Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 12


    "చెప్పను".

    ఆ నలుగురిలోనూ కొంచెం బక్కగా వున్నావాడు నావైపు అనుమానంగా చూసి "ఇతణ్ని నేను నమ్మను. సి.ఐ.డి. ఆఫీసర్ కూడా ఇంత గురిగానూ కొడ్తాడు" అన్నాడు.

    "నేను నిన్ను ఇంకోలా నమ్మించగలను కొంచెం బాధగా వుంటుంది అది" అన్నాను.

    "నమ్మించు" అన్నాడు వాడు.

    అరచేతిని కత్తిలాచేసి వెన్నెముక అయిదో పూసకి, ఆరో పూసకి మధ్య కొట్టగా విరుచుకుబడ్డాడు. "నాకు అది నేర్పుతూ ఠాకూర్ 'తనొక్కడే ఇలా కొట్టగలననీ, నేను రెండో వాణ్ననీ' అన్నాడు. పోతే ఠాకూర్ కి బలం తక్కువ కాబట్టి నాలుగు గంటలు, అతడికన్నా వయసులో వున్నాను కాబట్టి. నేనైతే ఆరుగంటలు. ఇతడికి ఆరుగంటల్లో స్పృహ వస్తుంది" అన్నాడు.

    అందర్లోకి పొడుగ్గా వున్నవాడు బిగ్గరగా నవ్వి "శభాష్" అన్నాడు. మిగతా యిద్దరు క్రిందపడిన వాణ్ని గుర్రం మీదకు చేర్చారు.

    "వెళ్ళొస్తాం-"

    "మంచిది."

    వాళ్ళు నెమ్మదిగా కదిలేరు. నేను రెండడుగులు వేసి వెనక్కి తిరిగేను. వాళ్ళు అప్పటికే దూరమయ్యేరు. నోటిచుట్టూ, చేతులుపెట్టి బిగ్గరగా అరిచేను. 'భయ్యా! ఠాకూర్ ఎక్కడున్నాడు.......?'

    గాలిలో అలల్లా వాళ్ళ జవాబు తేలి వచ్చింది.

    "మాకు తెలీదు!"

                               *    *    *

    కాళికాదేవి గుడి వెనుక చెదురు మదురుగా పడివున్న రాళ్ళలో నాకు కావాల్సింది వెతుక్కోవడానికి కొంచెం శ్రమే అయింది బలం అంతా ఉపయోగించి రాతిని కదిపేను. క్రింద గోతిలో చిన్న పెట్టే కనబడింది.

    తెరిచి చూసేను రెండు బంగారపు గొలుసులు, చెవుల ఆభరణాలు, దిద్దులూ వున్నాయి. మొత్తం అంతా కలిపి ఇరవై వేల దాకా వుండొచ్చు.

    "ఎందుకైనా పనికి వస్తాయని అప్పుడు దాచేను. వాటి సంగతే తరువాత మార్చిపోయేను. నువ్వు  తీసుకో-" అన్న ఠాకూర్ మాటలు జ్ఞాపకం వచ్చేయి.

    ఆలోచన్ల మధ్య పెట్టె మూస్తూ, ఒక మూలగా వున్న అక్షరాలు చూసి ఆగేను, పరీక్షగా చూస్తే "రాజా నరేంద్రవర్మ" అని చిన్న చిన్న అక్షరాలు కనిపించినయ్.

    నాలో మళ్ళీ పరస్పర విరుద్ధమైన భావాలు మొదలయ్యేయి. ఈ చిన్న నగల పెట్టె ఎవరిదో తెలిసేక, దాన్ని నా కోసం వాడుకోబుద్ది కావటంలేదు. తెలియపోతే అది వేరే విషయం.

    క్షణంసేపు ఆలోచించేను.

    ఏ న్యాయాన్ని గౌరవించి,చేయని తప్పుకు శిక్ష అనుభావించానో, అదే న్యాయం మళ్ళీ గెలించింది.

    ఫలితం -మళ్ళీ రెండువందల మైళ్ళు ప్రయాణం.

    మరుసటిరోజు ప్రొద్దున్నకి నరేంద్రవర్మ సంస్థానాన్ని (ఇప్పుడా మాట ఉపయోగించవచ్చో, లేదో నాకు అంతగా తెలీదు. కాని ఆ భవనం మాత్రం గొప్ప  గొప్ప రాజులు నివసించే హర్మ్యాలకన్నా అద్భుతంగా వుంది) చేరుకున్నాను.

    లోనికి ప్రవేశం దొరకటానికి నాకు చాలా కష్టమయింది. ఎలాగైతేనేం కష్టపడి ప్రవేశించగలిగాను.

    క్షణంసేపు నా కళ్ళు చెదిరిపోయినయ్ ఎత్తయిన స్తంభానికి ఎందరో శిల్పులు ఎంతో కష్టపడి  చెక్కిన లతలు  నిజమనే భ్రాంతి  కలిగిస్తున్నాయి. నడుస్తూంటే కాళ్ళక్రింద తివాసి - నడవటానికి కాదేమో అన్నంత అందంగా మెరుస్తూంది. గోడలకి రంగు రంగుల బొమ్మలు ప్రాచీన వైభవాన్ని చాటుతున్నాయి.

    "ఏం కావాలి నీకు?" గంభీరంగా వినిపించటంతో అటు చూసేను. అందమైన సింహాసనం లాంటి ఎత్తయిన కుర్చీలో వున్నాడు. అతడికి దాదాపు యాభై ఏళ్ళ వయసు వుంటుంది. కళ్ళు తీక్షణంగా వున్నాయి. మొహంలో అదో విధమైన తేజస్సుంది. ఇలాటి తేజస్సే నాకు ఠాకూరులో కనపడింది. అతడివైపే కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాను- అతడితోపాటు దాదాపు  ఇరవైమంది దాకా అక్కడున్నారు. నేను మవునంగా వుండటం చూసి వారు నావైపు చిత్రంగా చూసేరు. అది గమనించి అడుగు ముందుకేసేను. చేతిలో పెట్టె అతడికి అందించేను. నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని అందుకొని పరిశీలించేడు. క్షణంలో అతని కళ్ళు పెద్దవయ్యేయి. చప్పున మూత తెరిచి లోపలి ఆభరణాలు బయటికి తీసి చూసేడు.

    "ఇవి ఎక్కడివి నీకు" ఎంత అణచుకోటానికి ప్రయత్నించినా అతడి కంఠంలో ఉద్వేగం కనపడింది.

    "దొరికేయి."

    "ఎక్కడ-"

    "........అడవిలో కాళికాదేవి గుడి వెనుక పెట్టెమీద మీ  పేరుండటం చూసి తీసుకొచ్చేను."

    చాలా అపురూపమైన వస్తువుల్ని పొందినట్టు వాటివైపు ఆప్యాయంగా చూస్తూ చాలాసేపు వుండిపోయాడు. తరువాత బరువుగా ఊపిరి తీసి వదుల్తూ నా  వైపు తిరిగి "మీకు నా కృతజ్ఞతలు. నా కొడుకూ కోడలు జ్ఞాపకార్థం ఇవి నాకెంతో ముఖ్యం" అన్నాడు.

    నేను ఉలిక్కిపడి "అంటే" అడిగాను.

    నరేంద్రవర్మ మాట్లాడలేదు. పక్కన ఎవరో అందుకొని "ఆ కాళికాదేవి గుడి దగ్గర దాదాపు పది సంవత్సరాల క్రితం చినబాబు అమ్మగారితో కలిసి వెళ్తూంటే హఠాత్తుగా దోపిడి చేసేరు. అందులోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయేరు" అన్నారు.

    నేను మౌనంగా వుండిపోయేను. చాలా  బాధాకరమైన పరిస్థితి అది  అడవుల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు పక్కన యెంత బలగమున్నా కష్టమే బందిపోట్లు హఠాత్తుగా దాడిచేస్తారు. వారి తాకిడికి తట్టుకోవటం కష్టం.నేను  ఆలోచిస్తున్నది అదికాదు ఆ వృద్ధుడికి పుత్రశోకాన్ని కలిగించింది ఠాకూర్. అదీ బాధగా వుంది.

    నరేంద్రవర్మ తేరుకున్నట్టున్నాడు- పాత జ్ఞాపకాలతో కంటి చివర నిలిచినా నీటిబిందువులు చిటికెన వ్రేలితో విదిలించేడు. నా దగ్గరగా వచ్చి భుజం మీద  చేయివేసి- "మీ గురించి తెలుసుకోవచ్చా" అడిగాడు.

    నేను తలవంచుకొని "తెలుసుకోవటానికి ఏమీలేదు. నేనో 'అనాధను' అంతే" చెప్పాను.

    "మా దగ్గరే వుండిపోండి అయితే".

    "లేదు లేదు" కంగారుగా అన్నాను. "నేను వెళ్ళిపోవాలి."

    అతను చేతి వ్రేలునుంచి ఉంగరం తీసి యిస్తూ "యిది వుంచండి" అన్నాడు విస్మయంగా అతడివేపు  చూసేను. విషాదంగా  నవ్వేడు -"ఎప్పుడో చనిపోయిన  నా కొడుకు జ్ఞాపకంగా నాకీ వస్తువులు తెచ్చి పెట్టారు. ఇది దానికి  ప్రతిఫలం అనను, నా సంతోషం కోసం  ఇది మీరు  స్వీకరించక తప్పదు."

    వంగి వేలికి స్వయంగా తొడిగి, లేస్తున్నప్పుడు చూసేను-

    అతడి మెడలో అలాంటిదే లాకెట్....అటూ యిటూ ఊగుతోంది.

    నా.....నోటివెంట అప్రయత్నంగానే చిన్న కేకలాటిది వెలువడింది. నా మొహంలో మారుతున్న రంగుల్ని గమనించి "ఏమిటి, అలా అయిపోయారు?" అన్నాడు.

    అతడి మెడలో లాకెట్ వేపు చూపుతూ "ఇది....ఇది.....మీకెక్కడిది?" అడిగాను విస్మయంతో. చుట్టూ వున్నవాళ్ళు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకొన్నారు. నాతో ఇంతకు ముందు మాట్లాడిన మనిషి కల్పించుకొని "అదేమిటి బాబూ- ఈ  వంశంలో ప్రతివాళ్ళు ఈ హారాన్ని ధరిస్తారు. రాజవంశానికి అది గుర్తు" అన్నాడు.

    నా తల గిర్రున తిరగసాగింది. అది ఆనందమో, ఇంకే స్థితో వివరించలేను. నిలదొక్కుకోవటానికి విఫల ప్రయత్నం చేసేను.

    "మీ ఆరోగ్యంలో ఏ లోపమూ లేదు కదా" అంటున్నాడు నరేంద్రవర్మ.

    అతికష్టంమీద నన్ను నేను సంబాళించుకుని, "ఇలాంటి హారం నా మెళ్ళోనూ వుండేది" అన్నాడు.

    అంతే, సూదివేస్తే వినపడేటంత నిశ్శబ్దంగా తయారయింది ఆ హాలు. అందరూ నా వయిపే కళ్ళప్పగించి చూడసాగేరు. చాలా భయంకరమైన నిశ్శబ్దం అది. అందరికన్నా ముందు నరేంద్రవర్మ తేరుకొన్నాడు. "ఎవరు నువ్వు?" అడిగాడు.

    మా పల్లె పేరు చెప్పి అక్కడికి పదిమైళ్ళ దూరంలో వున్న అడవిలో పాతికేళ్ళ క్రితం అమ్మకి దొరికిన వైనం వివరించేను. వింటున్నంత సేపూ నరేంద్రవర్మ భృకుటి ముడిపడి వుంది. చెప్పటం పూర్తిచేసి అతడి వేపు చూసేను. తనలో తనే ఆలోచించుకొన్నట్లు మౌనంగా వుండిపోయేడు అందరూ అతడి నోటివెంట రాబోయే మాటకోసం ఆతృతగా చూస్తున్నారు. అతడు  కుర్చీలో ఇట్నుంచి అటు కదలి సర్దుకొన్నాడు.

    "నీ దగ్గిర లాకెట్ ఏది?" చేయి చాచి అడిగాడు.

    "ప్రస్తుతం లేదు."

    "ఎక్కడుంది?"

    "తెలీదు-"

    "అంటే-"

    మాట్లాడలేదు నేను.

    'నిన్ను ఏ రాజూ గుర్తుపట్టకుండా ఈ లాకెట్ నాకిచ్చేస్తున్నావన్న మాట' అన్న పార్వతి మాటలు జ్ఞాపకం వచ్చేయి. మౌనంగా వుండి పోయేను.

    నరేంద్రవర్మ కుర్చీలోంచి లేచి నా దగ్గరగా వచ్చేడు- అతడి మొహం కర్కశంగా వుంది. అయినా తాపీగా అన్నాడు. "ఇన్నాళ్ళ తరువాత నువ్వు ఇలా  రావటం ఆశ్చర్యాన్నేకలిగించింది. ఐతే నగల పెట్టె తెచ్చిచ్చి ప్రాపకం సంపాదించటం కోసం వచ్చేనేమో అనుకున్నాను. అంతకన్నా పెద్ద ఎత్తులోనే వచ్చేవన్నమాట సెభాష్.....తెలివతేతలు ఎక్కడున్నా గౌరవిస్తాన్నేను. పోతే నవ్వు చెప్పిన అడవీ, ఆ అడవిలో పాతిక సంవత్సరాలక్రితం నా మనవడ్ని వదిలేసి ప్రాణాలు రక్షించుకోవటం, వాళ్ళు పరుగు దియ్యటం ఈ కధ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వొచ్చి- ఆ మనవాణ్ని నేనేనంటే నమ్మే మూర్ఖులు ఎవరూ లేరిక్కడ."

    "కానీ......." అంటూ ఏదో చెప్పబోయాను.

    "నువ్వు ఇంకా మాట్లాడి, మావాళ్ళ నిన్ను మెడపట్టుకుని గెంటే సన్మానం చేయించుకోవాలనుకుంటే నాకు అభ్యంతరంలేదు."

    ఒక క్షణం అతడి కళ్ళల్లోకి సూటిగా చూసేను "సరే వెళుతున్నాను. డబ్బు నన్నెప్పుడూ బంధించలేదు. ఇక ముందు బంధించదు కూడా. నేను మిమ్మల్ని మోసం చెయ్యాలని అనుకొని వుంటే ఇంకా పకడ్బందీగా ప్లాన్  వేసి వుండేవాణ్ని- పోనీయండి- నాకు అసలు యీ బంధుత్వలమీదే  నమ్మకంలేదు, పోతే నాదో చిన్న కోరిక. నలుగురు దొంగలు చుట్టుముట్టగానే కన్నకొడుకుని - పాలుతాగే పసివాణ్ణి - అడవిలో తుప్పల మధ్య పారేసి పరుగులు తీసిన ఆ తల్లిదండ్రుల ఫోటో వుంటే ఒక్కసారి చూపిస్తారా.........?"

    నరేంద్రవర్మ మొహం ఆవేశంతో ఎర్రబారింది. గట్టిగా, "గెటవుట్" అని అరిచేడు.

    నెమ్మదిగా వెనక్కి తిరిగాను. చుచ్టూ అందరూ మావైపే కళ్ళప్పగించి చూస్తున్నారు. చేతులు రెండూ ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తలవంచుకొని బయటకు వచ్చేసేను. వెనక్కి తిరిగి చూస్తే - ఆ పురాతన భవనపు ఎత్తయిన స్తంభాలు జాలిగా వీడ్కోలు చెబ్తున్నట్లు అనిపించింది.

    నవ్వు వచ్చింది విషాదంగా నాలో నేనే నవ్వుకొన్నాను. మెలోడ్రామా ఎక్కడోలేదు. మన జీవితాల్లోనే వుంది.

    చరిత్ర ఎంత చిత్రమయింది. ప్యూడల్ వ్యవస్థకి ప్రతీకలయిన నా తల్లితండ్రుల్ని చంపింది, తుపాకిద్వారా సమానత్వాన్ని తేవాలనుకొనే నా గురువు ఠాకూర్ మరణం ఓటమికి చిహ్నంకాదు అని ఠాకూర్ అన్నప్పుడు ప్రభావితుడనైన నేను ఈ  సిద్ధాంతం నా తల్లిదండ్రుల్నే చంపినప్పుడు పునరాలోచించుకోవలసి వచ్చింది. మళ్ళీ ఘర్షణ.

    ఈ ఘర్షణ ఒకవేపు, తరువాత ఏం చెయ్యాలన్న ప్రశ్న యింకో వయిపు! నా  దగ్గిర డబ్బులేదు.

    చాలా చౌకబారు లాడ్జీలో దిగేను. మేడమీద మూడు గదుల్లో  మధ్యది నాది. ముందు చిన్న వరండా, దానికి చెక్కల రెయిలింగ్ వుంది. నడుస్తూంటే పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయేలా వున్నాయి మెట్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS