Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 10

"చెప్పండి...నా వల్ల మీకేం సాయం కావాలి?" అడిగాడు సుసిరియో.
"గొప్ప తాంత్రికుడిగా మీకు పేరుంది. మీ సాయం కావాలి..." అన్నాడు రాబర్ట్.
"ఏ విషయంలో?"
"బిత్రోచి విషయంలో"
ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు సుసిరియో...అతని మోహంలో రంగులు మారాయి.
"బి..త్రో..చి..వి..ష..యం..లో..నా?"
"అవును బిత్రోచి గురించే..."
"బిత్రోచి అనే క్షుద్రశక్తి గురించి, పురాతన కాలం నాటి గ్రంధాలు తిరగవేస్తే తెలుస్తుంది. అయినా బిత్రోచి ప్రస్తావన ఇప్పుడెందుకు?" సుసిరియో గొంతులో విస్మయం.
"పెరిగిమియో...అంటే ఏంటి?" సూటిగా అడిగాడు రాబర్ట్.
"పె..రి..గి..మి..యో..." బిత్రోచికి ఓ మృత స్త్రీని తిరిగి బ్రతికించి అర్పించే ప్రక్రియ.
కానీ...ఇప్పుడా ప్రక్రియ ఎవరూ చేయడంలేదు. అది చాలా ప్రమాదకరమైంది. కొన్ని సంవత్సరాలపాటు మంత్ర విద్యలను అభ్యసించి, ఎన్నో క్షుద్ర శక్తులను సంతృప్తి పరిస్తేగానీ, ఆ ప్రక్రియ చేయడానికి అర్హత లభించదు. అయినా  ఇప్పుడు పెరిగిమియో చేసేవాళ్లెవరు?"
"ఉన్నారు మిస్టర్ సుసిరియో...మీరోసారి నాతో రావాలి. ఓ పోలీసాఫీసర్ గా నేను నిజానికి ఇటువంటివి నమ్మకూడదు. కానీ, పర్సనల్ గా నేను దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా క్షుద్రశక్తులను నమ్ముతాను" గంభీరంగా అన్నాడు రాబర్ట్.
సుసిరియో ఓ క్షణం ఆలోచించి అన్నాడు. "అలాగే ఆఫీసర్ మీ ఇష్టం.."
"థాంక్యూ మిస్టర్ సుసిరియో..మనం ఇప్పుడే బయల్దేరాలి...ప్లీజ్ కమ్..." అంటూ లేచాడు.
సిసిరియో లోపలికి నడిచి...ఎదురుగా వున్న షెల్ప్ దగ్గరకి నడిచాడు. ఓ క్యాండిల్ వెలిగించి మనసులో ఏదో ప్రార్ధించాడు.
క్యాండిల్ క్షణానికో రంగు మారుతూ క్షణ క్షణానికి పెద్దదైంది.
నా ఇంటిని కాపాడు...అలాగే నన్నుకూడా...అని ప్రార్ధించి బయటకు వచ్చి తలుపువేసి లాక్ చేసాడు.

                                                              * * *
పీటర్సన్ నాలుగో రౌండ్ కూడా పూర్తి చేశాడు.
అప్పుడొచ్చాడు డేనియల్.
"ఏమైంది? ఏమైనా సోర్స్ దొరికిందా?" అడిగాడు ఆత్రంగా పీటర్సన్.
"ఒకే ఒక మార్గం వుంది. కానీ అది రిస్క్ తో కూడుకున్నది..." చెప్పాడు డేనియల్.
"ఎంత రిస్క్ అయినా ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్లేదు...మనం వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలి. సింగపూర్ పోలీసులు మనల్ని పట్టుకుంటే బయటకు వచ్చే ఛాయిస్ కూడా లేదు కదా" చాలా రెస్ట్ లెస్ గా వున్నాడు పీటర్సన్.
అతని కళ్ళు ఎర్రబడ్డాయి.
"మనం షిప్ లో వెళ్లాలి"
"షిప్ లోనా?"
"యస్...ఆరు నెలలకోసారి షిప్ ఇండియా వెళ్తుంది. స్టార్ త్రీ అనే షిప్ రేపే బయల్దేరుతొంది. ఆరునెలలకు ముందే బుక్కింగ్ కూడా అయిపోతుంది. నాకు తెలిసిన ఓ ఏజెంట్ ని కాంటాక్ట్ చేశాను. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి, ఇద్దరు ప్రయాణికులను డ్రాప్ చేయించేలా చేసాను. వాళ్ల ప్లేస్ లో మనం వెళ్తాం.
మూడ్రోజుల ప్రయాణం. మామూలుగా అయితే ప్లయిట్ లో నాలుగ్గంటల్లో చేరుకోగలం...కానీ ఇప్పుడు సెవంటీ టు అవర్స్...ఇదొక్కటే మనకు సేఫ్...మనకు కలిసి వచ్చే విషయమేమిటంటే..లక్కీగా ఈ రూట్లో మనం వెళ్తామని పోలీసులు అనుమానించలేరు..."
"దట్స్ గుడ్...వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయ.." అన్నాడు పీటర్సన్..
డేనియల్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి లేచాడు. (సింగపూర్ నుంచి క్వీన్ ఎలిజిబెత్-2 అనే షిప్ సింగపూర్ నుంచి ప్రతి ఆరు నెలలు ఒకసారి బయల్దేరి బొంబాయి చేరుకుంటుందిట. ఆరు నెలల ముందే ఈ షిప్ లో బయల్దేరడానికి టిక్కెట్సు బుక్ అయిపోతాయి. ఐదంతస్థుల ఈ షిప్ లో స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ లిఫ్ట్ లాంటి ఏర్పాట్లు కూడా వుంటాయి.
సింగపూర్ నుంచి ముంబయ్ కి మూడు రోజుల ప్రయాణమట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీలైతే మున్ముందు అందించే ప్రయత్నం చేస్తాను-రచయిత్రి)

                                       * * *
పీటర్సన్ ఇంట్లో రెబ్ కాని పడుకోబెట్టిన బల్లను చూపాడు. సుసిరియో, దానిమీద వున్న బొమ్మను చూసాడు. క్యాండిల్స్ గమనించాడు.
ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు సుసిరియో. అతని కళ్లముందు రకరకాల రూపాలు కనిపించాయి. క్షణక్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి.,
రాబర్ట్ సుసిరియో వైపే చూస్తుండిపోయాడు. రెండు నిమిషాలు అనంతరం సుసిరియో కళ్ళు తెరిచాడు.
రెబ్ కాని వెంటనే బరియల్ గ్రౌండ్ లో పాతిపెట్టి మంత్రశుద్ది చేయాలి. ఆమె శరీరంలో ఇంకా దుష్టశక్తుల ప్రభావం వుంది. మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా 'పెరిగిమియో' ప్రక్రియలో ఒక దశ పూర్తయ్యేది. అప్పుడు ఈ శవం క్షుద్ర ప్రేతమైపోయేది.
బిత్రోచిని వశపరుచుకుని, సంతృప్తి పరిచే ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైంది.
కేవలం ఐదు అక్షరాల మంత్ర ప్రక్రియ చేసిన వ్యక్తి సామాన్యుడు కదా.
క్లియో...గ్లిమో...శ్లుమో...క్రిమో...స్రికో...అన్న ఐదు అక్షరాల, అయిదు పదాల మంత్ర ప్రక్రియను అతను చేసాడంటే అతను సామాన్యుడు కాదు.
ఎన్నో సంవత్సరాలుగా అతను క్షుద్రోపాసన చేస్తూ వుండాలి..." సుసిరియో చెప్పాడు.
క్షుద్రశక్తుల ఉనికిని నమ్మే రాబర్ట్ ఒక్క క్షణం వొణికిపోయాడు.
"ఇప్పుడేం చేయాలి?"
"అతడ్ని పట్టుకొని క్షుద్రప్రయోగాలు చేయకుండా ఆపాలి. అతని చేతి మణికట్టుకు ఎన్ని రంగుల దారాలు వున్నాయో తెలుసుకోవాలి. ఒక్కో రంగు ఒక్కో క్షుద్రశక్తిని వశం చేసుకున్నందనడానికి గుర్తు.
చివర ప్రయత్నమే బిత్రోచిని వశపరుచుకోవడం. ఇప్పుడతను చివర ప్రయత్నంలో వున్నాడు. వీళ్ళు ప్రతిరోజూ అర్దరాత్రి క్షుద్రోపాసన చేస్తారు.
అప్పుడు సంభవించే పరిణామాలు బయోత్పాతంగా వుంటాయి..." ఆగి ఊపిరి పీల్చుకున్నాడు సుసిరియో...
భయంతో మరోసారి వొణికిపోయాడు రాబర్ట్.

                                                       6
11.55 పి.ఎం   
స్టార్ త్రీ షిప్ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. అయిదంతస్తుల ఆ షిప్ చూడ్డానికి ఓ చిన్నపాటి దీవిలా వుంది. రెండు వందల గదులు, రెస్టారెంట్, డిస్కోథెక్, స్విమ్మింగ్ ఫూల్...లిఫ్ట్...చాలా అధునాతమైన
ఆ షిప్ కోటీశ్వరులకు లగ్జరీ జర్నీ...
సింగపూర్ లో బయలుదేరి ఆ షిప్ ముంబయ్ చేరుకునే సరికి మూడ్రోజులు పడుతుంది.
నింగీ...నేలా...అని కాకుండా, నింగీ...సముద్రం అనుకునే సందర్భం. సముద్రం ప్రశాంతంగా వుంది. అప్పుడప్పుడు అలల సౌందర్యాన్ని అలవోకగా ఆవిష్కరిస్తోంది సముద్రం.
చల్లటిగాలి రివ్వున వీస్తోంది. లగ్జరీ సూట్లలో, క్యాబిన్ లలో...క్లబ్బుల్లో అంతా ఖరీదైన వాతావరణమే. కొందరు సముద్రపు అలలను చూస్తూ డెక్ పై నుండి ఎంజాయ్ చేస్తోంటే, మరికొందరు మందుకొడుతున్నారు.
మరికొందరు స్విమ్మింగ్ చేస్తున్నారు హాయిగా, కొత్తగా పెళ్లయిన కొన్ని జంటలు తమ స్వీట్ మెమరీస్ ని భద్రపరుచుకునే ప్రయత్నంలో, లగ్జరీ సూట్స్ లో ఆదమరచి సర్వ సౌఖ్యాలు అనుభవించే ప్రయత్నంలో వున్నారు.

                                                                             * * *
11.58 పి.ఎం.
పీటర్సన్ షిప్ డెక్ దగ్గర తిరగడం ఆపి క్యాబిన్ లోకి వెళ్లాడు. డేనియల్ బయటే నిలబడిపోయాడు.
"బీకేర్ ఫుల్...ఎవర్నీ లోపలికి రానివ్వద్దు...బిత్రోచికి నైవేద్యం పెట్టే సమయం ఆసన్నమైంది...." అంటూ లోపలకి నడిచి డోర్ దగ్గరకు వేశాడు పీటర్సన్.

                                      * * *
11.59 పి.ఎం.
క్యాబిన్ మధ్యలో రౌండు సర్కిల్ బ్లాక్ చాక్ పీస్ తో వేసి వుంది. ఇంగ్లీష్ లో బిత్రోచి అన్న పదం వుంది..
ఆ సర్కిల్ లో కూచున్నాడు పీటర్సన్. మోకాళ్లమీద కూచున్నాడు. రెండు చేతులను పైకెత్తాడు. తలను కొద్దిగా కిందికి వంచాడు.
ఒకటి...రెండు...మూడు...
తలను కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి...పైకి (సీలింగ్ వైపు), ఒకసారి, కిందికి ఒకసారి తిప్పుతూనే వున్నాడు.
12.పి.ఎం.
తలను స్ట్రయిట్ గా పెట్టి రెండు కళ్ళూ మూసుకుని...పెదవులను కదల్చాడు పీటర్సన్.

                                        * * *
రాబర్ట్ ఆందోళనగా వున్నాడు.
సుసిరియో తన గదిలో ఆసనం వేసుకుని కూచున్నాడు. అతని ఎదురుగా పన్నెండు క్యాండిల్స్ వున్నాయి. అవి నాలుగు వరసల్లో వున్నాయి.
మొదటి వరుసలో ఒక క్యాండిల్.
రెండవ వరుసలో రెండు క్యాండిల్స్...
మూడవ వరుసలో మూడు క్యాండిల్స్...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS