ఎట్లా చావాలి నేను? మేజరుగా మీకెంత బాధ్యత ఉందొ, మేనేజరుగా నాకూ అంత బాధ్యతుంది. కాదా సార్?"
మేజర్ సుదర్శనం అతని మాటలు వినిపించుకోవడం లేదు. అతని ద్రుష్టి అంతా లోపలికి వస్తున్న ఇద్దరు మనుషులు మీద ఉంది.
ఒక దేశపు బోర్డరు కాదు.
నాలుగుదేశాల బార్డర్లు దాటివస్తున్నట్లు వాళ్ళవంటి మీద కొంతమేర ఎర్రటి దుమ్మూ, కొంత మేర నల్లటి బురదా అంటుకుని ఉన్నాయి. చెవుల్లో, జేబుల్లో, బూట్లలో, ఇసక దూరి ఉంది. మొహానికి , చేతులకి గ్రీజు అంటి ఉంది.
ట్రూపు నుండి విడిపోయి, సపరేట్ గా ముందే బయలుదేరిన అసలు ఆర్టిస్టులు వాళ్ళు ఇద్దరూ, వాళ్ళ సూట్ కేసే నిఖిల్ కి దొరొకింది.
నేరుగా ట్రూపు మేనేజరు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించారు వాళ్ళు. "మీరు చెప్పిన మాట వినకుండా ముందే వెళ్ళిపోవడం మా చావుకి వచ్చింది మహాప్రభో!" అన్నారు జంటగా.
ట్రూపు మేనేజరు వాళ్ళిద్దరినీ చూడగానే నోరెళ్ళబెట్టాడు. చాలాసేపటి తర్వాత గొంతు పెకలించుకుని, "మరి గిరిజనుల మేకప్ లో మాకు ఎదురయిన ఆ ఇద్దరూ ఎవరు?" అన్నాడు స్వగతంలా.
అప్పటికే వైర్ లెస్ సెట్ ని చేరుకొని, ఆ సమాచారాన్ని తరుణ్ కి పంపడం మొదలెట్టాడు మేజర్ సుదర్శనం.
* * *
సేఠ్ చంపక్ లాల్ మానిక్ లాల్ కోచర్ తన కిరాణా దుకాణంలో గుండ్రటి దిండ్లను అనుకుని జోగుతున్నాడు. అరమూతలు పడిఉన్న అతని చింతాకులాంటి చిన్నకళ్ళకి ఇద్దరు గిరిజనుల రూపాలు అస్పష్టంగా కనబడేసరికి కళ్ళు పూర్తిగా తెరిచాడు. వెంటనే అతని మొహం వికసించింది.
ఈ అడవి మనుషులు ఉత్త వెర్రి గొర్రెల లాంటివాళ్ళు. వీళ్ళని బులిబచ్చకాయలు చెప్పి లాభం దండుకోవడం అతిసులభం.
"ఏమిటి?" అన్నాడు, గిరిజన యువతి వేషంలో ఉన్న రాధవైపు , ఆమె నెత్తిన ఉన్న మూటవైపూ ఆబగా చూస్తూ.
"ఇమ్లీ!" (చింతపండు) అంది రాధ వగలు వలకబోస్తూ.
"దింపుకోగలవా? దింపనా?"
నవ్వుతూ , ఓరగా చూస్తూ, దోరవయసు పొంకం కొద్దిగా ప్రదర్శిస్తూ వంగి, మూటని కిందికి దింపింది రాధ.
ఆ కొద్ది క్షణాలపాటూ ఆమె గుండెల మధ్య ఉన్న లోయలో చిక్కుకుపోయాయి సేఠ్ చూపులు.
రాధ దింపిన మూటను విప్పి చూడలేదు సేఠ్. గిరిజనులు తనలాగా మోసం చేసే మనుషులు కారని అతనికి బాగా తెలుసు.
కానీ అతను ఆ మూటను గనుక విప్పి చూసి వుంటే, అతనికి ఆ మూటలో చింతపండు కాదు చెత్తాచెదారం కనబడి వుండేవి.
ఆ అడవుల్లో ఇంకా బార్డరు పద్దతే అమలులోవుంది. డబ్బు వాడకం చాలా తక్కువ. వస్తువు ఇచ్చి వస్తువు పుచ్చుకోవడమే వాళ్ళకి అలవాటు.
కాసేపు అంచనా వేస్తున్నట్లు ఆ మూటవైపూ, రాధ వైపూ మార్చి మార్చి చూశాడు సేఠ్.
"ఎమివ్వమంటావే?"
"నీకు తెలవదా సేఠ్?" అంది రాధ.
"ఏమిచ్చినా తీసుకుంటావా?" అని వెకిలిగా నవ్వి, దయాధర్మంలాగా ఒక అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు సేఠ్.
కొండాకోనల్లో నాగరికతకు దూరంగా బ్రతికే గిరిజనులను దోచుకుతినే మైదాన ప్రాంతపు మనుషులు కొందరికి ప్రతీక ఆతడు.
నిఖిల్ వైపు చూసింది రాధ.
అతను కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఇంతేనా సేఠ్, మాకు వచ్చేది?" అన్నాడు పళ్ళ బిగువున.
సేఠ్ ఒక బీడీ కట్ట తీసి ఇచ్చాడు "నీకు ఆశ ఎక్కువరా! ఒక్క మూట చింతపండుకి అగ్గిపెట్టె బీడీలకట్ట! న్యాయం ఎక్కడుందిరా? ఇంకాసేపు వుంటే ఇది ఒక పూసల దండ కూడా ఇవ్వమంటది! ఏమే? అవునా?"
రాధ మొహం చేటంత అయింది.
"పూసల దండా! ఇవ్వుదొరా!" అంది సంతోహంగా, ఓరకంటితో నిఖిల్ ని చూస్తూ.
"ఇస్తే పెట్టుకుంటావా"
సిగ్గుగా తల ఊపింది రాధ.
"తారీ కుసీతో మారీ కుసీ!" (తేరీ ఖుషీ హమారీ ఖుషి) అని యాసగా అంటూ ప్రయాసతో లేచి నిలుచున్నాడు సేఠ్. నువ్వు ఇక్కడే వుండరా!" అని నిఖిల్ ని గదమాయించి, "రావే!" అని రాధతో చెప్పి లోపలికి నడిచాడు సేఠ్.
అతను లోపలికి వెళ్ళగానే దుకాణం షట్టరు క్రిందికి లాగేశాడు నిఖిల్. అక్కడ ఉన్న తప్పుడు తూకపు రాళ్ళలో అతి పెద్ద దానిని తీసుకుని, తను కూడా లోపలికి వెళ్ళాడు.
మరు నిమిషంలో సేఠ్ నెట్టి మీద అయిదు కిలోల తూకపు రాయి బలంగా తగిలింది.
అచేతనంగా కిందికి జారాడు, ఒక దశాబ్దంగా గిరిజనులను దోచుకు తింటున్న సేఠ్ చంపక్ లాల్ మానిక్ లాల్ కోచర్.
అతని బొడ్లో వేళ్ళాడుతున్న తాళపు చెవుల గుత్తి అందుకున్నాడు నిఖిల్.
రాధ అచ్చం సేఠాణీలాగా ఉంది. నెత్తిమీద గులాబి రంగు మేలిముసుగు ఆ ముసుగులో నుంచి తొంగి చూస్తోంది. పాపటి మీదుగా ధరించే ఒక ఆభరణం.
షట్టరు కిందికి లాగేశాడు నిఖిల్.
నడవడం మొదలెట్టారు ఇద్దరూ.
"ఎక్కడికి ఇప్పుడు?" అంది రాధ.
"నాగపూర్ వెళ్ళాలి మనం."
"వెళ్ళి?"
"నాగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో సింపల్ కుట్టీ చేరాలి. సింపల్ కుట్టి దగ్గరే హాదీ బృందం ఆ బృహత్తరమైన దేవాలయం కడుతున్నాడని తెలుసు రాధకి.
"కానీ నాగపూర్ వెళ్ళడం ఎలా?"
"కలకత్తా నుంచి, వాడా నాగపూర్ బాంబే 2 అప్ మెయిల్లో."
"వాడానా? అదేమిటి?"
"వారా అని పలుకుతారు చాలా మంది. కానీ సరైనా ఉచ్చారణ వాడానే."
"అలాగా! లవ్ అంటే సరైన ఉచ్చారణ ఏమిటి?"
"నీ మొహం"
"నా మొహం చంద్రబింబంలా ఉంటుందని మా ఫ్రెండ్స్ అంటూ ఉండే వాళ్ళు."
"షటప్!"
బుంగమూతి పెట్టి నడవసాగింది రాధ.
మరికొంత దూరం నడిచాక వాళ్ళకి కలకత్తా నగరం వెళ్ళే బస్సు ఒకటి దొరికింది.
* * *
