Previous Page Next Page 
యువత నవత పేజి 10

   
     గ్రామసీమలు అనగానే అందరికీ కళ్లముందు చటుక్కున కనిపించేది పచ్చని పైరులు, పంట కాలువలు, స్వచ్చమైన గాలి, కల్లాకపటం తెలియనట్టుగా వుండే పల్లీయులు.

     నాకు కనిపించేవిమాత్రం అవికాదు.

     మురికి కూపాలూ, చీమిడి ముక్కులతో మసిపాతర లాంటి బట్టలు చీలికలతో వ్రేలాడే పిల్లలు, ఒంటినీ, ఇంటినీ శుబ్రంగా వుంచుకోవడం తెలియని ఆడవాళ్లు, ఇళ్లచుట్టూ పెంటపోగులూ, మురికి కాలువలూ, శ్రమకు తగిన ఫలితం దొరక్క ఎండుకుపోయిన డొక్కలు.

     నాగరిక ప్రపంచంతో సంబంధాలులేక తరతరాలుగా అవిధ్యలో, అంధకారంలో మ్రగ్గిపోతున్నారు. పరిసరాలను అపరిశుభ్రంగా మార్చుకొని అనారోగ్యంతో అకాలమృత్యువువాత పడుతున్నారు "అలా వుండకూడదు! అదికాదు బ్రతుకు! ఇలా వుండాలి!ఇదీ బ్రతుకు! అనిచెప్పేవాల్లు లేక అదే మురికి కూపంలో వాళ్లు జీవితాలు చాలిస్తున్నారు.

     గ్రామ చైతన్యానికి పాటు పడేందుకు నాకు ఈ ఉద్యోగం ఎంత గానో తోడ్పడుతుంది, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలను సంస్కరించడంలో నా డ్యూటీని ఒక పవిత్రమైన సేవాకార్యంగా భావించి, నా సర్వ శక్తుల్నీ, ధారబోసి నాకు దొరికిన ఉద్యోగానికి న్యాయం చేయాలను కొంటున్నాను"

    ఆ ధోరణిలోనే రెండు పేజీలు సాగిన సుధ వుత్తరం చదివి శాలిని నవ్వుకొంది.

     చెప్పేవాళ్లు లేక చెడిపోయారా గ్రామసీమల్లోని ప్రజలు? గ్రామాల్లో ఒక రిద్దరు మోతుబరి రైతచులు, షావుకార్ల ను విడిచి పెడితే చాలావరకు అట్టడుగు బ్రతుకులే. వాళ్ల ఆర్దిక దుస్థితీ,  పై వర్గంలో వున్నవాళ్లు వీళ్లను పైకి రాకుండా చూసే పద్దతి వాళ్లను తరతరాలుగా అవిద్యలో, అంధకారంలో వుండేట్టు చేశాయి. వాళ్లను బాగు పరచాలని ఎవరైనా సుధ లాంటివాళ్లు ఆదర్శాల ఊపుతో వెడితే ముందు మా ఆర్దిక దుస్థితి తొలగించి తరువాత మాట్లాడమంటారు. తనే పొట్టకూటికోసం ఉద్యోగానికి  వెడుతూ ఆర్దికంగా వాళ్లకి తనేం సాయం చేయగలదు?

     అట్టడుగు బ్రతుకులకోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాల వల్ల జరిగేమేలు ఏ మూలకూ చాలడంలేదు. ప్రభుత్వ ఆసరాతో పేదవాళ్లకు ఏదైనా చేయాలని వెడితే నిధుల కొరతవల్ల సుధలాంటి వాళ్లకు చివరికి నిరాశే మిగులుతుంది.

     సంవత్సరం తరువాత, వనపర్తికే పోస్టింగ్ అయ్యి, ఆర్డర్స్ చేత బుచ్చుకొని వచ్చిన సుధతో ఇదే  అభిప్రాయాన్ని వెలుబుచ్చింది శాలిని.

     "ఏదో ఏదో చేయాలని మరీ అంతంత కలలు కనకు! ఏదీ చేయలేక పోయినపుడు మానసికంగా గాయపడతావు"

    "మనస్సుంటే మార్గముండదా? డబ్బుకొరతవల్లే నేననుకొన్నది సాధించలేనంటే  వాళ్లకోసం జోలెకట్టి తిరుపమెత్తుతాను!వాళ్ల చీకటి బ్రతుకుల్లో ఏ కొంచెం వెలుతురు తీసుకు రాగలిగినా నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తాను!"

    సుధ స్థిరంగా గంభీరంగా  అంటూంటే శాలిని చలించిపోయినట్టుగా అయింది. "సుధా, నీలాంటి స్నేహితురాలు వుండటం నా అదృష్టం గర్వపడుతున్నానే!" అంది ఉద్విగ్నంగా సుధ చేతులు చేతుల్లోకి తీసుకొంటూ.

         *    *    *    *    *

     ఉద్యోగంలో చేరిన మొదటిరోజు కరుణ అనే సీనియర్ వర్కర్ చెప్పింది.

    "గ్రామ సేవికలు,ముఖ్య సేవికలు అంటే పిలువని పేరంటంలా వెళ్లి ఇంటింటి తలుపూ తట్టడం అన్నమాట. వీధి వీధికీ, ఇంటింటికీ వెళ్లి మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా మనది గ్రామాల్లో పని! చాలా  జాగ్రత్తగా వుండాలి."

     "జాగ్రత్త అంటే ఎలాంటి జాగ్రత్త?" అడిగింది సుధ.

     "ఇళ్ళలో ఆడవాళ్లే కాదు! మగవాళ్లుకూడా వుంటారుకదా? వాళ్ల కన్ను మనమీద పడకుండా చూసుకోవాలి. పాతికేళ్లు సర్వీసునాది! గ్రామ సేవికగా ప్రారంభమైంది ఉద్యోగినిగా నా జీవితం! చేదుజ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఎన్నెన్నో. నేను వెళ్లగానే "పోయిలేసే అమ్మ" వచ్చింది అనే వాళ్లు అప్పుడు పొగలేని పొయిలు వేయించడం మా మొదటి పని అన్నమాట. పొగవల్ల కళ్లు, ఇళ్ళుఎలా పాడవుతాయో చెప్పి, పొగలేని పొయిలు వేయించేదాన్ని. అందుకని ఆ పేరు నాకు. ఇహ సర్పంచులతో మాట్లాడవలసి వస్తుంది అఫీషియల్ గా. ఆడవాళ్లకి ఎంత అనుమానమో! "మా మొగోళ్లని వల్లో ఏసుకుందుకు వచ్చినావా?  చాలుచాల్లే ఇంక మా వూళ్లో కాలుపెడితే కాళ్లు విరగ్గొడతాం! అనేవాళ్లు. నవ్వూ,. కోపం రెండూ వచ్చేవి! అప్పటిలా అజ్ఞానం లేదులే గ్రామసీమల్లో: గ్రామ సేవికలవల్లా, హెల్త్ విజిటర్ల వల్లా కొద్దికొద్దిగా మారారు వాళ్లు. మనం చెప్పేది శ్రద్దగా వినగలుగుతున్నారు!........"

    చిరునవ్వుతో విన్నది సుధ ఆమె అనుభవాలను.

     రెండురోజుల తర్వాత సుధ టూర్ బయల్దేరింది.

     "ఎలా వున్నాను?" అంది బయల్దేరడానికి ముందు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS