పడగనీడ
వెంకట్రావు వాలు కుర్చీలో కూచుని పేపరు తిరగేస్తున్నాడు. ఆ కుర్చీ వాలు ఎలాటిదంటే, వీథినవచ్చేపోయే వాళ్ళని చూడగలడు కాని అతనెవరికీ కనబడకుండా ఉండగలిగినటువంటిది.
"ఆ చదువు ఆపి లోపలికి రండి.... కాఫీ" గుమ్మంలోంచి కేక పెట్టింది వెంకటరామ సుబ్బలక్ష్మి. అంతే ఒక్క రెప్పవాటు కాలంలో లోపలికి కుర్చీతో సహా వెళ్ళిపోయాడు శ్రేయోభిలాషి వెంకట్రావు.
భార్యంటే చాలా భయభక్తులున్నాయంటే నమ్మడం ఆశ్చర్యంగా ఉండవచ్చు. అది పచ్చినిజం. వెంకట్రావుకి ఇంగ్లీషు సినిమాలు చాలా ఇష్టం. అయినా పెళ్ళయ్యాక ఒక్కటికూడా చూడ్డం మానేశాడు.... అతని భార్యకి ఇంగ్లీషు సినిమా అర్థంకాదు కనుక. స్నేహితుల యింటికి ఎప్పుడైనా వెడితే ఖచ్చితంగా చెప్పాలి- ఎప్పుడు ఎన్ని గంటలకి వస్తాడో - అనుకున్న టైముకి రాలేకపోతే అతని పాట్లు అన్నీ ఇన్నీ కావు. నిద్రలోవున్న భార్యని లేపకూడదు. అతనికోసం వుంచిన భోజనం చేసి తీరాలి... అయితే వెంకట్రావు భార్యా విధేయుడేకాకుండా, చాలా తెలివైనవాడు కూడా. అలాంటి క్లిష్ట పరిస్థితి వస్తే, చాలా ఉపాయంగా ఆపద నుంచి తప్పించుకోగలడు. చదువుకుంటున్న కొడుకుని లేపి ప్రవేశిస్తాడు ఇంట్లోకి. బళ్లమీదున్న భోజనాన్ని నిశ్శబ్దంగా దొడ్డి గుమ్మం తలుపు తెరిచి కుక్కకి పడేస్తాడు. అలాటప్పుడే అతని మనసు క్షోభిస్తుంది. స్వర్గంలో వున్న మామగారు క్షణక్షణం తనని శపిస్తున్నట్టు అనిపించి భయమేస్తుంది. వెంటనే తన క్లిష్టమైన దైవ ప్రార్థన చేసుకుంటాడు. మనసులో పక్షవాతంతో మంచాన పడివున్న వెంకటరామ జోగయ్య కూతురి మెడలో తాళికట్టాడో, ఆ క్షణంనుంచే గతాన్ని మరిచిపోవాలని ప్రతిజ్ఞ పూనాడు. అప్పట్నుంచే, అంటే, డబ్బున్న వెంకట్రామ జోగయ్య అల్లుడయినప్పట్నుంచే గొప్పవాళ్ళ జాబితాలో చేరిపోయాడు వెంకట్రావు.
గొప్పగా ఉపన్యాసాలియ్యటం, లోకోద్దరణకే తను జన్మించానని విశ్వసించటం, పరమ వికారంగా వుండే వెంకటరామ సుబ్బలక్ష్మిని చేపట్టడంలో పరమార్థముందని, ఆత్మ సౌందర్యానికే తను విలువనిస్తాననటం, అసలు ఆడవాళ్ళు అందంగా వుండకూడదనడం - ఇలాంటి వెన్నెన్నో విషయాలు ఎన్నుకొని అనర్గళంగా, అనంతంగా, గంభీరంగా ఉపన్యసించటం ఈ మధ్య మరీ ఎక్కువై, ఊపిరి సలపనంతగా కాలం గడిపేస్తున్నాడు మహాత్ముడు వెంకట్రావు!
ఇంతవరకు తెలిస్తే చాలదు వెంకట్రావు గురించి. అసలు తెలియాల్సింది చాలావుంది నిజానికి. అతను శ్రేయోభిలాషి - ఎవరు, ఎక్కడ, ఏపని, ఎప్పుడు చేస్తున్నారో, ఎవరింటికి ఏచుట్టం ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్లాడో, పక్కింటి కుర్రాడు కాలేజినుంచి ఎందుకాలస్యంగా వచ్చాడో, ఎదురింటి వారి అమ్మాయి ఐదుగంటలయినా ఇంకా ఎందుకు ఇంటికి రాలేదో - అబ్బో- ఇలాంటి వెన్నెన్నో వివరంగా క్షణాలమీద చెప్పేయగల సమర్థత వుంది. ఇవన్నీ ఎందుకూ అని ఎవరూ అనడానికి వీలులేదు.
'నా ఇరుగు పొరుగుల క్షేమసమాచారాలు, బాగోగులు తెల్సుకోవలసిన బాధ్యత నాకుంది.... ఈ సంఘం బాగుపడాలంటే, ఎవరికి వారే నాకేమని ఊరుకుంటే ఎలా....' అంటాడు - విజయగర్వంతో, ఓ నవ్వు విసురుతాడు - వెంకట్రావు సంఘ శ్రేయోభిలాషి!
ఈమధ్య వెంకట్రావుకి ఎందుకో చిరాగ్గా అనిపిస్తోంది. బాబాయి గారూ అని, మామయ్యగారూ అని తన చుట్టూ తిరుగుతూ వుండే మనుష్యుల సంఖ్య తగ్గింది - అందుకే అతనికి కోపం - అరే!వెంకట్రావు కుర్చీలో కూచుని తల ఎత్తేసరికీ - ఇంకేముంది - తలకొట్టేసినంత పనైంది. ఎదురింటి మేడమీద భాగంలోకి ఎవరో వచ్చారే - ఇది ఎలా జరిగిందబ్బా! ఈ మేడ రాజయ్య తనని సంప్రదించకుండా - తనకి చెప్పకుండా - తనకి తెలియకుండా....వెంకట్రావుకి తను బతికుండగానే తన పెద్దరికానికి ఈ వీథిలో ఇంత పెద్ద దెబ్బా?! రాజుగారికి ఉన్నట్టుండి కిరీటం పడిపోతే, సింహాసనం కదిలిపోతే ఎలావుంటుంది? వామ్మో వెంకట్రావు చెప్పులు తొడుక్కుని గబగబా ఎదురింటి మేడ మెట్లెక్కాడు.
"రండిబాబూ - రండి" రాజయ్య కుర్చీ చూపించాడు. "రాత్రే ఈ వాటాలోకి వచ్చారండి - మా అల్లుడిగారి స్నేహితుడట ఆయన - నాకూ చెప్పలేదు బాబూ...." ఏదో తప్పు చేసిన వాని ధోరణి రాజయ్య గొంతులో ధ్వనించింది. వెంకట్రావు మాట్లాడలేదు.... ఒక్క నిముషం ఆలోచించాడు.... వ్యవహారం మొత్తం చేయిజారిపోకూడదు. రాజయ్య ఆ ఊళ్ళో పేరుపొందిన కలప వ్యాపారి. బాగా డబ్బున్నవాడు.... వెంకట్రావులాటి శ్రేయోభిలాషులంటే భయం ఉన్నవాడు.
వెంకట్రావు ముందు నడుస్తుంటే, వెనక నడిచాడు రాజయ్య మేడ మీదకి.
"ఇంటి ఎదురుగా వుంటారు - వెంకట్రావు గారని" రాజయ్య అంటుంటే కుర్చీ జరుపుకు కూచున్నాడు వెంకట్రావు. ఆ భాగంలోకి కొత్తగా వచ్చిన జ్యోతికి నచ్చలేదా పద్ధతి. స్నానానికెళ్ళిన రామం ఇంకా రాలేదు.
జ్యోతిని నఖశిఖపర్యంతం పరీక్షగా చూసాడు వెంకట్రావు. ఆమె చేస్తున్న ఉద్యోగం, వచ్చే జీతం, రామం చేస్తున్న ఉద్యోగం, అతని జీతం, ఇంటిపేరు - ఒకటేమిటి అన్నీ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జ్యోతికి మహా చిరాగ్గా వుంది. "వస్తానమ్మా -" ఇల్లంతా పరిశీలనగా చూస్తూ లేచాడు వెంకట్రావు.
'తమాషా మనిషి' నవ్వుకొంది జ్యోతి.
'మరేం లేదయ్యా - ఇందులో ఎన్నిరకాలు - అసలు ఈ రోజుల్లో భార్యభర్తలో కారో చెప్పటానికి కూడా కష్టమే, తీరా ఇల్లు ఇచ్చుకుని ఇబ్బంది పడిపోతావని నీమీదవుండే అభిమానం కొద్దీ నేను ఇలా రావడం కానీ' వెంకట్రావు ఆగాడు. 'ఫరవాలేదండి - తమరు పెద్దలు - ఎన్నైనా అడగచ్చు' రాజయ్య నెమ్మదిగా దిగాడు. బాత్ రూమ్ నుంచి వచ్చిన రామం మెట్ల దగ్గర వెంకట్రావుని చూసి, లోపలికెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అవసరమముండి, లేక వెంకట్రావు జ్యోతి మేడమీది కొస్తూనే వున్నాడు. కాసేపు పేపరు తిరగేసి, కాఫీ తాగేసి వెళ్ళిపోడం అలవాటు చేసుకున్నాడు. అయితే సాధారణంగా రామం బయటకి వెడుతుండగానో, పడుకున్నప్పుడో రావడం జరుగుతోంది. అంతేకాకుండా, సోది కబుర్లు చెప్పడం, ఇరుగుపొరుగుతో బాతాఖానీ చేయడం, అందర్నీ పలకరించడం ఇష్టం వుండదు రామానికి.
ఇదే నచ్చలేదు వెంకట్రావుకి. అమ్మాయి ఫరవాలేదు కానీ, ఇతనికే కాస్త గర్వం - గర్వమేమిటి - అందగత్తె భార్య, సంపాదనాపరులు భార్య - తెలివైన భార్య వుందిగా వీడికి - వెంకట్రావుకి ఉన్నట్లుండి వెంకట రామ సుబ్బలక్ష్మి కేక వినిపించింది. "లోపలికి రండి - భోజనం" లోపలికి వెళ్ళిపోయినా రామం తనని గౌరవంగా చూడలేదని, తనకి వినయంగా నమస్కారం పెట్టడం లేదని - ఏదో ఏదో కోపం ఒక్కసారిగా గుండెల్లో దాగి కూర్చుంది - వెంకట్రావు కింద పెదవి కొరుక్కున్నాడు.
"ఏమిటా పరధ్యానం" అరిచింది వడ్డన చేస్తున్న అర్ధాంగి. "ఆ ఏం లేదు" మంచినీళ్ళు గబగబా తాగాడు.
ఆరోజు ఆఫీసుకి సెలవు. జ్యోతి తీరిగ్గా తలదువ్వుకుంటోంది. ఒక్కసారి ఉలిక్కిపడింది - అద్దంలో కనిపించిన రూపం చూసి.
"మీ ఆయన కనపడడేం -"
"ఆయన - సినిమాకెళ్ళారు-" జ్యోతి జుట్టు ముడివేసుకుంది. ఈ రాజయ్యతో చెప్పి ఈ పీడ వదలించమనాలి. లేకపోతే ఈ వాటా ఖాళీ చెయ్యాలి - క్యోతికి చాలా కోపం వచ్చింది. సమయాసమయాలు లేకుండా ఇంట్లో జొరపడేవాళ్ళంటే చాలా అసహ్యం తనకి!!
వెంకట్రావు పకపకా నవ్వాడు -
"అదేమిటమ్మా - నిన్ను తీసుకెళ్ళకుండా ఒక్కడూ వెళ్ళటమేమిటి - నాకు నచ్చలేదు."
"ఓ అదా - నేను ఆ సినిమా ఇంతకు ముందే చూసాను."
"ఏమో - ఏమిటో - సరే వస్తానమ్మా"
'హమ్మయ్య' - ఊపిరి తీసుకుంది జ్యోతి.
మెదడుకి ఈ రోజుకి మంచి మేత దొరికింది - ఒక్కడూ సినిమా కెళ్ళడం - ఆ అమ్మాయి బిక్కు బిక్కుమంటూ ఒక్కర్తే ఉండటం - ఒక్కడూ వెళ్ళాడో, ఎవరినైనా వెంటబెట్టుకెళ్ళాడో - ఏదయినా ఇందులో ఏదో వుంది, 'సమ్ థింగ్ ఫిషి' - వెంకట్రావుకి విజయోత్సాహమొచ్చింది. 'యురేకా' అని కేక పెట్టాలనుకున్నాడు. గొప్ప రహస్యాన్ని, తనే కనుకున్నానన్న గర్వంతో రాజయ్య గుమ్మం దగ్గరకొచ్చాడు. స్కూటర్ లోపల పెట్టి, జుట్టు పైకి తోసుకుంటూ రామం మెట్లెక్కుతూ కనిపించాడు.
'ఏమిటి వీళ్ళ కథ' కళ్ళెగరేస్తూ వెంకట్రావు రాజయ్యతో రహస్యంగా అన్నాడు.
"మంచివాళ్ళండి - రెండో తారీఖుకల్లా నాకు అద్దె ఇచ్చేస్తున్నారు."
"అబ్బ, అద్దె గురించి కాదయ్యా - ఆ కుర్రాడు కిందికొచ్చి నీతో కబుర్లు చెప్తాడా-"
"అదా, అండీ - అబ్బే - ముభావం మనిషి - ఆయన పనేదో ఆయంది - మంచి వారండి."
ఈమాటు వెంకట్రావుకి రాజయ్య మీద కోపం వచ్చింది.
ఆ రాస్కెల్ ని వీడు మంచివాడంటాడేమిటి - పెద్దవాళ్ళంటే గౌరవం లేదు వాడికి - ఒకసారీ నాకు నమస్కారం చెయ్యడు - ఏమిటి వీడి పొగరు - వెంకట్రావు ఎన్నో విషయాలు పోగుచేయాలనుకుంటుంటే, రాజయ్య దారివ్వడం లేదే.
"ఏమోనయ్యా, ఆ బొమ్మల చొక్కాలు, ఆ జులపాలు ఏమిటా వేషం - మర్యాదస్థునిలా కనిపించడేం-"
"అయ్యో అదేమిటండీ - ఇవాళ రేపు కుర్రాళ్ళంతా ఇంతేకదండి- మా అల్లుడుగారయితే మెడలో గొలుసు కూడా వేసుకున్నారండి- ఫేషనట" వెంకట్రామయ్యకి రాజయ్య గొంతు నులిమేయాలనిపించింది - శ్రేయోభిలాషిత్వం తల్చుకు గర్వపడిపోతున్న వెంకట్రావుకి రామం విషయం పెద్ద గొడ్డలి పోటులా అనిపించింది.
అసలు రాజయ్యకు బుద్దిలేదు - నాకు చెప్పకుండా ఈ భాగం ఎందుకియ్యాలి - ఈ రామంగాడు నన్ను లెక్క పెట్టడేం - 'రండి బాబాయిగారూ అనడేం' - వెంకట్రావు పళ్ళు కొరికాడు, కోపం పాము పగైంది. ఎన్ని చేపలు తన వలలోపడి గిలగిల తన్నుకోలేదు, వీడో లెక్కా తనకి?! వెంకట్రావు బుసకొడుతూ మేడపైకి చూసాడు.
కాలం గడుస్తోంది. మళ్ళా డల్ గా వుంది వెంకట్రావుకి. తనేదో చేయాలి - వెంకటరామ సుబ్బలక్ష్మి ఊరెళ్ళి వారం రోజులుండి రాత్రే వచ్చింది.... అన్నీ గమనిస్తూనే వుంటాడు ఆలస్యం కాకుండా, పొరపాటు లేకుండా వెంకట్రావు!
స్కూటర్ స్టార్టు చేసిన రామం ఎదురుగా నిల్చున్న వెంకట్రావుని చూస్తూ, 'నమస్కారం - తీరిగ్గా వున్నారివాళ' - ఉలిక్కిపడ్డాడు వెంకట్రావు.
"అంటే?"
"అదే - పేపరు చేతిలో లేదు - అందుకని" నవ్వుతూ అంటూనే వెళ్ళిపోయాడు రామం.
"ఓహో - నన్ను మంచి చేసుకోవాలనా ఈ దారికొస్తున్నాడు - ఈ వెంకట్రావు అలాటి ఇలాటి వాడు కాడు-' గర్వంగా నవ్వుకున్నాడు తనలోతాను!
రాత్రే ఊరినుంచి వచ్చిన జ్యోతి, భర్త ఆఫీసుకెళ్ళిన తర్వాత తలుపేసుకు బడలికగా వుండి పడుకొంది.
తలుపు చప్పుడు....చిరాగ్గానే లేచింది.
"ఒంట్లో బాగా లేదా" వెంకట్రావు గుమ్మంలో ప్రత్యక్షం.
"ఏం లేదు-రెండు రాత్రులనించి చెప్పాలనుకుంటున్నాను-మీవాళ్ళు దూరంగావున్నా, ఎదురుగుండా వున్నందుకు తండ్రిలాటి బాధ్యత నాకుంటుంది తప్పదుమరి" జ్యోతి ముఖంకేసి చూస్తున్నాడు.
ఏవిషయమో అర్థంకావటంలా....
"అదేనమ్మా - నువ్వు ఒట్టి మనిషివికాదు - రాత్రిళ్ళు చలిగాలిలో మేడమీద నువ్వు, మీ ఆయన తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే చూస్తున్నాను. మొన్న అర్థరాత్రి దాటిందా - గాలిలేక, నిద్ర పట్టక బయట కొచ్చాను. వచ్చేసరికి మీరిద్దరూ మేడపైన కనిపించారు- మరేంలేదు, చలిగాలిలో తిరిగితే ఆరోగ్యం పాడవుతుంది - అది ఎలా చెప్పాలా అని తికమకపడ్డాను. చిలకా గోరింకల్లా ఇద్దరూ మేడమీద ముచ్చటగానే వుంది కానీ-నీది-అదే నీ ఆరోగ్యం జాగ్రత్త" వెంకట్రావు పేపరులో ముఖం ఉంచుకొనే జ్యోతిని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాడు.
ఏమీ అర్థంకాలేదు - దీనికి మొదలు తుది తెలియలేదు. వెళ్ళిపోతున్న వెంకట్రావు వైపు చూస్తూ నిలుచుంది, తను ఊరినుంచి వచ్చిందే రాత్రి....మేడమీద చల్లగాలికి తను, భర్త మొన్న కనిపించడమేమిటి - పైగా చిలకా గోరింకల్లాగానా - చేతిలో దువ్వెన అలానే వుంది. మనసు ఎటో ఎటో పరిగెత్తింది. తల తోకలేని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి - అయినా నిప్పులేందే పొగరాదుగా - నిజనిజాలు ఎలా తెలుస్తాయి? జ్యోతి తలవేడెక్కింది. భార్యాభర్తల్లో అనుమానాలు భయంకర పిశాచాలు.
కాలం గడుస్తోంది. నాలుగు రోజులయింది. ఏమో మరి - భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకున్న భర్తలు, భార్యని హత్య చేసి పెళ్ళి చేసుకున్న భర్తలు - ఎందరెందరో - జ్యోతి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. తన రామాన్ని తనే శంకిస్తుందా - ఏ ఆధారంతో - వెంకట్రావు పెనుభూతంలా కళ్ళముందు కనిపిస్తుంటే అప్రయత్నంగా కళ్ళు మూసుకుంది.
తలుపు దబదబా బాదుతున్నారు - జ్యోతికి భయం వేస్తోంది తలుపు తియ్యాలంటే -వెంకట్రావు ఇంకేమీ చెప్పడానికి వస్తున్నాడో-
ధన, ధన, ధన - తలుపు విరిగిపోతుందేమో! జ్యోతి గబగబా లేచింది.
ఆశ్చర్యం - రాధారాణి!! ప్రాణస్నేహితురాలు!!
"ఏమిటి చెముడా - లేకపోతే పుట్టబోయే బిడ్డ గురించి తియ్యని కలలా-"
"ఏమిటీ - అలా ఏడుపుగొట్టు ముఖం నువ్వునూ, నేనెళ్ళిపోనా-"
తేరుకుంది జ్యోతి.
"ఒక్క నిముషం - వస్తాను" గబగబా లోపలికెళ్ళింది. ముఖం కడుక్కుంది. బొట్టు దిద్దుకుంది.
"చెప్పు" స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలోకి దిగారు.
"ఏమిటలా అయిపోయావు" పరీక్షగా చూస్తూ అంది రాధారాణి.
"అదా - ఒంట్లో బాగాలేదు" పేలవంగా నవ్వింది.
రాధారాణి గలగలా మాట్లాడుతుంది. మద్రాసులో వుంటూ భర్త ట్రయినింగ్ కి వెళ్ళాడని పుట్టింటికొచ్చింది.
ఇల్లంతా కలయచూస్తూ, "ఇక్కడ నుంచుంటే చాలు - హాయిగా కాలక్షేపమవుతుంది కదూ-" మేడమీద నుంచి కిందికి చూస్తూ అంది.
"హమ్మ బాబోయ్ - ఈ వీధిలో ఎలా ఉండగలుగుతున్నావ్ బాబూ"
"ఏం" కంగారుపడింది జ్యోతి.
"అటుచూడు - శ్రేయోభిలాషి వున్న వీథిలో వుండటమంత నరకం మరోటి లేదు"
"అంటే"
"అదే - వాడే-"
జ్యోతి అటు చూసింది - వెంకట్రావు!
"జ్యోతీ - ఈ ఇంట్లో కాపురం నీకు పడగ నీడలాటిది - నామాట విని ఇల్లు ఖాళీ చెయ్యి-"
"అదేమిటి"
"అది అంతే - లేకపోతే, ఈ శ్రేయోభిలాషి కాపురాలు కూల్చేయగలడు - వీడి అహం ముందు ఎన్ని కొంపలు కూలిపోయాయో నీకేం తెలుసు? అన్నట్టు నీకు గుర్తులేదూ - నా పెళ్ళి ముందు ఒక సంబంధం చూసారు మావాళ్ళు - ఆ పెళ్ళి కొడుకు గురించి అబద్ధాలు చెప్పి, లేని ఉద్యోగం కల్పించి చెప్పాడు ఈ పెద్ద మనిషి. తీరా, ఆరాలు తీస్తే అంతా అబద్ధమే - ఆ సంబంధం మావాళ్ళు వదులుకున్నారు-ఆ కోపంతో ఈ పెద్దమనిషి నా పెళ్ళయ్యాక మావారికి నామీద ఎన్నో కల్పించి ఉత్తరం రాసాడు - నేను పెళ్ళికాక ముందు లేచిపోయానని, ఇంకా ఎన్నెన్నోలే - నీకు గుర్తు లేదూ నేనొకసారి చెప్పాను-ఆ మహాత్ముడు వీడే! థూ!!థూ!!"
జ్యోతి విస్తుపోయి వింటోంది. "అందరిలో తప్పులు వెదుకుచూ, పెద్ద మనిషిలా చెలామణి అయిపోయే వీడు - ఎంత దుర్మార్గుడో అనుభవానికొస్తే కానీ ఎవరూ నమ్మరు."
"అవునవును" జ్యోతి నెమ్మదిగా నసిగింది! హాయిగా నవ్వింది!
* * *
ఆర్నెల్లు గడిచాయి. రాజయ్య మేడపై భాగం ఖాళీ అయిపోయిందని తెలిసిన వెంకట్రావు చిరాగ్గా కుర్చీతో సహా లోపలికెళ్ళిపోయాడు వెంకటరామ సుబ్బలక్ష్మి పిలవకుండానే!!!*
