Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 10


    నాకు పట్నాల గురించి అంతగా తెలీదు - నా ఇరవై రెండేళ్ళ జీవితంలోనూ పల్లెకు యాభై మైళ్ళదూరంలో వున్న చిన్న పట్టణానికి రెండు మూడు సంవత్సరాలు వెళ్ళేనంతే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమంది జనాన్ని ఒక్కసారి చూడటం వింతగా వుంది. నా మొహంలో ఆ కొత్తదనం కనిపించకుండా నడవసాగేను.

    అందరూ ఏదో హడావుడిగా ఇట్నుంచి అటూ, అట్నుంచి ఇటూ వడి వడిగా పోతున్నారు. కారు హారన్లు, సైకిల్ బెల్ మ్రోతలూ -రణగొణ ధ్వనితో ఆ ప్రదేశం అంతా  అలజడిగా వుంది.

    "విల్ యూ ప్లీజ్ టేక్ ది పెయిన్స్ అప్ టెల్లింగ్ మీ మై వే టు ది రైల్వే స్టేషన్" అడిగేను. అవతలి మనిషి నా వైపు తేరిపార చూసేడు. నా ఉచ్ఛారణలోనో, నేను కన్ స్ట్రక్ట్ చేసిన వాక్యంలోనో ఏవో తప్పు వుండి వుంటుందనిపించింది.

    "గో స్ట్రెయిట్ అండ్ దెన్ లెప్ట్!"

    స్ట్రెయిట్ అంటించిన రకరకాల సినిమా పోస్టర్లూ వాటి పేర్లూ నన్ను చాలా ఆశ్చర్యపరిచినయ్. షో కేసుల్లో బొమ్మల్నీ, బొడ్డుక్రిందికి చీరెకట్టిన ఆడవాళ్ళని చూసుకుంటూ ముందుకు సాగేను సెక్స్ ఈ తరం మీద చాలా బాగా తన ప్రభావం చూపుతున్నదన్నమాట. నలుగురైదుగురు హిప్పీ!....(ఠాకూర్ ఏదో  చెప్పేడు. సరిగ్గా జ్ఞాపకం లేదు) లు నన్ను రాసుకుంటూ వెళ్ళిపోయేరు. వీళ్ళది ఆధ్యాత్మిక వాదమా? నిస్తేజంలోంచి పుట్టిన పూరివిప్పిన కోర్కెలు - సెక్స్- తాగుడు....మళ్ళీ అందులోంచి వేదాంతం.

    "సివిలైజేషన్ ఈజ్ ఎ సర్కిల్" అన్నాడు కిట్స్. ఎంత నిజం. రివక్యూషన్ నిరంతం.

    చటుక్కున ఆగేను.

    లైబ్రరీ.

    పెద్ద పెద్ద అక్షరాల్తో వ్రాసివుంది రెండంతస్తుల పెద్ద భవనం. లోపలి వెళ్ళాలన్న కోర్కెను చాలా బలవంతం మీద ఆపుకొన్నాను. ఒకసారి లోపలికివెళితే మళ్ళీ బయటకు రాలేనని తెలుసు. తల తిప్పుకొన్నాను. లైబ్రరీకి ఎదురుగా  ఎమ్యూజ్ మెంటు పార్కు కనబడింది. మనిషి మానసిక వికాసాన్ని పెంపొందించే ఆలయం ఒకవైపు, బలహీనతల మీద ఆడుకొనే జూద గృహం ఒకవైపు, సగటు మనిషి ఎన్ని కాంట్రడిక్షన్ల మధ్య బ్రతుకుతున్నాడో.....

    నా ఆలోచన్లు రకరకాల పంధాల్లో సాగుతున్నాయి. చిత్రమేమిటంటే నా అంతర్గతమైన ఆలోచన్లలో కూడా ఎక్కువగా ఆంగ్లమే చోటు చేసుకుంటోంది. పుట్టిన దగ్గర్నుంచీ ఇరవై రెండేళ్ళదాకా ఒక అడవిలో మనిషిని అడవిలో పెంచి తరువాత అతడికి ధియరిటికల్ గా విజ్ఞానం నేర్పి, ఒక్కసారి మనుష్యుళ మధ్యకు వదిలేసి తను నేర్చుకొన్నదానికి, జరుగుతున్న దానికి అన్వయించుకొమ్మంటే ఎంత అయోమయమైన స్థితిలో పడిపోతాడో చెప్పటానికి నేనే ఉదాహరణ.

    స్టేషన్ కనబడింది. దూరంగా రైలేదో వస్తూంది. లోపలికి వెళ్ళేను. కౌంటర్ల దగ్గర పెద్ద గుంపు కనబడింది. కిటికీపైన వున్న బోర్డులు చదువుతూ నేను వెళ్ళవలసిన బుకింగ్ దగ్గరకు చేరుకొన్నాను. దాన్ని ముందు దాదాపు పాతికమంది వున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళుపడి కుమ్ములాడుకొంటున్నారు.

    నా ఊరుకి ప్రక్కనే వున్న పట్నం పేరు చెప్పి, అక్కడకి వెళ్ళటానికి ట్రయిన్ ఎప్పుడుందో అడిగేను.

    "కదలడానికి సిద్ధంగా వుంది" అన్నాడు అవతలి వ్యక్తి. ఆందోళనతో గుంపువైపు చూసేను. మా ఖైదీల్లో ప్రతి పనీ క్యూలో నిలబడి చేసేవాళ్ళం. క్రమశిక్షణ ఏ మాత్రం తప్పినా లాఠీలు మా శరీరం మీద నాట్యం చేసేవి. ఈ ప్రజల్లో ఆ మాత్రం శిక్షణ కూడా కనబడటంలేదు. వీళ్ళకది నేర్పాలంటే ఎంతకాలం జైళ్ళలో పెట్టాలో.

    అవతలి వ్యక్తి నా సంశయం గమనించినట్టున్నాడు, "ఇలా చూస్తే లాభంలేదు. వెళ్ళి మీ శక్తి పరిశీలించుకోండి" అన్నాడు.

    నవ్వి, "అంతేనా" అంటూ గుంపు చేరుకొన్నాను. చేతులు పైకి మడిచి, గుంపులోకి చేతులు పోనిచ్చి విసురుగా చెరో పక్కకి తోసేను. ఇటో ముగ్గురూ, అటో ముగ్గురూ పక్కకి తూలిపడ్డారు. నాకు సలహా చెప్పిన వ్యక్తి నోరు తెరిచి విస్మయంతో నా వైపు చూస్తున్నాడు. నా బలాన్ని ఇతరుల మీద ప్రదర్శించటం ఇదే మొదటిసారి.

    "గురుగారూ, నాకూ మీ ఊరుకే. ఒక టిక్కెట్టు తీసుకోండి ప్లీజ్" అన్నాడు దూరం నుంచి ఆ వ్యక్తి. 'అలాగే' అరిచేను. నా వెనుకవాళ్ళు అదేదో అతి సామాన్యమైన విషయం అన్నట్టు నా వెనుక మళ్ళీ సర్దుకొన్నారు.

    గంట కొట్టారు. మళ్ళీ కలకలం రేగింది. ఇంకోసారి చేతుల్నీ, మోచేతుల్నీ ఉపయోగించి కిటికీ దగ్గరకి చేరుకొన్నాను. నిముషంలో టిక్కెట్లు తీసుకొని బయటపడ్డాను. అతని టిక్కెట్టు అతనికి అందించి ప్లాటుఫారం మీదికి పరుగెత్తేను. ఒక నిముషం తర్వాత నెమ్మదిగా రైలు కదిలింది. 

    ఏదన్నా గొప్ప విషయం తొందరలో జరగబోతూ వుంటే దాన్ని గురించి ఆలోచిస్తూ అనవసరంగా బి.పి. పెంచుకోకు. దాన్ని మర్చిపోయి మిగతా విషయాల మీద ధ్యానం కేంద్రీకరించు అనేవాడు ఠాకూర్. అందుకే ఇంతసేపూ మనసుని అదుపులో పెట్టుకొన్నాను, ఇక సాధ్యంకాదు. ఒక్కసారి ఆనకట్ట వదిలేసేసరికి పార్వతి తాలూకు జ్ఞాపకాలు ఉప్పెనలా వచ్చిపడ్డాయి.


                               *    *    *

    బస్సు దిగి చుట్టూ పరిశీలించి చూసేను.

    కొత్తగా బస్ స్టాండ్ కట్టినట్టున్నారు, ఇంతకుముందులేని కిళ్ళీ కోట్లు హొటళ్ళూ వెలిసినయ్.

    నిముషం సేపు అలాగే నిల్చుని, నాకు తెలిసిన వాళ్ళెవారైనా కనబడతారేమోనని పరకాయించి చూసేను. అందరూ కొత్త కొత్త  మనుషులు. కాలం చాలా తొందరగా నా పల్లెని మార్చేసింది.

    మనసు చాలా వేసిలేటింగుగా వుంది.

    పార్వతి.... పార్వతి.... పార్వతి.

    అదొక్కటేకాదు..... మనసుని ఉత్సుకతతో నింపేస్తూంది, ఆ రోజుకి ముందురోజు పార్వతి నాకు చెప్పిన విషయం.....అది సరదాగా నన్ను తొందరపర్చటానికి చెప్పిందా లేక నిజమేనా?

    నిజమైతే-

    నిజమైతే నా కొడుక్కో కూతురుకో యిప్పుడు స్కూల్ కెళ్ళే వయసు వుంటుంది.

    అడుగుల అప్రయత్నంగా వడివడిగా సాగేయి. కానీ ఎటు వెళ్ళను? ఎవర్ని అడగను?

    "నా వాడు" అనుకొన్న బాబాయిమోసం చేసేడు. చిన్నతనం  నుంచీ  స్నేహితులు నాకాట్టే లేరు.

    తెలిసిన వారేమైనా కనబడతారేమోనని ఆశగా చుట్టూ చూస్తూ నడవసాగేను. నా ఆశ తీరలేదు. నెమ్మదిగా నడుస్తూ ఊరు చివరికి వచ్చి మా ఇంటి దగ్గర ఆగేను.

    కూలిపోయి శిథిలావస్థలో వున్న పాక వెక్కిరిస్తూ వుంది.  చుట్టూ పిచ్చి మొక్కలు ఇష్టం వచ్చిన రీతిలో పెరిగేయి. గడ్డి దుబ్బులు దుబ్బులుగా పెరిగి ఆ  ప్రాంతాల్లో ఎవరూ తిరగటం లేదన్న విషయాన్ని నిరూపిస్తోంది.క్రింద జాగ్రత్తగా చూసుకొంటూ పాకని సమీపించేను. కొంచెం పెద్దవర్షం వస్తే పూర్తిగా నేలమట్టం కావటానికి సిద్ధంగా వుంది. ముందు తలుపులు ఎవరో పీక్కు పోయినట్టున్నారు. ద్వారం ఖాళీగా వుంది. దగ్గిరగా వెళ్ళేను. నా అడుగుల చప్పుడుకి పోదలోంచి ఉడుత ఒకటి దూరంగా పారిపోయింది.

    తల బాగా వంచి లోపలికి అడుగుపెట్టాను. అడుగువేయగానే కాలిక్రింద నుంచి ఎత్తుగా దుమ్ములేచింది. ఏదో జంతువు చచ్చిపోయిన వాసన వేస్తూంది.

    బయట అంతా నిశ్శబ్ధంగా వుంది. దూరంగా ఎక్కడో కాకి వుండి వుండి అరుస్తోంది. చుట్టూ చూసేను ఒకవైపు చూశాను. ఒకవైపు గోడ పూర్తిగా పడిపోయింది. పై కప్పు కేవలం నాలుగు చీలిపోయిన స్థంభాల పైన నిలబడి వుంది.

    ఈ పాకలోనే ఒక స్త్రీ మాతృత్వాన్ని సిద్ధింపచేసుకొని, అడవిలో దొరికిన ఒక అనాధుడ్ని పెంచి పెద్ద చేసింది. ఈ పాకలోనే నేను ఆ ఒడిలో కన్నతల్లి యెవరో గుర్తు లేకుండా పెరిగేను. ఈ పాకలోనే నేనూ పార్వతి చిన్న పిల్లల్లా దెబ్బలాడు కొంటూంటే ఆ తల్లి నవ్వుతూ మమ్మల్ని కోప్పడేది.

    ఏమైంది ఆ తల్లి?

    ఎక్కడున్నాయి నన్ను ఆప్యాయంగా సాకిన చేతులు? ఆలోచనలతో తల పగిలిపోతోంది.

    మూలగా ఏదో తళుక్కుమంటే వంగొని చూసేను. గాజుముక్క దానిక్రిందే దుమ్ములో రంగు పోగొట్టుకున్న రాములవారి విగ్రహం కనబడింది. ప్రతిరోజూ దానికి దణ్నం పెట్టేవాణ్ని. ఏ రోజన్నా మర్చిపోతే అమ్మ తిట్టేది. బొమ్మ జేబులో పెట్టుకొన్నాను.

    బయట ఏదో చప్పుడైంది.

    తల బైటికి పెట్టి చూసేను. తొందరగా వంగడంవల్ల  పై కమ్మీ కొట్టుకుంది. ఆగంతకుణ్ని వింతగా చూసిన కుక్క తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది.

    బయటకొచ్చేను.

    ఇరవై రెండేళ్ళు ఎండనుంచీ వాననుంచీ మమ్మల్ని కాపాడిన ఆ పాక సామ్రాజ్యాలు కోల్పోయి చరిత్రపుటల్లో శిథిలమైన కోటలా వుంది. ఒకప్పుడు ఈ ఇంటిముందు ప్రతిరోజూ ముగ్గులు వుండేవి. బంతిపూలు విరగబూసేవి. నా  చేతుల్తో నేను స్తంభాలు పాతి కట్టిన పాక.....

    భరించలేనంత దుఃఖం గుండెల్లోంచి పెల్లుబికింది. అతికష్టంమీద అదుపులో పెట్టుకొని వెనుదిరిగేను.

    మళ్ళీ ఊరివైపు నడక సాగించేను. దారిలోనే బాబాయి కలపకొట్టు - బాబాయి కనపడటం ఇష్టంలేదు. దూరం నుంచే అడితీని పరిశీలించేను. బాగా అభివృద్ధి పోందినట్లుంది. ఎత్తుగా కర్రమీద కర్రలు పేర్చి కనబడ్తున్నాయి. చాలామంది కూలీలు 'సామిల్' కోసిన కర్రల్ని ఎత్తుకొని వరుసగా పేరుస్తున్నారు. మోఉ సామిల్లులు ఒకేసారి పనిచేస్తున్నట్టున్నాయి! వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్నాడన్నమాట. అంతకుముందు ముగ్గురం. నేనూ, ఇస్మాయిల్, రాముడూ, పనిచేసేవాళ్ళం. పరకాయించి చూసేను - వాళ్ళిద్దరూ కనబడలేదు.

    ఎక్కువసేపు అక్కడ ఉండటం నా కిష్టంలేదు.

    కదిలేను.

    పార్వతి ఇంటివైపు అడుగులు వేస్తూంటే, నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    తండ్రి చనిపోయిన వంటరిదైన పార్వతి నా తల్లి దగ్గరికి వచ్చేసి వుంటుందని అనుకున్నాను. కానీ శిథిలమైన పాక నాలో ఆలోచన కలిగించింది. నాకన్నా పార్వతి స్థితి ఆర్థికంగా కొంచెం మెరుగైంది. బహుశా నా తల్లినే పార్వతి ఆహ్వానించిందేమో! ఈ ఆలోచన ముందే రానందుకు నన్ను నేను నిందించుకొన్నాను.

    వీధి మలుపు తిరగగానే మొట్టమొదట ఎత్తరుగుల ఇల్లు పార్వతిది.

    ఇల్లు దగ్గరపడుతున్న కొద్దీ రక్తప్రసారం ఎక్కువ అవుతోంది. అడుగులు తొందర తొందరగా వేస్తూ దాదాపు పరుగెత్తుతున్నట్లు నడవసాగేను.

    పార్వతి....

    నా తల్లి.....

    కొడుకో- కూతురో-

    వీళ్ళందర్నీ కలుసుకోబోతున్నా?

    నా నుదుటిమీద చెమటపట్టింది. నాకు చాలా పరిచయమైనా దారి అది- దాని కిరువైపులా వచ్చిన మార్పుల్ని గమనించే ఓపిక లేదు. వీధి మలుపులోనే దృష్టిని కేంద్రీకరించేను. మేం కలుసుకోబోయే క్షణాల్ని రకరకాలుగా ఊహించుకుంటూ వీధి చివరికి చేరుకొన్నాను. కుడివైపుకి తిరిగి ఆత్రంగా తలెత్తి చూసేను అంతే-షాక్ తగిలినట్లు అలాగే నిలబడిపోయేను.

    పార్వతి వాళ్ళ ఇంటిస్థానే మూడంతస్థూల మేడ వుంది. ఇంటిముందు తోట, గేటు దగ్గర గూర్ఖా వున్నాడు. మాలి చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. పోర్టికోలో ఇంటి యజమానురాలు నిలబడి నోవ్కరికి ఏవో సూచన్లు ఇస్తోంది. ఇనుపగేటుకి కుడివైపున పాలరాతి ప్లేటుమీద ఇంటి యజమాని పేరు అందంగాచెక్కబడి వుంది.

    "కె. లక్ష్మీనారాయణ. కమీషన్ ఏజెంట్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS