"ఏమిటమ్మ , ఏదో కొంప మునిగినట్లు అలా చూస్తున్నారేమిటి అందరూ" తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నించాడు ప్రసాద్. కాని ఆ నవ్వు అతని పెదాల నించి వచ్చింది కాని గుండెల్లోంచి రాలేదని అందరికీ అర్ధం అయింది.
"ఏమోరా నాయనా, తల్చుకుంటేనే నాకేదో గుండెల్లో గుబులుగా వుంది. నా మనసు వప్పడం లేదు. ఆపైన నీ యిష్టం.... అనుభవించేది నీవు, నీ యిష్టం. మీ నాన్న యిష్టం " అంది కాంతమ్మ.
"నేను మాత్రం ఏం చెప్పగలను. వాడన్నది ఒక విధంగా నిజం. డబ్బు లేని బాధ అన్నింటి కంటే గొప్పది. దాని ముందు అవిటి భార్యని భరించడం సుళువేనెమో. ఏమో అది వాడు ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు కష్ట నిష్టూరాలు ఎదుర్కొవలసింది వాడు. వాడు ఆలోచించుకుని యిష్టపడితే నేను చెప్పేది ఏముంది.'
'అమ్మా.....యిదే మనింట్లో ఒకపిల్ల అలాంటిది వుంటే ఎలాగో అలాగ పెళ్ళి చెయ్యాలని తాపత్రయపడవా, ఏదో లోటన్నా అందరిలాగే తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని తల్లిదండ్రులారాటపడరా..... ఏదో రోగం, పిచ్చి గిచ్చి కాదు కదా , అవయవ లోపం అంతే కదమ్మా."
"పోనీ , పిల్ల ఎలా వుంటుందో చూశావా....' కాంతమ్మ రాజీ కొచ్చిన ధోరణి లో అడిగింది.
"వుంటుంది , ఓ మాదిరిగా ..... చామన ఛాయగా , మొహం ఫరవాలేదు" నిజానికి ప్రసాద్ ఆమెని చూసింది పట్టుమని రెండు నిమిషాల కంటే వుండదు. ఆ యిల్లు , ఐశ్వర్యం చూసిన కళ్ళకి, ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది. అసలు జరుగుతున్నదంతా ఏదో నమ్మశక్యం కాని కలలా అన్పించింది. అతనూహించని విషయం అతి త్వరగా అతని ప్రమేయం లేకుండా అంతా జరిగిపోయింది.
ఇంటర్వ్యూ కి వెళ్ళిన అతన్ని నారాయణమూర్తిగారు ..... ఎగాదిగా చూశారు. యింటి పేరు, కులగోత్రాలు, పుట్టు పూర్వోత్తరాలు అడుగుతుంటే ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు. ఆ జవాబులు విని అయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు. "మిస్టర్ ప్రసాద్ మీరు బయట కాసేపు వెయిట్ చెయ్యండి మళ్ళీ పిలుస్తాను' అన్నాడాయన. అంతమాత్రం మాటలే ఈ ఉద్యోగం తనకోచ్చినట్టు సంబరపడిపోయాడు ప్రసాద్. లేకపోతే ఎందుకు వుండమంటాడు అని గాలిమేడలు కట్టాడు. మిగతా అందరిని యింటర్వ్యూ పూర్తి చేశాక అయన మళ్ళీ ప్రసాద్ ను పిలిచి "మిస్టర్ ప్రసాద్ , నాతో ఒక్క అరగంట యింటికి రాగలరా, మీతో పర్సనల్ గా మాట్లాడాలి" అన్నాడు. అయన మాటలకు తబ్బిబ్బు అయిపోయాడు. అయనన్నదానికి అర్ధం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తన కొచ్చినట్టే, అంత పెద్ద డబ్బు గలయన కాకపోతే తనతో ఎందుకు మాట్లాడుతాడు అనుకొన్నాడు.
ఆయనతో పాటు అయన పెద్ద కారులో పాములా నేల మీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్ళడం, ఇంటి కెళ్ళాక బంజారాహిల్స్ లో అ బంగళాని, దాని వైభవాన్ని ఒక్కొక్క గది అయన చూపిస్తుంటే నోట మాట రానట్టు ఆశ్చర్యంగా చూశాడు. ఏ హిందీ సినిమా సెట్టింగు ల్లోనో చూడడం తప్ప అంత ఖరీదయిన , అంత అందమైన భవంతి, ఫర్నిచరు చూడలేదేమో విన్తాగా, కుతూహలంగా తెల్లపోతూ చూశాడు. చూస్తున్నంత సేపూ అదంతా అయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచన రాలేదు. తర్వాత అయన తన ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు రూమ్ లో కూర్చిపెట్టి నౌకరు తెచ్చిన వెండి కాఫీ సెట్టులోంచి స్వయంగా కాఫీ పోసి యిచ్చి, వెండి పళ్ళెంలో బిస్కెట్లు ఆఫర్ చేసి తన కంపెనీ వివరాలు, తన షేర్లు, బ్యాంక్ అకౌంట్లు, తన ఆస్థుపాస్తులు చెపుతుంటే అప్పటికి వంటి మీద తెలివి వచ్చినట్టు ఇదంతా అయన తనకెందుకు చెప్తున్నాడన్న ఆలోచన వచ్చి తెల్లపోతూ వినడం తప్ప అడగలేకపోయాడు , అన్నీ చెప్పిన అయన ఆఖర్న ...."ఈ ఆస్థి కంతటికీ వారసురాలు ఎవరో తెలుసా, నా ఒక్కగానొక్క కూతురు అంటుండగా అయన మొహంలో ఎలా విషాదపు నీడలు కదిలాయో గుర్తించి ఆశ్చర్యపోయాడు. అన్నీ చెప్పిన అయన హటాత్తుగా ప్రసాద్ చెయ్యి పట్టుకుని "రా, బాబూ మా అమ్మాయిని చూపిస్తాను' అంటూ మేడ మీదకు తీసికెళ్ళాడు. ఉత్కంట తతో మేడమీదకు వెళ్ళిన ప్రసాద్ కి పెద్ద మంచం మీద ...పట్టు పరుపుల మధ్య, సిల్కు తలగడల నానుకుని ఏదో పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూపించాడాయన. పక్కన చక్రాల కుర్చీ వుంది. 'మా అమ్మాయి లత....లతా , యితను ప్రసాద్ అని మన ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చారు. మన యింటికి పిల్చాను మాట్లాడడానికి" అయన మాటలు అర్ధం అయినట్టుగా ఆ అమ్మాయి తల పంకించింది. హటాత్తుగా ఆమె మొహం లో ఎరుపు రంగు తొంగి చూసింది. ప్రసాద్ వంక చూసి తల దించుకుంది.
'చూసావుగా , రా....అంటూ అయన మళ్ళీ ప్రసాద్ ని తీసుకొని కిందికి వచ్చాడు. "చూశావా బాబూ, యింత అస్థికీ వారసురాలు అయినా నాకూతురు ఏది అనుభవించ లేకుండా చేశాడు ఆ దేముడు. మంచం లోంచి కదలలేని అవిటిదాన్ని చేశాడు. చూశావా నాయనా ఆయన గొంతు రుద్దమయింది. మొహం ఎర్రబడింది.
"లక్షలు, యీ మేడలు , కార్లు ....యివన్నీ ఎవరి కోసం బాబూ, దాని కోసం. అది అనుభవించ లేనిదయింది. కనీసం దాని కడుపున నలుగురు పిల్లలు పుడితే యీ శ్మశానం లాంటి యింటిలో కళ వస్తే చూసి కన్ను మూయాలని నా ఆశ. నా తరువాత నేనున్నానని డానికి చేయూత యిచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబూ. డానికి నేనివ్వగలిగింది డబ్బు. కాని....కష్టానికి సుఖానికి తోడుండాలి ఒకరు. నా తరువాత అది దిక్కులేని దవకూడదని నా బాధ అందుకే డానికి పెళ్ళి చెయ్యాలని కోరిక . చూడు బాబూ ప్రసాద్ యిదంతా నీతో ఎందుకు చెప్తున్నానో నీకిపాటికీ అర్ధం అయుండాలి. బాబూ....యీ ఆస్థి....యీ లక్షలు, యీ కార్లు , యీ షేర్లు అన్నీ కానుకగా తీసుకుని నా కూతురికి నీ చేయి ఆసరా అందించగలవా...." అయన అంత పెద్ద ధనవంతుడు, అంత ఆస్థి అంతస్తు వున్నాయన ఏమీ లేని బికారిలా ప్రసాద్ ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. అసలే అనుకోని విధంగా జరిగిన యీ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయనలా దీనంగా, దైన్యంగా అడిగిన ఆ తీరుకి విచలితుడై జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడి పోయి.
"నేను....నేను....అన్నాడు" ఆలోచించుకో బాబూ. "తొందరేం లేదు. మీ యింట్లో వాళ్ళతో కూడా చెప్పి.....ఆలోచించు చెప్పు....."
"నన్ను .....నన్నే ఎందుకు మీరు అడిగారు.....యింకెవరూ....
'చాలామందిని చూస్తున్నాను నాయనా, నాకు నచ్చినవాళ్ళు కనపడితే, వాళ్ళు యిష్టపడక యిలా కాలం జరిగిపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళలో బుద్దిమంతులు మంచి కుటుంబం నుంచి వచ్చిన సత్ప్రర్తన , నీతి నిజాయితీ గా వుండగలరనుకున్న వాళ్ళని చూసి అడిగాను. బాబూ నా లక్షలన్నీ ఇస్తానన్నా కొందరంగీకరించలేదు. నీకిష్టం అయితే అలోచించి చెప్పు బాబూ. యీ యిల్లు, వాకిలి, నా బిజినెస్సు అన్నింటితో పాటు దాన్ని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా నిట్టురుస్తాను. ఒక్కగానొక్క కూతురు బతుకిలా అయిందని మంచం పట్టి బెంగతో చచ్చిపోయింది నా భార్య. నేను జీవచ్చవంలా నా కూతురి కోసం నా ఆసరా లేకపోతే బతకలేని దాని కోసం బతుకుతున్నాను.
"మీ అమ్మాయికి ముందు నించి యిలాగే....."
