Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 11



    "నే చెప్పింది వినరు! చెయ్యమన్నది చెయ్యరు! తిన మన్నది తినరు. ఇక నేనేం చేసేది నా శ్రాద్ధం!" అని నణుక్కుని బరబరా మందులు రాసిచ్చారు. పరుగున వెళ్ళి మందులు తెచ్చింది దీపిక. అది మింగించి ఆయనకీ నిద్రపట్టే దాకా అక్కడే కూర్చున్నారు.

    వర్ధనమ్మతో "జాగ్రత్తగా చూసుకోండి" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

    సత్యనారాయణమూర్తిగారికి తగిలిన దెబ్బ సామాన్యమైందికాదు. జరిగిన పూజలతో ఆయన ఇల్లు గుల్లయి పోయింది. చేసిన  ఉపవాసాలతో ఒళ్ళు గుల్లయిపోయింది. ఇష్టంవచ్చినట్లు చెప్పాపెట్టకుండా శెలవులు పెట్టెయ్యడం వల్ల  ఆఫీసులోకూడా చెడ్డపేరు వచ్చింది. అయితే ఈ  సమస్యలేవీ ఆయనని బాధించలేదు. ఆయన బాధల్లా  ఇక్కటే లంకెబిందెలు ఎప్పుడు దొరుకుతాయో! ఎలా దొరుకుతాయో! ఎలా దొరుకుతాయో!

    అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఆయన ఆరోగ్యం మరింత పాడైపోయింది. డాక్టర్ల సలహాని అనుసరించి వాలంటరీ  రిటైర్ మెంట్ తీసుకున్నారు ఆయన.

    కృష్ణ ఉద్యోగంలో చేరాడు. దీపిక డిగ్రీ తీసుకుంది. కూతురి పెళ్ళి చేసేద్దాం అంది వర్ధనమ్మ.

    "ఇప్పుడప్పుడేకాదు. కొన్నాళ్ళాగి చేద్దాం" అన్నాడాయన.

    ప్రస్తుతం చేతిలో డబ్బులేదు మరో నాలుగురోజులుపోతే బిందెలు ఎలాగూ దొరుకుతాయి. ఏకంగా అప్పుడు ఏ కోటీశ్వరుడికో ఇచ్చి చెయ్యొచ్చు. అదే ఆయన ప్లాన్.

    ఆ రోజుల్లో ఒక జాతకాలు చూసే ఆయన తటస్థ పడ్డాడు సత్యంగారికి. పూజలూ హొమాలూ చేయించలేదు ఆయన. రెండొందల యాభై తీసుకొని జాతక చక్రం వేశాడు. త్వరలో నీకు మహాణుభావుడు పరిచయం అవుతాడు. ఆయన ద్వారా నీకోరిక నెరవేరుతుంది అని చెప్పాడు.

    ఆ తరువాత ఒక కోయవాడు తటస్థపడ్డాడు. నూట పదహార్రూపాయలు తీసుకుని లంకెబిందె లెక్కడున్నాయో చెప్పాడు. ఆ  వేళ సత్యంగారి ఆనందం వర్ణనాతీతం.

    ఆ ప్లాను అంతా వివరంగా రాయించుకుని భద్రంగా పెట్లో దాచిపెట్టాడు. లంకె బిందెలు ఎక్కడున్నాయో తెలిసింది ఇక తవ్వి తెచ్చుకోడమే తరువాయి. కానయితే అది ఒకడివల్ల అయే పనికాదు. అందులోనూ తనలాటి మనిషివల్ల అసలేకాదు.  నాలుగడుగులు వేసేసరికి ఆయాసం ఎగరొప్పు ప్రారంభం అవుతాయి. అలాటిది గజాల  పోడుగానా తవ్వాలంటే సామాన్యమా! అందుకనే ఆలోచించి_ ఆలోచించి  పుత్రుడికి ఈ బాధ్యత అప్పగించ దల్చుకున్నాడు ఆయన. కన్నబిడ్డ, లంకె బిందెలకి భావి వారకున్నాడు ఆయన. కన్నా బిడ్డ, లంకె బిందెలకి భావి వారసుడు అతడే మరి. ఆ మాత్రం చెయ్యకపోడు అనుకుని, ఆ రాత్రి అందరూ పడుకున్నాక మెల్లిగా కొడుకుని లేపాడు.

    "కృష్ణా నీతో మాట్లాడాలి నా దగ్గరకూర్చో!" అన్నాడు.

    ఆవలిస్తూ వచ్చి కూర్చున్నాడు క్రిష్ణ. "చెప్పండి" అన్నాడు.

    "నీకో పెద్ద బాధ్యత అప్పగించ దల్చుకున్నానురా  అబ్బాయ్! నా ఆర్యోగం అంత బాగాలేదు" అన్నాడు.

    "ఏమిటా బాధ్యత? చెల్లాయి పెళ్ళా?" అడిగాడు క్రిష్ణ.

    "కాదురా! ఎన్నాళ్ళగానో నీకు చెప్పాలనుకుంటున్నాను. నా జాతకంలో లంకె బిందెలు దొరుకుతాయని రాసి వుందిట. అవి ఎక్కడున్నాయో కనుక్కునేందుకు నేను పడినపాట్లు ఆ భగవంతుడికి ఎరుక. ఎలాగయితేనేం సాదించాను. వాటి ఆచూకి దొరికంది ఇక తవ్వి తెచ్చుకోవటమే తరువాయి. నావల్ల అయ్యేపనికాదు. చాలా శ్రమతో కూడుకున్న పని. నా ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా వుంది. పోనీ అలా అని మరొకరికి పురమాయించే పని  అంతకంటే కాదు. అందుకని యిక నువ్వే సాధించాలి. బిందెలు దొరకగానే మన దశ మారిపోతుంది. నాకు ఒక్క గాను ఒక్క కొడుకుని నువ్వు. నాకూ, మీ అమ్మకీ, చెల్లాయికీ కలిపి ఒక బిందె నీకు ఒక్కడికే ఒక బిందె."

    "నా బొంద" మధ్యలోనే ఆపేశాడు క్రిష్ణ.

    "మీకేమైనా మతిపోయిందా నాన్నా! యేమిటి మీరు చెప్పేది మీకు లంకెబిందెలు దొరుకుతాయా?" అన్నాడు విసురుగా.

    "అవున్రా! మన తాతముత్తాతలు బిందెలనిండా వజ్ర వైఢూర్యాలు నింపి పాతేశారుట. మన పూజ గడికి ఈశాన్య దిశలో పదహారువందల గజాల దూరం వెళ్ళి పశ్చిమానికి తిరిగి మళ్ళీ పదహారువందల గజాలు తవ్వి ఆ తరువాత తూర్పుకితిరిగి!" వివరంగా చెప్పసాగాడు ఆయన.

    "యిక చాల్లే వూరుకోండి. యెవరన్నా వింటే నవ్విపోతారు. నాకందుకే మిమ్మల్నిచూస్తే ఒళ్ళు మండేది. చేసే పనులకి తలా తోకా వుండదు.

    యెవడో పొట్టకూటికోసం జాతకాలు రాసేవాడు చెప్పాడే అనుకోండి మీరెలా నమ్మారు. తరతరాలుగా మన కుటుంబం మధ్య తరగతి కుటుంబమే అనీ, అందరూ రెక్కాడితేగాని డొక్కాడని బాపతేననీ మీరే యెన్నో సార్లు చెప్పారు మరి అలాటిది మన తాత ముత్తాతల దగ్గర బిందెడు వజ్రవైఢూర్యాలు యెక్కడనించి వచ్చాయి?

    ఉన్నది ఏదో కొడుకులకి యిచ్చి పోతారుగానీ భూమిలో పాతిపెడతారా?

    సరే పాతిపెట్టారే అనుకుందాం! మన స్వంత వూరు క్రిష్ణా జిల్లాలో వుంది. మనవాళ్ళంతా అక్కడే వుండేవాళ్లు. పాతిపెట్టినా అక్కడే పాతిపెడతారుగానీ ఇక్కడ ఎందుకు పాతిపెడతారు?

    మన స్థలం అంతా  కలిపి ఆరొందల గజాలు. ఆ తరువాత వున్న స్థలంలో మనకేమీ హక్కులేదు. మరి పదహారోందలు, ఏడొందలు, గజాలు ఎలా తవ్వగలం.

    సరే తవ్వేం! దొరికాయే అనుకోండి, భూగర్భంలో దొరికిన ప్రతి వస్తువూ ప్రభుత్వానికి చెందుతుంది అనే చిన్న విషయం తెలియదా మీకు? మన ప్లాను యెవరికైనా తెలిస్తే పోలీసులకి చెప్పి మనల్ని లాకప్ లో పెట్టిస్తారు. ఇక అప్పుడు జైలుకెళ్ళి గోతులు తవ్వుకుంటూ రాళ్ళు కొట్టుకుంటూ భావిజీతం గడపాలి.

    ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఎవరేది చెప్పితే అది నమ్మేస్తారుగానీ నాన్నా ముందు వెనకలు ఆలోచించరేం? లక్షసార్లు చెప్పెను మీకు. ప్రాక్టికల్ గా ఆలోచించండీ! ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడవండి! అంటాను వింటారా మీరు!"

    ముందు గదిలో మంచం వేసుకుని పడుకున్న వర్ధనమ్మకి ఏవో మాటలు వినిపించి మెలకువ వచ్చింది. కొడుకు కంఠం వినిపించి గాభరాగా వరండాలోకి వచ్చి లైటు వేసింది. ఎదురుగా మంచంమీద నిస్సహాయంగా పడుకొని రొప్పుతున్నారు సత్యంగారు ఎదురుగా నిలబడి ఆవేశంతో వాదిస్తున్నాడు కృష్ణ.

    "ఒరే క్రిష్ణా! ఏమిట్రా అది! కన్న తండ్రి అనే గౌరవం లేకపోయినా బ్లడ్ ప్రెషర్ మనిషి అని జాలయినా లేదుట్రా నీకు! అర్థరాత్రి ఆయన ప్రాణం విసిగిస్తున్నావ్! పో అవతలకి!" అని కసిరింది. విసురుగా లోపలికి వెళ్ళి పోయాడు కృష్ణ.

    ఆయనకీ మందులిచ్చి సపర్యలు చేస్తూ కూర్చుంది ఆవిడ కాసేపటికి సర్దుకున్నారు సత్యంగారు కొడుకు వాదన వల్ల ఆయన ఆశ అణగారిపోయింది. మొండి వెధవ తనెళ్ళి తవ్వి తెచ్చుకుందాం అంటే వెళ్ళి నిజంగానే పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా ఇవ్వగల సమర్థుడు. లాభంలేదు.

    దీన్నిబట్టి ఆలోచిస్తే తనకు ఆ జాతకం వేసినాయన చెప్పినట్లు మహా పురుషుడు ఇంకా తారనపడలేదు. కానీ, దేనికయినా సమయం రావాలి. అనుకున్నాడు దీనంగా నిట్టూరుస్తూ.

    దీపిక రిజల్ట్సు వచ్చేసాయి. పాసయ్యింది. ఆ సందర్భములో స్నేహితులంతా కలిసి పిక్చర్ కి వెళ్దాం అని ప్లాన్ వేశారు. దీపికనికూడా రమ్మని బలవంతం చేసారు. అన్యమనస్కంగానే బయలు దేరింది దీపిక సినిమా అయిపోయాక మా ఇంటికి రండి ఐస్ క్రీం ఇస్తాను అని బలవంతం పెట్టి లాక్కుపోయింది ఒక ఫ్రెండ్.

    ఆ ప్రోగ్రాంకూడా అయ్యేసరికి  ఒంటిగంట అయింది అమ్మాయిలంతా బస్ స్టాప్ కి వచ్చారు. ఎఅవారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దీప ఒంటరిగా మిగిలిపోయింది బస్ ఎంతకీ రాలేదు. రిక్షాకూడా లేదు. చూసి చూసి విసుగు వేసి వడవటం మొదలు పెట్టింది. ఓ ఫర్లాంగు దూరం వచ్చేసరికి టపటపా వాన మొదలయింది. నిలబడడానికి బాగా ఏమీలేదు. పక్కనున్న చెట్టుకిందకి వెళ్ళి నిలబడింది.

    క్రమంగా ఎక్కువయింది వాన ఇక లాభంలేదని పక్కగావున్న ఇంటి గేటు తీసుకుని ఇంటి వరండాలోకి వెళ్ళి నిలబడింది. ఆ లొకాలిటీలో ఇళ్ళు దూర దూరంగా వున్నాయి.

    పమిటటో మొహం తుడుచుకుంటూ ఇంటిని పరిశీలించి చూసింది ఇల్లయితే నీటుగానే వుందిగానీ ఎక్కడా అలికిడి లేదు. వర్షం హెచ్చయింది. ప్రొద్దునెప్పుడో తిన్న టిఫెన్, ఆ తరువాత తిన్న ఐస్ క్రీం అరిగిపోయి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నీరసంగా మొహం వేలాడేసుకుని వర్షం వంక చూస్తూ నిస్సహాయంగా వుండిపోయింది దీప.

    హఠాట్టుగా తలుపు తెరుచుకుంది. వరండాలోకి వచ్చాడు ఆ యింటి యజమాని. సగం తడిసిపోయి నిలబడిన దీపిక వంక ఎగాదిగా చూశాడు.

    "హూ ఆర్యూ" అని అడిగాడు.

    "నాపేరు దీపిక, పిక్చర్ నించి వస్తుంటే మధ్యలో వాన పట్టుకుంది. అందుకే ఇలా వచ్చి నిలపడ్డాను." అంది మొహమాటంగా.

    తలపంకించాడు ఆయన, "ఇలాటి అవస్థలు వస్తాయనే నేను ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళినా అంబ్రెల్లా తీసుకువెళతాను. జనం నన్ను చూసి నవ్వుతూ వుంటారు. అయినా నేను లెక్కచెయ్యను. ఆ నవ్విణ వాళ్ళు ఎవరైనా అవసరానికి వచ్చి ప్రొఫెసర్ పృద్వీ ఇదిగో గొడుగు అని నాకిస్తారా? ఫ్రం నౌ ఆన్ వర్డ్స్ యూ ఆల్సో టేక్ అంబ్రెల్లా వేరెవర్ యూగో!" అన్నాడు.

    ఆయన మాటలు వచ్చాయి. దీపికకి. నిజమే అలా అయితే ఈ పాటికి ఇంటికి చేరిపోయి అన్నం తినేసి పడుకుని వుండేదాన్ని కదా! అనుకుంది.

    "కమాన్! లోపలికి రా! టీ తీసుకుందువు గాని!" అన్నారాయన.

    కంగారు పడింది దీపిక "వద్దండీ! ఇప్పుడేం టీ? నేనింకా భోజనమే చెయ్యలేదు" అంది.

    సీరియస్ గా చూశారాయన. "మీ యంగ్ జనరేషన్ అంటే ఇందుకే నాకు నచ్చనిది. వేళకి తినరు. వేళకి విశ్రాంతి తీసుకోరు బారెడు పొద్దెక్కాక బ్రేక్ ఫాస్ట్ అపరాహ్ణం దాటాక లంచ్ అర్థరాత్రి డిన్నర్. అందుకే ఈ రోజుల్లో ఆరోగ్యాలు అలా పాడైపోతున్నాయి. పాతికేళ్ళకి అల్సరు. ముప్పై లివర్ కంప్లయిట్ ముప్పై అయిదుకల్లా హార్ట్ ఎటాక్ ఇక కౌంట్  డౌన్ మొదలు.

    నన్ను చూడు. అంతా టైం ప్రకారం చేస్తాను. సిక్స్ కి బెడ్ టీ, సెవెన్ థర్టీ బ్రేక్ ఫాస్ట్ , లెవెన్ కి లంచ్ టూకి టీ సెవెన్ థర్టీ డిన్నర్ అటు సూర్యుడు ఇటు పొడిచినా నా టైమింగ్స్ మారవు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS