"వెంకటపతిరాజు గారొస్తున్నారమ్మా!" చెప్పాడు.
అప్పటికే ఆయన హాల్లోకి వచ్చేశారు.
"గుడ్ మార్నింగ్!" అన్నారాయన.
నాగమణి నవ్వింది. "గుడ్ మాణింగ్ సర్! ఏంటి చాలా రోజులకి వచ్చారు."
"కాస్త నీతో మాట్లాడాలని వచ్చాను" అన్నారు వెంకటపతిరాజు.
మల్లన్నకేసి చూసింది నాగమణి.
"చెప్పండి"
"నేను, జి.కె. చిన్ననాటి స్నేహితులం అని నీకు తెలుసు. నోట్ల మధ్య అతను, ఓట్ల మధ్య నేను బిజీగా వుంటాం.
ఇద్దరికీ విశ్రాంతి లేదు.
రాజకీయాలు వైకుంఠపాళి ఆటలాంటివి. ఎప్పుడు ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తామో! ఎప్పుడు క్రిందపడిపోతామో చెప్పలేము.
నేను మాజీమంత్రిగా విసిగిపోయాను.
జి.కె.కి రాజకీయాల్లో తలదూర్చే టైం లేదు. ఒంటరిగా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే బదులు కాస్త బిజీగా మారమని చెప్పాలని వచ్చాను."
"అంటే?"
"నీకు డబ్బు, అందం, తెలివితేటలు ఉన్నాయి. ఇవన్నీ అడవి కాచిన వెన్నెల కాకుండా నీవు రాజకీయాల్లో దిగితే?"
"భలేవారే?- నాకు రాజకీయాలేం తెలుసు?"
"అడుగుపెడితే అవే తెలుస్తాయి."
"కానీ ఆయన......"
"నేను చెప్తాను"
ఆశ్చర్యంగా చూసింది.
పరాయివాడి నీడ తనపైన పడితేనే సహించని జి.కె. తనని రాజకీయాల్లో ప్రవేశించనిస్తాడా! హింసలతో ప్రతిక్షణం వేధించే భర్త తనని ఓ నాయకురాలిగా భరించగలడా?
"ఆయనతో పేచీ, మీకు తెలీదా?"
"నాకు తెలుసమ్మా! నీకెందుకు, నేను నడిపిస్తాను కదా!"
నాగమణి ఆలోచించింది.
వెంకటపతిరాజుగారికి రాజకీయ అనుభవం ఎంతో వుంది. సీనియర్ నాయకుడు. ఆయన సారధ్యంలో తను రాణించగలిగితే ఖచ్చితంగా ఓ మంచి నాయకురాలు కాగలదు.
భర్తకీ, తనకి చుక్కెదురు! తను పైకి రావడం అతనికిష్టం వుండదు. రాజకీయాల్లో చేరితే ఎందరితోనో పరిచయాలు ఏర్పడతాయి. మాట్లాడవలసి వుంటుంది.
తను కాలేజీలో చదివిందని స్టూడెంట్స్ నూ లెక్చరర్స్ గురించీ అనుమానించాడు. ఉద్యోగం చేస్తే పై అధికారులకు లొంగిపోయిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసాడు.
భర్త పెట్టే హింసకి అలవాడుపడిపోయింది శరీరం.
అతనంటే గౌరవం, భక్తి ఏమీ లేవు.
ఏ మగాడైనా అంతే! ఆడదాన్ని కీలుబొమ్మని చేసి ఆడించటానికి ప్రయత్నించే స్వార్థపరుడు.
అలాంటి మగవాళ్ళని తన చేతివేళ్లపైన ఆడించాలంటే అది మంచి మార్గం అవుతుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?"
చిన్నతనంలో కష్టాలు.
వయస్సు వచ్చాక ప్రేమలో ఓటమి.
పెళ్లి జరిగాక వైవాహిక జీవితంలో ఓటమి.
సుఖం అనేది లేదు.
