"కావు " మని జగము మొఱలిచ
గావగ దక్షుంచు దా నోకండే జగతిన్
గావుట బరవిదు వేలుపు
క్ష్మా వరసుతుదగుచు "కావు కావ"ని యేచ్చేన్.
తమ్ముడి ఉయ్యాల తన ప్రక్కన లేందే అయ్యగారికి నిద్రపట్టదట!
తన యుయ్యల ప్రక్కను ల
క్ష్మణు నుయ్యల లేకయున్న కనుమూయం, డే
మిని నుల్లాసము గానదు
జననీస్తన్యంబు గ్రోల జన డేమైనన్.
వీరు తమ రామాయాణాన్ని సప్తకాండలు సంపూర్ణంగా రచించి ఇష్టదైవమైన శ్రీ ఒంటిమెట్ట కోదండ రామస్వామి వారి కర్పించి ధన్యులైనారు.
ఆంధ్ర శ్రీమద్రామాయణం
"అభినవాంధ్ర వాల్మీకి" బిరుదాంకితులు "కావ్యతీర్ధ" జనమంచి శేషాద్రిశర్మ గారు ఈ రామాయణాన్ని రచించారు. మూల రామాయణంలోని అర్ధం సంపూర్ణంగా తెలియటానికి గోవిందరాజాది వ్యఖ్యాతం అభిప్రాయలు సైతం కలియగలపుకొని తమ రచన సాగించటం వీరి ప్రత్యేకత. వీరి రామాయణంలో కూడా వాల్మీకి రామాయణంలోని సర్గ సంఖ్య శ్లోక సంఖ్యా గుర్తింపబడ్డాయి. వీరి రచన సరళ సుందరంగా సాగిపోతుంది.
శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతం ఎరిగింపగానే మందరతో కైక అంటుంది-
ఏతన్మే ప్రియమాఖ్యాతుః కిం నా భూయః కరోమి తే,
రామే వా భరతే వాహం విశేషం నేపలక్షయే.
పై వాల్మీకి శ్లోకానికి శర్మగారి అనువాదం ఈ విధంగా ఉన్నది!
మనమున కింపు బెంపడగు మాటను జెప్పిన నీకు నేమి యి
య్యనుగలదాన "నీ సవతి యాత్మజుపై నిటు ప్రీతి యేలొకో"
యనియెడ వేమొ రాఘవుని యందును నా సుతునందు భేదమున్
గనుగొన జాల నిద్దరును గాదిలి పుత్రులె నాకు గావునన్.
పై పద్యంలో "నీ సవతి యాత్మ]జుపై నిటు ప్రీతి యేలొకో యనియెద వేమొ" అన్నమాట మూలంలో లేదు. అది "నను సపత్నీ పుత్రే కధం నా ఏతాదృశీ ప్రీతిః ఇత్యత ఆహా" అన్న గోవిందరాజీయ వ్యాఖ్యాన పంక్తి ననుసరించి చేర్చబడింది.
ధర్మసార రామాయణం
ఈ రామాయణం కూడా జన మంచివారిదే. రామాయణంలోని రాజధర్మం, భ్రాతృధర్మం, మిత్రధర్మం, పుత్రధర్మం మొదలైన ధార్మిక సిద్దాంతాలను చక్కగా నిరూపిస్తూ శర్మ గారు రచించిన మహాగ్రంద్రమిది.
శ్రీరామ కధామృతం
గ్రంధకర్త తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు. వీరు మహావిద్యాంసులు. తపస్సంపన్నులు. విశేషించి శ్ర్రీమదుమామహేశ్వర చరననళిన నిత్యసేవాపరాయణులు నిరాడంబర జీవనులు. చతుర్వింశతి సహస్త్రశ్లోక పరిమితమైన వాల్మీకి రామాయణాన్ని అనుసరించి తమ గ్రంధాన్ని ఉత్తర కాండతో కూడ "గాయత్రీ చతుర్వింశతివర్ణాంకిత చతుర్వింశతి సహస్ర గద్య పద్మాత్మకం" గా దిద్దితీర్చి పరమేశ్వారాంకితం చేశారు. ఇందలి రామాయణ కధ పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లు ఉంటుంది.
"శంభో స్వాగత మాస్యతాం" అని కలవరించిన లీలాశుకుని బాలకృష్ణుని వలెనె వీరి బాలరాముడు నిద్రలో కలవరిస్తాడు -
'కుశలమె నీకు బ్రహ్మ! నను కూర్మీ దలంతునే యీశ! నీ కహ
ర్నిశము సుఖంబే యింద్ర! భయభీతి దొలంగెనే దివ్యులార! బా
లిశు డాతడేమి సేయు దృణలీల సడంతు' నటంచు నిద్దురన్
విశద మొనర్చు దాశరధి వేల్పులతో పతిదేవతామణీ!
అబ్బాయి కలవరిస్తున్నాడని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి రక్షపెడుతుంది.
శ్రీకృష్ణ రామాయణం
కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు దీనిని రచించారు. శాస్త్రిగారు భారత భాగవత - రామాయణాలను ఒక్క చేతి మీదుగా వ్రాసి తమ నామాన్ని జోడించి వానికి "శ్రీకృష్ణభారతం ' - శ్రీకృష్ణ భాగవతం" "శ్రీకృష్ణ రామాయణం" అని పేరు పెట్టారు.
వీరి రామాయణం సరిక్రొత్త మార్గంలో నడిచింది. మూల రామాయణంలో లేని వాల్మీకి పూర్వ చరిత్రం, కౌసల్యదశరధుల కల్యాణ వృత్తాంతం , దశరధుని మృగయావిహారము, శాపప్రాప్తి, శాంత పుట్టుక, రావణాదుల జననం, జైత్రయాత్రలు, వేదవతి వృత్తాంతం అన్నీ బాలకాండ లోనే ప్రారంభించి చెప్పారు. జయవిజయుల శాపవృత్తాంతం కూడా జోడించారు.
ఇందు అహల్య నిర్దోషురాలు , కైకేయి నిష్కళంక . పుత్రశోకార్తయైన శూర్పణఖకు సీత ఆశ్రయ మిస్తుంది. రావణుడు గడ్డతో పెకలించి సీతను తీసుకువెళ్ళుతాడు. శబరీ ఎంగిలి పండ్లు రామునికి పెడుతుంది. సీతాదేవి భూప్రవేశం లేదు. రామనిర్యాణం జరగదు. అంతా సుఖాంతం.
శాస్త్రిగారి కవితా మాధుర్యానికి ఒక పద్యం. రావణుడు సీతతో అంటాడు -
కైలాసం బరకేల నేత్తితిని! నాకవ్రాతమున్ మొత్తితిన్!
గీలిం గట్టితి గాలి బట్టితి! యమున్ గింపాకునిం జేసితిన్!
భూలోకంబున గాక నాల్గుపదియై పోల్పోందు లోకంబులన్
నా లా వన్నను బిచ్చలింతురు జనుల్ నానాప్రకారంబులన్.
గోవింద రామాయణం
ఆత్మకూరి గోవిందచార్యులు గారు తమ పేరుతొ "గోవింద రామాయణం" రచించారు. వీరు జాతీయ సమర వీరులు. గాంధేయులు. వీరి వేషంలాగానే వీరి కవిత్వం కూడా నిరాడంబరం. ఉత్తరకాండతో ఏడు కొండలు పూర్తిగా వ్రాశారు. ఆచార్యుల వారి అనర్గళకవితాధారలో రసద్రుష్టితో పాటు రాజకీయ దృష్టి కూడా చోటు చేసుకున్నది. వీరు శ్రీరామచంద్రుని ఆదర్శ ప్రభువుగా చిత్రించారు. రామరాజ్యాన్ని దర్శించి ప్రదర్శించారు.
సుభ్రదా రామాయణం
సుభద్రా రామాయాణాన్ని రచించినవారు శ్రీమతి సీరం సుభద్రయాంబగారు. ఈమె సెట్టి లక్ష్మీనరసింహారావుగారి సోదరి. ఈ రామాయణంలో పట్కండలు ఉన్నాయి. 2000 లకు పైగా పద్యాలు ఉన్నాయి. సుభద్రయంబగారి పద్యాలు ముద్దులు మూటగట్టుతూ రాయంచలవలె నడుస్తాయి.
పుత్ర విరహం సహించలేని దశరధుడు అంటున్నాడు -
ఉల్లము పల్లవింప మృదులోక్తులు పల్కుచు నా సమక్షమం
దల్ల కళానిధిం దెగదు నాస్యరుచుల్ వెదజల్లి నా కనుల్
చల్లగజేయు నా యనుగు చక్కనిరాము డరణ్యాసీమలో
దల్లడ మందుచున్ దిరుగ డాల్పగలాడనె మేన బ్రాణముల్!
తపస్వినియైన వేదవతిని దనుజెంద్రుడు రావణుడు ప్రశ్నిస్తున్నాడు-
ఈ యేలజవ్వనంపుజిగి! ఈ సుకుమారత! ఈ విలాస! మీ
సోయగ! మీ శరీరనవశోభ! సురోరగమానవాళిలో
నే యలివేణులం దయిన నేను గనుంగొన లేదు నిక్క! మీ
ప్రాయము కాయ మిట్లడవి పాలగు వెన్నెలజేయ న్యాయమే?
సరస్వతీ రామాయణం
దీనిని రచించిన వారు శ్రీమతి చేబ్రోలు సరస్వతీదేవి గారు. కమ్మని కవితా గుణ మెరిగిన "కవి కలహంసి" ఈమె. వీరు ఉత్తరాకాండం కూడా కలిపి ఏడుకొండలు సమగ్రంగా రచించారు. ఈ రసవత్తర రామాయణంలో 1900 పద్యాలు ఉన్నాయి. వీరి పద్యాలలో చక్కని చిక్కని తెనుగుదనం జాలువారుతూ ఉంటుంది. పోతన్నగారి ఒరవడితో సాగిన ఈ పద్యం సీతతో ఆంజనేయుడు అనేది -
నల్లని మేనివాడు , చిరునవ్వులు చిల్కేడి మోముతోడ శో
భిల్లెడువాడు , చక్కనగు పీవరవక్షము వాడు, సొగలౌ
పుల్ల సరోజప్రతములబోలు కనుంగవవాడు, లోకమున్
జల్లగ నేలువాడు, కరుణానిధి శ్రీరఘురామ దమ్మరో!''
వాల్మీక్యాశ్రమంలో వదలబడిన సీత లక్షణునితో అంటుంది -
వాక్కేటులాడేనో! మనసు వజ్రమయం ఐయిపోయేనో! కటా
మక్కువ మాయమయ్యేనో! కుమార! స్వసౌఖ్యము గోరియైన న
న్నక్కడ నిల్పడయ్యే గద! యిక నేటికి మేన బ్రాణముల్!
వ్రక్కలుగాదు నాదు మది వర్రమో యిట్టి కఠోరవార్తకున్!
