టేబుల్ దగ్గర కుర్చుని ఉన్నాడు తరుణ్. అతని ఎదురుగా రైల్వే టైం టేబుల్ ఉంది.
దానిలోని రైల్వే మ్యాపు తెరిచి పెట్టి ఉంది. మరొకవైపు ఎయిర్ లైన్స్ వారి బుక్ లేట్ ఒకటి ఉంది. విమానమార్గాలు సూచించి ఉన్నాయి దానిలో. పెద్ద పెద్ద రహదారులన్నీ గుర్తించి ఉన్న పెద్ద మ్యాపు కూడా ఒకటి టేబులు మీద ఉంది.
తరుణ్ పెదిమల కొసనుండి సిగరెట్ వేలాడుతోంది, కోటు విప్పేసి సోఫామీద పడేశాడు అతను. నెక్ టై వాదులు చేసి ఉంది. షర్టు చేతులు మోచేతిదాకా మడిచి ఉన్నాయి.
అతని ఏకాగ్రత చెదిరిపోయేలా అమూల్య గొంతు వినబడింది.
"నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్న సంగతే మీరు మర్చిపోయినట్లు ఉన్నారే!"
తల ఎత్తి చూసి, చిన్నగా నవ్వాడు తరుణ్.
"మిమ్మల్ని నేను మర్చిపోవడమూ అమూల్యా! నన్ను నేనైనా మరచిపోగలను గానీ మిమ్మల్ని ఎలా మర్చిపోగలను?"
"మీరేం మాట్లాడకపొతే నాకేం తోచడం లేదు. ఏమిటంత దీర్ఘాలోచన?"
"ఈ నిఖిల్ నిజంగా కొండ ఎలుక లాంటి వాడు."
"ఏమయింది?" అతని మెదడులో మెదలుతున్న ప్రతి భావతరంగాన్ని తను రిసీవ్ చేసుకుని నిఖిల్ కి చేరేలా ట్రాన్స్ మీట్ చెయ్యాలని ఆమెకి.
"మళ్ళీ జారిపోయాడు అమూల్య! ఇంకా లాభం లేదు! ఈసారి పని ఇంకెవరికో అప్పగిస్తే కుదరదు. నేనే స్వయంగా వెళ్లి అతన్ని పట్టుకోవాలి."
ఆ మాటలు వినగానే అమూల్య మొహం రక్తహీనం అయిపొయింది. కానీ వెంటనే చిరునవ్వు తెచ్చుకుని అంది ఆమె.
"నేను వస్తాను మీతో!"
తరుణ్ తల అడ్డంగా ఊపాడు.
"నో! నో! మీలాంటి ఆడపిల్లలు రావలసిన ప్రదేశాలు కావు అవి."
అతని కళ్ళలోకి చూసింది అమూల్య.
"వెళ్ళక తప్పదా?"
"తప్పదు అమూల్యా!"
"అయితే క్షేమంగా వెళ్లి లాభంగా రండి!" అంది సాధ్యమైనంత నిజాయితీ గొంతులో పలికిస్తూ.
సంకోచంగా ఆమె చేతిని అందుకుని, సుకుమారమైన ఆమె వేళ్ళను సున్నితంగా తన పెదిమలతో స్పృశించాడు తరుణ్.
"క్షేమంగానే వస్తాను అమూల్యా! మీకోసం!"
అతను బయటికి వెళ్ళగానే అమ్మూల్య అపార్ట్ మెంట్ లో ఫోన్ రింగయింది.
"నేను" అన్నాడు నిఖిల్ అమూల్య రిసీవర్ ఎత్తగానే.
అతని గొంతు వినగానే రోమాంచితమయింది అమూల్య శరీరం.
తరుణ్ తనని తాకినా ఎప్పుడూ ఇలాంటి అనుభూతి కలగదు తనకు.
కానీ ఇతని కంఠం వినబడితే చాలు. పరవశమయిపోతుంది మనసు.
ఇతనంటే తనకి ఎందుకింత పిచ్చి?
"ఎలా ఉన్నారు మీరు?"
"వేటాడబడుతున్న జంతువులా ఉన్నాను. పిచ్చిరాద కూడా అలాగే ఉంది నువ్వు?"
"నేను? గుండెలో గునపాలు గుచ్చుకున్నదానిలా ఫీలవుతున్నాను."
"ఎందుకు?"
దానికి సమాధానం చెప్పకుండా, "తరుణ్ మీకోసం బయలుదేరాడు." అంది అమూల్య.
"ఎప్పుడు?"
"ఇప్పుడే!"
"ప్లయిట్ లోనా?"
"ప్లయిట్ లోనా అంటే, విమానం కాదు."
"మరి?"
"ఒక హెలికాప్టర్ అతని స్వాధీనంలో ఉంచారు అధికారులు."
కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆ పాయింటుని అన్ని కోణాలనుంచి పరిశీలించి చూశాడు నిఖిల్.
"ఇంకేమన్నా చెప్పాడా?"
"మీరు నాగపూర్ వెళతారనీ, బహుశా , వాడా బాంబే మెయిల్ వెళతారనీ ఊహిస్తున్నాడు."
"షిట్!" అన్నాడు నిఖిల్ "దిస్ తరుణ్ ఈజ్ ఏ రియల్ బాస్టర్డ్! అతని ఉఉహ కరెక్టే! వాడా నుంచే మాట్లాడుతున్నాను నేను. నాగపూర్ వెళుతున్నాను."
అమూల్య గొంతులో ఆదుర్దా ధ్వనించింది.
"ఎలా మరి?"
ప్లాను మార్చే వ్యవధి లేదు. ట్రెయిన్ లోనే నాగపూర్ వెళుతున్నాను. ఈలోగా ఏదన్నా ఆలోచించాలి. వీలయితే మళ్ళీ రింగ్ చేస్తాను.
"ప్లీజ్! తప్పకుండా చెయ్యండి" అంది.
"థాంక్స్ ఫర్ ద ఇన్పర్మేషన్!" ప్రార్దిస్తున్నట్లు ఆమె "డోంట్ మెన్షన్ " అని చెప్పేలోగా లైన్ డేడ్ అయిపొయింది.
నిరుత్సాహంగా అనిపించింది అమూల్యకు.
ఒకసారి, ఒక్కసారి నిఖిల్ ని చూడగలిగితే ఎంత బాగుండు!
* * *


