Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 10


    ఉదయం లేవగానే దగ్గర కూర్చుని హోం వర్కంతా పూర్తిచేయించింది రాగిణి."
    "బోట్ లో వెళదామా?" అడిగింది రాగిణి.
    "ఓ......" అంది శిల్ప.
    పదిగంటలకల్లా ఫలహారాలు పూర్తిచేసుకొని, ఊటీలేక్ కేసి వెళ్ళారు. సెలవురోజు కావడంతో ఆ ప్రదేశం కిటకిటలాడిపోతోంది. క్యూలోనుంచుని, టిక్కెట్లు కొనుక్కోవాలి. రాగిణికన్నా ఒక పది పదిహేను మంది క్యూలో ముందున్నారు.
    "మై గాడ్! మన ఛాన్స్ వచ్చేసరికి ఎంత సేపవుతుందో!" అంది రాగిణి.
    "అక్కా! నాకు బోట్ రెయిడ్ ఇష్టం" అంది శిల్ప రాగిణి ఎక్కడ వద్దంటుందో నన్న భయంతో.
    "వెళదాంలే!" అని క్యూలో నుంచుంది.
    అంతలో ఎవరో ఒకతను నల్లగా, పొడుగ్గా సన్నటి మీసాలూ బొద్దుగా వున్న క్రాఫ్, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకున్నాడు. పెద్ద గోగో గ్లాసుల్లాంటి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. స్టయిల్ గా పైపు వెలిగించి, పొగని నోట్లోంచి రింగులు రింగులుగా వదులుతున్నాడు. తదేకంగా రాగిణినీ, శిల్పనీ చూస్తున్నాడు.
    "మేడమ్! మీరు డాన్సర్ కదూ?" అన్నాడు.
    "అవును" నవ్వుతూ సమాధానం చెప్పింది రాగిణి.
    "మీ పేరు......." ఏదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు.
    "రాగిణి! అంది."
    "అవును మీరు నాలుగేళ్ళ క్రితం "సిద్ధార్థ అసోసియేషన్" తరపున రవీంద్రభారతిలో ప్రదర్శన యిచ్చారు గుర్తుందా? అప్పుడు అసోసియేషన్ సెక్రటరీని నేనే."
    "ఓ అలాగా!" అంది రాగిణి.
    "మీ డాన్స్ చాలా బాగుంది!"
    "థాంక్స్"
    "ఈ పాప.....?"
    "మా చెల్లెలు....."
    ఆ సమాధానం వినగానే శిల్ప మొహం మారిపోయింది. ఏదో నిరాశ, నిస్పృహ. ఆ చిన్నారి మనసుని ఉడికించాయ్! మొన్న సిస్టర్ ఫెర్నాండిస్. అడిగిన ప్రశ్నకి రాగిణి చెప్పిన సమాధానం లోంచి అర్థాలు వెతుకుతోంది ఆ మనసు. ఇప్పుడు అతనితో రాగిణి చెప్పిన మాటలు, అందుకు పూర్తిగా వ్యతిరేకం. శిల్పకి నిజమేమిటో తెలీడంలేదు. ఏదో అసంతృప్తి, ఆందోళనా, గుండెల్ని కలచివేస్తున్నాయి.
    "మీకు ఇంతచిన్న చెల్లెలుందా? అచ్చం మీ పోలికే!" నవ్వాడతను.
    రాగిణి కూడా నవ్వూరుకుంది.
    "టిక్కెట్సు కోసం నుంచున్నారా?" అడిగాడు.   
    "అవును."
    "నేతెస్తానుండండి!" అంటూ వెళ్ళి ముందున్నవారితో ఏదో చెప్పి, రెండు టిక్కెట్లు తీసుకొని ఇచ్చాడు.
    రాగిణి డబ్బివ్వబోతే -  "వద్దండీ! పర్వాలేదు" అంటూ పుచ్చుకోలేదు.
    "ఎక్కడ దిగారు?" అడిగాడతను.
    "హోటల్ దాస్ ప్రకాష్ లో!"
    "నేనొచ్చి కలుస్తాను. నేనీమధ్యన ఒక కొత్త ప్రాజెక్టొకటి మొదలెట్టాను. మీతో మాట్లాడాలి. రూం నెంబరెంత?"
    నాలుగు!
    "కలుస్తాను! బై.... బై.....! బై.....బై..... పాపా? నీ పేరేమిటి?" బుగ్గలు నొక్కుతూ అడిగాడు.
    "శిల్ప" అంది మెల్లగా.
    "బై..... బై....." అంటూ వెళ్ళిపోయాడు అతని విజిటింగ్ కార్డిచ్చి.
    బోటులో కూర్చున్నా శిల్పకి సంతోషంగా లేదు. మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. రాగిణి విజిటింగ్ కార్డు తీసిచూసింది. "ఎ.కె. భార్గవ., ఫిలిం ప్రొడ్యూసర్, అప్సరా మూవీస్ త్రివేండ్రం" అని వుంది. కార్డును పర్సులో పెట్టుకుంది ఏదో ఆలోచిస్తూ.
    ఎంతో ఉత్సాహంగా బోటు ప్రయాణానికి తయారయిన శిల్ప అంత నిరుత్సాహంగా బోటులో యాంత్రికంగా కూర్చుంది 'రాగిణి తనకేమవుతుంది? అమ్మా? అక్కా' - ఇవే ఆలోచనలు ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి.
    "శిల్పా..... నీళ్ళు బాగున్నాయి కదూ?" అంది రాగిణి.
    "ఊ!" అంది ముక్తసరిగా.
    "నీకు బోట్ లో వెళ్ళాలంటే ఇష్టమా?" అడిగింది.
    "ఊఁ....."
    "మళ్ళీ ఊఁ...ఊఁ -  ల్లోకి దిగావేంటి? నిన్నంతా ఎంతో బాగా మాట్లాడావ్?"
    ".........................."
    "శిల్ప మాట్లాడలేదు.
    దాదాపు అరగంట పట్టింది. ఆ లేక్ అంతా తిరగడానికి మధ్యాహ్నం  భోజనానికి హోటల్ కి తిరిగొచ్చారు!
    భోం చేసి కాస్సేపు పడుకుని, సాయంత్రం అలా వెళదాం సరేనా?" అడిగింది రాగిణి.
    "ఊఁ - " అంది శిల్ప.
    భోంచేసి నిద్రపోయారు. రాగిణీ, శిల్పా. శిల్ప కళ్ళు తెరిచిచూసేసరికి, రాగిణి అతనితో మాట్లాడుతూ ఉంది. ఇద్దరూ తాగుతున్నారు. "నాకీ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు అంది రాగిణి.
    "దాందేముందీ! ఇందులో నా గొప్పేమీ లేదు. హైదరాబాదొచ్చాక కలవండి!" అన్నాడతను నవ్వుతూ. ఇంకా కాస్సేపు ఏవేవో మాట్లాడి అతను వెళ్ళిపోయాడు.
    అతనున్నంతవరకూ నిద్రపోతూన్నట్టుగానే పడుకుంది శిల్ప. అతడు వెళ్ళాక కళ్ళు తెరిచింది.
    "నువ్వు మేలుకునే వున్నావా?" అంది రాగిణి.
    బలవంతాన లేచి పాలుతాగి, తయారైంది శిల్ప బొటానికల్ గార్డెన్స్ అంతా తిరిగి తిరిగి హోటల్ చేరుకున్నారు. శిల్ప మౌనంగానే వుంది.
    ఆ మర్నాడే రాగిణి ప్రయాణం. మధ్యాహ్నం భోజనాలయాక, రూము ఖాళీచేసి, శిల్పని స్కూల్లో దిగబెట్టి, బస్సులో బెంగుళూరుకి ప్రయాణమయింది రాగిణి. అక్కడినుంచి ఫ్లయిట్ లో పోవాలని నిర్ణయించుకుంది.
    "బాగా - ఎంజాయ్ చేశావా?" అడిగింది శిల్పని సిస్టర్ ఫెర్నాండిస్.
    "ఊఁ - " అంది శిల్ప.
    శిల్ప మొహాన్ని పుస్తకంలా చదివేస్తున్న సిస్టర్ ఫెర్నాండిస్. శిల్ప ఏదో విషయం గురించి బాధపడుతోందని గ్రహించింది. జాలి పడడం కన్న ఏం చేస్తుంది?
    రాగిణి సిస్టర్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. శిల్పని గట్టిగా ముద్దెట్టుకుని" బై - బై" చెప్పింది.
    నీళ్ళు నిండిన కళ్ళతో బై - బై - చెప్పింది శిల్ప.
    రాగిణి ఊటీనుంచి తిరిగొచ్చిన ఒక వారానికల్లా, భార్గవ దగ్గరి నుంచి ఒక ఉత్తరం వొచ్చింది. రెండు మూడు రోజుల్లో తను హైదరాబాదు వస్తున్నాననీ, అప్పుడు అన్ని విషయాలూ మాట్లాడుతాననీ ఆ ఉత్తరంలోని సారాంశం.
    రాగిణిలో కొత్త ఆశలు చిగురించాయ్. వైజయంతిమాలా, హేమమాలినీ, వీళ్లంతా మొదట్లో సినిమాల్లో డాన్సర్లుగా పరిచయమయ్యాకే పెద్ద పెద్ద హీరోయిన్లయిపోయారు. తనూ ఒక రోజు ఆ స్థాయికి చేరుకోవచ్చు అదృష్టం వుంటే! కలలలో తేలిపోతోంది. చిత్ర జగత్తు మత్తులో ఊగిపోతోంది. రాగిణి ఆశలకు నీరుపోసి పెంచుతోంది సరోజిని. అవి మానై పెద్ద పెద్ద వృక్షాలయి మనసంతా ఆక్రమించుకున్నాయి. ఎప్పుడెప్పుడు భార్గవగారు వచ్చిపడతారా అని ఎదురుచూడసాగారు. ఈలోగా భార్గవ అదివరకేమైనా సినిమాలు తీశాడా - లేదా? డబ్బున్న వాడా కాదా? మొదలయిన విషయాలన్నీ వాకబు చేసి పెట్టుకుంది సరోజిని. అతనిదివరకు కొత్తవాళ్ళతో రెండు మూడు సినిమాలు తీశాడనీ, అవి వందరోజులు కాకపోయినా యాభై రోజులు ఆడాయనీ తెలుసుకొని సంతోషించారు తల్లీ బిడ్డలిద్దరూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS