Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 10

    ఉద్యోగంలో చేరిన నాటినుండి పెళ్ళిచేసుకోమని పారుతున్న తల్లికి శిల్ప చిరునామా ఇచ్చాడు. తల్లి తెలివైంది కావడం వల్ల భర్తని తీసుకుని మరునాడు శిల్ప ఇంటికి వెళ్ళింది. పిల్లవాడు ఇష్టపడిన తరువాత కుంటిసాకులు చెప్పేవాళ్ళు కాకపోవడం వల్ల అవినాష్ తల్లిదండ్రులు తమ తరపున మాట్లాడటం పూర్తిచేశారు.
    పదిరోజుల్లో అవినాష్ పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. హనీ మూన్ కి బెంగుళూరు వెళ్లొచ్చారు. నిద్రలేచి బెడ్ రూమ్ నుంచి శిల్ప బయటకొస్తుంటే ఆమె వెనుక అవినాష్ ఉండటం గమనించిన అతని తల్లి మందలించింది. తల్లిదండ్రులు తీర్ధయాత్రలకు వెళ్ళడంతో తల్లి మాటలు వెంటనే మర్చిపోయాడు.
    నైట్ డ్యూటీకి వెళ్ళడం ఇష్టంలేదు. కాని తప్పదు. భారంగా నిట్టూర్చి ఆఫీస్ వైపు నడిచాడు. రిసీవర్ అందుకుని ఇంటి  నెంబరు తిప్పాడు.
    ఎంగేజ్.
    కట్ చేశాడు. ఆ సమయంలో ఫోను వచ్చిందంటే మామగారు చేసుంటారు.నిముషం తరువాత రింగ్ చేశాడు. తిరిగి అదే శబ్దం వచ్చింది.
    రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ నిలబడ్డాడు.
    క్రొత్తగా పెళ్ళియినవాళ్ళకు అడ్డు రావడంలో ముసలాళ్ళు సిద్దహస్తులు. తలుపులు మూసుకుంటే లోపల ఏం జరుగుతున్నదో తెలియనట్టు తలుపు కొడతారు. తండ్రి మార్కెట్ కి, తల్లి వంట గదిలోకి వెళ్ళడం గమనించి చటుక్కున భార్యని పెనవేసుకుంటే, "అమ్మాయ్! కారం చూడు..." అని కేక వేస్తారు. లేదా గరిటెతో కూర తీసుకుని తిన్నగా గదిలోకి వచ్చేస్తారు. రాత్రి పదకొండు గంటలకు ఫోనుచేసి కూతురితో గంటసేపు కబుర్లు చెబుతాడు మామగారు. ఆ సమయం భార్యాభర్తలకు ఎంతో ముఖ్యమైందని తెలియనట్టు.
    ఇటువంటి అనుభవాలు ఎన్నిటిలో జీర్ణించుకున్న వయస్సు వాళ్ళదని, వయస్సు వేడిలో ఏ మాత్రం ఆవకాశం దొరికినా సన్నిహితంగా గడపాలనుకునే క్రొత్త జంటకి తమ పనుల్లో మునిగిపోయిన పెద్దవాళ్ళు అడ్డొస్తున్నన్నట్టు ఉంటుందని తెలిసినా ఆలోచనలు వాళ్ళకి వ్యతిరేకంగా సాగుతూనే ఉంటాయి.
    ఆలోచనల నుండి తేరుకుని చురుగ్గా ఇంటి నెంబరు తిప్పాడు. అవతల నుంచి గరగరమనే చప్పుడు వచ్చిన రెండు క్షణాలకి ఒక కంఠం వినిపించింది.
    "అటువంటప్పుడు చేసుకోనని చెప్పాల్సింది."
    "ఏం చెప్పను? అతను నాన్నగారికి బాగా నచ్చాడు. అతని తల్లిదండ్రులు కట్నం అక్కర్లేదని చెప్పారు. అతన్ని చేసుకోనని చెప్పినా నాన్నగారు వినిపించుకోలేదు...." సన్నగా వినిపించిందో స్త్రీ గొంతు.
    అవినాష్ మొహం పాలిపోయింది.
    "ఈ ఇరవై రోజుల్లో ఎలా తెల్లవారుతున్నదో, ఎప్పుడు చీకటి పడుతున్నదో నాకు తెలియదు. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అరగంటలో నీ ముందుంటాను...."
    "వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు. గంట తరువాత మా క్వార్టర్స్ దగ్గరున్న బస్ స్టాఫ్ లో ఉండు, నేను వస్తాను...."
    అవినాష్ పిడికిలి నుండి రిసీవర్ జారిపోయింది. తల నుంచి కణతల మీదుగా చెంపలపైకి జారింది చమట. జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి వెనక్కి దువ్వుకున్నాడు. గుండె ఉండాల్సిన చోట ఖాళీ ప్రదేశం ఉన్నట్టు, ఆ గుండెను ఎవరో బలవంతంగా పెకిలించుకుపోయినట్టు బాధ. నెమ్మదిగా అక్కడా నుంచి బయటకొచ్చాడు. కాళ్ళలో శక్తిలేనట్టు అడుగులు పడటం లేదు. అతని మొహంలో కదలాడిన కళ హఠాత్తుగా మాయమయింది. నాలుగు అడుగులు నడిచిన తరువాత క్రింద పడిపోయాడు.
    అది గమనించి సెంట్రీ అతనివైపు పరిగెత్తాడు.
     క్షణాల్లో అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం లేదని, నీర్సంగా ఉన్నాడని రాత్రికి హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోనివ్వమని డాక్టర్ చెప్పాడు.
    నైట్ డ్యూటీ కాన్సిల్ చెయ్యబడింది.
                               *    *    *    *    
    బెడ్ పై నుంచి లేచి కూర్చున్నాడు అవినాష్. అతని మెదడుకి చీకటి ఆవరించుకుంది. ఆ చీకటిలో కూడా మిణుకు మిణుకుమంటూ చిన్న ఆశ కదలాడసాగింది. లేచి డాక్టర్ కన్స్ ల్టింగ్ రూము దగ్గరకు వచ్చాడు. తలుపు తెరిచి చూసాడు.
    టేబుల్ మీద టెలిఫోన్ కనిపించింది.
    మెల్లగా లోపలకు వెళ్ళి వణుకుతున్న చేత్తో ఇంటి నెంబరు తిప్పాడు. గుండెల్లో ఏదో తెలియని ఘోష. అవతల ప్రక్క ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించసాగింది. ఒకటి....రెండు....మూడు....నాలుగు పద్దెనిమిదిసార్లు రింగ్ కావడం లెక్కపెట్టి రిసీవర్ రెస్ట్ మీద ఉంచాడు.
    రెండు చేతులు టేబుల్ పైన ఆనించి మెడ వంచాడు. అతని కళ్ళనుండి కన్నీళ్ళు బొట్లుబొట్లుగా టేబుల్ మీద పడ్డాయి. తన ముందు ఎంతో జీవితం ఉందని భావించాడు. ఇప్పుడసలు జీవితమే లేకుండా పోయింది. తన వైవాహిక జీవితం కోసం స్వచ్ఛతని మూటకట్టి దాచాడు.
    రాష్ట్రపతి సేవా పతకం వచ్చినప్పుడు సిబ్బంది ఇచ్చిన పార్టీలో మద్యం తీసుకోమని చాలామంది బలవంతం చేశారు. ఒకవేళ అక్కడ మద్యం తీసుకున్నా తన జీవితంలోకి రాబోయే అమ్మాయికి ఆ విషయం తెలియదని తెలుసు. చాలామంది ఆరోగ్యం పాడవుతుందని త్రాగరు. కొంతమంది భార్యలకు భయపడి త్రాగరు. అవినాష్ మాత్రం తన జీవిత భాగస్వామి వచ్చేసరికి కలుషితం కాకూడదని అనుకోవడం వల్ల త్రాగలేదు. రాబోయే భార్య కోసం ఆలోచించకుండా కొంత సమయం వెచ్చించేవాడు. అటువంటి అవినాష్ భార్య దగ్గర తన హృదయ కవాటాలు తెరవకుండానే గుండె గాయపడింది.
    ఓ నిర్ణయం తీసుకున్నట్టు నిటారుగా నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు. క్షణాల్లో హాస్పిటల్ నుండి బయటకొచ్చి ఆటో ఎక్కి తన క్వార్టర్ కి వచ్చాడు. తాళం తీసి లోపలకు వెళ్ళాడు. సూట్ కేస్ తెరిచి ఒక సూట్ తీసి తొడుక్కున్నాడు. అల్మారా నుంచి స్టీల్ నైఫ్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. యూనిఫాం ఓ కాగితంలో చుట్టి బయటకొచ్చాడు. క్వార్టర్ కి తాళం వేసి మోటార్ సైకిల్ బాక్స్ లో పాకెట్ పడేసి స్టార్టు చేశాడు.
    ఇరవై నిముషాలు తరువాత సముద్రపు ఒడ్డున విశాలంగా నిర్మించిన బిల్డింగుల సముదాయం మధ్య మోటార్ సైకిల్ ఆపి స్టాండ్ వేశాడు. ఒకసారి చుట్టూ పరిశీలనగా చూసాడు. నిస్సబ్ధంగాను , నిర్మానుష్యంగాను ఉన్నదా ప్రాంతం. అవినాష్ చూపులు ఒక బిల్డింగు పై భాగంలో ఒక గది కిటికీ నుండి వెలుగు కనిపిస్తోంది.
    సాలోచనగా తల పంకించి అటువైపు నడిచాడు. నాలుగడుగుల ఎత్తున్న కాంపౌండ్ వాల్ దూకి లోపలకు ప్రవేశించాడు. కొన్ని క్షణాల పాటు నిలబడి పరిసరాలను గమనించాడు. ఎక్కడా అలికిడి లేదు. బిల్డింగ్ వెనుక వైపుకు చేరుకుని పైప్ లైన్ అందుకుని పైకి ఎక్కసాగాడు. పావుగంట తరువాత బిల్డింగ్ పైకి చేరుకొని అలుపు తీర్చుకోవడం కోసం ఆగాడు. అక్కడ నుంచి కదిలి దీపం వేలుఉతున్న గదిని సమీపించాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.
    తలుపుల్ని వెనక్కి నెట్టాడు.
    అవి నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. గదిలో ట్యూబ్ లైట్ వెలుగుతోంది. ఆ కాంతిలో గదిలోని ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తోంది. గది మధ్యలో ఫోం బెడ్ ఉంది. అవినాష్ దృష్టి బెడ్ పైన నిలిచింది. బెడ్ పైన ఒకతను వెల్లకిలా పడుకుని ఉన్నాడు. అతని పైన అటో కాలు, ఇటో కాలు వేసి కూర్చుందామె. వీపుమీద పరుచుకున్న తల వెంట్రుకలు లయబద్దంగా కదులుతున్నాయి.
    చప్పుడు కాకుండా లోపలకు నడిచాడు అవినాష్.
    జీవితంలోని సుఖమంతా ఒకేసారి అనుభవించేయాలనే తాపత్రయం వల్ల వాళ్ళు అతన్ని చూడలేదు.
    అవినాష్ కత్తి బయటకు తీశాడు. క్షణంపాటు కత్తిని చూసాడు. స్టీల్ బ్లేడ్ లైట్ కాంతిలో మెరుస్తోంది. ఏదో గుర్తొచ్చినట్టు దానిని తిరిగి  జేబులో పెట్టుకోబోయాడు.
    సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తి అవినాష్ ని చూసాడు.
    "ఏయ్! ఎవరు నువ్వు?" అరిచాడు.
    అవినాష్ మెరుపులా కదిలి ఒక కాలు బెడ్ పైన వేసి కత్తిని శిల్ప వీపుకి ఆనించి ప్రశాంతంగా చెప్పాడు.
    "కదలొద్దు..."
    "శిల్ప వెర్రిదానిలా అవినాష్ వైపు చూసింది. తన పరిస్థితి గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది. అతని పైనుంచి లేచి పిచ్చిగా పరిగెత్తాలనే ఆలోచన వచ్చింది.
    ఆమె ఆలోచన గ్రహించినట్టు కత్తిమొన కొద్దిగా చర్మంలోకి దిగింది.
    "మీ ఇద్దర్నీ చంపాలని వచ్చాను...." చెప్పి కొన్ని క్షణాలు ఆగి అన్నాడు, "కాని చంపను....చంపి పాపం మూటగట్టుకోను...." అని వాళ్ళవైపు చూసాడు.
    అత్యంత దయనీయ స్థితిలో చిక్కుకుపోవడం వల్ల ఉన్నపళంగా తన ప్రాణం పోతే బాగుండునని అనుకుంది శిల్ప. ఆ వ్యక్తి మాత్రం మొహం ప్రక్కకు తిప్పుకున్నాడు. కదిలితే అవినాష్ శిల్పని పొడుస్తాడని భయంగా వుంది. అతను డ్యూటీకి వెళుతున్నానని, ఉదయంవరకూ రాడని తెలుసుకునే శిల్పకి ఫోన్ చేశాడు. మూడోకంటికి తెలియకుండా ఆమెను తెల్లవారు జామున క్వార్టర్ వద్ద వదిలి రావచ్చునని భావించాడు. కాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అతను ఇక్కడకు ఎలా వచ్చాడో అర్ధం కావడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS