Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 11

    "శిల్పా! ఇటు చూడు..." కటువుగా అన్నాడు అవినాష్.
    ఆమె చూడకపోవడంతో కుడిచేతిని కొద్దిగా ముందుకి జరిపాడు. అంగుళంలో పదోవంతు కత్తిమొన ఆమె సున్నితమైన చర్మంలోకి దిగింది. ఆమె శరీరం జలదరించింది. చప్పున అవినాష్ వైపు చూసింది.
    "ప్రేమంటే ఏమిటి?" అడిగాడు.
    ఆమె చూపు మరల్చుకుంది.
    "ఈ ప్రేమ కోసం నూరేళ్ళ మన సంసారాన్ని వదిలి వచ్చావా? నువ్వు కాదంటే మన పెళ్ళి ఆగిపోతుందని నీకు తెలియదా?" అడిగాడు.
    కొన్ని క్షణాల తరువాత బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు గదిలో ప్రతిధ్వనించింది. చప్పున చెయ్యి వెనక్కి తీసుకుని కత్తి జేబులో పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చకచకా నడిచి గుమ్మం దాటి వెళ్ళిపోయాడు.
    శిల్ప, అతను నిశ్చేష్టులై వెళ్ళిపోతున్న అవినాష్ ని మతిపోయిన వాళ్ళలా చూస్తుండిపోయారు.

                           *    *    *    *
    "ఏం! ఇంకా తయారు కాలేదా?" గదిముందు నిలబడి గర్జించాడు రోశయ్య.
    మంచం మీద ఆలోచిస్తూ పడుకున్న అర్చన ఉలిక్కిపడి లేచి టవల్ తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది.
    ఉదయం నుంచి విశ్రాంతి తీసుకున్న అమ్మాయిలు సాయంకాలం ఐదుగంటలకు సింగారించుకుని సిద్దంగా ఉండాలి.  ఆలోచనల్లో మునిగిపోయిన అర్చన చీకటిపడటం గమనించలేదు. ఆ రోజు ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఆనుకున రోజు. రాత్రి రెండు తరువాత అంతా పడుకున్న సమయంలో ఆ పని చెయ్యాలనుకుంది. అరగంటలో తయారై తన గదిలో కూర్చుంది. అంతవరకూ ఆమెను గమనించిన రోశయ్య తృప్తిపడి ముందు గదిలోకి వచ్చి ఎప్పటిలా తలుపు ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు.
    రాత్రి ఎనిమిది గంటలకు రాజమ్మ కంపెనీ ముందు ఒక రిక్షా ఆగింది. ఏభైసంవత్సరాల స్త్రీ ఒకామె రిక్షా దిగి చీర మడతలు సరిచేసుకుంది. వయసుదాచడానికి చేసిన ప్రయత్నాలు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెయిర్ డై వాడటం వల్ల జుట్టు నల్లగా నిగనిగ లాడుతోంది.
    ఆ కంపెనీకి యజమానురాలు ఆమె, పేరు రాజమ్మ.
    రిక్షా అతను వెళ్ళి తలుపు తట్టాడు. రోశయ్య తలుపు తెరిచాడు రోశయ్యని చూసి చిన్నగా నవ్వి హుందాగా లోపలకు నడిచింది రాజమ్మ. రిక్షా అతను ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చి లోపల పెట్టాడు. తలుపులు తిరిగి మూసుకున్నాయి.
    అది పెద్ద గది. కప్పు నుండి రెండు ఇనుప గొలుసులు వ్రేలాడుతున్నాయి. గోడ ప్రక్క రెండు కుర్చీలు ఉన్నాయి. ఆ గది నుండి వెనుకవైపుకి వెళ్ళడానికో తలుపు ఉంది. రోశయ్య ఆ తలుపు తెరిచాడు.
    రాజమ్మ ఆ గుమ్మం నుండి లోపలకు నడిచింది. నాపరాళ్ళు పరిచిన నడవాకి రెండు వైపులా గదులు ఉన్నాయి. ఆమె ఒక్కొక్క గది వద్దకు వెళ్ళి అమ్మాయిల్ని పలకరించి తిరిగొచ్చింది. కప్పునుండి వ్రేలాడుతున్న గొలుసులకు చెక్క ఉయ్యాల తగిలించాడు రోశయ్య. దానిపైన మెత్తటి పరుపు వేసి, రెండు దిళ్ళు అమర్చాడు. రాజమ్మ ఉయ్యాలలో కూర్చుంది.
    ఒక వ్యాపార వేత్త తన కార్యక్రమాన్ని ఓ పద్దతిలో రూపొందించుకున్నట్టు రాజమ్మ తన పనులు చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి ఎనిమిదికి వచ్చి తెల్లవారు ఝామున మూడు గంటలకు వెళ్ళిపోతుంది. సింధియాలో ఆమెకు రెండిళ్ళు ఉన్నాయి. సూపర్ బజార్ దగ్గర లాడ్జిలో వాటా ఉంది ఇవి కాకుండా ఇంటి వద్ద వడ్డీ వ్యాపారం, చీటీల వ్యాపారం చేస్తుంది.
    రాజమ్మజీవితంలో ఓ ముప్పై సంవత్సరాల వెనక్కి వెళితే ఆమె ఓ నిరుపేద యువతి. ఆమె భర్త కూలిచేసి ఆమెను పోషించేవాడు. రాజమ్మ ఇళ్ళల్లో పనిచేసి డబ్బు సంపాదించేది. ఒకరోజు ఇంటి యజమానురాలు గుడికి వెళ్ళిన సమయంలో ఆమె భర్త రాజమ్మని పట్టుకున్నాడు. ఆమె తిరస్కరించింది. అతను వంద రూపాయల కాగితం ఒకటి ఆమె చేతిలో పెట్టాడు. దానిని చూసి మెత్తబడిన రాజమ్మ అతన్ని కాదనలేకపోయింది. అతను రాజమ్మని పెద్దగా కష్ట పెట్టకుండా తన పని ఒక్క నిముషంలో పూర్తి చేశాడు. అప్పుడే రాజమ్మ ఆలోచనలు మలుపు తిరిగాయి. అతనికి తన శరీరం అప్పగించటం వల్ల తప్పు చేశాననే భావం తప్ప మరే నష్టం కనిపించలేదు. జీవితంలో తిరిగి అటువంటి భావాలు కలక్కుండా జాగ్రత్తపడింది.
    మనిషి బలహీనతని అర్ధం చేసుకుని వ్యాపారం చేసేవాళ్ళు పైకొస్తారు. పూర్వం రసికులు వేశ్యల చుట్టూ తిరిగేవారని చెబుతారు. ప్రస్తుతం కాలం మారింది. వ్యభిచారి వద్దకు వెళ్ళేవాళ్ళు అభద్రతాభావంతో ఉంటారు. పోలీసులు పట్టుకుంటారని, జబ్బులు వస్తాయనే భయాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యభిచారి సహకారం ఉండదు. ఇన్ని కారణాల వల్ల విటుడు వ్యభిచారి దగ్గిర ఎక్కువసేపు ఉండలేడు. రాజమ్మ తన చురుకైన తెలివితేటలతో ఈ విషయాలు తెలుసుకుంది.
    ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.
    "డాక్టర్ వచ్చి మహేశ్వరికి ఇంజక్షన్ చేసి వెళ్ళాడు. రాధిక, లక్ష్మి రేపు మొదటి ఆట సినిమాకి వెళతామంటున్నారు__" రోశయ్య చెప్పాడు రాజమ్మతో.
    "జార్జిని వెంట తీసుకుని మ్యాట్నీకి వెళ్ళమను. ఈరోజు నుంచి ఆషాడమాసం...."చెప్పిందామె.
    ప్లాస్టిక్ బ్యాగ్ అందుకుని లోపల నుంచి అల్యూమినియం బాక్స్  తీసింది. బాక్స్ తెరిచి మూడు స్టీలు డబ్బాలు తనముందు పెట్టుకుంది. తమలపాకుల కట్ట నుండి రెండు లేత ఆకులు ఎంచి సున్నం రాసింది. ఆకుల్లో జర్దా, వక్కపొడివేసి చుట్టి బుగ్గన పెట్టుకుంది. రోశయ్య బూడిదతో నింపిన మట్టి పాత్ర తెచ్చి ఉయ్యాల దగ్గర ఉంచాడు. స్టీలు డబ్బాలు బాక్స్ లో సర్ది ప్రక్కన పెట్టుకుంది రాజమ్మ.
    తలుపు చప్పుడు కావడంతో రోశయ్య తెరిచాడు. ఒకతను లోపలకు వచ్చాడు. రోశయ్య తలుపు మూసి అతన్ని లోపలకు తీసుకెళ్ళి క్షణాల్లో తిరిగొచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. క్రమంగా అక్కడ సందడి మొదలయింది. ఒకతను విసురుగా లోపలనుంచి రాజమ్మ దగ్గరకు వచ్చాడు.
    "అది సరిగ్గా ఉండటంలేదు..." చెప్పాడు కోపంగా.
    రోశయ్య అతనివైపు కదలబోయాడsు. అతన్ని కళ్ళతోనే వారించింది రాజమ్మ.
    "ఎవరు?" అడిగింది.
    "రాధిక" చెప్పాడు రోశయ్య.
    రాజమ్మ ఉయ్యాలపైనుంచి లేచి లోపలకు నడిచింది. రాధిక గదిముందు నిలబడి లోపలకు చూసింది. కాలుమీద కాలు వేసుకుని పుస్తకం చదువుతోంది రాధిక.
    "రాధికా!" పిలిచింది.
    "ఏమిటి?" అడుగుతూ గుమ్మం దగ్గరకు వచ్చింది.
    "అతన్ని ఇబ్బంది పెట్టావా?"
    "వాడికి వంటినిండా జబ్బులు..." మొహం అదోలా పెట్టి అంది.
    ఒక్క క్షణం మౌనంగా ఉంది అంది రాజమ్మ.
    "నీకు లేవా? రోశయ్యని పిలవనా?"
    రాధిక సమాధానం చెప్పలేదు. రోశయ్య వచ్చాడంటే ఎముకలు విరుస్తాడని తెలుసు. నాలుగురోజుల క్రితం ఒకామె మాట వినలేదని పది రోజులపాటు లేవకుండా కొట్టాడు. అందరూ చూస్తుండగా జరిగిన సంఘటన రాధిక కళ్ళముందు కదిలింది. అప్పటివరకూ ఆమె మొహంలో కదలాడిన మొండితనం స్థానంలో భయం చోటు చేసుకుంది.
    "ఇటువంటి ఆగడాలు చెయ్యొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. డాక్టర్ వచ్చినప్పుడు చూపించుకో...."
    చెప్పి అక్కడనుంచి వచ్చి ఉయ్యాలమీద కూర్చుంది. రోశయ్య ప్లాస్కులోని టీ కప్పులో పోసిచ్చాడు. నీళ్ళతో నోరు కడుక్కుని టీ త్రాగింది రాజమ్మ. తలుపు చప్పుడు కావటంతో రోశయ్య వెళ్ళి తీసాడు. ఇద్దరు వ్యక్తులు లోపలకు వచ్చారు. వాళ్ళల్లో ఒకతను బ్రోకరు. రెండో అతనికి పాతిక సంవత్సరాలు ఉంటుంది. అతను అధికంగా త్రాగడం వల్ల స్థిరంగా నిలబడలేకపోతున్నాడు.
    "కస్టమ్స్ ఆఫీసర్! బార్ దగ్గర తగిలాడు...." రాజమ్మ ప్రక్కకు వెళ్ళి ఆమెకు మాత్రమే వినిపించేటట్టు చెప్పాడు బ్రోకరు.
    రాజమ్మ పెదాలపైన సన్నటి నవ్వు కదిలింది.
   "అర్చన గదికి తీసుకెళ్ళు. దాన్నిలా రమ్మను...." చెప్పింది.
    రోశయ్య ఆ యువకుడ్ని పట్టుకుని లోపలకు తీసుకెళ్ళాడు. రెండు నిముషాల్లో అర్చన రాజమ్మ దగ్గరకు వచ్చింది.
  "ఇప్పుడొచ్చిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకో..." చెప్పింది రాజమ్మ. అర్చనలాంటి క్రొత్తపిల్ల కష్టమర్స్ ని ఇబ్బంది పెట్టే గడుసుతనం సంపాదించడానికి ఇంకా సమయం పడుతుందని ఆమెకు తెలుసు. అంతే కాదు ముఖ్యమైన కష్టమర్ ని సంతోష పెట్టడానికి క్రొత్తగా వృత్తిలోకి వచ్చిన వాళ్ళని ఉపయోగించడం ఆనవాయితీ.
    అర్చన తన గది చేరుకుని లోపలకు వెళ్ళబోతూ గుమ్మంలోనే ఆగిపోయింది. మంచంపైన పడుకోబెట్టిన యువకుడు వాంతి చేసుకుని నిస్తేజంగా పడుకుని కనిపించాడవు.
    అతను త్రాగిన మద్యం వాసన గదంతా వ్యాపించింది. గదిలోకి వెళ్ళడానికి మనస్కరించలేదు. కాని అతన్ని అలా వదిలేయడం మానవత్వం కాదనిపించింది. నెమ్మదిగా గదిలోకి నడిచింది. ఆమెకోసం తెచ్చిన భోజనం ప్లేటు ఆకు మూసి టేబుల్ పైన పెట్టి ఉంది. దాని ప్రక్కనే ఉన్నసత్తు గ్లాసు తీసుకుని మంచం వద్దకు వచ్చింది. మంచంపైన కూర్చుని అతని తల ఒడిలో పెట్టుకుని గ్లాసులోకి మజ్జిగ త్రాగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS