Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 9


    అనుకోని ఈ ప్రశ్నకి ఒక్క నిమిషం తడబడినా తమాయించుకుని నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది.
    "అదా...... నేను మా అమ్మని అమ్మా అని నాన్నని నాన్నా అని పిలవడం వల్ల తనూ అలాగే పిలుస్తుంది. మా చెల్లెలు నన్ను అక్కా అంటుంది కదా! అందుకని తనూ నన్ను అక్కా అంటుంది" అంది శిల్పని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనిమురుతూ.
    "మరి వాళ్ళ నాన్నగారినేమని పిలుస్తుంది?"
    ఈ ప్రశ్న అసలు ఎదురుచూడలేదేమో. రాగిణి షాక్ తిన్నట్టనిపించింది.
    శిల్ప వీరి సంభాషణంతా విని అర్థం చేసుకుంటున్నట్టనిపించి "అదంతా తర్వాత చెబుతాను సిస్టర్!" అంది మెల్లగా.
    పరిస్థితిని అర్థం చేసుకున్న సిస్టర్ మరి ఆ ఊసెత్తలేదు.
    శిల్పకేసి ఆప్యాయంగా చూస్తూన్న రాగిణి "శిల్ప బాగా చిక్కిపోయింది సిస్టర్" అంది.
    "నిద్రాహారాలు మాని, కన్నతల్లిగా చూసుకున్నారు సిస్టర్ ఫెర్నాండిస్ పాపం!" అంది అప్పుడే అక్కడికేదో పనిమీదవచ్చి వీరి మాటలు విన్న సిస్టర్ లిల్లీ.
    "అవును! నాకు తెలుసు. ఎవ్వరికీ పలకని మా శిల్ప సిస్టర్ కి ఇంతబాగా సమాధానం చెబుతోందంటే ఆమె ప్రతిభ వేరే చెప్పనక్కర్లేకుండానే అర్థమవుతుంది."
    "మిసెస్ రాగిణీ! ఐ వాంట్ టు స్పీక్  టు యూ సెపెరెట్ లీ అబౌట్ దిస్ గరల్. శిల్ప గురించి మీతో మాట్లాడాలి." అని - "ఆ శిల్పా! ఇప్పుడు ఏం క్లాసుంది నీకూ?" అంది సిస్టర్ ఫెర్నాండిస్
    "సైన్సు క్లాసు" అంది శిల్ప.
    "అయితే వెళ్ళు. క్లాస్ కెళ్ళిపో...... స్కూల్ అయిపోయాక ఇక్కడికొచ్చేయ్. అమ్మని, అక్కని కలవొచ్చు. ఓ.కే....." అంది.
    "ఎస్ సిస్టర్" అంటూ రాగిణి ఒళ్ళోంచి లేచినుంచుని బైబై చెప్పింది.
    "రహీం.....!" పిలిచింది.
    "రహీం లేడు సిస్టర్. బేబీ కుముదినికి వాంతులయ్యాయట. జ్వరం కూడా వచ్చిందిట! సిస్టర్ రూబీ పిలిస్తే రహీంని కుముదినిని డాక్టరుకి చూపించడానికి పంపించాను" అంది సిస్టర్ లిల్లీ.
    "కుముదిని అంటే ఫోర్త్ క్లాసులో అమ్మాయి కదూ? బ్యూటీ గరల్. నేను తరువాతొచ్చి చూస్తాను. ఇప్పుడు శిల్పని దింపి రావడానికి ఎవరినయినా పంపండి" అంది.
    "ఓ.కే. సిస్టర్......" అంటూ సిస్టర్ లిల్లీ బయటికొచ్చి అటుకేసి వెళుతున్న ఆరో తరగతి కుర్రాడు సుందర్ తో శిల్పని క్లాసులో దించి వెళ్ళమంది.
    శిల్ప సుందర్ తో కలిసి వెళ్ళిపోయింది.
    "సిస్టర్! ప్రతి పిల్లగురించీ మీరు పడుతున్న శ్రమ, తీసుకుంటున్న శ్రద్ధా చూస్తూవుంటే ఆశ్చర్యంగా వుంది. కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లలే కానీ, మీకు వీళ్ళందరూ పిల్లలే."
    "అవును రాగిణిగారూ! మాకు వీళ్ళమీద ప్రేమ ఎంత పెరిగిపోతుందంటే, వీళ్ళు బడివదిలిపెట్టి వెళ్ళేనాడు, ఆడపిల్లని అత్తగారింటికి పంపించేటప్పుడు, తల్లిదండ్రులు పడే బాధలా ఉంటుంది. కానీ, మా బడి వొదిలిపెట్టి వెళ్ళిన పిల్లలు ఎంత హోదాలో వున్నా ఎక్కడున్నా ఇక్కడి కొచ్చినప్పుడల్లా మమ్మల్ని చూసి వెళుతుంటారు. పేరు పేరునా వాళ్ళు నాకు జ్ఞాపకం వుంటారు. ఇదొక రకమైన అనుబంధం" అంది సిస్టర్ ఫెర్నాండిస్. కళ్ళజోడు తీసి అద్దాలు తుడిచి, మళ్ళీ పెట్టుకుంటూ.
    "అవును!" అంది రాగిణి.
    "రాగిణిగారూ! శిల్ప విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి! ఆ అమ్మాయికి తల్లిదండ్రుల ప్రేమ సరిగ్గా అందినట్టు లేదు. ఆ అమ్మాయి అలా ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా వుండడానికీ, మూడీగా ప్రవర్తించడానికీ ఇంట్లోని వాతావరణమే కారణం. డాక్టర్ రాబర్టు కూడా ఈ విషయంలో నాతో ఏకీభవించారు" అంది సిస్టర్ ఫెర్నాండిస్.
    "సిస్టర్! శిల్పకి ఏ విషయంలోనూ లోటు లేదు. కావలసిన తిండీ, బోలెడన్ని బొమ్మలూ, లెక్కలేనన్ని బట్టలూ అన్నీ వున్నాయి. ఇంట్లో అందరూ శిల్పని ఎంతో ముద్దు చేస్తారు."
    "అందరూ అంటే?"
    "మా అమ్మా...... నాన్నగారూ..... మా చెల్లీ..... నేనూ....."
    "రామానుజంగారంటే?"
    "మా నాన్నగారు!"
    "మరి శిల్ప నాన్నగారు?"
    "లేరు!..... "కాస్సేపాగి," మా ఇద్దరి మధ్యా అభిప్రాయబేధాలొచ్చాయి! అందుకని నేను పుట్టింట్లోనే వుండిపోయాను."
    "అంటే విడాకులు పుచ్చుకున్నారా?"
    "అదేమీలేదు. కానీ ఒకరితో ఒకరు తెగతెంపులు చేసుకున్నాం. మేం ఒకరిని ఒకరు చూసుకుని కొన్నేళ్ళవుతుంది.
    "అతనిప్పుడు ఎక్కడున్నారు?"
    "తెలీదు. పాప కడుపులో ఉన్నట్టుకూడా అతనికి తెలీదు. అప్పటికే మేము విడిపోయాము. పాపకు నేను తల్లిననీ తెలీదు. మా అమ్మని చూసే అమ్మనుకుంటోంది."
    "వ్హాట్.... ఎ..... పిటీ......"
    "వారేం చేసేవారు?"
    "కృష్ణా ఫర్టిలైజర్సు" లో పనిచేసేవారు. మేం విడిపోయాక ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి హైదరాబాదొదిలిపెట్టి వెళ్ళిపోయారు! దయచేసి ఇంక నన్నేమీ అడగకండి! నేను చెప్పలేను!" అంటూ నీళ్లు నిండుతున్న కళ్ళని కర్చీఫ్ తో తుడుచుకుంది.
    "నిట్టూర్చింది" సిస్టర్ ఫెర్నాండిస్.
    అమ్మని అమ్మా అని పిలవలేక, నాన్నెవరో? అసలు నాన్నంటేనే తెలీక పెరుగుతున్న శిల్పని తలచుకుంటే సిస్టర్ ఫెర్నాండిస్ కి అపరిమితమైన జాలి పుట్టుకొచ్చింది. హృదయం ద్రవించిపోయింది.
    బిడ్డల భవిష్యత్తుని ఆలోచించకుండా కనిపారేసి, వారి వారి స్వార్థాలకోసం, పట్టుదలలకుపోయి, వారి పంతాలు నెగ్గించుకున్నామని విర్రవీగడం తప్ప, విడాకులు పుచ్చుకుని ఎవరినుద్ధరిస్తున్నట్టు. డబ్బుతో కొనలేనిదీ, ఎంతో విలువైనదీ, ప్రేమా, అభిమానం, ఆప్యాయతా, ఆదరణా ఇవీ మనకున్నవీ...... విదేశాలలో లేనివీ. విదేశాలలో డబ్బుకేమీ లోటులేదు. కానీ, ఎవరికి ఎవరూ అంటనట్టూ, ముట్టనట్టూ వుంటారు. మన దగ్గర ఏమీ లేనివాడైనా, ఉన్నదానిలో తన వాళ్ళందరినీ తృప్తిపరచి, సంతోషిస్తాడు. ఇటువంటి ఉన్నతాదర్శాలు గల దేశంలో పుట్టీ, మనకి తెలీకుండానే మనం మన సంప్రదాయాలనీ, సంస్కారాన్నీ వదిలి, పరదేశీయుల అడుగుజాడల్లో నడిచి, అదే గొప్పని చంకలుకొట్టుకుంటున్నాం! ఎంత దిగజారిపోయాం! - ఫెర్నాండిస్ ఆలోచనల్లో పడిపోయింది.
    రాగిణి కూడా ఏదో ఆలోచిస్తూ వుండిపోవడంతో ఇద్దరి మధ్యా కొంతసేపు మౌనం తాండవం చేసింది. "ఎక్కడ దిగారు రాగిణిగారూ?" అడిగింది సిస్టర్ ఫెర్నాండిస్.
    "హోటల్ దాసప్రకాష్" లో!
    "మంచి హోటలే?"
    "సిస్టర్! ఎల్లుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఈ రెండు రోజులూ బడి అయిపోయాక, శిల్పని నాతో తీసుకుపోనా?"
    "అలాగే : నో అబ్జెక్షన్?"
    రాగిణి సెలవుతీసుకుని, హోటల్ కి వెళ్ళిపోయింది.
    సాయంత్రం అయిదు గంటలకొచ్చి, శిల్పని తనతో తీసుకెళ్ళింది. బజారుకు తీసుకెళ్ళి కొన్ని డ్రెస్సులూ, బొమ్మలూ కొంది సినిమాకు తీసికెళ్ళింది. ఐస్ క్రీం తినిపించింది. ఆ రాత్రి శిల్పని తన గుండెలకదుముకొని తన ప్రక్కనే పడుకోబెట్టుకుంది. శిల్పకి ఆకాశంలోని చందమామని అరచేతిలోకి అందుకున్నట్టుగా వుంది సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ, హాయిగా నిద్దరపోయింది.
    ఆ మర్నాడు శనివారం.
    శని, ఆదివారాలు బడికి సెలవురోజులు. అందుకని శిల్పని తనదగ్గరే వుంచుకోడానికి పర్మిషన్ తీసుకుంది రాగిణి. హోంవర్కు చేసుకోడానికి, పుస్తకాలను హోటల్ కే తీసుకెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS