ్రి. లేడీస్ క్లబ్బు విశేషాలు చెప్తోంది రాధారాణి ఉత్సాహంగా. కాలింగ్ బెల్ మోగడంతో రంగయ్య తలుపు తెరిచాడు.
"హాయ్ - ఎప్పుడు రావటం" రాధారాణి కుర్చీ చూపించింది.
"నిన్ననే వచ్చా.... చూసారా - మీరు పంపిన స్వీట్సు తినేశాం.... మీ వస్తువు పంపించటం మరిచిపోయాం. వెంటనే మీకు పంపేయమన్నాను. అమ్మ ఆ విషయమే మర్చిపోయింది. ఒక్కోసారి తమాషాగా మర్చిపోతాం కదూ" ఇందిర గలగలా మాట్లాడుతూ బుట్టలోంచి తీసి పైన పెట్టింది.
రాధారాణి గుండె ఆగినంత పనైంది.
అన్నం కలపడం ఆపేసి మూర్తి భార్యకేసి చూశాడు.
రెప్ప వాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయాడు రవి.
ధగధగా మెరుస్తున్న మూడు గిన్నెల కారియర్!
"అదేమిటర్రా అంత విస్తు పోతున్నారు- అది మీదే- ఆరోజు నాకు స్వీట్సు పంపలేదూ" ఇందిర మాటలేవీ వినిపించటం లేదు రాధారాణికి. ఏదో చెప్పాలని నోరు తెరిచి, తల్లి కళ్ళని చూసి వెంటనే నోరు మూసేసుకున్నాడు రవి.
* * *
ఆరోజు ఎంతో ఉత్సాహంగా వుంది రవికి. స్కూలుకి రోజుకన్నా చాలా ముందు వచ్చేసాడు. స్కూల్లోకి అడుగు పెడుతున్న విజయ్ కి ఎదురెళ్ళాడు.
"ఒరేయ్, మా కారియర్ దొరికింది - మా ఇందిర అత్తయ్య...." ఏదో ఉత్సాహంగా రవి చెప్తుంటే, వినిపించుకోకుండా ముందుకి నడిచాడు విజయ్.
పక్కన కూచుని "ఆ రోజు మా అమ్మ నిన్ను" చెప్పబోయాడు రవి. "సరేలే" విజయ్ నోట్సు రాసుకుంటూ తలెత్తలేదు.
"ఎలా దొరికిందిరా - మీ అమ్మ నన్ను దొంగ అందిగా" అంటూ ఏమీ అనకపోయేసరికి, రవికి భోరున ఏడ్వాలనిపించింది.
ఇంక ఈ విజయ్ కి, నాకు స్నేహం ఉండదు. రవి పుస్తకంలో తల దాచుకున్నాడు.
యధాప్రకారంగా లంచ్ టైము అయింది. విజయ్ టిఫిన్ బాక్సు తెరిచాడు. రవి కారియర్ తెరవలేదు. కొన్ని నిముషాలు గడిచాయి.
'తిను' విజయ్ రవికేసి చూసాడు.
రవి మాట్లాడలేదు. విజయ్ మళ్ళీ మాట్లాడించలేదు. అంతే - లంచ్ బెల్ అయిపోయింది. ఎవరి చోట్లో వారు కూచున్నారు. విరిగిన గాజు ముక్కలు అతకడం కష్టం. ఆ రోజు నిండుగా ఉన్న కారియర్ వెనక్కి తీసుకెళ్ళాడు రంగయ్య! ఆకసాన హరివిల్లు విరిస్తే అది మకేనని ఆనందించే పసి మనసుల్ని తేలిగ్గా దూరం చేసేయగల రాధారాణులెందరో మరి!! ఇదేం తెలుసు రవికి?!! ఆ రోజు నుంచీ 'లంచ్ బెల్' ఇద్దరినీ మరీ దూరం చేసింది.
స్కూలుకి వెళ్ళే టైమవుతుంటే యధాప్రకారం కారియర్ సర్దింది రాధారాణి. బుట్ట నిండుగా వుంది. పైన చిన్న అందమైన నాపికిన్ కప్పింది. కాని ఆ కారియర్ స్కూలు ఆవరణలో అడుగుపెట్టే భాగ్యం ఆ నిముషంలోనే కోల్పోయింది.
వంటింట్లో కొచ్చాడు రవి, మూల దాచిన చిన్న టిఫిన్ బాక్సు తీసుకున్నాడు. శుభ్రంగా కడుక్కుని. నాలుగు పూరీలు దాంట్లో సర్దుకున్నాడు. కాడ్ బరీ చేత్తో పట్టుకుని నిలబడ్డ రాధారాణి కొడుకుని చూస్తూ,
"అదేమిటి" అంది ఆశ్చర్యంగా.
అంతే - "స్కూల్లో ఏం తినాలో నాకు తెలుసు మమ్మీ" చకచకా నడిచి ముందుకెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూ అలానే నిలబడిపోయింది.
మూడు గిన్నెల కారియర్, ప్లాస్కు, యాపిల్, కాటబరీ - అన్నీ అన్నీ బుట్టలోంచి తొంగి తొంగి తన్నే చూసి నవ్వుతున్నట్టనిపించిందా క్షణంలో రాధారాణికి. పేపరులో ముఖం దాచుకుని భర్త నవ్వుతుంటే, సోఫాలో కూలబడింది.*
