Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 11

    "ఆ మ్యారేజిలోన్ స్టీలు అలమరా కుర్చీలు వగైరాలు కొనడానికి తీసుకున్నానండీ...."

    "మరి ఈ మ్యారేజిలోన్?"

    "ఈ మ్యారేజీలోన్ స్కూటరు కొంటానికి పెట్టనండీ...."అన్నాను.

    వెరీనైస్.... వెరీనైస్.... అయితే ఇకముందు ఆఫీసుకు ఆలస్యంగా రావన్నమాట..." అనేసి నా అప్లికేషను మీద లోన్ శాంక్షన్ చేసినట్టు రాసి సంతకం చేసేసాడు.

    లోన్ డబ్బు చేతికి అందింది.

    చంచల్రావు, నేను కలిసివెళ్ళి స్కూటర్ కొన్నాం. ఆ రోజునుండీ నా కష్టాలు గట్టెక్కాయ్... నేను రోజూ ఆఫీసుకి కరెక్ట్ టైంకే చేరుకుంటున్నాను.స్కూటర్ మీద వెళ్తూ బస్ స్టాండ్ లో నిలబడ్డ జనాన్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది... ఆటోవాళ్ళను చూస్తే, కసిగా నవ్వాలని అనిపిస్తూంది.

    కానీ...

    ఆ రోజు...

    రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళడం వల్ల ఉదయం మెలకువ రాలేదు. చాలా ఆలస్యంగా నిద్ర లేచాను. టైం చూస్తే ఎనిమిదైంది.

    గబగబా భోజనం చేసి ఆఫీసుకి బయలు దేరా స్కూటర్ మీద.

    త్వరగా వెళ్లాలి. కంగారు!!...

    నా కర్మకాలి ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న ప్రతీ చోటా నేను వెళ్ళగానే రెడ్ లైట్ పడుతోంది.

    దాంతో మరింత హడావిడి పడి పోయాను.

                                              

   స్కూటర్ స్పీడు పెంచాను. ఎక్కడినుండి వచ్చిందో హఠాత్తుగా ఓ ఎద్దు పక్కనున్న ఇరుకు సందులోంచి రివ్వున మెయిస్ రోడ్డుమీదికి దూసుకు వచ్చి నా స్కూటర్ కి అడ్డుపడింది. అప్పటికీ నేను బ్రేకు నొక్కానుగానీ ఒకటిన్నర క్షణాలు ఆలస్యం చేసినట్టున్నా....

    క్రీ...ఈ...ష్...ధన్!

    నా స్కూటర్ ఎద్దుని గుద్దుకుని ఆగిపోయింది, కానీ నేనుమాత్రం ఆగలేదు. సూపర్ మ్యాస్ లా రివ్వున గాల్లో పది అడుగుల దూరం వెళ్ళి దబ్బున నేలమీద పడ్డాను. మోచేతులూ, మోకాళ్ళూ కొట్టుకుపోయాయ్. వాటిని చూసుకుందాం అనుకుంటుండగా రివ్వున ఒక లారీ నా మీదికి వచ్చెయ్యడం కనిపించింది.

    వెంటనే నేను నేలమీద కూర్చునే కప్పలా పక్కకి గెంతాను. కానీ అట్నుండి ఆటో సర్రున దూసుకు వస్తోంది, మరోసారి కప్పలా ఇంకో వైపుకి గెంతాను. లారీ, ఆటో రెండూ వెళ్ళిపోయాయ్. రోడ్డుమీంచి లేచి కుంటుకుంటూ నాలుగడుగలు వేశానో లేదో కనుకొనలనుండి ఇందాక నేను స్కూటర్ టో గుద్దిన ఎద్దు నావైపు దూసుకురావడం కనిపించింది. నేను కుంటుతున్నానన్న  విషయం కూడా మర్చి పోయి పక్కకి ఒక్క జంపింగు చేశాను. ఎద్దుకూడా ఎంతో సమయస్ఫూర్తితో జంప్ చేసి నన్ను పొడవబోయింది. నేను నడుం కాస్త వెనక్కి వొంచా... ఎద్దు సర్రున నా వెనుక భాగాన్ని రాసుకుంటూ దూసుకు పోయింది. ఆ రాపిడికి నేను ఎగిరి బోర్లాపడ్డాను.

    లేవాలని ప్రయత్నించానుగాని ఒక ఏనుగుని నా వీపుమీద కూర్చోబెట్టినట్టు లేవలేకపోయాను. ఆ దారిన పోయేవాళ్ళు నన్ను లేపి నిలబెట్టారు. ఓ సోడా కొట్టి నాకు తాగించారు. అందులో ఒకరు నన్ను దగ్గర్లోని ఆసుపత్రికి నా స్కూటర్ మీదే తీసుకెళ్ళి నా చేతులకీ, ఒక కాలుకీ కట్లు కట్టించి, మొహానికో ప్లాస్టారు ప్లస్ ఆకారంలో అతికింపజేసి నన్ను స్కూటర్ వెనకాల మళ్ళీ కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు.

    రాత్రికి జ్వరం వచ్చింది గానీ డాక్టరు గారిచ్చిన మాత్ర వేసుకుని పడుకున్నాను. తెల్లారి ఆలస్యంగా లేచాను. జ్వరం తగ్గిందిగానీ ఒళ్ళంతా నొప్పులు. శలవెందుకు వేస్టు చెయ్యాలని ఆఫీసుకు బయలుదేరా. చేతులకీ, ఓ కాలుకీ కట్టుంది కాబట్టి, స్కూటర్ ని ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీసుకి బస్సులో వెళ్ళాను.

    ఆఫీసుకెళ్ళేసరికి అరగంట లేటయింది. అటెండెన్సు రిజిస్టరు లోపలికి వెళ్ళిపోయింది.

    నేను కుంటుకుంటూ ఆఫీసరు గదిలోకి వెళ్ళాను.

    "ఆఫీసుకు లేటుగా వచ్చినందుకు ఈవేళేం  కుంటిసాకు చెప్పదల్చుకున్నావ్?" అన్నాడు ఆఫీసరు కొరకొరా చూస్తూ.

    నేను చేతులు చూపించాను.

                       

      "ఊ..... హు!" అన్నాడతను.

    తరువాత కాళ్ళు చూపించాను.

    "ఒహో...." అన్నాడు కళ్ళెగురవేస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS