అందుకే అధికారాన్ని సంపాదించాలి. ఆ అధికారంతో ఈ మగజాతిని తన కాళ్ళకింద మడుగులొత్తే తొత్తుల్ని చేయాలి.
"బాధ్యత మీది అని చెపుతున్నారుకదా! నాకైతే అభ్యంతరం లేదు. పేచీ ఏదైనా వస్తే అది మీ ఫ్రెండ్ తోనే. నన్ను కాస్త హింస పెడతారు. అఫ్ కోర్స్. అది అలవాటైపోయింది. కనక బాధ లేదు."
"ఓకే. అయితే రాజభవన్ లో ప్వేరింగ్ అవుతోంది. మొదటి అంశంగా అది చూద్దువుగాని, పద వెళదాం!" అంటూ ప్రక్కనే వున్న ఫోన్ అందుకున్నాడు వెంకటపతిరాజు.
"ఫోన్ ఎవరికి?"
"జి.కె. ఏం చెపుతాడో చూడాలి!"
ఫోన్ లో మాట్లాడి వెంకటపతిరాజు "వెల్! తీసుకెళ్ళమన్నాడు" అన్నాడు.
ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
బహుశా స్నేహితుడి ముందు తనలోని శాడిజాన్ని కనపడకుండా జాగ్రత్తపడి వుండాలి. దాని రియాక్షన్ రాత్రికి గాని తెలీదు.
రాజభవన్ కాబోయే మంత్రులతోను, మంత్రిపదవి వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న ఎం.ఎల్.ఏ. లతోనూ, కార్యకర్తలతోను, పోలీసులతోను, జనంతోను కళకళలాడుతోంది.
సెక్యూరిటీ సిబ్బంది హడావుడి.
వందల కార్లు......
తమ బలాబలాలు చూపించడానికి కొందరు ఎం.ఎల్. ఏ.లు కార్యకర్తల్ని వెంట తీసుకొస్తున్నారు.
రకరకాల నినాదాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లిపోతోంది.
గేటులోంచి జనం తోసుకురాకుండా పోలీసు అధికార్లు అవస్థపడుతున్నారు.
వెంకటపతిరాజుగారు నాగమణితో కారు దిగారు. ఆయన వెనక కారులో మరికొంతమంది.
ఆయన్ని చూడగానే అక్కడ చేరిన కొందరు వినయంగా నమస్కారాలు చేస్తున్నారు. భుజంపైన కండువాని సర్దుకుంటూ హుందాగా రాజభవన్ హాల్లోకి ప్రవేశించారు ఆయన.
టి.వి. కెమేరాలు, ఫొటోగ్రాఫర్స్, తమ పని చేసుకుపోతున్నారు.
నాగమణికి ఆ వాతావరణం క్రొత్తగా వుంది. తనసలు ఏం చేయగలరని రాజుగారు తనని రాజకీయాల్లోకి దింపాలని అనుకుంటున్నారో అర్థం కావటంలేదు. భుజంపైన
డబ్బు, పలుకుబడి గల ప్రముఖ పారిశ్రామికవేత్త భార్యగా...... ప్రచారం పొంది ఎన్నికలలో గెలవటానికి అవకాశం వుంటుంది.
నలుగురిలో నిలబడి మాట్లాడటం, పనులు చేయడం తనకి సాధ్యమేనా?
నేర్చుకోవాలి!
నాగమణి అక్కడ తనపైన పడుతున్న కళ్ళని పసిగట్టింది.
కొన్ని చూపులు వేడిగా, వాడిగా వచ్చి గుచ్చుకొంటున్నాయి.
వెంకటపతిరాజుగార్కి తను ఏమి అవుతుందో తెలీక కొందరు.
కూతురా? కోడలా?
లేక ఆయన ఆంతరంగికమైన..... ఊహాగానాలతో కొందరు. ఆమె జి.కె. భార్యగా గుర్తించేవాళ్ళు మరికొందరు.
ఆమె కనుసన్నల్లో నిలబడ్డానికి వయస్సులో వున్నవాళ్ళు చేస్తున్న ప్రయత్నం.
నీలంరంగు సిల్క్ చీరలో, స్లీవ్ లెస్ బ్లౌజ్, బాబ్ చేసిన జుత్తు, నాజూకైన పెదవులపై చెరగని చిరునవ్వు, గుండ్రని చిరునవ్వు, గుండ్రని బుజాలు, కోమలమైన శరీరం..... తననోసారి చూసే కొన్ని క్షణాలు అవతలివారికి మైకంకమ్ముతుందని నాగమణికి తెలుసు.
ఆమె గర్వంతో పమిటని భుజంమీదుగా తీసుకుంది.
గవర్నర్, ముఖ్యమంత్రి వచ్చారు.
