Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 11


                                                 7

    ఒకరోజు గడిచింది.

    తెరవెనుకేవుండి పార్వతి ఆచూకీ తీయ్యటానికి నేను ప్రయత్నించిన మార్గాలన్నీ నిష్పలమయ్యేయి. ఏం చెయ్యాలో తోచలేదు - ఎవర్నీ నమ్మడానికి, నా ఉనికి బహిర్గతపరచడానికి  వీలులేదు. అయినా నా పట్టు వదులుకోదల్చుకోలేదు. వెదుకుతూనే వున్నాను. మా పాక పార్వతి ఇల్లూవున్న పరిసరప్రాంతాల్లో గాలించేను. లాభం లేకపోయింది.

    మధ్యాహ్నం పన్నెండయింది. ఎండ మాడ్చేస్తుంది.

    తిరిగి తిరిగి బస్టాండ్ చేరుకొన్నాను. దాహంతో నోరు ఎండిపోతూ వుంటే కిళ్ళీకొట్టు దగ్గర ఆగి సోడా కొట్టమన్నాను.  సోడా త్రాగి డబ్బులిస్తూ అతడి మొహంలోకి చూసి, ఆనందం పట్టలేక "ఇస్మాయిల్" అన్నాను.

    అతడు నావేపు విచిత్రంగా చూసి -

    "ఎవరు మీరు?" అడిగాడు.

    "నేను.... నేను కృష్ణని-" ఎదురు చూసిన పెన్నిధి దొరికిన ఆనందంలో నా నోటివెంట మాట రాలేదు.

    అతడు నావైపు సూటిగా చాలాసేపు చూస్తూ వుండిపోయేడు. నా చేతిని తన చేతిలోకి తీసుకొని, తనలో తనే గొణుక్కుంటున్నట్టు "ఇదేమిటి - నిజవాఁ నిజమే? నమ్మలేకపోతున్నాను! నమ్మను" అన్నాడు మళ్ళీ అతనే.

    "కృష్ణే, కొద్దిగా పోలికలు కనబడుతున్నాయి" అన్నాడు.

    నేను నవ్వి "యా అల్లా, నన్ను మర్చిపోయేవా" అడిగేను. అతను ఎప్పుడూ వాడే ఆ వూతపదం నేను వాడేసరికి కొట్లోంచి క్రిందికి ఒక్క దూకులో దూకి నన్ను కౌగిలించుకొని "ఎన్నాళ్ళయింది భయ్యా" అని అరిచేడు.

    కొట్టువైపు తిరిగి పైనుంచి తలుపులాగి తాళం వేసేసేడు.

    "నేను ఆశ్చర్యంతో అదేమిటి" అన్నాను.

    "పద, పద, ఇంటికిపోయి మాట్లాడుకుందాం" అన్నాడు నా భుజం మీద చెయ్యివేసి తోసుకెళుతూ.

                               *    *    *

    "అది భయ్యా జరిగింది" అన్నాడు భోజనం చేసి కూర్చున్నాక.

    "అయితే నువ్వూ సరీగ్గా చెప్పలేవన్నమాట" అన్నాను.

    "అసలు పార్వతి ఇక్కడికి రాలేదు భాయ్.."

    "మరి తండ్రి చనిపోయాక-"

    "ఇంకెవరున్నారు ఇక్కడ? అందుకే పట్నంలో బంధువుల ఇంట్లో వుండి పోయింది అనుకున్నాం అందరం."

    "మరి తండ్రి శవాన్ని చూడటానికయినా రాలేదా?"

    "శవం ఎక్కడుంది భయ్యా! కొయ్యడానికి పట్నం తీసుకుపోయేరుగా. మీ  బాబాయి అక్కడే దాన్ని కాల్పించేడు."

    "మరి ఇల్లు-"

    "ఆది లక్ష్మీనారాయణ కొనుక్కున్నాడుగా! డబ్బు పార్వతికిచ్చినాడంట పట్నంలో -తండ్రి పోయినాడనగానే పార్వతి మూర్ఛపొయిందంట. రెండురోజుల వరకూ  స్పృహ లేదంట. స్పృహ వచ్చేక- అసలు  ఈ ఊరే రానందంట. తనకెవరూ లేరనీ, ఇంక ఆ ఊరికీ, తనకీ సంబంధం లేడనీ అన్నదట."

    ఆవేశంతో నా దవడ కండరాలు బిగుసుకున్నాయి. "మరి నేనేమయ్యానుట?" అన్నాను కసిగా.

    "తండ్రిని చంపింది నువ్వేనని తెలిసి 'ధూ' అని ఉమ్మేసిందట".

    "నేను నమ్మను" అరిచేను. ఆ అరుపుకి లోపల్నుంచి ఇస్మాయిల్ కూతురు తొంగి చూసి లోపలికి వెళ్ళిపోయింది. నన్ను కంట్రోలు చేసుకొంటూ "ఏదో మోసం జరిగింది యిస్మాయిల్" అన్నాను.

    "లేదు భయ్యా! లక్ష్మీనారాయణ ఆమెకి ఇరవై వెలిచ్చేడట. కరణంగారు స్వయంగా పత్రాలు రాసేడు. ఆ యింటికి పదివేలకన్నా ఎక్కువ పలకదనీ, చాలా  గొప్ప హృదయంతో ఆ తండ్రిపోయిన పిల్లని ఆదుకున్నాడనీ అనుకొన్నారు."

    లేచి, పార్వతి పట్నంలో ఎక్కడుందో తెలుసా?" అన్నాను.

    "తెలీదు."

    "ఎవరికి తెలుస్తుంది?"

    "లక్ష్మీనారాయణకి-"

    "అతడికి కాదు" విసురుగా అన్నాను. "ఇంకెవరికైనా."

    "పార్వతికి ఆ రోజుల్లో నువ్వూ, మీ అమ్మ తప్ప యింకెవరూ అంతగా పరిచయం లేదు. ఎవరూ ఆవిడ గురించి అంతగా పట్టించుకోలేదు."

    "అవును అది నిజమే తండ్రిపోయేడు -ప్రేమించినవాడు హంతకుడయ్యాడు ఉన్న ఆస్తికి మంచి  ధర పలికింది. ఇంకేమంది బంధం - ఎందుకు రావాలి ఇక్కడికి -?"

    "అంటే- అంటే- పార్వతి అంతా నమ్మేసిందా? నన్ను హంతకుడిగా భావించిందా?"

    తండ్రిని చంపిన హంతకుడ్ని కనుక నాతో పరిచయాన్ని తెంపుకొని వుండవచ్చు. కాని నా తల్లిని కూడా- అసలు నా తల్లి ఎక్కడుంది? అదే ప్రశ్న అడిగేను. ఇస్మాయిల్ మాట్లాడలేదు. నా మనసు  కీడును శంకించింది.

     "చెప్పు ఇస్మాయిల్. అది ఎటువంటి విషయమైనా వినటానికి నేను సిద్ధంగా వున్నాను."

    "నువ్వు అరెస్టయిన రెండు రోజులకే మీ అమ్మ మీ బాబాయి ఇంటి కొచ్చేసింది....." ఆగేడు.

    "తరువాత......?"

    "ఒక నెల రోజులు అక్కడే వుంది భయ్యా ఆ పైన......"

    ఊపిరి బిగపట్టి "ఆపైన....." అన్నాను.

    క్షణంసేపు ఆగి, నెమ్మదిగా అన్నాడు- "ఎదురింటి దర్జీవాడితో లేచి పోయింది-"

    పిడికిలి బిగించి కొట్టిన దెబ్బకి వెనక్కి పడ్డాడు. తల గోడకి కొట్టుకుంది. భయంకరమైనా నిశ్శబ్దం......

    నెమ్మదిగా చేతుల మధ్య లేస్తూ, "నువ్వు భరించలేవని నాకు తెలుసు భాయ్ యా అల్లా పళ్ళూడగొట్టేశావ్" అన్నాడు. నేను చప్పున వంగి అతడికి చేయి  అందిస్తూ కంటినిండా నీటితో  "క్షమించు భయ్యా! ప్లీజ్-" అన్నాను. అతన్ని చేతుల్తో లేపేసేనన్న మాటేగానీ నా మనసు మనసులో లేదు. నన్ను కన్నతల్లిలా సాకిన ఆ పవిత్రమూర్తి ఇంత కళంకాన్ని భరించడానికి ఎందుకు సాహసం చేసింది? ఆ వయసుతో ఆ ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా- అమ్మా ఆ -అమ్మా - నా మెదడు మొద్దుబారిపోయింది. రక్తనాళాలు తెగిపోతాయేమోనన్న భ్రాంతి కలిగింది. ఏదో మైకం నన్ను కమ్మేసింది.

    ఇస్మాయిల్ ఏదో అంటున్నాడు- వినటంలేదు.

    పట్నం వచ్చి నాలుగు రోజులయింది.

    చేతిలో డబ్బు అయిపోసాగింది.

    పార్వతి కోసం వెతుకుతూనే పనేదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నం చేయసాగాను.

    ఏ పనీ దొరకలేదు.

    రోజంతా కష్టపడి పనిచేస్తే మూడు రూపాయలిస్తారట. ఆ రోజుల్లో కన్న ఎక్స్ ప్లాయిటేషన్ ఎక్కువైనట్టుంది. చిత్రమేమిటంటే ఆ మూడు  రూపాయల కూలీకే జనం ఎగబడుతున్నారు. ఈ కూలీలికి తమ శక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఠాకూర్ అన్నట్టు ధర- డిమాండ్, సప్లయి మధ్య వుంటుందనే చిన్న సత్యం ఎప్పుడు గ్రహిస్తారు వీళ్ళు?

    ఠాకూర్ జ్ఞాపకం వచ్చేసరికి నా మెదడులో ఏదో తళుక్కుమంది. చటుక్కున లేచి పెట్టె సర్దుకొన్నాను. సత్రం గుమాస్తాని కనుక్కుంటే ట్రైన్ ఇంకో రెండు గంటల్లో వుందన్నాడు. అద్దే బకాయి ఇచ్చి స్టేషన్ కి వచ్చేశాను. కొద్దిసేపట్లో ట్రయిన్ వచ్చింది.

    దాదాపు ఆరు గంటలు ప్రయాణం చేసిన తర్వాత నేను దిగవలసిన స్టేషన్ వచ్చింది. చాలా  చిన్న స్టేషన్ అది. నేనొక్కణ్నే దిగేను. ప్లాట్ ఫారం అంతా ఖాళీగా వుంది. నిముషం కూడా ఆగలేదు.

    స్టేషన్ కి పదిహేను గజాల దూరం నుంచే అడవి ప్రారంభమైంది. నిర్మానుష్యంగా  వుంది. రైలు పట్టాలు దూరంగా  ఎక్కడో కలిసినట్టు కనబడ్తున్నాయి. సరుగుడుచెట్లు పొడుగ్గా భయంకరంగా నిలబడివున్నాయి. వాటికి కొంచెం లోపలగా చిన్న చిన్నా దుబ్బులూ, లతలూ దట్టంగా పెరిగి పగలే చీకటిని సృష్టిస్తున్నాయి.

    టికెట్ కలెక్టర్ నా దగ్గరగా వచ్చేడు. టిక్కెట్ ఇచ్చేసేను బాగా ముసలతను. ఓవర్ కోర్ వేసుకున్నాడు.

    "ఎక్కడికి వెళ్ళాలి?" అడిగాడు.

    "అడవిలోకి" అని ముందుకు సాగేను.

    దాదాపు గంట ప్రయాణం చేసేను - అడవి బాగా దట్టమైంది. ప్రయాణం చురుగ్గా సాగటం లేదు. ఒకటి, రెండు నక్కలూ, చిన్న చిన్న పాములూ కనబడ్డాయి. ఆశయసిద్ధి కోసం అడవిలో బ్రతికే వాళ్ళ జీవితం పూలపాన్పు కాదు.

    అరగంట  ప్రయాణం జరిగేసరికి మనుష్యులు అలికిడి  వినిపించింది. చూస్తూ వుండగానే నలుగురు ఆశ్వికులు నన్ను చుట్టుముట్టేరు. చాలా భయంకరంగా వున్నారు. నడుముకి అడ్డంగా తుపాకులు వ్రేలాడుతున్నాయి.

    "ఎవరు నువ్వు ?" అడిగాడు అందులో ఒకడు.

    అవును. ఎవర్నినేను?

    కనగానే తుప్పల్లో పారేసిన ఓ తల్లి కన్న కొడుకునా? నలభై ఏళ్ళ వయసులో దర్జీవాడితో లేచిపోయిన ఓ తల్లి పెంచిన కొడుకునా? సంవత్సరాల తరబడి జాగ్రత్తగా పెంచుకొన్న ప్రేమలతని ఒక్క వేటులో నిర్ధాక్షిణ్యంగా నిర్ధాక్షిణ్యంగా తెగగొట్టిన ఓ స్త్రీ ప్రియుణ్నా? ఎవరిని నేను?

    "జవాబు చెప్పవేం?"

    చెప్పేను.

    "ఠాకూర్ బలదేవ్ సింగ్ శిష్యుణ్ని."

    నా సమాధానం వాళ్ళల్లో సంచలనం కలిగించింది. నలుగురూ ఒకేసారి గుర్రాల మీదనుంచి క్రిందికి దిగారు. అందర్లో బలంగా, లావుగా, నల్లగా వున్నవాడు నా దగ్గరగా వచ్చి పరిశీలనగా చూస్తూ "నేను నమ్మను" అన్నాడు.

    నవ్వి "ఎం ఎందుకని?" అన్నాను.

    అందులో ఒకడు నా దగ్గరగా వచ్చి  తుపాకి ఇచ్చి "అదిగో ఆ చెట్టుమీద గూడుని కొట్టు" అన్నాడు బొంగురు గొంతుతో.

    "ఠాకూర్ మీకు తెలుసా?"

    "ఆయన మా గురువు" గర్వంగా జవాబు చెప్పేడు.

    "ఠాకూర్ ఎప్పుడైనా పక్షుల్నీ, పక్షి గూళ్ళనీ కొట్టమని అంటాడని అనుకోను."

    వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. "నిజవేఁ" అన్నాడు అందులో ఒకడు. "అయితే అదిగో" అంటూ పక్కకొండమీద చిన్న గుడిలాంటి దాన్ని చూపించి "దాన్ని గోపురాన్ని కొట్టు" అన్నాడు.

    తుపాకి అందుకుకున్నాను. టార్గెట్ చాలా చిన్నదిగా కనబడుతుంది. నా చేతులు వణికేయి. మొట్టమొదటిసారి తుపాకి పట్టుకోవటం. నా గురి తప్పిన  మరుక్షణం నా శరీరం తూట్లు పడుతుందన్న విషయం తెలుసు. ఠాకూర్ ని మనసులో స్మరించుకొన్నాడు. తుపాకి వెదురు కర్ర  అయింది, ట్రిగ్గర్ రబ్బరుతాడు అయింది. గాలి నెమ్మదిగా వీస్తూంది. ఒక కన్ను మూసేను. నా చెయ్యి బారెల్ చుట్టూ బిగుసుకొంది. ఇంకో చేతి చూపుడు వేలు ముందుకు వంగింది.

    "ఢాం" అన్న  ధ్వనితో అడవి ప్రతిధ్వనించింది.

    గుడిగోపురంమీద  దుమ్ము లేచింది. "శభాష్" అన్నాడు వాళ్ళలో ఒకడు.

    "ఎక్కడికి వెళుతున్నావ్?" అడిగాడు అందులో ఇంకొకడు.

    "అది కాళికాదేవి గుడేనా?"

    "అవును."

    "అక్కడికే"

    "ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS