అప్పటికే ఆమె మనసు పూర్తిగా వికలమైంది. ఎంత కాదనుకున్నా బాధతప్పదు. రేపీ వార్త పేపర్లో వస్తుంది. కేసు కోర్టు వరకూ వెళ్ళకపోవచ్చు! కానీ రకరకాల రూమర్లు వ్యాప్తి చెందడానికి కేవలం 'వార్త' చాలు!
మానసికమైన వత్తిడిలో వుండడం చేత ఆమె పైటని గమనించలేదు. స్థనద్వయంలో ఒకటి స్పష్టంగా గోచరమవుతూంది. వీథిలైటు వెలుతురు తాలూకు నీడ మెడ క్రింద సరళరేఖగా క్రిందకి అదృశ్యమవుతూంది. సలీంశంకర్ ఓరగా ఆమెవైపు చూశాడు. ఆమె ఆరోగ్యవంతమైన శరీరం అతడిని మరింత తొందర చేస్తూంది. ఈ మధ్య కోర్టు కేసువల్ల ఇలాటి వ్యవహారాలు లేవు. 'ఇంకెంతసేపు? మహా అయితే ఇంకో పది నిమిషాలు' అనుకున్నాడు. అతడు మాటిమాటికీ పెదవులు తడిచేసుకోవడం ఆమెకి అదోలా అనిపించింది.
సలీంశంకర్ జీపు స్టార్ట్ చేశాడు. అది వేగం పుంజుకుంది. అనూష ఆలోచనల్లో పడింది. ఈ రాత్రికి బెయిల్ దొరక్కపోవచ్చు. వెళ్ళగానే లాయర్ కి ఫోన్ చెయ్యాలి. పండాకి చెయ్యాలా? అక్కర్లేదనుకుంటాను. ఆ ముసలాయన్ని రాత్రిపూట కంగారు పెట్టడం అనవసరం. ఆడవాళ్ళని రాత్రిపూట ఎంతో అవసరమైతే తప్ప అరెస్ట్ చేయకూడదు. అదీగాక ఆడ పోలీసుల సమక్షంలో వుంచాలి. ఇవన్నీ తన లాయర్ కి చెప్పాలి. ఈ ఇనస్పెక్టర్ భవిష్యత్తులో ఇవ్వన్నీ చేయకుండా చిన్న పాఠం.
ఆమె ఆలోచన్లలోంచి తేరుకుని జీపు కుదుపులకి చుట్టూ చూసింది. దూరంగా అక్కడక్కడా మినుక్కుమినుక్కుమని దీపాలు కనపడుతున్నాయి. మొదటిసారి కంగారుపడింది.
"ఎక్కడికి వెళ్తున్నాం?" అని అడిగింది అటూ ఇటూ చూస్తూ.
జవాబుగా సలీం జేబులోంచి ఆసిడ్ సీసా తీసాడు.
ఆమెకి మొదట అర్థం కాలేదు. అంతలో శంకర్ మొహం మీద వికృతమైన నవ్వు కనపడింది.
"నువ్వు చాలా తెలివైన దానివటగా! మీ ఆఫీసులో అంతా అలాగే చెప్పుకుంటారుట" అన్నాడు.
"ఎవర్నువ్వు" అంది.
ఆ ప్రశ్నకి అతడు సమాధానం ఇవ్వలేదు. "తెలివైనవాళ్ళు పడకమీద మంచి సుఖం ఇస్తారని నాకో గొప్ప నమ్మకం" అన్నాడు.
అప్పుడు అర్థమయింది ఆమె అతడు పోలీస్ ఇన్ స్పెక్టర్ కాదని.
జీపు వేగంగా వెడుతుంది.
"నా పేరు శంకర్ ..... సలీం శంకర్" అన్నాడు అతడు. ఆమె గుండె ఆగిపోయిందో క్షణం! స....లీం .... శం..... క....... ర్ రేపు కోర్టులో నేరం నిరూపణ అయితే శిక్ష పడవలసిన బోస్టన్ స్ట్రాంగ్లర్!! తన పక్కన.
'ఇదేమిటో తెలుసా? ఆసిడ్ సీసా' అన్నాడు ఒక చేత్తో మూత తీస్తూ. "చుక్కపడితే చాలు చర్మం సలసలా కాలిపోతుంది".
ఆమె మెదడు ఆలోచించే శక్తి కోల్పోయింది.
"ఆడదాన్ని బలవంతం చెయ్యటం, అది గీరటం, కొరకటం ఇవేమీ నాకు ఇష్టం వుండవు. మర్యాదగా అడుగుతాను. లేకపొతే ఇదిగో ఈ ఆసిడ్" అంటూ సీసా వంపబోయి, "నీ మీద వద్దులే అసలే లేత చర్మం. ముందు అనుభవించబోయే ఆనందానికి ఈ మంట అడ్డొస్తుంది. నా మీదే ఓ చుక్క వేసుకుంటాను చూడు" అంటూ పోశాడు. స్టీరింగ్ ని పట్టుకున్న అతడి చెయ్యిమీద చర్మం అప్పటికే బుస బుసా పొంగింది. పళ్ళ బిగువున బాధని అదిమి పెట్టి "ఒక చుక్కకే ఇది. నీ మొహం మీద పూర్తిగా పడిందంటే ఇక బయట అడుగు పెట్టలేవు. ఆలోచించుకో. ఇష్టంగా వప్పుకుంటావా? కాలిపోవటానికి సిద్ధపడతావా?"
వప్పుకున్నా వప్పుకోకపొయినా తన మరణం నిశ్చయమని ఆమెకి తెలిసి పోయింది. రేప్ చేసి, ఆ తరువాత దారుణంగా చంపే ఇతడి గురించి ఆమె చదివి వుంది. పోలీసులు ఒక్క కేసూ ప్రూవ్ చేయలేకపోయారంటే ఎంత పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తాడో అర్థమవుతూంది. అదీగాక ఇప్పుడు తన స్వంత చర్మం మీద ఆసిడ్ పోసుకున్న విధానం, ఆ పచ్చితనం చూస్తుంటే అతడిలో రాక్షసత్వం ఎంతగా గూడు కట్టుకుపోయి వుందో తెలుస్తూంది.
అతడింత ప్లాన్ వేసి తనని ఎందుకు బంధించి తీసుకువెళ్తున్నాడు? అందం చూసా?.....ఇంపాజిబుల్.
ఆమెకి అకస్మాత్తుగా రామలింగేశ్వర్రావు గుర్తొచ్చాడు. తను ఆఫీసులో అతడిని రెడ్ హండెడ్ గా పట్టుకుంది. దానికిలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడా?
.....సలీం జీపు ఆపుచేశాడు.
దూరంగా ఎర్రగోడలున్న ఇల్లు - దీపం కనబడుతున్నాయి. అది పోలీస్ స్టేషనా? ఆమెకి నమ్మకం కుదరలేదు. కానీ అది పోలీస్ స్టేషనే.
"ఏం బేబీ? వెన్నెల్లో అయితే బావుంటుంది. లేదు, లోపలికి వెళ్దామంటే సరే-"
అతడి మాటలు పూర్తి కాకుండానే దూరంగా రెండు లైట్లు కనిపించాయి. చూస్తూ వుండగా వేగంగా ఒక కారు వచ్చి ఆగింది.
కారులోంచి ఒక యువకుడు మొహం బయటకు పెట్టి చిరునవ్వుతో "హాల్లో శంకర్ బావున్నావా" అంటూ క్రిందికి దిగాడు. అతడు పొడుగ్గా వున్నాడు. నుదుటి మీదకు జుట్టు నిర్లక్ష్యంగా పడుతూంది. చెంపమీద చిన్న గాయం అతడి మొహానికి అదోలాంటి రఫ్ నెస్ నిస్తూంది.
"ఏదో నాటకానికి వెళ్తున్నట్టున్నావే. జీపులో మా కజిన్ కనపడితే అప్పటినుంచీ హారన్ కొట్టుకుంటూ వస్తున్నాను. మా 'చిన్ని' అంతే! రిహార్సల్స్ లో పడితే అసలు బయట ప్రపంచం గుర్తుండదు. ఏం చిన్నీ! అంతేనా!"
అనూషకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఈ లోపులో అతడు "ఏమిటి జీపు పాడయిందా? పోనీ చిన్నిని నా కార్లో తీసుకెళ్తాన్లే. నువ్వు కూడా వస్తావా?" అంటూ ఆ వాహనం వైపు పరీక్షగా చూసి, "జీపు కూడా ఎక్కడో కొట్టుకొచ్చినట్టున్నావే. నాటకం కోసం నువ్వే 'పోలీస్' అని వ్రాయించావా లేక ఎవడైనా కక్కుర్తి డి.ఎస్.పి. వాడుకొమ్మని ఇచ్చాడా?" అన్నాడు.
సలీం మొహం ఎర్రగా మారింది. "నీకనవసరం జానీ" అన్నాడు పళ్ళ బిగువున.
"అవును. నాకనవసరమే. నా కజిన్ ని మాత్రం నేను తీసుకుపోతున్నాను. రావే చిన్నీ, రిహార్సల్స్ కి రేపట్నుంచీ వెళ్దూగాన్లే".
అనూష ఏదో అనబోతూ వుండగా ఆమె కళ్ళ ముందు మెరుపుకన్నా వేగంగా రెండు సంఘటనలు జరిగాయి. సలీంశంకర్ రెప్పపాటులో జేబులోంచి కత్తి తీశాడు. ఎన్నో పుస్తకాలు చదివి, దృశ్య వీక్షణానుభవం వున్న ఆమే ఆ వేగానికి ఆశ్చర్యపోయింది. అయితే అంతకు సగకాలంలోనే జానీ జేబులోంచి రివాల్వర్ బయటకొచ్చి చీకట్లో మెరవటం చూసి ఆమె విస్తుబోయింది. అంత భయంలోనూ అసలిది ఎలా సాధ్యం అన్న అనుమానం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసింది.
"మొన్నే కొన్నాను సలీం. ఎలా వుందీ రివాల్వరు?" అడిగాడు జానీ.
సలీం మాట్లాడలేదు. పిస్తోలు జేబులో పెట్టుకుని "వెళ్ళొస్తాం. రా చిన్నీ" అంటూ కారువైపు నడిచాడు అతడు. అయోమయంగా, ఏదో నిద్రావస్థలో వున్నట్టు అతడితోపాటు వెళ్ళి కారులో కూర్చుంది.
కారు కదిలాక ఆమె తలతిప్పి వెనక్కి చూసింది. సలీంశంకర్ అలాగే నిలబడివున్నాడు. కాటు వేయబోయే ముందు కాలు దూరంగా వెళ్ళిపోతే దెబ్బతిన్న పాములా వున్నాడు.
"నీ పేరేమిటి చిన్నీ?"
ఆమె తెప్పరిల్లి "అనూష" అంది.
"మంచిపేరు. బావుంది".
కారువేగంగా వూరివైపు సాగిపోతూ వుండగా అతనన్నాడు.
"జీపులో సలీంని యూనిఫారంలో చూడగానే అనుమానం వచ్చింది. పక్కనే చిరెకొంగు కనపడడంతో అది బలపడింది. ఏదో కొత్తప్లాను అనుకున్నాను. ముందు నాకెందుకులే అనుకున్నాను. కానీ ఎందుకో రక్షించాలనిపించింది. అది నీ అదృష్టం".
ఆమెకి కోపం వచ్చింది. కాస్త వెటకారంగా, అ"అంటే, తెలిసీ మీ దారిన మీరు వెళ్ళిపోదామనుకున్నారా" అంది.
"ఈ ప్రపంచంలో ప్రతిక్షణం పదిలక్షల మందికి పైగా ప్రమాదంలో పడుతూవుంటారు. అందర్నీ రక్షించడానికి నేనేం సూపర్ మాన్ ని కాను. అదీకాక తెలిసీ ఎవడూ సలీంశంకర్ తో విరోధం తెచ్చుకోడు".
అతడెందుకు 'నాటకం- రిహార్సల్స్- చిన్ని' అని తెలిసీ తెలియనట్టు అబద్ధామాడాడో ఆమెకి అర్థమైంది. జానీకి తెలుసు. అతడికి తెలుసని సలీంకి తెలుసు.
అయినా ఒకరినొకరు మామూలుగానే పలకరించుకున్నారు. ఎవరేపని మీదున్నారో ఎదుటివాళ్ళకి తెలియనట్టు.....
ఎందుకో తెలీదుగానీ, అప్రయత్నంగా ఆమె వళ్ళు జలదరించింది.
కారు వెళుతూవుంటే చల్లగాలి రివ్వున వీస్తూంది. తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు- "ఎవరో ఒకడు కాస్త ఖాకీ యూనిఫాం వేసుకుని వస్తే- పట్టుచీరె కట్టుకుని మరీ వచ్చి జీప్ ఎక్కేస్తావన్న మాట-"
అనూష మొహం ఎర్రబడింది.
ఏమనుకుంటున్నాడో ఇతడు తన గురించి?
అంతలో అతడు, "ఎక్కడ మీ ఇల్లు" అని అడిగాడు.
ఆమె చెప్పింది. కారు ఇంటి ముందు ఆపుచేస్తూ "నువ్వు లోపలికి వెళ్ళు. అప్పటివరకూ నేనిక్కడే వుంటాను" అన్నాడు.
"ఫర్వాలేదు. నేను వెళ్ళిపోగలను".
"సాధారణంగా సలీంశంకర్ ఇలాటివి తానొక్కడే చేస్తాడనుకో! కానీ ఎందుకైనా మంచిది- చీకట్లో ఎవరైన పొంచి వుండవచ్చు. లేక తన ప్లాను పాడయిందన్న కోపంతో వాడే వచ్చి కాల్చేయొచ్చు కూడా. సర్లే నువ్వెళ్ళు...."
అప్పుడు తోచింది ఆమెకి అతడు తనని ప్రమాదం నుంచి రక్షించినవాడని! "కొంచెం కాఫీ తీసుకువెళ్దురుగాని రండి-" అంది. ఆమె కంఠం సిన్సియర్ గా వుంది.
అతడొక క్షణం ఆలోచించి, "సర్లే పద" అన్నాడు. ఇద్దరూ ఆమె ప్లాట్ వద్దకు వచ్చారు. ఆమె తన ఫ్లాట్ తాళం తీస్తూ వుంటే, "అదీ సంగతి" అన్నాడు.
"ఏది?"
"సాధారణంగా పోలీసులూ అరెస్టులూ అంటే ఎంతో హడావుడి, వ్యాను వరకూ ఇంటిల్లిపాది రావటం జరుగుతుంది. ఇక్కడ అలాటి గొడవేమీ లేకపోతే కారణం ఏమిటో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి".
"నాకెవరూ లేరు. ఒక్క అన్నయ్యే! ఢిల్లీలో వుంటాడు".
ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించారు. అక్కడి అలంకరణ చూసి అతడు మెచ్చుకోలుగా, "గుడ్ టేస్ట్" అన్నాడు.
"మీరు కాఫీయా? టీయా?"
"ఉహూ- ఏదీ వద్దు" అంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి తెరలు కాస్త పక్కకి తొలిగించి బైటకు దృష్టి సారించాడు. అది గమనించి ఆమె "వాడిక రాడనుకుంటాను" అంది. "......అయినా వాడిని వదిలిపెట్టను. ఇప్పుడే రిపోర్టు ఇస్తాను. వాడి ఆచూకి మీకు తెలుసుగా".
"సలీంశంకర్ చార్మినార్ ప్రాంతంలో వుంటాడు."
"వాడిని అరెస్ట్ చేయిస్తాను- ఇంపెర్సెనేషన్ క్రింద" అంటూ ఫోన్ దగ్గరకు నడిచింది. ఆమె అందుకోబోయే లోపులో తనే ఫోన్ అందుకుని ఒక నెంబర్ తిప్పి "హల్లో సూపర్నిండెంట్ సాబ్..... స్కాచ్ పంపించాను అందిందా" అన్నాడు. అతడు సలీం కంఠంతో మాట్లాడడాన్ని ఆమె విస్మయంతో గమనించింది. ఫోన్ పెట్టేస్తూ-
"ఏమని అరెస్ట్ చేయిస్తావు? ఈ రాత్రి అసలు తను ఈ వూళ్ళోనే లేడని అతడు క్షణాల్లో నిరూపిస్తాడు. కావాలంటే దానికి సూపర్నెంటే సాక్ష్యమిస్తాడు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో నూటికి తొంభైమందికి పైగా సలీంశంకర్ తో సత్సంబంధాలు పెట్టుకోవాలని అభిలాషిస్తారు. అటువంటివాడు నీ ఇంటికి మారువేషంలో వచ్చాడని చెప్పినా నమ్మేదెవరు? నమ్మినా నీ మాటమీద అతడిని అరెస్ట్ చేసే దమ్ములెవరికి?"
"నేను స్టాక్ హొం జనరల్ మానేజర్ని".
"నువ్వు స్టాక్ హొం జనరల్ మేనేజర్ వే కావచ్చు. ఆమెరికా ప్రెసిడెంట్ వే కావచ్చు. కానీ వసంత్ దాదా అనుచరుడైన సలీంని మాత్రం ఏమీ చెయ్యలేవు".
